గీర్వాణ కవుల కవితా గీర్వాణం -4

56-తంత్ర మంత్ర శాస్త్ర రహస్యవేత్త –బ్రహ్మశ్రీ దండి భొట్ల విశ్వనాథ శాస్త్రి గారు (19 00 )
తూర్పు గోదావరిజిల్లా రాజమండ్రి కి చెందిన బ్రహ్మశ్రీ దండి భొట్ల విశ్వనాధ శాస్త్రిగారు బాల మేధావి .చిన్నతనం లోనే తర్క ,వ్యాకరణ ,మీమా౦స లను మదించి ,యజుర్వేద కర్మకాండ ,అధర్వవేద మంత్రప్రయోగ భాగాలపై సాధికారత సాధించారు .అధర్వ వేదం లో రహస్యంగా నిక్షిప్తమై ఉన్న తంత్ర ,మంత్ర శాస్త్ర రహస్యాలను క్షుణ్ణంగా అధ్యయనం చేశారు .1930 లలో మొదటి ప్రపంచ యుద్ధసమయం లో జర్మనీ పరభుత్వ ఆహ్వానం పై జర్మనీ వెళ్లి అక్కడ వారు తయారు చేస్తున్న మిసైల్ టెక్నాలజీ కి రహస్య మంత్రాలను డీకోడ్ చేయటానికి సహాయ పడ్డారు .దీనికి కృతజ్ఞతగా ఫ్రాంక్ ఫర్ట్ యూని వర్సిటీ లో ఆయన చిత్రపటాన్ని అత్యంత గౌరవ స్థానం లో ఉంచారు .జర్మన్ పార్లమెంట్ లోని ‘’హాల్ ఆఫ్ ఫేం ‘’లో ఆయన పేరును చేర్చి అత్యంత గౌరవం చూపించారు .
హిట్లర్ కు సహాయ పడుతున్న జర్మనీ సైంటిస్ట్ లు కొద్దిమంది శాస్త్రిగారిని 1938 లో జర్మనీకి ఆహ్వానించి యజుర్వేద ,అధర్వ వేదాలలోఉన్న రహస్య మంత్రాలను డీ కోడ్ చేయమని కోరారు .ఆయన అది తనకు నల్లేరు పై బండి కనుక అతిత్వరలో ఆ రహస్యాలను ఆవిష్కరించి వివరించారు .వీటి ఆధారం గా రెండవ ప్రపంచ యుద్ధం లో జర్మనీ సైంటిస్ట్ లు మిసైల్ అంటే క్షిపణి తయారు చేసి, యుద్ధం లో ప్రయోగించారు .అంతేకాదు నాజీ జర్మన్లు ఫస్ట్ ప్రాక్టికల్ పల్స్ జెట్ ఇంజన్ ను v8 రాకెట్ ‘’బజ్ బాంబ్స్’’ కోసం నిర్మించారు .భారత్ ,టిబెట్ లలో శాస్త్ర రహస్యాలెన్నో ఉన్నాయని హిట్లర్ అతని బృందం పూర్తిగా విశ్వశించి 1930 నుండి ప్రతి ఏడాది ఒక అన్వేషణ బృందాన్ని ఈ దేశాలకు పంపించేది .ఆ బృందాలు వచ్చి ఇక్కడి ఆ శాస్త్ర మేధావులను కలిసి వాటిలోని రహస్యాలను ఆకళింపు చేసుకొని జర్మనీ లో సైంటిఫిక్ రిసెర్చ్ కి ఉపయోగించేవారు .
