సాహితీ బంధం -కవిసమ్మేళనం కవితలు -3 (చివరిభాగం )
24-12-17 ఆదివారం సాయంత్రం రేపల్లెలో’’ గ్రంథద్వయ ఆవిష్కరణ’’ సందర్భంగా జరిగిన ‘’సాహితీ బంధం ‘’కవి సమ్మేళన కవితలు -3
7- శ్రీమతి కోపూరి పుష్పాదేవి –విజయవాడ -9440766375
సాహితీ సుగంధం
అనాగారకులకు అక్షర భిక్ష పెట్టింది సాహిత్యం
మాట ,మన్నన నేర్పి –మనుజులుగా తీర్చి దిద్దింది సాహిత్యం
ఒడి దుడుకులలో తోడుగా నిలబడి –మునుముందుకు సాగించింది సాహిత్యం
అద్భుత కావ్య రాజాల నందించి –విశ్వమందు భారతావనికి
అజరామర కీర్తి నంది౦చి౦ది సాహిత్యం
అవనిలో అద్భుతాలకు ఆలంబనమై –అచంచలసేవ చేసింది సాహిత్యం
మనిషి మనుగడకు ఉత్సాహం –మహాత్కార్యాలకు ఉత్ప్రేరకం సాహిత్యం
స్పూర్తిని రగిలిస్తూ –కీర్తిని అందిస్తూ చేస్తుంది సహవాసం
మనిషితో యెడ తగనిది సాహితీ బంధం
మరణం వరకు వెన్నంటి ఉంటుంది –ఆ తీయని సుగంధం .
8-శ్రీ విష్ణు మొలకుల భీమేశ్వర ప్రసాద్ –తెనాలి -8897659364
1-కవికుల తిలకుడు కాళిదాస కవీంద్రు –భోజ భూపాలుని భూరి కీర్తి
మన ఆదికవి యైన మహనీయ నన్నయ –రాజరాజ నరేంద్రు ప్రబల కీర్తి
కవి సార్వభౌమ విఖ్యాతుడౌ శ్రీనాధ-అనవేమ భూ విభు అమలకీర్తి
ఆంద్ర భోజు౦డైన ఆ కృష్ణరాయని –అష్ట దిగ్విజపు విశిష్ట కీర్తి
అవని సుస్థిర విఖ్యాతి యలరె గాదె –రవి సుధాకర కిరణాల గ్రాలనాడు
కనగ సాహితీ బంధము కతన గాదె –అక్షరంబంది సత్యంబు ఆక్షయముగ.
2-ఏనాడు మలగని యెన లేని జ్ఞాన దీ-పంబులవెలిగించు పసిడి తల్లి
ఏనాడు వాడని ఇంపైన భావ సు –మంబులు పూయించు మమతవల్లి
ఏనాడు తరగని ఈశ్వరు కృపవోలె-కమ్మగా కాచెడి కల్పవల్లి
ఏనాడు చెదరని యిన తేజమున్ భంగి –ఘన యుగం బొసగెడి కావ్య వల్లి
అమ్మ తీరుగ ఆచి తూచి అనవతరము –మనల దీవించు పావన మహిత వల్లి
ఉత్తమోత్తముడనగను ఉర్విలోన –బ్రతుకు పండించు సాహిత్య బంధ మరయ .
9-శ్రీమతి గుడిపూడి రాధికా రాణి –మచిలీ పట్నం -9494942583
నా అక్షర నేస్తాలు
నాకు తెలిసి నా గుండె కొట్టు కుంటోంది-లబ్ డబ్ అని కాదు -అఆ ఇఈ అని .
నా అక్షర నేస్తాలు –సమీక్షా సమీరాలై –సాహితీ సౌరభాలను –నిజాయితీ గా వెదజల్లుతాయి
నా అక్షర నేస్తాలు –కవితా కరవాలాలై-కరడు కట్టిన అవినీతిని –కరుకుగా చెండాడుతాయి
నా అక్షర నేస్తాలు –పిల్లల కథల పిల్లన గ్రోవిగ-పెద్దలలోని పసి మనసులని –ప్రేమతోటి పలకరిస్తాయి .
నా అక్షర నేస్తాలు –గజల్స్ గజ్జేలై –ఘల్లు ఘల్లున గళసీమ మ్రోగి –గ్రామగ్రామం సంచరిస్తాయి .
నా అక్షర నేస్తాలు -సాహితీ గగనాన విజయ విహారం చేసే –గాలి పటాలై –నా నైతికటే సూత్రం గా –చెలిమిఅనే దారంతో –నన్ను వదలక తోడు వుంటాయి .
