‘’చిన్న రసం ‘’ పెద్ద మోసం గురో’’

        ‘’చిన్న రసం ‘’ పెద్ద మోసం గురో’’

ఒకప్పుడు నూజి వీడు   చిన్నరసాలు అంటే ఎంతో క్రేజు .ఆ రుచీ,రంగూ  ,వాసనా నాణ్యతా దేనికీ ఉండేదికాదు .పెద్ద రసాలు సైజులో పెద్దవే కాని రుచిలో చిన్నవే అంటే మాధుర్యం తక్కువ ,రసం మరీ పలచనకూడా .బాగా పండిన ఒక్క పెద్ద రసం పండు తింటే కడుపు నిండి పోయేది . అన్నం కూడా తినాలని పించేదికాదు.కాని పచ్చి పెద్దరసాలను ఆవకాయ వేసుకోవటానికి బాగా ఉపయోగించేవారు .ఇప్పుడు పెద్దరసాలు కరువై పోయాయి .చిన్నరసం కోలగా  ముడుతలతో ,పసుపు రంగు చాయతో ,చిక్కని రసం తో పరమమాదుర్యంగా తీపికే తియ్యదనం ఇచ్చేట్టు గా ఉంటాయి ,ఉండేవి .వీటిని భోజనం లో చివరగా పెరుగన్నం లేక మజ్జిగన్నం లో ముద్దముద్దకూ ఒక రసాన్ని జుర్రుతూ మహా ఇష్టంగా తినేవాళ్ళం .మా  పిల్లల,మనవళ్ళ కాలం లో కూడా అందరం చాలా ఆనందం గా నూజివీడు చిన్న రసాల వైభవాన్నిఅనుభవించాం  ,’’విస్తూనే ‘’ఉన్నాం  ,కాని ఇదివరకటి మాధుర్యం ,రంగు రుచీ వాసనా అసలు కనిపించటమేలేదు గత ఎదేనిమిదేళ్లు గా .తేడా ఎక్కడ వచ్చిందో తెలీదు కాని ,చిన్నరసం పేరుతో నానా చెత్తా చెదారం అమ్ముతున్నారు .చూడటానికి రసం ఆకారమే కాని రుచిలో నక్కకూ నాగలోకానికీ ఉన్నంత తేడా .బండ్లమీద కాని కొట్లలో కాని ఉన్న రసాలను  కొందామని పండుతీసుకుని వాసన చూస్తె  ,చిన్న రసం వాసన వస్తే ఒట్టు .అంతా దగా మోసం .రేటు మాత్రం ఆకాశంలోనే .

  అయిదారేళ్ళ క్రితం చిన్నరసాన్ని తోతాపురి అంటే కలెక్టర్ మామిడితో బ్లెండ్ చేసి రసం పేరు తో అమ్మారు .కొంతవరకు రుచిగానే ఉండేవి .చిన్నరసాలలో చెట్టుకు పండిన పళ్ళ రుచి చెప్పనలవి కాదు .చెట్టు కాపు అయి పోయె సమయం లో చిన్నరసాలలో ‘’కొసకాయలు’’పండ్లు గా అమ్ముతారు .రేటు తక్కువే కాని వీటి మాధుర్యం, రుచి న భూతో గా గా ఉంటుంది .పాతిక చెల్లగా పాతిక కొనటమే పని .మా వాళ్ళందరూ మహా ఇష్టపడి తింటారు . వీటిని  నేను పెట్టిన ముద్దుపేరు ‘’తుప్పులు ‘’.తుప్పులు కొన్నాను ఇవాళ ‘’అని రాస్తే మా అమ్మాయి అబ్బాయిలు మనవళ్ళు అందరూ అర్ధం చేసుకుంటారు .ఇటీవల తుప్పులూ దొరకటల్లేదు  . రెండేళ్ళ నుంచి చిన్నరసం పేరుతో పెద్ద మోసమే జరుగుతోంది .వీటిలో చెరుకు రసాలు ,నల్లరసాలు వగైరా పనికిమాలినవన్నీ కలుపుతున్నారు .ఊరగాయ అంటే మాగాయ కు చిన్న రసం నంబర్ వన్.మంచి ముదురు టెంకఉన్న  కాయలు వచ్చేదాకా ఆగి మాగాయ వేసేవాళ్ళం .తొక్కుడు పచ్చడికి తెల్లగులాబి లేక నాటు రకాలు వాడేవాళ్ళం .పెద్ద రసాలు తగ్గాక అదే సైజు లో లేక అంతకంటే పెద్ద సైజులో సీజన్ చివర్లో వచ్చే ‘జలాలు ‘’అనే రకం ఆవకాయకు శ్రేష్టం గా ఉంటుందని వేస్తున్నాం .కాయ 15 నుంచి 20 రూపాయలు ఉంటుంది .కాని దాని రుచి దానిదే ఊరగాయకు .సీజన్ చివర్లో కోతిముడ్డి మామిడి పళ్ళు  లేక నీలాలు వస్తాయి ఇవి పెద్దగా రుచిగా ఉండవు .రసాలు తిన్న నోటితో వాటినీ తోతాపురి పళ్ళను తినాలంటే ఇబ్బందిగా ఉంటుంది జిహ్వ చాపల్యానికి తప్పదు కదా తింటాం .బంగినపల్లి మామిడి చెక్కుమీద మచ్చలు వస్తే బాగాముదురు అని అర్ధం దీని రుచి అద్భుతః .వీటిలో అవనిగడ్డ కాయ సీజన్ చివర్లో వస్తాయి .వీటి రుచి ఇక దేనికీ రాదు ఉండదు .అంత గొప్ప పళ్ళు అవి .ఇవికాక ఇప్పుడు చిన్న సైజు బంగినిపల్లి అంత పళ్ళు వస్తున్నాయి ఎక్కడినుంచో ఫర్లేదు .

