91 ఏళ్ళ వయసులోనూ అద్భుత కవితా సృష్టి చేయగల చేవ ఉన్న విద్వత్ కవి శ్రీ చింతలపాటి నరసింహ దీక్షిత శర్మ గారు . గుంటూరు జిల్లా అచ్చమ్మ పేట మండలం కోగంటి పాలెం అగ్రహార నివాసి .చింతలపాటి వెంకట నరసమాంబ ,వెంకట రామ శాస్త్రి దంపతులకు 26-6-1927జన్మించారు .కృష్ణా జిల్లా చందర్ల పాడు లో విద్యాభ్యాసం ప్రారంభించి ,హైదరాబాద్ వేదాంత వర్దినీ సంస్కృత కళాశాల లో విద్యా శిక్షణ పొంది ,గుంటూరు జిల్లా పొన్నూరు లో శ్రీ భావనారాయణ స్వామి సంస్కృత కళాశాల లో ఆంద్ర భాషాధ్యయనంచేసి ,గుంటూరు జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల ఆంధ్రాధ్యాపకులై ,విద్యా బోధనలో తరించి పదవీ విరమణ చేశారు .
రచనా దీక్షితీయం
జన్మతః కవిత్వం వంట బట్టిన శర్మగారు 16 వ ఏటనే రమాపతి, రాజ రాజేశ్వరశతక ద్వయం రాసిన ప్రతిభాశాలి .బాలకవిగా ,ప్రౌఢ కవిగా ,మధురభారతి గా ,కవిరాజమౌళి గా కవితా శిఖరారోహణం చేశారు . 72 కు పైగా గ్రంథాలు ఆంద్ర, సంస్కృతాలలో,వివిధ ప్రక్రియలలో రచించిన పండిత కవి . .’’శాతవాహన చరిత’’చారిత్రిక కావ్యం రాసి తన మిత్రుడు శ్రీ జొన్నలగడ్డ జానకి రామయ్యకు అంకిత మిచ్చిన స్నేహ శీలి .ఇందులోని అవతారికను బట్టి శర్మగారు అప్పటికే ఋతు సంహారము ,శృంగార గోవర్ధనము , లీలాభిక్షువు ,విశ్వనాథ విజయం రచించినట్లు తెలుస్తోంది .ఇవికాక మందార మంజరి ,నాస్వామి ,త్రివేణి ,కృష్ణ చరిత్ర ,సరసోపనిషత్తు కూడా రచించారు . అరవై ఏళ్ళ వయసులో తన షష్టి పూర్తి ఉత్సవ సందర్భంగా జగన్నాథ పండితరాయల సంస్కృత ‘’అన్యోక్తి విలాసం ‘ను ‘’చైత్ర రథం ‘’పేర తెలిగించారు .చైత్రరథం అంటే కుబేరుని ఉద్యానవనం .అది అనేక రకాల పరిమళభరిత పుష్పజాతులతో విరాజిల్లేది .తన చైత్రరథం లోను పలు కవితా సౌరుల నంది౦చాలన్న తపనతో ఈ పేరు పెట్టారు శర్మగారు .ఒక ఉపజాతిపద్యం దాని తరువాత ఒక వృత్తపద్యం ,మళ్ళీ ఉపజాతి, తర్వాత వృత్తం ఉండేట్లు రచన చేసి శోభ చేకూర్చారు .ఇందులో శర్మగారి కవితా వైదుష్యం,వైశిష్ట్యం ,భావగాంభీర్యం ,ఆలోచనాసరళి ముగ్ధులను చేస్తాయి .ఆపాత మధురంగా ,ఆలోచనామృతం గా తీర్చి దిద్దారు .’’పాలిత శబ్ద ధర్ముడు ‘’ రసగంగాధర కర్త ఐన ఆంద్ర కవి పండిత జగన్నాథ కవి రాయల రచన నుఆంధ్రీకరించుట అంతంత మాత్రకవికి సాధ్యం కాదు .శర్మగారు దాన్ని సాధించి కీర్తి పొందారు .’’ప్రతిపద్యం ముక్తాస్వచ్చము ,మనోమోహకం ‘’అని మెచ్చిన డా ప్రసాదరాయ కులపతి గారి మాటలు అక్షర సత్యాలు .శ్రీ వేదాల సీతారామాచార్యులు వీరి విద్వత్తును ప్రశంసిస్తే , శ్రీ ఏలూరిపాటి అనంతరామయ్య గారు’’తెలుగుం బల్కుల తీపి మీగడలు తృప్తిం బెంచ ,గైర్వాణికోక్తులు మేలౌ కలకండ ముక్కలుగ నెంతో తీయముల్ నించ ,నీ తెలుగుం గావ్యము తీర్చి దిద్దితివి’’అంటూ ప్రశంసాశీస్సులు అందించారు .తాను ‘’ఉభయ భాషాను ష౦గసౌరభ తరంగములకు చలువల విలువలు కొలుపువాడ ‘’అని సవినయంగా బుధులకు విన్నవించుకున్నారు శర్మగారు .