10-శ్రీ మరో చలం –దుగ్గిరాల -8125752234
జీవన మర్మం
గురువులంతా గతించారు –గతవైభవ చిహ్నాలయ్యారు
ఒంటరినై ప్రశాంత నిశా దారుల్లోకవిత్వాన్ని వెదకుతుంటే
ప్రతి రాత్రి ధాత్రి సుగంధపు పరిష్వంగం లో రాత్రినై పోతుంటే
నిత్యం నాలోకి నేను మనో సర్పంలా పాకుతుంటాను
జీవితపు రహస్య ద్వారమేదోఅకస్మాత్తుగా తెరుచుకోవాలి
జరీ పోగుల అల్లిక లాంటి కవితా వస్త్ర దారి ఎవరో కనిపించాలి
అర్ధ శూన్య శబ్దాల అసంగత అభినయ విన్యాసాలకు తెరదించాలి
అబద్ధాల రంగ స్థలాలపై పొగడు దండల మెరుపు నింపి
మానవీయ హృదయ మాలికల సుగంధం నింపి
ప్రేమాస్పద సరస చంద్రికలతో ఇలను తడపాలి
నవకవిత్వపు మొలక లెగసి సహృదయవృక్షాలై నవరస ఫలాలనివ్వాలి
మనిషి చరిత హృదయగతం –మనిషి విచిత్ర ప్రేమయుగం
వితం చితి దాకా తరుముకు వెళ్ళే లోపు
అలవడుతుంది ఆపేక్షల అంతరంగపు చూపు
ప్రకృతి నించి ప్రకృతికి సాగే జీవితం లో
పరస్పర సాయమేగా ఓదార్పు ఒయాసీస్సు .
11-ప్రొఫెసర్ శ్రీమతి పంచుమర్తి నాగ సుశీల –గుంటూరు -9985444686
మాట
1-మనసులి కలిపేది మాట –మనుషులమధ్య –విస్ఫోటాలు రగిలించేది మాట .
అపార్ధాలు కలిగించి –అనర్ధాలు సృష్టించేదీ మాటే
ఓదార్పు నిచ్చేదీ –ఓరిమితో నిలిపేదీఆ మాటే
ప్రేమను పంచేదీ మాటే –ప్రపంచాన్ని చూపేదీ మాటే
2-మాట మాట కీ –ఉంది ఎంతో తేడా –పలికే మనిషిలో –పలికించే గొంతులో –పలుకుతున్న రీతిలో
అర్ధాలు గూడార్ధాలు –అనేక అర్ధాలు –అనంత అర్ధాలు
3-తీసేయ్యలెం మాటేగా అని –పెట్టేయ్యలెం ప్రక్కన –ఏముందిలే మాటగా అని
మాట నిలుపుకోటానికి –జరిగాయి యుద్ధాలెన్నో ప్రపంచ చరిత్రలో
మాట ఇచ్చినందుకు వచ్చాయి ప్రళయాలు గతం లో మరెన్నో .
4-మాటకున్న బలం –మరి దేనికుంది లోకం లో !
తూటా కంటే శక్తికలది –కత్తికంటే పదునైనది
తేనే కంటే తియ్యనైనదీ –వెన్నకంటే మృదువైనది –మాట లేనిదే –లేదు మనుగడ మనిషికి .
5-ఊహించలేం మనం మాట లేని లోకాన్ని –
మాటతో శాసిస్తాం మాటతోనే శ్వాసిస్తాం
కాలం గడిచేదీ-జీవితం నడిచేదీ –జీవనం ముగిసేదీ –మాటతోనే –మాటాడే తీరుతోనే .
6-సాహితీ బంధాన్నిబలపరచేదీ-సమాజాన్ని ఆలోచిమ్పజేసేదీ మాటే –అందుకే వాగ్భూషణమే సుభూషణం .
12- శ్రీమతి కోపూరి పుష్పాదేవి
‘’చంద్రునికో నూలు పోగు ‘’
సంగీత సాహిత్య సేవకుడు –శారదాదేవి ముద్దుల తనయుడు –కృషి ,పట్టుదల ఆలంబనతో –వయసును ఓడించిన శ్రామికుడు
సరసభారతి స్థాపించి –సత్కార్యాలు సాధించినవాడు –కవి పండితుల ఆడరణే లక్ష్యంగా –అర్దాంగితో అడుగు లేస్తాడు .
ఎవరమ్మా ?వేరేవరమ్మా ?
ఉయ్యూరుకు ,ఉపాధ్యాయ వృత్తికీ –వన్నె తెచ్చిన దుర్గాప్రసాదుడు –అందుకొనుడు –మా అందరి అభినందన మందార మాలలు .
సమాప్తం
గబ్బిట దుర్గాప్రసాద్ -11-1-18 –ఉయ్యూరు
—

