సరసభారతి 11 8 వ సమావేశం ‘’అమోఘమాఘమాసం ‘’లో నా ప్రసంగం
30-1-18 మంగళవారం ఉయ్యూరు శ్రీ సువర్చలాంజనేయస్వామి దీవాలయం లో సరసభారతి నిర్వహించిన ‘’అమోఘమాఘమాసం ‘’కార్యక్రమం లో అధ్యక్షునిగా నా ప్రసంగం –
శిశిర ఋతువు లో చెట్ల ఆకులు ఎర్రబడి రాలిపోతాయి .ఈ ఋతువు మాఘమాసం తో ప్రారంభమౌతుంది .మఖా నక్షత్రం పౌర్నమినాడున్ననెల మాఘ మాసం .అఘం అంటే పాపం .మా అంటే తొలగించేది దూరం చేసేది .పాపాలను పోగొట్టే నెల మాఘం . చెట్లకు చివుళ్ళు కూడా వస్తాయి .అలాగే పాపాలను రాల్చి పుణ్యం చివుళ్ళను ఏర్పరచే నెల.సూర్యారాధనకు శ్రేష్టమైన నెల .మాఘ ఆదివారం ఆవుపాలను ఆవు పిడకలపై పొంగి౦చి సూర్యునికి నైవేద్యం పెడతారు .మాఘ పంచమి వసంత పంచమి సరస్వతీ దేవి పుట్టిన రోజు .మాఘ శుద్ధ సప్తమి రధ సప్తమి . ఆకాశం లో నక్షత్రాలు ఈ రోజు రధం ఆకారం లో కనిపిస్తాయి .సూర్యుడు మకరరాశిలోకి ప్రవేశించగానే ఉత్తరాయణ పుణ్యకాలం వస్తుంది .ఉత్తరాయణం దేవతారాధనకు ముఖ్యం .ఉత్తరాయణ ప్రవేశంతో సూర్యుని మార్గం ఉత్తరానికి మారుతుంది .సూర్య రధ సారధి అనూరుడు లేక అరుణుడు సూర్య రధ సప్తాశ్వాల ను ఈశాన్యం వైపు మళ్ళిస్తాడు .మాఘ పౌర్ణమి సముద్ర స్నానానికి మంచిది .మాఘ బహుళ త్రయోదశి మహా శివరాత్రి . శివుడు ఆవిర్భవించిన రోజు .కనుక అటు విష్ణువుకు ఇటు శివునికి ప్రీతికర మైన నెల మాఘం అందుకే అమోఘం .
ఆడవాళ్ళు కొత్త నోములను మాఘమాసం లో నే పడతారు .లక్షవత్తుల నోము చేస్తారు .యజ్ఞయాగాదులకు మంచినెల మాఘం .పెళ్లిళ్లకు శుభప్రదం ‘’మాఘ మాసం ఎప్పుడొస్తుందో ‘’అని కన్నెలు ఎదురు చూస్తారు గ్రామ దేవతల తిరునాళ్ళు ఈ నెలనుంచే ప్రారంభమవుతాయి .మాఘమాసం లోసుపర్ణ సూక్తం , ఆదిత్య హృదయం ,అరుణ పారాయణ ,మహా సౌరమంత్రాలు, మయూరుని సూర్య శతకం ,కృష్ణుని కొడుకు సాంబుడు పఠించి కుష్టు రోగం పోగొట్టుకున్న 12 శ్లోకాలు భక్తీ తో పతిస్తారు .’’శ్రీ సూర్యనారాయణా –వేద పారాయణా’’అంటూ స్తుతిస్తారు .బాలాంత్రపు రజనీకాంత రావు గారుమహాద్భుత౦గా గానం చేసిన ‘’ఉదయిస్తూ బాలుడు ఉల్లిపువ్వూ ఛాయా ‘’పాటను పాడుతారు వింటారు .సూర్యాష్టకం చదువుతారు ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ .సత్యనారాయణస్వామి వ్రతం మాఘం లో అమోఘ ఫలితమిస్తుంది .
