చాలాకాలం క్రితం శ్రీ సా. వేం .రమేష్ ‘’ప్రళయ కావేరి ‘’కధలు రాసి సంకలనంగా తెచ్చి బహు కీర్తి నార్జించారు .కృష్ణా జిల్లా శ్రీకాకుళం వాస్తవ్యులు కవి, కథా , నాటక రచయిత శ్రీ పోలవరపు కోటేశ్వరరావు గారు అక్కడి కృష్ణా నది వరదలపై చక్కని కథలు రాసి మెప్పు పొందారు .దివిసీమ ఉప్పెన పై ఎన్నో కథలు, గాథలు , దీర్ఘ కవితలు వెల్లువలా వచ్చాయి .రమ్య భారతి సంపాదకులు ,ఆంధ్రప్రదేశ్ రచయితల సంఘ ప్రధాన కార్యదర్శి ,కవి, కథకుడు, విమర్శకుడు శ్రీ చలపాక ప్రకాష్ ఇప్పటికే ‘’ప్రళయం ‘’నేపధ్యంగా రెండు కథా సంకలనాలు ప్రచురించి ,మూడవ సంకలనం గా ముగ్గురు రాసిన మూడే మూడు కథలతో ‘’మూడవ ప్రళయం ‘’సృష్టించి ఈ ఏప్రిల్ లో ఆవిష్కరణ జరిపారు .ముచ్చటైన ముఖచిత్రం తో ,ప్రళయం సృష్టించిన దృశ్యాలతో లోపలి అంశాలకు ఆనవాలుగా పుస్తకం బాగుంది . ఏదో పని మీద నిన్న మా ఇంటికి వచ్చి ‘’ప్రళయం ‘’తో పాటు మరికొన్ని పుస్తకాలు ఇచ్చి వెళ్ళారు .ఇవాళే అన్నీ చదివేశాను .
ఈ మూడూ మూడు ప్రాంతాలలో అంటే కృష్ణానది ఉపనది అయిన తుంగ భద్ర తీరాన ,కృష్ణానది ఒడ్డున ఉన్న విజయవాడ లో,సముద్ర తీరాన కృష్ణాజిల్లా ఎదురు మొండి గ్రామాన జరిగినట్లు రాయబడిన కథలు.మొదటి కథ’’నేనున్నానుగా ‘’ రచయిత శ్రీ రంగనాథ రామ చంద్ర రావు .రెండవది ‘’ప్రళయం ‘’పేరుతొ చలపాక కథ.మూడవ కథ’’మరో ఉప్పెన ‘’శ్రీ వడలి రాధాకృష్ణ రాశారు .జల ప్రళయం వస్తే ఎంతటి విధ్వంసం జరుగుతుందో ,జీవితాలు ఎలా ఛిద్రమై అస్తవ్యస్తమౌతాయో ,కన్నబిడ్డలు, భర్తా భార్య ఎలా ఎడబాటుకు గురై పోతారో ,ప్రళయం మనుషుల మెదళ్ళలో ఎలాంటి ఆలోచనల సుడి గుండాలు రేపుతాయో ,ఎందరు వీటికి తట్టుకుంటారో ,ఎందరు ఆ ప్రభావానికి లోనై జీవిత గమ్యాలను ఆపేక్షాను రాగాలను కృష్ణార్పణం చేస్తారో తెలియ జెప్పిన ఆణిముత్యాలైన కథలివి .