కొన్నేళ్ళ క్రిందట మాత్రమె చైనీయులు లాసా ,టిబెట్ లలో సంస్కృత డాక్యు మెంట్లు కనుగొన్నారు .వాటిని చండీ ఘర్ పంపి చైనా భాష లోని అనువాదం చేయించుకున్నారు ఈ డాక్యుమెంట్ లలో ‘’ఇంటర్ స్టెల్లార్ స్పేస్ షిప్ ‘’నిర్మాణ రహస్యాలున్నాయి .వాటి చోదక శక్తి అంటే ప్రపల్షన్ గురుత్వాకర్షణ శక్తికి వ్యతిరేకం (యాంటి గ్రావిటేషన్) .ఇది అచ్చంగా మనలోని ‘’లఘిమ శక్తి ‘’గా కనిపిస్తుంది .ఇదిఅన్ని గ్రావిటేషనల్ పుల్స్ ను అధిగమించే సెంట్రి ఫ్యూగల్ ఫోర్స్ అన్నమాట .మనిషి సాధించగలిగే అష్ట సిద్దులలో లఘిమ ఒకటి .ఈ శక్తియే మనిషి గాలిలో పైకి లేవటానికి (లీవియేట్)ఉపయోగ పడుతుంది .
‘’అస్త్రాలు ‘’అని పిలువబడే ఈ యంత్రాలను వేలాది సంవత్సరాల క్రితమే మన పూర్వీకులైన భారతీయులు మనిషిని వేరు చేసి గ్రహాలపై పంపి ఉంటారని ఆ డాక్యుమెంట్ లవలన అర్ధమౌతోంది .ఆ వ్రాత ప్రతులలో ‘’అంతిమ ‘’అంటే అదృశ్య శక్తి రహస్యాలు ,’’గరిమ ‘’అంటే విపరీతం గా బరువు పెరగటం యొక్క రహస్యాలు కూడా ఉన్నాయి .రామాయణం లో హనుమంతుడు లంకను దాటటం ,తన శరీరాన్ని విపరీతం గా బలిష్ట పరచటం ఈ శక్తుల వలననే .దురదృష్ట వశాత్తు భారతీయులు ఈ గ్రంధాలని విషయాలను సీరియస్ గా తీసుకోకుండా అలక్ష్యం చేశారు .చైనీయులు తమ అంతరిక్ష శోధనకు ఈ గ్రంధాలలోని విషయాలు బాగా తోడ్పడ్డాయి అని ప్రకటించిన తర్వాతే మనకు’’ కాక’’ పుట్టింది .
భరద్వాజ మహర్షి విమాన నిర్మాణ శాస్త్రం రాశాడని మనకు తెలుసు .రైట్ సోదరులకంటే ముందే ఇండియాలో 1895 లోశివ కుమార్ బాపూజీ తల్పడే మెర్క్యురి ఇంజన్ విమానం తయారు బొంబాయి శివార్లలో చనడిపాడని మనం మర్చి పోయాం .అలాగే న్యూక్లియర్ యుద్ధం ఇవాల్టి దికాదు. 8 వేలసంవత్సరాలనాడే ఉందని గ్రంధాలు తెలిపాయి .రాజస్థాన్ లో జోధ్పూర్ కు పది మైళ్ళ పడమటి భాగాన మూడు చదరపు మైళ్ళ విస్తీర్ణం లో రేడియో యాక్టివ్ ధూళి పేరుకుని పోయి కనిపిస్తుంది .ఇక్కడ ఇళ్ళనిర్మాణ౦ చేసే ప్రయత్నం చేసి త్రవ్వుతుంటే శాస్త్ర వేత్తలకు అక్కడ అతి పురాతన నగర శిధిలాలు ,వేలాది సంవత్సరాలక్రితం అణు విస్ఫోటనం 8 వేలనుంచి 12 వేల ఏళ్ళ కిందట జరిగి వేలాది ఇళ్ళను సుమారు అరమిలియన్ జనాభాను కబళింఛి నట్లు దాఖలాలు కనిపించాయి .ఇక్కడ వేసిన న్యూక్లియర్ బాంబ్ 1945 లో జపాన్ పై వేసిన బాంబ్ పరిమాణం లో ఉండి ఉంటుందని నిర్ణయించారు .