ఇంతటి విద్వత్కవి శర్మగారు బాలలకోసం ‘’బాలప్రబోధం’’ రాశారు .అందులో ‘’మధుర శబ్ద పాక మహితమ్ము ,సుజ్ఞాన –బోధకమ్ము ,కీర్తి సాధకమ్ము –సరస భావ యుతము ,నరసింహ దీక్షిత –కృతము కనుము రచన రీతి బాల ‘’అన్నారు ,తాను అప్పుడప్పుడు రాసిన ఖండికలను ‘మధుకణాలు ‘’గా తెచ్చారు .ఇందులో కాళిదాసు ,విశ్వనాధ మున్నగు కవి ప్రశంస ,సంక్రాంతి ,ఉగాది శోభ వర్ణించారు .వజ్రాయుధం కొండలను నరికి నట్లు లోకం లోని అవినీతిని ఖండించటానికి 527పద్యాల ‘’కవితా తూణీరం ‘’రాశారు .ఇందులో –‘’గోడలందు ‘’అస్పృశ్యత కూడద’’నుచు –వ్రాయు చుండుటయే అంటరాని తనము –కలదనుచు పిన్నవారికి తెలుపుటెయిది –విజ్ఞాతా శూన్యమైనట్టి వెకిలి వ్రాత ‘’అని మన సిగ్గుమాలిన తనాన్ని ఎండగట్టారు . -’’నారద శారద ‘’లో జ్యోతిశ్శాస్త్ర విశేషాలన్నీ వచనంగా రాశారు.తన పేరు లోని నరసింహ దీక్షిత శర్మ ను ‘’నదీశ ‘’గా కుదించి ‘’నదీశ కవిత ‘’ ‘’రాశారు.ఇందులో ‘’వినయము విధేయత ,సపర్య యను గుణమ్ము-గృహిణులకు రత్నభూషయై కీర్తిపెంచు –కావ్య సతికిం ,జమత్కార గరిమ సొమ్ము ‘’వంటి అనర్ఘ పద్య రత్నాలెన్నో ఉన్నాయి .