తుంగ భద్ర తీరాన ఒక వైష్ణవ కుటుంబం లో చాలాకాలంగా మంచం పట్టిన ముసలి తండ్రి కొడుకు ,కోడలు ,చిన్నారి మనవడు ల గురించిన దే మొదటిది . సంప్రదాయాన్ని చక్కగా కాపాడుకుంటున్న కుటుంబం అది . మామగారిని తండ్రిలా చూసుకుంటున్న కోడలు ,కోడల్ని కూతురిలా ఆదరిస్తున్న మామగారు .తండ్రికి ఏ లోటూ రానీకుండా కాపాడుకుంటున్న కొడుకు వీరందరి ప్రేమానురాగాలు పొందిన చిన్నారి బాలుడు .హాయిగా సాగుతున్న జీవితం లో ఒకరోజు అకస్మాత్తుగా తుంగ భాద్రానది ఉత్తుంగ తరంగాలతో ఎగసి రాకాసిలా ఊరి మీద విరుచుకు పడింది. ఆగాలికీ నీటి వేగానికీ ఏదీ ఆగటం లేదు . చిన్నారి కోసం తండ్రి వెతుకులాట ,గదిలో ముసలాయన కు గుండెలలో తెలీని కలవరపాటు .ఇలాంటివి ఎన్ని చూశాడో పూర్వం .పదేసి నిమిషాలకోసారి మామగారికి ధైర్యం చెపుతోంది కోడలు విశాలాక్షి .ఆమె మనసులో భర్త ప్రహ్లాదాచారి ,కొడుకు చిట్టి మాధవుడు ఏమై పోయారో అన్నఆరాటం .ఇళ్ళల్లోఉండవద్దు ఖాళీ చేసి పొమ్మని అధికారుల ఆజ్ఞలు . దిక్కు తోచని స్తితి. ఆమె మామగారిని ఒంటరిని చేసి వెళ్ళ లేదు .ఇంటిలోని కొద్దిపాటి దనం సొమ్ములు మూటకట్టి భర్తకిచ్చింది . లాగికోట్టిన ప్రవాహానికి అతడు ప్రవాహం లో ఎదురీదుతూ ,కొడుకుని పొదివి పట్టుకుని సహాయకుడు వెంకన్న ఆసరాగా ఒడ్డుకు చేరే ప్రయత్నం చేస్తున్నాడు .కానీ విధి బలీయం .మామగారి దగ్గరకొచ్చి ‘’మీఅబ్బాయి మనవడు కులాసాగా ఉన్నారు ‘’అని ముసలాయనకు ధైర్యం చెప్పింది ..భయపడవద్దని మామగారిని పసిపిల్లాడిగా ఒడిలోకి తీసుకున్నది ఆ మహాతల్లి విశాలాక్షి .అంతే క్షణం లో ఆగది కూడా నీటిలో మునిగి మామా కోడలు జలసమాధి చెందారు .
మర్నాడు అంతా ప్రశాంతమే.ప్రహ్లాదా చారి తన ముందున్న మూట తెరిచాడు .అందులో డబ్బు నగలతో తనవి కొడుకువి మాత్రమె బట్టలున్నాయి .భార్య చీర ఒక్కటికూడా లేదు కు౦గి పోయాడు ఆచారి .మామగారికి చివరదాకా ‘’ననేనున్నాను ‘’అని భరోసా ఇచ్చి రక్షించి ,చివరికి తల్లీ కొడుకు లాగా మామగారు ,కోడలు భద్రం అనుకున్న తుంగ భద్ర ఉగ్రత్వానికి బలై పోయారు .కన్నీళ్లు తెప్పించే సంఘటన .చిక్కని కధనం .మామంచి కధ.