మన పురాణ ఇతిహాసాలలో విమానాలు అంతరిక్ష నౌకల ప్రస్తావన ఉండనే ఉంది .డబల్ డెకర్ సిలిండ్రికల్ విమానం రామాయణకాలం నాటిదే.అది వాయు వేగం తో ప్రయాణి౦చేది . విమానాలు నిలపటానికి అనువైన శాలలు ఉండేవి .అశ్విన్ అంతరిక్ష నౌకలో చంద్రుని చేరినట్లు తెలుస్తోంది .కృష్ణుడితో యుద్ధం చేసిన సాల్వుడు సౌభ విమానం లో అదృశ్యమైతే కృష్ణుడు ధ్వనివేగం తో వెళ్ళే అస్త్రాన్ని ప్రయోగించి వాడిని చంపింట్లు మహాభారత కధనం .అత్యంత వేగం గా ప్రయాణించే విమానంలో గూర్ఖుడు ఒకే ప్రక్షేపకం (ప్రోజక్టైల్ )కల ప్రపంచం లోని శక్తి అంతా కలిసిన శక్తి కలిగిన విమానం లో అంధక ,వ్రుషిల త్రిపురాలను దాటి పోతుంటే పది వేల సూర్యులకాంతి ,అంతేపొగ అంతరిక్షమంతా వ్యాపించింది .అదే అదృశ్య అస్త్రం అంటే దండర్బోల్ట్ అంటే పిడుగు . అంధక వ్రుషిల పురాలను వేలాది పురజనాలను మాడ్చి భస్మీపటలం చేసింది .సంస్కృత సంగ్రామ సూత్ర ధారగ్రంధం లో ఇలాంటి విషయాలెన్నో ఉన్నాయి.
అశోక చక్రవర్తి ‘’రహస్య నవ మానవ సంఘం ‘’ను అన్ని శాస్త్రాలలో పండిపోయిన విజ్నులతో ఏర్పాటు చేసివారితో పరిశోధనలు చేయించి వారి పరిశోధనా ఫలితాలను అత్యంత రహస్యంగా భద్ర పరచాడు .తాను గౌతమబుద్ధుని శిష్యుడు అహింసా ధర్మ వ్యాపకుడు కనుక వీటి రహస్యాలు జనాలకు తెలిస్తే వారి బుద్ధులు మారి మళ్ళీ హి౦సా వలంబకు లౌతారని భయానక ఆయుధాలు తయారు చేసి జనుల ప్రాణాలతో ఆడుకుంటారని భయం తో అలా నిక్షిప్తం చేశాడు .ఈ తొమ్మిది మంది తొమ్మిది గ్రంధాలు రాశారు .అందులో ఒకాయన రాసిన గ్రంధం ‘’గురుత్వాకర్షణ రహస్యాలు ‘’అందులో గ్రావిటీ కంట్రోల్ ‘’విషయం ఉన్నది .ఈ గ్రంధం ఇండియాలో లేక టిబెట్ లేక వేరొక చోట ఎక్కడైనా ఉండి ఉండచ్చునని చారిత్రకుల భావన
1931 లో లభించిన ‘’అంశు బోధిని ‘’గ్రంధం లో గ్రహాలూ వాటి రంగు , కాంతి ,ఉష్ణం విద్యుదయస్కాంత క్షేత్ర విషయాలున్నాయి .సోలార్ రేస్ ను ఆకర్షించే యంత్రాలు తయారు చేసేవిదానాలున్నాయి .అంతరిక్షం లో సుదూర ప్రాంత గ్రహ వాసులతో మాట్లాడే విషయాలున్నాయి .ఆ గ్రహాలకు మానవులను చేరవేసే యంత్రాల తయారీ విషయాలున్నాయి . విశ్వనాధ శాస్త్రి గారితో ప్రారంభించి అంతరిక్షం లో చాలా దూరం ప్రయాణం చేసి అలసిపోయాం కదా .