మాఘ స్నానం మహా పుణ్యఫలదం.ప్రవహించే నీటిలో అఘమర్షణ స్నానం సూర్యోదయానికి ముందే చేయాలి .మను చరిత్రలో ప్రవరాఖ్యుడు ‘’అఘమర్షణ స్నానమాచరించి సాంధ్య కృత్యము దీర్చి సావిత్రి జపియించి సైకతస్థలి కర్మ సాక్షి కెరగి ‘’స్నాన జప అర్ఘ్య విధి చేసినట్లు పెద్దన రాశాడు .మాఘ స్నానం మార్కండేయుడిని అపమృత్యు బాధ నుంచి తప్పించి చిరంజీవి ని చేసింది .మనసు మంచిది ,శుభ్రమైనదిగా ఉంటె శరీరమూ అలానే ఉంటుంది కోరిన కోరికలు తీరుతాయి .దీనికి ఉదాహరణగా స్వామి వివేకానంద రాసినా, చెప్పినా ‘’నాగ మహాశయుని గురించి తెలుసుకుందాం .
దుర్గా చరణ్ నాగ్ అంటే ఎవరికీ తెలియదు నాగమహాశయుడు అంటే తెలియని వారుండరు బెంగాల్ లో .ఇప్పటి బంగ్లాదేశ్ లో దియోగర్ లో 184 6 లో పుట్టి 1899 లో మరణించాడు . శ్రీ రామ కృష్ణ పరమహంస ముఖ్య శిష్యుడు .హోమియో డాక్టర్ .సంతృప్తి ఆయన జేవిత పరమావధి . రెండు చేతులా సంపాదన నిష్కల్మష మనసు .ఫీజుగా వచ్చిన డబ్బు ను దారిలో బాధ పడుతూ ఎవరు కనబడినా వారి చేతుల్లో పెట్టి ఒత్తి చేతులతో ఇంటికిచేరేవాడు .భార్య ఆయనకు అన్నిరకాలా అనుకూలవతి .ఒకరోజు పరమహంస ఈయనతో ‘’నువ్వెప్పుడూ రోగుల బాధ లపైనే దృష్టి పెడతావు నీకు ఆధ్యాత్మిక అనుభవం ఎలా వస్తుంది ‘’?అని ప్రశ్నించగానే ఆయన మనో భావం గ్రహించి వైద్య వృతిని తృణ ప్రాయం గా విసర్జించిన మహోన్నతుడు .భార్యా పిల్లలతో పూజా పునస్కారాలు ధ్యానలతో పరమహంస సేవతో సంతృప్తిగా గడిపాడు .
ఒక మాఘ పౌర్ణమి అంటే ‘’మహా మాఘి ‘’నాడు ఆయన కలకత్తా వెళ్లి గంగా స్నానం చేయాలను కొన్నాడు .రైళ్ళు అన్నీ కిక్కిరిసి ఉన్నాయి వెళ్ళే అవకాశమే కలగలేదు .ఇంటి దగ్గరే విచారం గా ఉండకుండా భగవధ్యానం తో ‘’గంగమ్మా కరుణిం చవా ‘’అని ప్రార్ధించాడు అంతే ఆయన పాదాల చెంత భూగర్భ గంగానది పెల్లుబికి బయటికి వచ్చింది .అయన ఆయన కుటుంబ సభ్యులు గ్రామజనం అందరూ ఆ పవిత్ర గంగా జలం లో మాఘ స్నానం చేసి పుణ్యం పొందారు .ఈ విషయాన్ని స్వామి వివేకానంద ఎన్నో సభలలో చెప్పి నాగ మహా శయుని ఔన్నత్యాన్ని లోకానికి చాటాడు .