కృష్ణం వందే జగద్గురుం,రసో వై సహ’’ అన్న దాన్ని అనుసరించి ‘’శ్రీ కృష్ణ విలాసం ‘’కావ్యాన్ని 102 తేటగీతి పద్యాలలో కవితామయంగా వర్ణనాత్మకంగా రాశారు .’’రాస లీలాది సుధల,గోపీ సుదతుల –ముంచి తేలిచి ,రస పీఠమున నిలిపె-ధాత్రి ,నాన౦దరస నిర్వృత మ్మొనర్చె-రసమయుడు బ్రహ్మానంద రసమయుండు ‘’.కృష్ణా జిల్లా దివితాలూకా అవనిగడ్డ –నాగాయలంక దారిలో ఉన్న వేకనూరు క్షేత్రం లో వెలసిన ఉభయ ముక్తీశ్వర స్వామి ‘’పై భక్తి చిప్పిలేట్లు’’ వేకనూరు ఉభయ ముక్తీశ్వర శతకం ‘’ రాశారు .ఇందులోని పద్యాల మొదటి అక్షరాలన్నీ కలిపితే శ్రీ వేకనూరి వాసాయ ఘంటసాల వంశ సంభవ —భారద్వాజస గోత్ర మధురభారతి కవిరాజమౌళి చింతలపాటి నరసింహ దీక్షిత కవి విరచితం ‘’అని వచ్చేట్లు చమత్కారం చేసి స్వామికార్యం, స్వకార్యం తీర్చుకున్నారు .’’ముక్తి రమ చేరుగాత ముముక్షు తతిని-భక్త కోటికి శుభములు ప్రబలు గాత-కవి వచస్సులు తేజస్సు గా౦చు గాత-ఉభయ ముక్తీశ్వారా వేకనూరి వాస ‘’ .అలాగే కృష్ణాజిల్లా నందిగామ దగ్గరున్న చింతలపాడు లో చింతలపాటి వంశీకులడైన సోమేశ్వర స్వామి ‘’పై అవంశం వారి అభ్యర్ధనమేరకు చింతలపాటి సోమేశ్వర శతకంను ‘’ సహస్ర చంద్ర దర్శనం’’తర్వాత పూర్తి ఆరోగ్యం తో ‘’కళ్యాణ మంగళ వాద్యంగా ,ఖండ శర్కర నైవేద్యం లాంటి పద్యాలతో రాసి శివభక్తి ప్రకటించుకుని’’శతకంబుల్ రచియించితి ,నభీష్ట శ్రీల గుప్పింతువో –రతనంబుల్ సమకూర్తువో –అతుల జ్ఞాన ధనాఢ్యు చేయుదువో’’అంటూ ఆర్తిగా వేడుకొన్నారు . చనిపోయిన తన చెల్లెలు ‘’సాధు అది శేషాంబ’’స్మృత్యర్ధం మేనల్లుని కోరికపై ‘’సువర్ణ దుర్గ ‘’శతకం రాసి భక్తి శతకక రచనలో తనదైన ముద్ర వేసి భక్త కవి శిఖామణి అనిపించుకొన్నారు . .’’త్రివేణి ,సువర్ణాభిషేకం ,శ్రీ వేణుగోపాలశతకం కూడా రాశారు .87 వ ఏట ఈముదుసలి కవి మనసు సరసం పైకి పాకి,ఏకంగా ‘’సరసోపనిషత్ ’’రాసేసి –‘’విషమ శరతంత్ర వైవిధ్యమరసి-సంతసి౦చుడు’’అంటూ సరసోపనిషత్తు ‘’నిత్యకల్యాణ లక్ష్మీ వినిద్ర కీర్తి –సంపదల సొంపుపెంపుల నింపుగాత’’అని అభయమిచ్చారు .
అవధాన సరస్వతి
శర్మగారు నలభై కి పైగా అష్టావధానాలు చేశారు .అందులో వచ్చిన సమస్యలను మధుర కవిత్వం తో పూరించి ఆ పూరణలను ‘’సమస్యా పూరణం ‘’పేరుతో ప్రచురించారు .50 భువన విజయాలలో పాల్గొన్నారు .జంధ్యాల వారి సరసన ‘’ధూర్జటి ‘’పాత్ర పోషించారు .కవిసామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ ,డా నారాయణ రెడ్డి ,దివాకర్ల వేంకటావధాని వంటి సాహితీ దిగ్గజాల దీవెనలు అందుకున్న కవి శేఖరులు శర్మగారు .