ఆధారం –మా అబ్బాయి శర్మ సేకరించి పంపిన ఆంగ్ల వ్యాసం .
శాస్త్రిగారి ఫోటో ,హిట్లర్ తో ఉన్న ఫోటో జత చేశాను చూడండి
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -19-1-18- ఉయ్యూరు
దండిభొట్ల వారి దర్జా..(విద్వాన్ సర్వత్ర పూజ్యతే.)
స్వగృహే పూజ్యతే మూర్ఖః స్వగ్రామే పూజ్యతే ప్రభుః స్వదేశే పూజ్యతే రాజా విద్వాన్సర్వత్ర పూజ్యతే– అంటే మూర్ఖుడిని వారి ఇంటిలోని వారే గౌరవిస్తారు ( వాని మీద ఆధార పడి బ్రతుకు తారు కనుక తప్పదుకదా ? ). గ్రామాధికారికి తన వూళ్ళోనే మర్యాద ఉంటుంది. రాజుకు తన రాజ్యంలోనే గౌరవం. కానీ విద్వత్తు ఉన్న వాడు ప్రపంచంలో ఎక్కడైనా గౌరవింపబడుతాడని భావం. ఎంత చక్కటి నిజం! ఇది ఎరిగిన వారు కనుకనే పండితులైన వారు తమ పాండిత్యాన్ని కాపాడుకుంటూ మర్యాదగా జీవించేవారు. బ్రాహ్మణుడైన వాడు ధనాశను వీడి తనకు లభించిన దానితో సంతృప్తిని చెంది మరునాటి గురించి కూడా ఆలోచించకుండా జీవించాలట. ఇది సనాతన బ్రాహ్మణ ధర్మం. అందువల్లనే కొందరు బ్రాహ్మణోత్తములైన పండితులు తమ పాండిత్యాన్నే నమ్ముకుని ఎవరి ఆశ్రయం కోసం పాకులాడక స్వతంత్ర ప్రవృత్తితో ఎన్ని కష్టాలనైనా ఓర్చుకుంటూ రాజులనైనా లెక్కచేయకుండా మహోన్నత వ్యక్తిత్వంతో జీవించేవారు. ఇలాంటి మహాను భావులగురించి ఇంతకు ముందు పోస్టు ( డబ్బంటే చేదా..) లో చెప్పి ఉన్నాను. ఆ టపా చదవడం కోసం చాలాకాలం క్రితం కాశీలో మహాపండితులు కాపురం ఉండేవారు. అలాంటి వారిలో మన తెలుగు వారైన దండిభొట్ల విశ్వనాథశాస్త్రి గారొకరు. వారు తెలుగు వారనే మనకు తెలుసు గాని ఎక్కడి వారో తెలియదు. వారి అత్తవారిది మాత్రం గోదావరి జిల్లాలో నేదునూరి ప్రాంతం. ఆయన తన చిన్నతనం లోనే భార్యతో కలసి కాశీ వెళ్ళిపోయి అక్కడ కాపురం పెట్టారు. పిల్లా పీచూ ఎవరూ లేరు. వీరు ఏం దర్జాగా బ్రతికేరో చూడండి: అప్పట్లో విజయనగర సంస్థానాధీశులైన ఆనందగజపతి రాజుగారు ఏడాది లో కొన్నినెలల పాటు కాశీలో ఉంటూ ఉండేవారు. స్వయంగా పండితులైన ఆనంద గజపతిగారికి సాహిత్యాభిలాష మెండుగా ఉండేది. పాండిత్య సభలు ఏర్పాటు చేసి కాశీలోని పండితులందరినీ గౌరవిస్తూ ఉండేవారు. ఇదిగో ఇలాంటి సమయాల్లోనే దండిభొట్ల వారికీ ఆనందగజపతుల వారికీ పరిచయం ఏర్పడి స్నేహంగా వృధ్ధి చెందింది. ఒకసారి