సాంబశివుని ‘’శ్రీరామ తీర్థం’’
కొన్ని పరిచయాలు చాలా ఆకస్మాత్తుగా జరుగుతాయి .సరసభారతి పుస్తకాలపై పత్రికలలో వచ్చిన వార్తలను చూసి ఆపుస్తకాలు తమకు పంపించమనటం నేను వెంటనే పంపటం జరుగుతూ ఇటీవలె శ్రీ వేలమూరి నాగేశ్వరరావు ., వారబ్బాయి తో మా ఇంటికి వచ్చారు విజయనగర౦ సాహితీ పిపాసి ,సేవా దీక్షాతత్పరులు శ్రీ వేలమూరి నాగేశ్వరరావు . వారిద్వారా పరిచయమైన ‘’విజీనగరం ‘’జిల్లా గంట్యాడ రిటైర్డ్ హెడ్ మాస్టర్ ,కవి పండితులులు ప్రస్తుత విజయవాడ వాసి చావలి సాంబశివ సుబ్రహ్మణ్య౦ గారు .వీరు రేపల్లె గ్రంధద్వయ ఆవిష్కరణ సభకు ,విచ్చేసి మా సత్కారానికి సంతసించి సభ జరిగిన తీరుకు పులకించి .నూతన ఆంధ్ర ప్రదేశ్ ఆవిర్భావం తో భద్రాచలానికి దీటుగా భాసించిన శ్రీ రామ తీర్ధం పై ఆ క్షేత్ర మహాత్మ్యాన్ని తామేప్పుడో పాతిక ఏళ్ళక్రితం రచించి తిరుపతి దేవస్థానం వారి సహకారం తో ప్రచురించి ,అందరికీ ఉచితంగా అందించి తమవద్ద మిగిలిన ఒకే ఒక్క పుస్తకాన్ని రిజిస్టర్డ్ పోస్ట్ లో నిన్న పంపితే ఇవాళ అందితే వెంటనే ఫోన్ చేసి చెప్పి అరగంటలో పూర్తిగా చదివేసి క్షేత్ర విశేషాలకు ఆశ్చర్యం పొంది ,ఆ కావ్యాన్ని మీకు పరిచయం చేస్తున్నాను.
విజయనగరం జిల్లా ఒకప్పుడు కు౦భినీ పురం అని నేడు ‘’కుమిలి ‘’అని పిలువబడుతున్న గ్రామం లో దూదేకుల కులం లో జన్మించి ,పుట్టు మూగది అయిన ఒక ముసలి స్త్రీ నాలుకపై శ్రీ రాముడు మూడు బీజాక్షరాలు రాసి భక్తవరడుడై ఆమె మాట్లాడేట్లు చేశాడు.నేటి విజయనగర రాజ వంశీకుల పూర్వీకుడైన నాటి కు౦భినీ పురాధిపతి కి శ్రీరామ చంద్రుడు కలలో కనిపించి తన ఉనికిని చెప్పి ,ఆలయ పునర్నిర్మాణ౦ చేయించాడు .స్వామి ఇక్కడే ‘’వనవాస రాముని ‘’గా కొలువై భక్తులపాలిటి కొంగుబంగారం గా విరాజిల్లాడు .ఈ కధను శ్రీ సుబ్రహ్మణ్యంగారు తమ కవితా శక్తినీ ఊహాశక్తినీ జోడించి కమనీయ కావ్యం గా రచించి తమ తండ్రి ‘’శ్రీ చావలి సూర్యనారాయణ ‘’గారికి అంకితమిచ్చి పిత్రూణ౦ ,దైవ ఋణం తీర్చుకున్నారు .
ఒకప్పుడు రామ తీర్ధం బౌద్ధారామ౦గా భక్తులకు రామ తీర్ధంగా వెలిగింది . ఆనాటి పూసపాటి సీతారామ చంద్ర రాజు ఈ క్షేత్ర దేవతా మూర్తులను ప్రతిష్టించి స్వామి భక్తీ ప్రకటించుకున్నారు .ఈ క్షేత్ర మహాత్మ్యం బ్రహ్మాండ పురాణం లో వివరంగా ఉన్నది .యధాప్రకారం మునులు సూతమ మహర్షి ని ఈ క్షేత్ర మహాత్మ్యం గురించి తెలియ జేయమని అడగటం తో కధ ప్రారంభమౌతుంది .నారదుడు చెప్పినదాన్ని తాను తెలియజేస్తానని సూతుడు చెప్పి నారదుడు బ్రహ్మను అడగటం ఆయన వివరించటం ఆ కధను మునులకు చెప్పటం జరిగింది .
