గీర్వాణ కవుల కవితా గీర్వాణం -4
5-అసమాన వైయాకరణులు –ఖండవల్లి నరసింహ శాస్త్రి (1920-1980 )
తెలంగాణలో బిజినేపల్లి మండలం వట్టెం గ్రామం లో 1920 లో జన్మించి 60 ఏళ్ళు సార్ధక జీవనం గడిపి 1980 లో మరణించిన ఖండవల్లి నరసింహ శాస్త్రి గారు ‘’వట్టెం శాస్త్రులవారు ‘’గా సుప్రసిద్ధులు .వ్యాకరణ ,సాహిత్య న్యాయ మీమాంస జ్యోతిశాలలో అసమాన ప్రజ్ఞావంతులు హైదరాబాద్ వివేక వర్దినీ సంస్కృత కళాశాలో 30 ఏళ్ళు అధ్యాపకులుగా సేవలందించారు .హైదరాబాద్ ఆకాశ వాణి కేంద్రం నుంచి చేసిన ‘’అమరవాణి’’ ప్రసంగాలు ప్రశస్తి చెందాయి .సంస్కృతం లో పాణినీయ వ్యాఖ్య శంకర విజయం రాశారు అనేక సంస్తానాలలో విద్వత్ సభలలోపాల్గొని తమ అమేయ విద్వత్తు ప్రదర్శించి ప్రశంసలు బహుమతులు సత్కారాలు అందుకున్నారు . దక్షిణ భారత దేశం లో వీరి వంటి వైయాకరణులు లేరని కీర్తి గడించారు .వీరి ప్రాసంగిక శ్లోకాలు అనేకం బహుళ వ్యాప్తి చెందాయి .
6-జ్యోతిష సిద్ధాంత ప్రదీపిక కర్త –సింగం పల్లి సీతారామ సిద్ధాంతి (1910-1970 )
జ్యోతిష సిద్ధాంత ప్రదీపిక రచించిన సింగం పల్లి సీతారామ సిద్ధాంతి గొప్ప జ్యోతిశ్శాస్త్ర పండితులుగా ప్రసిద్దులు .తెల్కపల్లి రామ చంద్ర శాస్త్రిగారు భార్యతో సింగం పల్లె లోనే ఉండి సిద్ధాంతి గారి భావాలకు వాక్య రూపం కల్పించినట్లు భావిస్తారు .ఈ గ్రంధం గద్వాల చెన్నకేశవ ముద్రణాలయ ప్రచురణ .అనేక సంస్కృత గ్రంథాధ్యయనం చేసిన మహా పండితులు సిద్దా౦తి గారు .యజుర్వేదాది సంహితలు ,విష్ణు వాయు ,కూర్మ పద్మ పురాణాలు ,భారత భాగవతాలు ,ఆర్య భట్టీయం ,సిద్ధాంత శిరోమణి వీరికి కరతలామలకాలు .వయసులో తెల్కపల్లి వారికీ వీరికీ తేడా ఉన్నా ,మంచి మిత్రులు .
7-‘’రాజ యోగ ప్రభావము’’కర్త –విక్రాల వెంకటాచార్యులు (18 90 )
వనపర్తి దగ్గర రాజానగర వాసి విక్రాల వెంకటాచార్యులు 1890 లో జన్మించారు .11 ఏళ్ళు కాశీలో వ్యాకరణ శాస్త్రాధ్యయనం చేశారు సంస్కృతాంధ్రాలలో గొప్పకవులు పురాణ ప్రవచన ప్రసిద్ధులు .కర్నూలు వేదశాస్త్ర విద్యాలయ వ్యాకరణ అధ్యాపకులు .ఇక్కడే తెల్కపల్లి వారు వీరి శిష్యులైనారు . ఆచార్యులవారి సుప్రసిద్ధ సంస్కృత రచన ‘’రాజ యోగ ప్రభావం ‘’.