దండిభొట్ల వారు దక్షిణ దేశం రైల్లోవస్తూ విజయనగరంలో దిగారు. ముతక పంచె మాసిన గడ్డం పొడుగాటి లాంకోటూ ఇదీ వారి వేషం. చేతిలో సంచీ కూడా లేదు. రైలు దిగీ దిగడంతో సరాసరి రాజుగారి కోటకే వెళ్లారు. తాను రాజుగారి మిత్రుడినని అనర్గళంగా హిందీలో చెబుతున్నఈ పండితుణ్ణి నివారించడానికి అక్కడున్నఉత్తరాది సైనికులెవరూ సాహసించేలేక పోయారు. శాస్త్రిగారు నేరుగా రాజమహల్ హల్లో ప్రవేశించి కుర్చీలో కూర్చున్నారు. అక్కడకు వచ్చిన అంతరంగికుడైన పనివాడిని పిలిచి రాజుగారితో దండిభొట్ల విశ్వనాథం వచ్చేడని చెప్పమన్నారు. దానికిది సమయం కాదు బాబూ అంటూ అతడు సంశయిస్తున్నంత లోనే శాస్త్రిగారి గొంతు గుర్తు పట్టి రాజా వారు హాల్లోకి వచ్చి శాస్త్రిగారిని ఎప్పుడు వచ్చేరని అడిగితే దానికాయన తాను ఊరికే దక్షిణాదికి వెళ్ళి వద్దామని బయల్దేరాననీ ఇంతలో రైలు బరం పురం వచ్చే సరికి తన దగ్గర భంగు అయిపోయిందనీ అది విజయనగరం ప్రభువుల వద్దనే దొరుకుతుందని తెలిసి ఇటు వచ్చానని అన్నారు. రాజు గారు పాలు మిఠాయిలూ భంగూ తెప్పిస్తే ఇద్దరూ కలిసి వాటిని సేవించాక మరికొంత భంగుని పొట్లం కట్టించి జేబులో వేసుకుని ఇక వెళ్ళి వస్తానని రాజుగారిని సెలవడిగారట. రాజుగారు నాలుగు రోజులుండి తమ ఆతిధ్యం స్వీకరించమనీ, తమ ఆస్థాన పండితుల వారింట బస చేయమని కోరితే తానెవ్వరి ఇంటా బస చేయనని రైలు స్టేషను దగ్గర మంచుకొండ వారి సత్రం చూసేనని అక్కడ ఆ రోజుకి ఉండి మరునాడు ఉదయం 10 గంటల రైల్లో వెళ్ళిపోతాననీ చెప్పారు. రాజుగారు ఆసాయంత్రం తమ ఆస్థాన పండితుల్ని పిలిచి పండితులందరూ వెళ్ళి సత్రంలో శాస్త్రిగారి దర్శనం చేసుకోమని ఆజ్ఞాపించేరు.. మరునాడు వారందరూ తమతమ శిష్యగణంతో పాటు శాస్త్రిగారిని దర్శనం చేసుకున్నారు. వారి కోరిక పై దండిభొట్లవారు వారి శిష్యులను పరీక్ష చేసి వారిలో శేఖరం (వ్యాకరణ గ్రంథం) చదువుకుంటున్న అబ్బాయి చాలా పైకి వస్తాడనీ అయితే ఆ అబ్బాయి వేసుకున్న ఇస్తిరీ బట్టలూ షోకూ శాస్త్రానికి పనికి రావనీ అన్నారు. ( ఆ ఇస్తిరీ బట్టల అబ్బాయి మరెవరో కాదు- తరువాతి కాలంలో మహామహోపాధ్యాయ బిరుదు పొందిన రాయుడు శాస్త్రిగారే). ఆ తర్వాత వారు టిక్కట్టు కొని ఇస్తామన్నా వద్దని వారిస్తూ తమను రైల్లో టికట్టు ఎవరూ అడగరని