ఒక సారి పుట్టు మూగ అయిన ఒక దూదేకుల ముసలిఅడవిలో తుఫానులో చిక్కుకుని దిక్కు తోచక ‘’నీవే తప్ప ఇతః పరంబెరుగ’’అని శ్రీరాముని మనసులో ప్రార్ధిస్తే ,విని హనుమతో ‘’ఆర్తనాద మొక్క డబల రోదనమందు –వినగనయ్య నీవు వీర వర్య ‘’అని కనుక్కోమని పంపితే ,ఆయన మూగవనిత దయనీయ స్థితి చూసి రాముని వద్దకు తీసుకు వెడితే ,లక్ష్మణుడు ఆమె మూగదని అన్నకు తెలియజేస్తే ,దయాళువైన రామ చంద్ర ప్రభువు ‘’నాల్క జాపు మంచు నయముగ బల్కి ‘’దర్భతో ఆమె నాలుకపై మూడు బీజాక్షరాలు రాయగా ఆమెకు వెంటనే మాటలు వచ్చాయి .వెంటనే ‘’శ్రీరామ ఇంతకాలము –నోరారగ నిన్ను బిలువ నోపని నాకున్ –ఈ రాత్రి ఉదయమాయెను –నీరాకను వెల్గు నిండి నెమ్మాన మలరెన్ ‘’అని కృతజ్ఞతలు చెప్పుకొన్నది .ఆమె భక్తికి సంతోషించి సోదర ,సీతా సమేతంగా ఆ రాత్రి రాముడు అక్కడే ఆమె ఆతిధ్యం లో బస చేశాడు .శ్రీరామ చరిత వినిపించమని ఆమె హనుమను కోరగా రావణ వృత్తాంతం తో సహా విఅవరించాడు .
ద్వాపరం లో శ్రీ కృష్ణుడు పాండవులకు రామకధ చెప్పి శ్రీరామాదుల అర్చావతార మూర్తులను వారికి అందజేశాడు .వారందరూ రాముడిని అత్యంత భక్తీ తో సేవించారు .సంతసించిన రాముడు ధర్మరాజాదులకు ధర్మ బోధ చేస్తూ ‘’కలియుగములోన భువి ఎల్లకలుషితమయి –ధర్మమనుమాట ఎపుడును తప్పి యుండు ‘’అంటూ ‘ధర్మమార్గము తప్పవలదు ‘’అని బోధించాడు .రాముడు మూగవనిత వద్ద వీడ్కోలు పొందగా ఆమె తన బంధువులను వెతుక్కుంటూ వెళ్లి కలుసుకొన్నది .ఆమె తుఫానులో చచ్చిపోయిందని భావించిన వాళ్లకు ఆమె కనిపించటం దైవ లీల అని పించి వివరాలు తెలుసుకొని ,మహారాజుకు ఆమె సందేశాన్ని తెలియజేయగా రాజు వేటనిమిత్తం ఇక్కడికి వచ్చి ముసలిదాన్ని చూసి ప్రశ్నించి ,రాముని వెదకి దొరకక వేసారి ఆమె పై కోపించి ,చివరికి చేసినదానికి చింతించి వైరాగ్యం ప్రకటించగ రాముడు కలలో కనిపించి ఉనికి చెప్పగా ,రాజు అడవి వదలి కుమ్భినీపురం చేరి ,పురజనుల సంకల్పం తో మళ్ళీ అడవికి వచ్చిమట్టిలో కూరుకుపోయిన విగ్రహాలను కనుక్కొని బయటికి తీయించి పులకించి శ్రీరామ క్షేత్రం లో ప్రతిష్టించి దేవాలయం కట్టించాడు .అప్పటినుంచి శ్రీరామ క్షేత్రం ప్రసిద్ధ వైష్ణవ క్షేత్రంగా విరాజిల్లింది .ఇప్పుడు భద్రాచలానికి బదులు నవ్యాంధ్ర ప్రదేశ్ కు శ్రీరామ క్షేత్రం అఫీషియల్ గా అపర భద్రాద్రి అయి ప్రభుత్వ లాంచనాలతో నవమినాడు సీతారామ కల్యాణం పరమ వైభవంగా జరుగుతోంది .
ఈ కధను శ్రీ’’ చావలి’’ వారు చవులూరించే పద్యాలతో’’ సదాశివ’’నామం తో చేసిన శ్రీరామ నామ భజనగా ,’’సుబ్రహ్మణ్య స్వామి ‘’జానకీరాముల కరుణా కటాక్షాలకు దర్పణంగా రచించి కావ్య గౌరవాన్ని కల్గించి శ్రీరామ పద సేవలో ధన్యులై శ్రీరామ క్షేత్ర వైభవాన్ని ఆస్తిక జనులకు అందుబాటులోకి తెచ్చి చరితార్దులయ్యారు .ఈ క్షేత్ర రాముడు మామూలు రామయ్య కాదండోయ్ –‘’పాండు సుతుల కలత బాపగా వెలసిన –రాముడితడు సుగుణ ధాముడితడు ‘’చలో శ్రీరామ క్షేత్రం .
మీ- గబ్బిట దుర్గాప్రసాద్ -12-1-18- ఉయ్యూరు
—