బిరుద సత్కారాలు
కృష్ణా జిల్లా నందిగామలో కుర్తాళ౦ పీతాధిపతి సమక్షం లో శర్మగారు కనకాభిషేకం పొందారు.అలాగే అవధాన సరస్వతి శ్రీ మాడుగుల నాగఫణి శర్మగారి అధ్యక్షత న జరిగిన సభలో దీక్షిత శర్మ గారికి కనకాభి షేకం జరిగి ‘’కవి శిరోమణి ‘’బిరుదు నందుకున్నట్లు తెలియ జేశారు ,ఇవి అపూర్వ విషయాలు.,చిరస్మరణీయాలు .శర్మగారి రచనా సర్వస్వం పై ఒక విదుషీమణి ‘’సిద్ధాంత గ్రంధం ‘’రచించి ,ఆచార్య నాగార్జున విశ్వ విద్యాలయం నుండి డాక్టరేట్ పొంది కవిగారి కీర్తి కిరీటం లో మరొక కలికితు రాయిని చేర్చింది .శర్మగారి బిరుదులు ఎన్నో ఉన్నాయి .అందులో కవి రాజ మౌళి ,కవి శిరోమణి ,మధురభారతి ,పండిత పరమేశ్వర ,కవి వతంస ,సత్కవీంద్ర ,విద్వత్కవి పుంగవ ,అభ్యుదయ భారతి ,సాహిత్య సాగర ,కవివల్లభ ఆంద్ర గోవర్ధన ,సాహిత్య జగద్గురు ,మధురకవి ,భక్త కవి వరేణ్య ,కవి సార్వభౌమ మొదలైనవి .ఇవన్నీ వారి విద్వత్తుకు, కవితా పాండిత్యానికి, శేముషీ గరిమకు లభించిన అన్వర్దాలైన బిరుదాంకితాలే .ఈనాడు మున్నగు తెలుగు పత్రికలు శర్మగారి కవితా సామర్ధ్యం పై అనేక వ్యాసాలు రాశాయి .కవిత్వం వీరికి వాచో విదేయం .సుగమం, సుందర పద గు౦ఫన తో ,అనితర సాధ్య శైలీ నిర్మాణం తో శర్మగారి కవిత్వం శోభిల్లు తుంది .పద్యం లోనూ ఆధునిక భావాలను అలవోకగా చెప్పగల నేర్పు వారిది .ఆధునిక భావాలనూ సమాదరించి పాత కొత్తలకు మేలు వంతెన నిర్మించారు .
ఇంతటి ఉత్కృష్ట రచనలు చేసి ,పలుసన్మానాలు ,బిరుదులూ పొందిన కవి శేఖరులు,జ్ఞాన వయో వృద్ధులు శ్రీ చింతలపాటి నరసింహ దీక్షిత శర్మగారు గుంటూరు జిల్లా స్వగ్రామంలో శేష జీవితం గడుపుతున్నారు . ప్రభుత్వం వారి దృష్టి ,మహా మహా సాహిత్య సంస్థల దృష్టి , ,సాహిత్యాన్ని ఉద్ధరిస్తున్నామని చెప్పుకునే పత్రికల దృష్టీ,,విశ్వ విద్యాలయాల దృష్టి ఈ పండిత కవి శ్రేస్టుని పై ప్రసరించకపోవటం విచారకరం .శర్మగారు ప్రస్తుతం ‘’పేటికా౦తర్గత మాణిక్యం ‘’లాగా ఉండి పోయారు .వారి ప్రజ్ఞా పాండిత్య కవిత్వ శేముషీ వైభవాన్ని గురించి ఈ తరం వారికి తెలియ జేయటానికి రమ్య భారతి సంపాదకులు,సాహితీ సుమనస్కులు శ్రీ చలపాక ప్రకాష్ గారు పూనుకొన్నందుకు అభినందిస్తూ , ,రాసే బాధ్యత నాకు అప్పగించినందుకు ధన్యవాదాలు తెలియ జేస్తూ .అంతటి కవితావతంసుని పరిచయం చేసే భాగ్యం ,అదృష్టం నాకు కలిగినందుకు ధన్యుడనయ్యానని వినమ్రంగా విన్నవించుకొంటున్నాను .
‘’తే వంద్యా స్తే మహాత్మానః –తేషాం లోకేస్థిరం యశః –యైర్ని బద్ధాని కావ్యాని -యే చ కావ్యే ప్రతిష్టితా’’.
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -15-5-18 –ఉయ్యూరు