చెబుతూ రైలెక్కి వెళ్లిపోయారు. *** మహా వ్యాకరణ పండితులైన విశ్వనాథం గారికి కాశీలో అనేక మైన పండిత సభల్లో రెండేసి శాలువలను కప్పేవారు. వారు సభానంతరం ఇంటికి వస్తూ వస్తూ దారిలోఇద్దరు వేద వేత్తలైన పండితులను ఇంటికి పిలుచుకు పోయి భార్యతో “ ఏమేవ్ వేదవేత్తలొచ్చారు, వీరు దేవతా స్వరూపులు. వీరికి చెరొక శాలువా ఇచ్చి నమస్కరించుకో ” అనే వారు. తమకోసం ఏనాడూ ఏదీ మిగుల్చుకోలేదు. కప్పుకోవడానికి వారికి మామూలు దుప్పట్లే గతి. *** ఒక సారి వారి శ్రీమతికి శివరాత్రికి కోటిపల్లి వెళ్ళాలని మనసైంది. ఆవిడ కోరిక తీర్చడం కోసం వారిద్దరూ శివరాత్రికి ఒక వారం ముందరే కాశీలో బయల్దేరి రైల్లో కాకినాడ వరకూ వచ్చారు. ( రైల్లో ఏనాడూ ఎవరూ వారిని టికట్టు అడిగే వారు కారట ) . అక్కడినుండి కోటిపల్లికి బండిమీద వెళ్ళడానికి వారి దగ్గర డబ్బులు లేక నడిచే అంచెలంచెలుగా ప్రయాణిస్తూ శివరాత్రి నాడు సూర్యోదయ సమయానికి కోటి పల్లి చేరుకున్నారు. అది శివరాత్రి పర్వదినం కావడంతో చాలారద్దీగా ఉంది, వారు భార్యను ఒడ్డునే తమ సంచీ చూసుకుంటూ ఉండమని తాను గోదావరిలో స్నానం చేసి వచ్చారు. తర్వాత ఆమెనుస్నానం చేసిరమ్మంటే ఆమె తటపటాయిస్తూ “ఎంత సేపు ములిగి రావాలి కాకి స్నానమేగా” అంది. ఆమె చూస్తున్న గోదావరి వైపు ఆయన దృష్టి సారించేసరికి వారికి అక్కడ స్నానాలు చేస్తూ బ్రాహ్మణులందరికీ రూపాయిలు దానం చేస్తున్న ధనికులైన కమ్మవారి ఆడువారు కనిపించేరు. తమ భార్య మనోగతాన్ని గ్రహించిన వారై “ వారి లాగా దానాలివ్వడానికి డబ్బులేదనేగా నీ సందేహం. జాగ్రత్తగాఇక్కడే ఉండు ఇప్పుడే తెస్తాను”అంటూ పిఠాపురం రాజావారు శ్రీ హరిశాస్త్రి గారింట బస చేసారని తెలుసుకుని అక్కడకు వెళ్ళారు. అప్పుడే స్నానాదులు ముగించుకుని సోమేశ్వర స్వామి దర్శనానికి బయల్దేరబోతున్న రాజు గారు వీరినిచూసి ఆగారు. కుశల ప్రశ్నలయేక ఏమిటిలా దయచేశారని రాజుగారడిగితే తాను భార్యాసమేతంగా సోమేశ్వరస్వామి దర్శనానికని ఆవూరు వచ్చాననీ తన భార్య బ్రాహ్మణులకి దానాలివ్వడానికి కొంత సొమ్ము అవసరమై వచ్చాననీ చెప్పారు శాస్త్రిగారు. రాజుగారు వెంటనే ఒక వెండి పళ్ళెంనిండా రూపాయిలు పోయించి తెప్పించి స్వీకరించమన్నారు.. శాస్త్రిగారు రెండు గుప్పిళ్లనిండా రూపాయిలు