జనవరి 20 నుంచి మార్చి 30 వరకు సూర్యోదయానికి ముందు ప్రవాహ జలం లో స్నానించాలి .అప్పుడు సూర్య కిరణాలలోని ఇన్ఫ్రా రెడ్ అల్ట్రా వయొలెట్ కిరణాల సాంద్రతలో లో మార్పు వచ్చి, అప్పుడు చేసిన స్నానం గొప్ప ఆరోగ్యాన్నిస్తుందని సైంటిస్ట్ లు రుజువు చేసి చెప్పారు .అది తెలియకపోయినా వేలాది సంవత్సరాలనుంచి మనం ఆ పని చేస్తున్నాం .దిలీప మహారాజు ఒకసారి వేటకోసం హిమాలయాలకు వెడితే సరస్సుదగ్గర ఒకముని కనిపించి ‘’మాఘ మాసం ఆ రోజే ప్రారంభం కనుక మాఘ స్నానం చేసిరా ‘’అంటే చేసి వచ్చి దాని ఫలితం గురించి చెప్పమని అడిగితే ,రాజధానికి వెళ్లి కులగురువు వసిస్టు ని అడగమని చెప్పాడు .ఆయన్ను అడిగితె ‘’ఒక గంధర్వుడి ముఖం వికృతంగా ఉండి మానసిక బాధ పడుతుంటే భ్రుగు మహర్షి మాఘస్నానం గంగానదిలో చేయమంటే చేస్తే మంచి రూపం వచ్చి మనస్తాపం తీరింది అని చెప్పాడు .ఇంద్రుని చెడ్డ పనులవలన దేవతలకూ అపకీర్తి అంటుకొని బాధ పడుతూ విష్ణు మూర్తికి తమ గోడు చెప్పుకుంటే మాఘస్నానం చేయమని చెబితే చేసి పాపాలమూట దులిపేసుకున్నారు .
ఆంద్ర దేశానికి చెందిన సుమంతుడు ,కుముద భార్యా భర్తలు. ఆమె ఎంత పుణ్యమూర్తో వాడు అంత నీచుడు దుర్మార్గుడు. ఆమె సద్ధర్మ పారాయణ .ఒకమాఘమాసం రోజు భర్త పొరుగూరికి వెళ్ళినప్పుడు జోరున వర్షం లో తడుస్తున్న సాధువుకు ఇంట్లో ఆశ్రయ మిచ్చింది .అతడు పడుకుని తెల్లవారుఝామున విష్ణు భజన చేసి నదీ స్నానానికి వెళ్ళిపోయాడు .మాఘస్నానం విశేష ఫలదం అని గ్రహించి భర్త రాగానే అతనితో నదీ స్నానానికి వెడదా మంటే ఒప్పుకోక ఆమెనూ వెళ్ళ వద్దన్నాడు .విసుగుపడి ఆమె ధైర్యం గా వెళ్ళింది .వాడు కర్రుచ్చుకుని కొట్టటానికి వెంటబడ్డాడు ఆమె గబుక్కున నదిలోకి వెళ్లి స్నానం చేస్తుంటే వాడు కర్రతో కొడుతుంటే కర్ర లాక్కుంటే వాడూ నీళ్ళలో పడిపోయాడు. అనుకోకుండా మాఘ స్నానం చేశాడన్నమాట .వాడిపుణ్యం పుచ్చి దంపతులు ఇద్దరూ వైకుంఠంచేరుకున్నారు .ఇలాంటి కధలు ‘’మాఘ పురాణం ‘’లో చాలా ఉన్నాయి ..అందుకే ‘’అమోఘమాఘమాసం అన్నాను .
మాఘుడు అనే సంస్కృత కవి ఉన్నాడని ,ఆయన శిశుపాల వధ కావ్యం రాశాడని దానికి వ్యాఖాన చక్రవర్తి మల్లినాద సూరి ‘’సర్వం కష ‘’అనే గొప్ప వ్యాఖ్యానం రాశాడని ఇది రాసేటప్పటికి వయసు ముదిరిపోయిందని తానె చెప్పుకున్నాడని మనకు తెలిసిన విషయాలే .ఇవాళ మహాత్మా గాంధీ గారి 70 వ వర్ధంతి కూడా .జాతిపిత మనకు , మన దేశానికి శుభాశీస్సులు ఇవ్వాలని కోరుకుందాం . నభోమండలమధ్యవర్తి ,ప్రత్యక్ష ,కర్మ సాక్షి ,సవిత్రు నారాయణుడు ఆదిత్య భగవానుడు సదామనకు ఆరోగ్య భోగభాగ్యాలనిచ్చి కాపాడాలని సూర్య నమస్కారాలు చేద్దాం .
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -30-1-18 –ఉయ్యూరు .
.
w
—
గబ్బిట దుర్గా ప్రసాద్

