గీర్వాణ కవుల కవితా గీర్వాణం -4
4-చిట్టి రాష్ట్రానికి పోట్టిగవర్నర్ –డా .బూర్గుల రామ కృష్ణారావు(1899-1967 )
‘’సంస్కృత శ్లోకం ,పార్సీ గజల్ ,తెలుగు పద్యం ‘’వెరసి బూర్గుల ‘’అని దాశరధి చేత కితాబు అందుకున్నవారు శ్రీ బూర్గుల రామ కృష్ణారావు .ఆ నాటి తెలంగాణా ముఖ్యమంత్రి .చిన్న రాష్ట్రం కేరళకు గవర్నర్ గా పని చేసిన పొట్టి వాడైనా గర్రి పండిత సత్కవి బూర్గుల బాల్యం లోనే సంప్రదాయ బద్ధంగా గీర్వాణ భాషను కూలంకషంగా నేర్చారు .కాలిదాసాది కవులను ఆపోసన పట్టిన మేధావి .సంస్కృతం లో శ్రీ వెంకటేశ్వర సుప్రభాతం ,శ్రీశృంగ గిరి శారదా స్తుతి ,శ్రీరామ స్తవం ,శ్రీనివాస పంచశతి రచించారు .’’పండిత రాజ మంచామృతం ‘’స్తోత్రాన్ని తెలుగులోకి అనువదించారు .వీరు లోతుగా పరిశీలించి పత్రికలో రాసిన సాహితీ వ్యాసాలూ ‘’సారస్వత వ్యాస ముక్తావళి ‘’గా వచ్చింది బూర్గుల బహుభాషావేత్త, సాహితీవేత్త. తెలుగు, హిందీ, ఇంగ్లిష్, కన్నడ, మరాఠీ, ఉర్దూ, పారశీక, సంస్కృత భాషల్లో బూర్గులకు ప్రావీణ్యం ఉంది. మహారాష్ట్రలో చదివే రోజుల్లోనే ఆంగ్లంలో కవితలు రాసేవాడు. పారశీక వాజ్మయ చరిత్ర ఆయన రచనలలో పేరు పొందినది. జగన్నాథ పండితరాయల లహరీపంచకమును, శంకరాచార్యుల సౌందర్యలహరి, కనకధారారాస్తవమును తెలుగులోకి అనువదించాడు. కృష్ణ శతకం, సంస్కృతంలో శ్రీ వెంకటేశ్వర సుప్రభాతం, శారదస్తుతి, గౌరీస్తుతి, వాణీస్తుతి, లక్ష్మీస్తుతి, శ్రీకృష్ణాష్టకం, రెడ్డి రాజుల కాలం-మత సంస్కృతులు (పరిశోధనా వ్యాసం) మొదలైనవి ఆయన ఇతర రచనలు. ఈయన రచించిన వ్యాసాలు ‘సారస్వత వ్యాస ముక్తావళి’ పేరుతో అచ్చయింది. పండిత రాజ పంచామృతం, కృష్ణశతకం, వేంకటేశ్వర సుప్రభాతం, నర్మద్‌గీతాలు, పుష్పాంజలి, తొలిచుక్క (కవితలు), నివేదన (కవితలు), పారశీక వాఙ్మయ చరిత్ర మొదలైన గ్రంథాలు వెలువరించడమే కాకుండా ఎన్నో కావ్యాలకు పీఠికలు రాశాడు. అనువాద రచనలు కూడా చేశాడు. వానమామలై, కాళోజీ, దాశరథి, నారాయణరెడ్డి ప్రోత్సాహంతో ‘తెలంగాణ రచయితల సంఘం’ ఏర్పాటు చేసి సాహితీలోక ప్రసిద్ధుడయ్యాడు.
- 1953లో ఆంధ్ర విశ్వవిద్యాలయం అయనకు డాక్టర్ ఆఫ్ లిటరేచర్ గౌరవపట్టాను ప్రదానం చేసింది.
- 1956లో ఉస్మానియా విశ్వవిద్యాలయం డాక్టర్ ఆఫ్ లాస్ అనే పట్టాను ఇచ్చింది.