8-ప్రచండ హైడింబీయం –కర్త –గుడిమంచి సుబ్రహ్మణ్య శర్మ (1892 -1930 )
తెల్కపల్లి రామచంద్ర శాస్త్రిగారి పెదతల్లి కుమారులైన గుడి మంచి సుబ్రహ్మణ్య శర్మగారు 1892 లో జన్మించి కేవలం 38 సంవత్సరాలు మాత్రమె జీవించారు .తెలంగాణలో వనపర్తి తాలూకా శ్రీ రంగాపుర నివాసి .గద్వాల సంస్థానం లో ‘’భావ కల్పక శిరోమణి ‘’బిరుదు పొందిన కవి వరేణ్యులు .సమస్యా పూరణ సుప్రసిద్ధులు .భారత సంగ్రహం ,ప్రచండ హైడింబీయం సంస్కృత రచనలు .’’స్వైరిణీ విలాసం ‘’అనే వీరి 11 శ్లోకాల సంస్కృత ఖండిక శర్మగారి కవితా వైదుష్యానికి ప్రతీక .
9-రస నిరూపణ కర్త –పల్లా చంద్ర శేఖర శాస్త్రి (19 02-19 70 )
తెల్కపల్లి వారికి సహాధ్యాయులైన పల్లా చంద్ర శేఖర శాస్త్రి కొల్లాపురం సంస్థానం లో తర్క వేదాంత శాస్త్రజ్ఞులు .సంస్కృతం లో రసనిరూపణ౦ ,శంకరపూజ ,వినాయక నవ గ్రహార్చన విధానం రచించారు వీరి అన్నగారు రామ కృష్ణ శాస్త్రి గారు కూడా మహా గీర్వాణ విద్వాంసులు .
10-శూద్రులకు సంస్కృతం నేర్పిన –అనుముల వెంకట సుబ్రహ్మణ్య శాస్త్రి (1888 -1959)
61 సంవత్సరాలు మాత్రమె జీవించిన అనుముల వెంకట సుబ్రహ్మణ్య శాస్త్రి గారు 1888 లో జన్మించి 1959 లో మరణించారు .సంస్కృతాంధ్ర ఆంగ్ల ఉర్దూ భాషలలో నిష్ణాతులు .1909 నుండి 1923 వరకు యాపర్ల లో ఉపాధ్యాయులుగా ఉన్నారు శూద్రులకు సంస్కృతం నేర్పి పరీక్షించటానికి వచ్చిన జాగీర్దార్ చేత ప్రశంసలు అందుకున్నారు .వీరిపై సురవరం ప్రతాప రెడ్డి గారి ప్రభావం ఎక్కువ .
11-దుందుభి కావ్యకర్త –గంగాపురం హనుమచ్ఛర్మ (1925-1996 )
దుందుభి కావ్యకర్తగా సుప్రసిద్ధులైన గంగాపురం హనుమచ్చర్మ 1925 లో జన్మించి71 వ ఏట 1996 లో మరణించారు .వీరు ‘’గుండూరు హనుమాండ్లు ‘’గా సుప్రసిద్ధులు .11 వ ఏట వేద విద్య నేర్చారు .14 వ ఏట చిన్నమరూరు ఇరువెంటి నరసింహ శాస్త్రి వద్ద సంస్కృత సాహిత్యం నేర్చారు .17 వ ఏట సాహిత్య శాస్త్రం ,19 వ ఏట కరివెన అగ్రహారం లో నంద్యాల మ౦కాల శాస్త్రి వద్ద పాణినీయం అభ్యసించి జ్యోతిష ధర్మ శాస్త్రాల పారమెరిగారు .సంస్కృతం లో చెన్నకేశవ స్వామి సుప్రభాతం రాశారు.
ఆధారం –శ్రీమతి పాణ్యం మీనాకుమారి రచన ‘’తెల్కపల్లి రామ చంద్ర శాస్త్రి ‘’
సశేషం
మీ- గబ్బిట దుర్గా ప్రసాద్ -11-1-18 –ఉయ్యూరు