శ్రీ ప్రకాష్ రాసిన ‘’ప్రళయం ‘’లో కృష్ణా నది ప్రళయమేకాదు ,వార్తా చానళ్ళ భయోత్పాతక కదన ప్రళయాలూ ఉన్నాయి .క్రష్ణాతీరాన బెజవాడ దీని నేపధ్యం.డబ్బు మీద యావ ఉన్నవాళ్ళు తలిదండ్రుల సంగతే మర్చి పోతారని ,తాను సురక్షిత ప్రాంతానికి వెడతానని వెళ్ళిన కొడుకు అక్కడి జలప్రళయానికి ఏమై పోయాడాఆనే ఆరాటం పడే తండ్రీ ,నిమిషానికో వార్త సృష్టించి ప్రజలకు ధైర్యం ,ఊరట ఇవ్వాల్సిన చానళ్ళు ,జరిగే దానికి చిలవలూ పలవలూ చేర్చి వండి వడ్డించే వ్యంగ్యాస్త్రాలు సంధించే అంశమూ ఇందులో ఉంది .చానళ్ళలో వచ్చే వార్తలు క్లోజప్ లో పదేపదే చూపిస్తుంటే చూసి చూసి ఆకుటుంబ యజమాని రంగారావు గారికి మున్నెన్నడూ రాని గుండేనొప్పి అకస్మాత్తుగా వచ్చి కుప్పకూలి మరణించాడు .సహాయం అందించే దిక్కే లేదు .అందరూ ఉన్నా ఒంటరి వాడయ్యాడు .దీన్ని చక్కని కథా౦శ౦ గా చలపాక మలచిన తీరు బాగుంది .చివర్లో ఆయన సంధించిన ప్రశ్నలు ‘’ఇంతకీ రంగారావు గారి దుస్తితికి కారణం ?ప్రకృతి చిందించిన విలయ తాండవమా ?ముంచెత్తిన జలప్రలయమా ?క్షణ క్షణం టివి లుకధలు సృష్టించి భూతద్దం లో క్లోజప్ గా బ్రేకింగ్ న్యూస్ గా చూపించటమా ?దీనికి ఎవరు బాధ్యులు ?సమాధానం చిక్కని ప్రశ్నలివి .
మూడవదైన ‘’మరో ఉప్పెన ‘’. ఎదురుమొండి గ్రామం దివి ఉప్పెనకు ఒకసారి అతలాకుతలమై మళ్ళీ కోలుకున్నది.ఇప్పుడు మళ్ళీ ఉప్పెన ప్రమాదం.ఒక వైపు ఉప్పెన ముంచెత్తుకొస్తుంటే అమృత భర్త లో ప్రణయం ప్రళయమై వాంఛ తీర్చు కొనేదాకా వదలలేదు .ఉద్ద్రుతమైన తుఫానులో అందరూ చెల్లాచెదరయ్యారు..భర్త అనాధ శవమై దహనమైపోయాడు .కొడుకు కనిపించలేదు .కొడుకు అమ్మకోసం పలవరిస్తున్నాడు రామకృష్ణ సేవా సదనం లో .అమృత కాలక్రమం లో మరో అతన్ని చేరి ,లోపల కొడుకు మీద మనసునిండా ప్రేమున్నా ,సుఖ సంపదలకు బానిసై ,ఆ కొడుకు ను తెలిసినవాళ్ళు తీసుకుని వస్తే వాడు తనతల్లి ఎప్పుడూ తనను మర్చిపోదన్న గాఢమైన నమ్మకం తో ఉంటే ,ఆమె తెగించి,గుండె రాయి చేసుకుని , కడుపులో బడబాగ్ని దహిస్తుంటే ,ధైర్యంగా తాను అమృత కాదని తనకు కొడుకే లేడని చెప్పి ఆ కుర్రాడి మనసులో ప్రళయమే సృష్టించింది .విధి వైపరీత్యం .ప్రళయం సృష్టించిన మరో విచిత్రం ఇది .
ఈ మూడిటి లో మొదటికథ సాంద్రం గా ,ఆర్ద్రం గా ఉంది .గుండె లోతులను తడిమింది .కోడలి త్యాగానికి పరాకాష్ట గా నిలిచింది .రెండవది లోకరీతి .కధనమూ బాగానే ఉన్నది .మూడవ దాంట్లో కృత్రిమత కనిపిస్తుంది .పలచబడిన కధనం అనిపించింది .సాగతీత విసుగు తెప్పిస్తుంది .
అందరు చదవాల్సిన కథా సంకలనం ‘’ప్రళయం ‘’
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -14-5-18 –ఉయ్యూరు