తీసుకుని అవి చాలని వెళ్ళివస్తానని అన్నారు.. రాజు గారు “ అలాక్కాదు గుడిలో చాలా రద్దీగా ఉంది. మీరు స్నానాలు ముగించుకుని సతీ సమేతంగా వస్తే మాతో తీసుకు వెళ్ళి శీఘ్ర దర్శనం చేయిస్తా” మని అన్నారు. దానికి శాస్త్రిగారు అక్కర లేదనీ తాము అంతకంటే రద్దీలో కాశీలో దర్శనాలు చేసుకున్నామని చెప్పి సెలవుతీసుకుని గోదావరి ఒడ్డుకు వెళ్ళి ఆ రూపాయిలు తనభార్య చేతిలో పోసి అందులో ఒక్క రూపాయి కూడా మిగల్చకుండా దానం చేసేయమన్నారు. ****
అయ్యా ఇదీ దండిబొట్ల వారి కథ. ఇందులో ఏం పెద్ద విశేషముందని ఈ కథ చెప్పావయ్యా అని ఎవరైనా అని అడగొచ్చు. స్థూలదృష్టితో చూస్తే దీనిలో విశేషం కనిపించక పోవచ్చు. కానీ చేతిలో దమ్మిడీ లేనప్పుడు అనాయాచితంగా అంత ధనం వస్తుంటే తీసుకోకుండా ఉండగలగడం సామాన్యమైన గృహస్తులకు సాధ్యపడే విషయం కాదు. చేతిలో ఏ సొమ్మూ లేకుండా తీర్థ యాత్రకి పత్నీ సమేతంగా బయలు దేరడానికి ఎవ్వరైనా సాహసించగలరా? శాస్త్రిగారు శాలువలు స్వీకరించినా రూపాయిలు తీసుకున్నా అవి ఇతరులకివ్వడానికే గాని తనకోసం ఏమీ తీసుకోలేదు. మన పెద్దలు ఏమన్నారంటే— సద్యో దదాతి చతురః సద్యో నాస్తీతి చతురతమః అంటే (అడగ్గానే) ఆలస్యం చేయకుండా (ధనం) ఇచ్చేవాడు తెలివైన వాడైతే, ( అడక్కుండానే వచ్చే ధనాన్ని)ఆలస్యం చేయకుండానే వద్దనే వాడు అంతకన్న తెలివైన వాడు-అని భావం. ( ఇక్కడ తెలివైన వాడంటే ధర్మం తెలిసినవాడని అర్థం). మరి దండిభొట్ల వారు ఎంత గొప్ప ధర్మపరుడు ? నప్రతిగృహీతృత్వం- అంటే ఎవరి దగ్గర నుంచీ ఏదీ ఉచితంగా తీసుకోరాదన్నది మనధర్మమని ఇదివరకే చెప్పి ఉన్నాను కదా? దానిని తూ.చ. తప్పకుండా పాటించిన మహాను భావుల్లో దండిభొట్ల వారు కూడా ఒకరన్నమాట. అదీ ఆయన దర్జా. *** ఇక్కడితో ఆపేస్తే నా ఈ వ్యాసం ఉద్దేశం పూర్తి గా నెరవేరినట్లుకాదు. ఇటువంటి ధర్మ వర్తనుల సహధర్మచారిణులు కూడా ఎన్ని కష్టాలనోర్చుకుని వారు కూడా తమ సహచరుల ధర్మ దీక్షాయజ్ఞంలో పాలు పంచుకున్నారో మనం తెలుసుకుని వారికీ మన జోహార్లు పలకాలి. ఎంతో కొంత ధనాశని చంపుకుని జీవితాలను గడుపుకుంటే మనంకూడా మన పాఠాలను నేర్చుకున్నట్లే. ( ఈ విషయాలను గ్రంథస్థం చేసి వెలుగులోకి తెచ్చిన శ్రీ దువ్వూరి వేంకట రమణ శాస్త్రిగారికి కృతజ్ఞతలతో—సెలవు.)
|

