హోసూర్ జానపద గాథా షడ్వింశతిశతి –దణి

హోసూర్ జానపద గాథా షడ్వింశతిశతి  –దణి

హోసూర్ తెలుగు జానపదుల గుండె చప్పుళ్ళ కమనీయ పాటల కతలే 20 17 లో  ‘’దణి’’గా ప్రతిధ్వనించి మనగుండెలను తాకాయి . తాను విన్నా ,కన్నా ,చేర్చిన ,కూర్చిన పాటలకు మినీకథానికా స్వరూపాన్ని అందంగా అమర్చి శ్రీ అగరం వసంత్ అందించిన మరొక హోసూరు సాహితీ ముత్యాలహారం .ఆయన క్లినిక్ లో రోగుల రోగాలనే చూస్తాడో, వారి బాధలనే వింటాడో ,లేక వారు పాడే జానపద పాటల కతలే వింటాడో అర్ధం కాదు .విన్న ప్రతిదానికీ అక్షర రూపం సంతరించే సాహితీ మాంత్రికుడు డాక్టర్ వసంత్.అక్కడి ఆటా పాటల్లో ,గుళ్ళల్లో ,పందిళ్ళ ల్లో ,ముసలివారి అనుభవ సారం లో ,పల్లె పడుచుల ,పడుచుగాళ్ళ సింగార కతల్లో,వేదనాభరిత చరితల్లో ,ఒక్కోసారి ఆశువుగా వినిపించే పాటల్లో ,భోజనాల వేళల్లో ,విహారాలలో ,జాతర్లలో,ఘర్షణల్లో ,అత్త ఆరళ్ళల్లో, కొంటె కోడలి చమత్కారాల్లో జాలువారి తరతరాలుగా జానపదుల నోళ్ళల్లో నాని నాని మధురమై వినిపించినవే ఈ పాటలు .వీటిని అత్యంత శ్రద్ధగా రికార్డ్ చేయించి శాశ్వతం చేశాడు వసంత్.తర్వాత పుస్తకరూపం గా తెచ్చి జానపద సరస్వతి కి కంఠా భరణంగా కూర్చాడు .అతను తిండి తింటాడో లేదో ,కునుకు తీస్తాడో లేదో తెలీదు . అతని మనసు నిండా, బుర్ర నిండా ఆ ప్రాంతపు మట్టి వాసనలే గుబాళిస్తాయి ..వాటినే పొందికగా కూర్చి ఇదివరకూ చాలా అందించాడు . ఇప్పుడు ఈ’’ దణి’’ గా ధ్వనింప జేయించాడు .హాట్స్ ఆఫ్ డాక్టర్ వసంత్.నిన్ను చూసి తెలుగు తల్లి మురిసిపోయి పులకిస్తుంది .వసంత్ చేసే ఈ జానపద సేవ ఎక్కడ తెలుగువారున్నా  వారందరికీ మార్గదర్శకమే .వారూ తమప్రాంత పాటలకు కతల రూపమిచ్చి వ్యాప్తి చెందించే ఆలోచన కల్గించాడు వసంత స్వామి . ఇందులో తెలుగు తమిళ కన్నడ భాషల కలయిక పాట కూడా ఒకటి ఉంది .ఈ దణిలోని కొన్ని ఇంపైన సొంపైన ధ్వనులను పరిచయం చేస్తాను .దణి అంటే ధ్వని ,పలుకు ,శబ్దం అని అర్ధం .

