బాత్ నీత్
గుండేలుబాదుకుంటూ మా బామ్మర్ది బ్రాహ్మి పరిగెత్తుకొచ్చాడు .కళ్ళవెంట ధారా పాతంగా నీళ్ళు కారుతున్నాయి .ఏదో ఉపద్రవం జరిగి ఉంటుందని భావించి ఓదార్చా .ఈ బాధకు కారణం ఏమిటో చెప్పమన్నాను .సగం ఏడుస్తూ సగం మింగుతూ చెప్పటం ప్రారంభించాడు –‘’బావా రోజూ చానళ్ళలో చాగంటాయన ధర్మపన్నాలు చెరిగేస్తూనే ఉన్నాడు ,గరికపాటాయన సమాజం భ్రస్టమై పోతోందని గాండ్రిస్తూనే ఉన్నాడు ,వేదాంత ప్రవచనాలతో సామవేదం సాధిస్తూనే ఉన్నాడు ,స్వంత చానలే పెట్టి పరిపూర్ణ స్వామి ప్రవచిస్తూనే ఉన్నాడు ,కాంగీ సాధూ గా ముద్రపడ్డ విశాఖ స్వామి ఆక్రోశం వెళ్ళ బుచ్చుతూనే ఉన్నాడు ,శక్తిపాతం పేరుతో నెత్తిన చెయ్యెట్టి మరో ఆయన జవ శక్తి పూరిస్తూనే ఉన్నాడు ,జగ్గీ వాసుదేవుడు ,రవి శంకర్ మారాజు ,రాం దేవ్ బాబా లు శాయశక్తుల ప్రజలను మంచి మార్గాన నడిపించటానికి కృషి చేస్తూనే ఉన్నారు –కానీ’’ అంటూ ముక్కు చీదుకుని మళ్ళీ మొదలెట్టి ‘’ఇంతమంది ఇన్ని రకాల ధర్మ న్యాయాలు బోదిస్తున్నా ,చానెళ్ళు అణువు ను భూతద్దంలో పెట్టి భయంకరంగా చిత్రిస్తున్నా ,డిబేటింగ్ లపైడిబెటింగ్ లు కండక్ట్ చేసి అనుక్షణ యుద్ధ వాతావరణాన్ని కలిగిస్తున్నా మనుషులకేమీ భయం లేకుండా పోతో౦దేమిటి?రోజు రోజుకూ నేరాలు ఘోరాలు ,మోసాలు దగాలు పెరిగిపోతూనే ఉన్నాయి .ఎక్కడా వెనకడుగు వేస్తున్న జాడ కనిపించటం లేదు .ఇదివరకు లేనిది ఇప్పుడు మరీ చిన్నపిల్లలపై అత్యాచారాలు ,వృద్ధులు సైతం కామం తో అకృత్యాలు చేసి సమాజ గౌరవాన్ని భ్రస్టు పట్టిస్తున్నారు బావా .పేపర్ తిరగేయాలంటే భయం, చానల్ చూడాలంటే డోకు గా ఉంది లోకం పరిస్థితి ‘’అని బావురుమన్నాడు .
బుజం తట్టి ,ఒదార్చా .నిజమే వాడు చెప్పింది నూటికి నూరు పాళ్ళు యదార్ధం .ఈ నీతి వచనాలు ప్రవచనాలు ఉద్గ్రంధాలు ఏమీ ప్రభావం చూపించటం లేదా అనే సందేహం రావటం నిజం .వాడికి నేను ఏం చెప్పి సమాధాన పరచగలను అని పించింది గొంగట్లో తింటున్నాం అన్న సంగతి గుర్తుకొచ్చింది .డేరాబాబా ,మొన్నటి గుజరాతీ బాబా,ఆంధ్రా లో ఇటీవల ఎందరో బాబాలు ఎన్ని మోసాలు చేశారో ,ఎంతకు తెగి౦చారో తెలుసు .ఇవి బ్రహ్మికీ తెలియనివికావుకదా అనుకుని ‘’ఇవేరా కోతి చేష్టలంటే .చపల చిత్తాల వెర్రి చేష్టలు ‘’అన్నా .వాడి మొహం లో బల్బు వెలిగింది .’’నిజమే బావా –మంకీ చేష్టలు .అవును మన్కీ బాత్ విన్నవాళ్ళు అలా చేస్తారంటావా ?’’అన్నాడు .వీడు మోకాలికీ బట్టతలకు లంకె వేస్తున్నాడు అనుకోని ‘’అరే!అది నువ్వు అనుకున్నట్లు మన్కీ బాత్ కాదునాయనా –మన్ కీ బాత్ –అంటే మనసులోని మాట .ఆయన రేడియోలో జనం తో తనమనసులోని భావాలను పంచుకునే మాటలు .అందులో స్వీయానుభవాలు అవతలి వారిపై సూటీ పోటీ ఉండచ్చేమో.కాని కర్తవ్య పరాయణులను చేసేందుకే ఆ బాత్ .దానికి పెడర్ధ తీసి ఏవేవో ఊహించి బుర్ర పాడు చేసుకోకు .ఇప్పుడు శాసనాలు పకడ్బందీ గా వస్తున్నాయి. నేరస్తులు తప్పించుకోలేరు .చంద్ర బాబు అన్నట్లు ‘’ఆంబోతుల్లా రోడ్డు మీద కొస్తే అదే ఆఖరు రోజు ‘’అని అందరూ తెలుసుకుంటే చిన్నారి బతుకుల దీపాలు ఆర్పేసే వారుండరు.’’అని చెప్పి ఊరడించి పంపించా మాబామ్మర్ది బ్రాహ్మి ని.
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -5-5-18 –ఉయ్యూరు


Sir, I don’t think this is not new to present day India. I’m sure this used to happen in old stone age, new stone age, and other umpteen ages. Now news channels are making use of this kind of masala news to increase their trps. They don’t have any sympathy towards the victim. Their only interst is how much publicity they can generate. This is true for political news as well. They want to sensationalise any and everything.
LikeLike