  అమెరికాలో మాఅమ్మాయి విజ్జి మామిడిపళ్ళు పటేల్ బ్రదర్స్ నుంచి బాక్సులకు బాక్సులు కొంటుంది అవీ మన రాసాలులాగా కింద కొన తేరి  పసుపు రంగులో ఉంటాయి .వీటి రుచీ బాగానే ఉంటుంది .

    ఆంజనేయ స్వామికే ‘’షటగోపం ‘’

  శ్రీ హనుమజ్జయంతికి ముందు రోజు ప్రతి ఏడాదీ స్వామివార్లకు మంచి శ్రేష్ట మైన రసం మామిడి పండ్లు కొని పూజ చేసి మర్నాడు  కల్యాణం అవగానే ప్రసాదంగా అందరికీ ఇవ్వటం అలవాటు .నిరుడు మేము మేము అమెరికా లో ఉన్నాం కనుక మా అబ్బాయి రమణ పళ్ళు కొని ఘనంగా పూజ చేయించి సద్వినియోగం చేశాడు .ఈ ఏడాది కూడా వాడికే అప్ప జెప్పా .సాధారణం గా ఉయ్యూరు కూరగాయల మార్కెట్ కు నూజివీడు ,పరిసర ప్రాంతాలనుంచి  రైతులు బుట్టల లలో మామిడిపళ్ళు తెచ్చి వేలంపాట ద్వారా అమ్ముకుంటారు .వేలం నిర్వహించేది శ్రీ జ౦పాన పరమేశ్వరరావు కుటుంబం .ఆకుటుంబం లో శ్రీ పూల’’ఇప్పుడు ఉయ్యూరు నగర పంచాయితి చైర్మన్ కూడా .ఆయన ద్వారానే పాట లో మామిడిపళ్ళు కొనటం అలవాటు .అలాగే ఈ ఏడాది హనుమజ్జయంతి రోజున మా వాడు ఆయన ద్వారా పాట ద్వారా 1100 చిన్నరసాలున్న గంపలు  కొన్నాడు గంపకు 50 పళ్ళు ఉంటాయి .ఇందులోనూ మోసమే .గంపలో పై వరస పండ్లకూ  కిందవరస పండ్లకు అసలు సంబంధమే ఉండదు .పైన బాగుంటాయి కిందకు వెళ్ళినకొద్దీ  సైజు తగ్గుతాయి కాయల నాణ్యతా బాగా తగ్గిపోతుంది .ఇదో రకం మోసం .దీనికి ఎవర్ని బాధ్యులని చేయాలో తెలియదు .సరే పళ్ళు గుడికి చేర్చి సహస్రనామ అష్టోత్తరాలతో పూజ చేశాం కిందవరుస కొంచెం పచ్చి రకం వి ,ఆ పై వరుస మధ్యరకం, ఆ పైన పండినపండ్ల ను పేర్చిజాగ్రత్త వహించి  పూజ చేయించాం .కన్నయ్య అనే ఆతను అరటి గెలలు మూడు ఇచ్చాడు ఖరీదుకే .అవీ నాణ్యంగా లేవు .చూడటానికే మనసొప్పలేదు .