హోసూర్ ప్రాంతం లో మనిషి పుట్టినా ,చచ్చినా పాటే . బతుక్కి పాటకీ అంతటి సంబంధం ఉందిక్కడ .బహుశా అన్ని ప్రాంతాలలోనూ ఇలానే ఉంటుంది .దీన్ని పట్టించుకుని సాహితీ పంట పండించుకున్నారు మాత్రం వీరు .ఇక్కడ తరచుగా వినిపించేది జేజి పాట .-‘’జేజమ్మ జేజి –మహిమల జేజి మా వూరు జేజి మహిమలా జేజి ‘’.ఒకత్త కోడలుపై సాడీలు కొడుక్కి చెప్పి వాడి బుర్రతిని ఇద్దరికీ కానీకుండా చేసి చివరికి కొ౦పలోంచి నేట్టేయిస్తుంటే  .మోకాల్లో ఉన్న వాడి మెదడు బల్బు ఎప్పుడో వెలిగి పెండ్లామును తీసుకోనేచ్చుందుకు  ఎప్పుడోస్తావని  బతిమాలితే ఆమె గడుసుగా ‘’ఉడకేసిన ఉలవలు మొలకెత్తినబుడు మొగడా’’అన్నదట.పనికీ కులానికి సంబంధమున్న రోజుల్లో ఒక అవ్వను ‘’ఏ పనీ చేయ్యని వాడిది ఏకులం ?అని అడిగితె ‘’పెద్దకులమప్పా ‘’అందట.మరో పాటలో ‘’గోలు గొలున ఏడ్సు కొని గౌరమ్మ –చిలకవన్నే చీర చించి  కాకికాలితో అమ్మకు కమ్మ పంపినాదట .’’తిరుపతి దేవుణ్ణి గూర్చి ‘’నాలుగు స్తంబాలపై దేవస్తానమున్నది-నల్లని వాడు అదినారాయణుడు –తెర లోపల ఉన్నాడు తెల్లనామాల వాడు ‘’అని ‘’కటాక్షించు తిరుపతి వెంకటా చలపతి ‘’అని ముక్తాయిస్తారు .’’మామిడి వనము తిరిగే టప్పుడు,మామకు సేవలు చేసే తబుడు –ఒకసారి రామా అనరాదా ?ఓ వెర్రి మనసా –తులసి వనము తిరిగేటప్పుడు ,అత్తకు మామకు మొక్కేతబుడు ఒక సారి రామా అనరాదా ‘’అని హితవు పాటలో అనుక్షణ హరి స్మరణ అవసరం తెలియ జేస్తుంది . నెల పై పడి ఉన్న జటాయువు ను చూసి ‘’లే-పక్షీ ‘’అన్న చోటే లేపాక్షి .తెలుగులో అన్నాడుకనుక రాముడు తెలుగు వాడే అనే ధర్మ సందేహం తీర్చుకున్నాడోక జానపదుడు .’’తాగుతా నీ యబ్బ తాగుతా –నీసోమ్ముతాగుతా నా సొమ్ము తాగుతా –దేవేంద్రుడు తాగినాడు –దేవలోకమేలినాడు –కాళిదాసు తాగినాడు –కావ్యాలెన్నో రాసినాడు –రామదాసు తాగినాడు తత్వాలెన్నో రాసినాడు ‘’అంటూ ఒక తాగుమోతు తన గుణాలన్నీ పై పెద్దోళ్ళకు అంటగట్టాడు .’

‘’ఆవక్కుండేది బరుగూరు –ఈ పక్కుండేది లక్కూరు –నట్టనడమ గంగమ్మ తల్లికి నిత్యపూజలు ‘’అనే అవ్వ పాటలో బరుగూరు తమిళనాడులో ,లక్కూరు కర్నాటక లో ఉంది.ఈ రెంటికీ లంకె ఏమిటని అడిగిన బస్తీ యువకుడికి ‘’రాజా ఇలాకా అయినా కు౦ఫిణీ ఇలాకా అయినా మన తెలుగు వాళ్ళదే పెద్ద గుంపు .అప్పుడు తెలుగు బాస బాగా ఎలిగే .మనకర్మ 1953 లో ఆంధ్రావోల్లు మాకు రాజ్జెం కావాలని అ౦గలార్సి ,సిక్కిందే సాలని బొక్కేసి మల్ని నడి ఈదిలో పారేసి పోయి౦ డ్రప్పా’’అని ఫ్లాష్ బాక్ కత చెప్పింది . ఎంగిలిపాట –‘’ఎంగిలి ఎంగిలి అని ఎగ్గు పడుదురు జనులు –ఎంగిలి ఎంగిలి నారాయణా –ఈ జగమంత ఎవురెంగిలి ?నీళ్ళు తాగుదామని బెమసి ఏటికి పొతే –ఎటంతా ఎనుము ఎంగిలి –పువ్వులు తెస్తామని తోటకి పొతే పువ్వంతా పురుగు ఎంగిలి ‘’అని మన బాలమురళి గారి తత్వాల పాట బాణీ ‘’గంగ ఉదకము దెచ్చిశుద్ధిగా పూజ్జేద్దమంటే గంగలోని చేపకప్పా లెంగిలంటు న్నాయి శివా ‘’ వినిపిస్తుంది .’’మూడు నామాల వాడ –ముద్దూ వెంకట రమణ –ఏడు కొండలవాడా యేడ నున్నావు –వచ్చే తబుడు మీ వాళ్ళు ,పోయే తబుడు నా వాళ్ళంటివి-చెయ్యి పట్టిన ఆలికి చెండు మల్లె లిస్తివి –కూడిన లంజికి మల్లె మొగ్గ లిస్తివి ‘’పాట అర్ధం తెలిస్తే బుర్ర తిరిగి పోతుంది .ఏడు కొండలాయనకి కొండమీద ఒక పెండ్లాం కొండ దిగువ బీబీ  నాంచారి మరో పెళ్ళాం అని మనకు తెలుసు .’’ఇలా చేశావేంటి మొగడా’’అని నాంచారి నిలదీస్తే లౌక్యంగా ‘’కొండకి నన్ను చూడటానికి వచ్చేవాళ్ళు నీ వాళ్ళు .కొండ దిగి వచ్చే వెళ్ళే వాళ్ళు  నా వాళ్ళు ‘’అని తొకరా మాట చెప్పి ఊరడించాడు నామాల సామీ .దీని భావమేమి తిరుమలేశా అంటే –కొండ ఎక్కే టప్పుడు అందరూ గడ్డాలు మీసాలతో ,పెరిగిన పొడవైన జుట్టుతో మొక్కు బడి తీర్చుకోవటానికి  వెళ్ళే వారందరూ  ‘’బూబమ్మ అంటే బేబీ నాచారి బంధువులు’’ అని ,కొండమీద మొక్కు తీర్చుకుని గుండు కొట్టించుకుని నామాలు పెట్టించుకుని దిగి వచ్చేవాళ్ళంతా సామి బంధువులు ‘’అని అర్ధం .