13-3-1899 న మెహబూబ్ నగర్ జిల్లా కల్వకుర్తి తాలూకా పాదకల్లు లో జన్మించారు .ఇంటిపేరు’’ పుల్లంరాజు ‘’అయినా పుట్టిన గ్రామం’’ బూర్గుల’’ ఇంటిపేరుగా చలామణి అయింది .ధర్మవంత్ లోనూ హైదరాబాద్ లోని ఎక్సేల్సియర్ హై స్కూల్ లోనూ చదివి పూనా ఫెర్గూసన్ కాలేజి లో బి ఏ ఆనర్స్ ,బాంబే యూని వర్సిటి నుంచి లా డిగ్రీ పొందారు .హైదరాబాద్ లో లా ప్రాక్టీస్ చేసి న్యాయ వాదిగా సుప్రసిద్దులయ్యారు .నిజాం రాష్ట్రాన్ని భారత దేశం లో విలీనం చేసే ఉద్యమం లో కీలక పాత్ర పోషించారు .హైదరాబాద్ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవస్థాపక సభ్యులు .1913 లో దేవరకొండ లో జరిగిన మూడవ ఆంద్ర మహా సభకు అధ్యక్షత వహించారు .రజాకార్ల ఉద్యమానికి ఎదురొడ్డి పోరాడిన ఘనులు .వెల్లోడి ప్రభుత్వం లో 1950 లో హైదరాబాద్ రాష్ట్ర రెవిన్యు మంత్రిగాతెలుగు సాహిత్యానికి ,హిందూ సంస్కృతీ వ్యాప్తికి ఎనలేని కృషి చేశారు .
రాజకీయాలలో ఉంటున్నా సాహిత్యమే ఊపిరిగా జీవించారు .1956 లో ఆంద్ర ప్రదేశ్ ఏర్పడ్డాక కేరళ గవర్నర్ అయ్యారు.ఉత్తర ప్రదేశ్ గవర్నర్ గా ఉండగా రాజ్య సభకు ఎంపికై రాజకీయాలకు స్వస్తి పలికారు .సంస్కృతం పార్సీ ఉర్దూ తెలుగు మరాటీ కన్నడ ఇంగ్లిష్ మొదలైన భాషలలో అద్వితీయులు .ఇంటర్ చదువుతుండగానే ‘’య౦గ్ మాన్ యూనియన్ ‘’స్థాపించి సాహిత్యాన్ని అందరికి అందుబాటులోకి తెచ్చారు .మాడపాటి హనుమంత రావు గారితో కలిసి రాష్ట్ర సంస్కరణలకు మార్గ దర్శి అయ్యారు .క్విట్ ఇండియా ఉద్యమం లో ప్రధాన పాత్ర పోషించి కె ఎం మున్షి అభిమానం పొంది ,నిజాం పతనం తర్వాత హైదరాబాద్ రాష్ట్రం భారత్ లో విలీనంయ్యాక 1948 లో వెల్లోడినాయకత్వం లో ఏర్పడిన మంత్రి వర్గం లో రెవెన్యు మరియు విద్యా మంత్రిగా సేవలు అందించారు .1952 సార్వత్రిక ఎన్నికలలో షాద్ నగర్ నుంచి ఎన్నికై రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యారు .హైదరాబాద్ రాష్ట్రానికి రెండున్నర శతాబ్దాలలో మొదటి ,చివరి తెలుగు ముఖ్యమంత్రి బూర్గులవారే .14-9-1967 న 68 వ ఏట సాహితీ రాజకీయ విరాట్ వామన మూర్తి బూర్గుల రామకృష్ణారావు గారు మరణించారు .
ఆధారం –శ్రీమతి పాణ్యం మీనాకుమారి రచన ‘’తెల్కపల్లి రామ చంద్ర శాస్త్రి ‘’మరియు వీకీ పీడియా
సశేషం
గబ్బిట దుర్గాప్రసాద్ -11-1-18 – ఉయ్యూరు