కల్యాణం రోజు మా కోడళ్ళు వాళ్లకు సహాయం గా శ్రీదేవి, అమ్ములు అందరికీ  పంచారు .శ్రీ కోనేరు చంద్ర శేఖరరావు గారు దీన్ని దగ్గరుండి పర్య వేక్షించారు .ఆ రోజు రాత్రి మా పెద్దబ్బాయి శాస్త్రివాళ్ళు హైదరాబాద్ వెడుతుంటే వాళ్ళకూ ,మా అక్కయ్యా వాళ్ళకూ ప్రసాదంగా పండ్లను అట్ట పెట్టేలలో పెట్టి పంపించాం .ఎలా ఉన్నాయో తెలీదు .

  మేము కొన్ని పండ్లు ఉంచుకున్నాం .నిన్న వాటిని తిందామని చూస్తె ఆ పళ్ళు ‘’ఒకమ్మకూ ఒక  అబ్బకూ పుట్టిన’’పళ్ళు లాగా లేవు .అసలు రసం వాసనే లేదు, సైజూ లేదు,ఆ ముడతలూ లేవు .బలవంతాన ఒక పండు తిందామనుకొంటే వెగటు వాసన. కడుపులో దేవేసి నట్లుంది. డాగులు, కంపు,దుర్వాసన .కనుక వీటిని తినలేము అని నిర్ణయానికి వచ్చి ,మా అమెరికా మనవళ్ళకు,ఇక్కడి మనళ్ళు మనవరాళ్ళకూ  మామిడి తాండ్ర బాగా ఇష్టం కనుక వాటిని పిసికి జ్యూస్ చేసి  కాచి పళ్ళాలలో ఎండలో  ఆరబెట్టి తాండ్ర చేద్దామనుకున్నాం .నిన్న, ఇవాళ ఆ  నేనె కస్టపడి ఆ పళ్ళను పిసికి రసం తీశా. పిసుకు తుంటే వచ్చిన వాసన భరించ లేక పోయా.  నాముక్కులో ఆ వాసన తిష్ట వేసుకుని పోయింది . తర్వాత ఏది వాసన చూసినా ఆ కంపు వాసనే వస్తోంది .చివరికి సెంటు కూడా .ఇంతటి దారుణం ఎప్పుడూ లేదు .భక్తులు ఎలా వాటిని తిన్నారో మా  శాస్స్త్రి వాళ్ళు, బావగారు వాళ్ళు ఎలాతిన్నారో దేవుడికే ఎరుక .ఇంతకంపు హనుమ ఎలాభరించాడో ?ఇంతటి ఘోర అపచారం రసం మామిడి పండ్ల రూపాన దేవునికి ,భక్తులకు కలిగింది .మా తప్పుకాకపోయినా  ”తిలాపాపం తలాపిడికెడు ”గా బాధ్యతమాదే  కనుక సవినయంగా శ్రీ స్వాములవారికీ భక్తులకు క్షమాపణలు చెప్పుకుంటున్నాం .మళ్ళీ ఇలాంటి మోసం జరగకుండా జాగ్రత్త వహిస్తాం .ఇక తాండ్ర ఎలా ఉంటుందో .ఈ కంపు అమెరికా దాకా పాకుతుందేమో అని భయంగా ఉంది .

  ఈ ఉదంతం  మాకు ఒక గుణ పాఠం నేర్పింది . కొనే మామిడిపళ్ళను  జాగ్రత్తగా పరిశీలించి ,కొంచెం రేటు ఎక్కువైనా నాణ్యత గల వాటినే కొనాలి . ఇలా సంతలో పాటగా మొహమాటపడి   చవకగా వస్తాయని కొంటె  ఇలానే జరుగుతుంది .మరో విషయం జయంతికి ముందురోజే తమలపాకు పూజ భారీగా చేసి జయంతి , కల్యాణం నాడు సుమారు 500 మంచి నాణ్యత ఉన్న రసాలు కొని పూజ చేసి కల్యాణం అవగానే అందరికీ పంచిపెడితే బాగుంటుంది .ఇక రాయలేను కడుపులో’’ మోసం రసం వాసన ‘’గుప్పుమంటోంది .శ్వాసతో అది మీకూ  ఇబ్బంది కలిగించవచ్చు .ఈ కంపు ను ఇక్కడితో గడిగేసుకుంటూ ,మరొకసారి మన్నించమని విజ్ఞప్తి చేస్తూ –

మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -12-5-18 –ఉయ్యూరు

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in సమయం - సందర్భం and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.