తెలుగు తమిళ,కన్నడాలున్నపాట –‘’అచ్చమూరింది బండి –అరికల్ పోన బండి –తచ్చణ౦ తయ్యారే బండి –నీ రంగం తంగం రైలు మోటారే బండి –పున్గనూరికే పోరే మగళే పువ్వులగందం వాంగ మగళే-గుడియాతం పోరే మగళే-పువ్వుల గందం వాన్గా మగళే’’. ఇందులో పోరే, తమిళపద౦ –పోవే అని అర్ధం .మగళే-కన్నడపదం- బిడ్డా కూతురా అని అర్ధం  .వాన్గా తమిళపదం అర్ధం –తీసుకో ,కొనుక్కో .మరో నీతిపాట –‘’నీవు పోయే దోవల బ్రామ్ములు ఉంటారు –బ్రామ్ముల మోసాలకు నువ్వు చిక్కొద్దు సామీ –నీవు పోయే దోవల లంజేలుంటారు –లంజెల మోసాలకీ నువ్వు మోసపోవద్దు సామీ ‘’అనే పాటలో మోసాలు చేయటానికి బ్రాహ్మలైనా ,లంజే అయినా ఒకటే .మోసాలేపుడూ మోసాలే మోస్తాయి మంచిని కాయవు .’’రాగులు మలిసిండ రాతి మీద పెట్టి –యేమని పాడుదును రాతి బసవన్న –తల్లి తండ్రిని పాడు తనూరిని పాడు –అన్నదమ్ములపాడు ,అందరిని పాడు ‘’అని ‘’న్యాక్ ‘’అంటే బుద్ధిచేప్పింది .

చివరికి మంగళ హారతి పాటతో ఆపేస్తాను –వేప కొమ్మలే ఎత్తైన మేడలే ఏ దిక్కు చూసినా పంజిరాలే –వజ్రాల వనములో నిలసిండే తొలసమ్మ నీకు హారతి –జయమంగళ ,నీకు శుభ మంగళ ‘’.

శాలివాహన గాదా సప్త శతి లాగా ఈ హోసూరు జానపద పాటల నాధారంగా చిక్కని చక్కని కతల తో ‘’దణి’’ అలరారింది .ఆనందాన్నిచ్చింది .ముసిముసి నవ్వులతోపాటు బాగా పగల లబడి నవ్వే పాటల కతలూ ఉన్నాయి .చేతికి  అందించాడు వసంత్ .ఆస్వాదించటం మనవంతు .మరిన్ని అర్ధవంతమైన రచనలు హోసూరు తెలుగు వారినుండి ,ముఖ్యంగా డా ,వసంత్ కలం నుండి జాలువారాలని కోరుతున్నాను .

మీ- గబ్బిట దుర్గా ప్రసాద్ -18-1-18 –ఉయ్యూరు

 

 

.

— 

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in రచనలు and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.