‘’దక్షిణ నాయకు’’ డొచ్చేశాడు –జాగ్రతో౦ జాగ్రత
‘’త్రిపుర’’నే ఓట్లతో సంహారం చేసి ,కమ్మీల ఇరవై ఏళ్ళ పాలనలో అసలు రెండు వేల రూపాయల నోటు మోహమే చూడని సామాన్యజనానికి ఒక్కసారిగా చేతిలో అలాంటివి పది నోట్లు పెట్టి(ఆర్. కే.కొత్తపలుకు ఆధారం ) అసలు మార్క్సిజం ఉందా అని దిమ్మ తిరిగేట్లు చేసి ముందస్తు వ్యూహం తో కమ్మీకోటలు బద్దలు కొట్టి అధికారాన్ని కొడవలి నుంచి కమలానికి బదిలీ చేయించిన గండర గండడు మోడీ .సహాయకాడు అమిత్ .,నిన్న కర్ణాటకలో కూడా 50 సీట్లున్న పార్టీకి రెట్టింపు అంటే 104 సీట్లు సంపాదించి మాజిక్ ఫిగర్ కు ఒక్క ఎనిమిది మాత్రమె దూరం లో నిలపగలిగిన ‘’గుజరాత్ మాంత్రిక ద్వయం ‘’ముందే వాళ్ళు ప్రకటించినట్లు ,ఇక ఆంధ్రా ,కేరళపై పంజా విసిరెందుకు సిద్ధంగా ఉన్నారు .ఇప్పటికే నాలుగు సార్లు ఎర్రకోటపై జండాఎగరేసి ‘’యెర్ర కోట’’లనుచిద్రం చేసి చీల్చి చెండాడి’ ఆసేతు హిమాచలపర్యంతం ‘’కమల సామ్రాజ్యం ‘’విస్తరించి కాషాయధ్వజ రెపరరెపలతో మిరు మిట్లు గొలిపే వ్యూహంతో దూసుకు వస్తున్నారు ‘’ద్వయం’’ కనుక ‘’బాబూ ‘’ జాగ్రతో౦ జగ్రత్త .
హంగు హంగామాతో కన్నడ రాజ్యలక్ష్మి కళ తప్పింది .122 మెజార్టీ సీట్లతో అధికారం లో ఉన్న కాంగీ ఇప్పుడు 78తో అంటే సుమారు సగానికి సగం సీట్లతో ,కుమారస్వామి కాళ్ళపై పడి దేబరించి సి .ఏం. పదవి ఆఫర్ చేసి గవర్నర్ అనుమతికోసం ఎదురు చూస్తోంది దిక్కు లేక . ఎన్నికలు అంటే ఆషామాషీ కాదు అని కాంగీ ఇప్పటికీ తెలుసుకోలేక పోయింది .’’తెల్ల పైజమా లాల్చీ’’ కుర్రాడు చూపులగుర్రమే అని తెలుసుకోలేక పోయింది .లింగాయతుల బలం తో గెలుద్దామనుకొంటే వాళ్ళు అదే చూపించారు .బాబాల ,పీఠాదిపతుల పాదాలపై వ్రాలి ప్రసన్నం చేసుకుని అవినీతి సామ్రాట్’’ గాలి ‘’ని సీట్ల ఆఫర్ తో బంధించి ,గెలుపుబావుటా ఎగరేసింది కమలం . ఇక్కడ తప్పు ఒప్పు ప్రసక్తి లేదు .గెలుపే ధ్యేయం .ఇక తండ్రీ ఇద్దరు కొడుకుల పార్టీ మూడు ముక్కలాట లాడి చివరికి ‘’బిందాస్ ‘’అయ్యామని గర్వపడుతోంది .కాన్గీతో కలిసిపనిచేస్తే అధికారాన్ని తేలికగా దక్కి౦చుకోనేది .తెలుగు వాడు ,నటుడు సాయి కుమార్ కే చుక్కలు చూపించారక్కడ .ఇంతకూ కమలం తప్ప మిగిలిన పార్టీలు ఏమాత్రం వ్యూహాత్మకంగా ముందునుంచి వ్యవహరించక పోవటమే దీనికి కారణం .క్రమక్రమ౦గా దేశమంతటా విస్తరిస్తున్న పార్టీని నిలవరించటానికి అధికారం ఉన్నా ,తగిన సామర్ధ్యం, వ్యూహం ,,క్రియాశీలత ,చారిస్మా ,చివరికి ధనబలం కూడా లేక పోవటం వలన కాంగీ నెత్తిన చేతులు పెట్టుకుని విలవిల లాడుతోంది ఇప్పుడు .వ్యతిరేక వోటు ను కాష్ చేసుకోలేని అలసత్వ అసమర్ధత ఇది .సిద్దూ బుద్ధుడే కాని వోట్ల ఏర వేయగల జాలరి కాలేక పోయాడు .
ఇంతకీ జాగ్రతో౦ జాగ్రత అన్నా వెందుకు అంటారా ! దానికే వస్తున్నా .ఇప్పటికే మనరాస్ట్ర పరిస్థితి కేంద్రం తో ఉప్పూ –నిప్పూ గా ఉంది .ఒకసారి ఫ్లాష్ బాక్ కు వెడితే ఆంధ్రరాష్ట్రం ఏర్పడిన దగ్గరనుంచి బ్రాహ్మలు, రెడ్లు మాత్రమె ముఖ్యమంత్రులు గా ఉన్నారు .తమను వాడుకోవటమే కాని ముఖ్యమంత్రులను చేయటం లేదన్న అసంతృప్తి ‘’ఒక వర్గం ‘’లో బలంగా వేరూనుకు పోయింది .దీనికి తోడూ కాన్గీల పాలనా అస్తవ్యస్తం గా ఉండటం తో నాదెండ్ల ,నందమూరి చేతులు కలిపి సినీ గ్లామర్ ను ముందుంచి పార్టీ పెట్టి’’ఆంధ్రుల అభిమానం ‘’జెండా ఎగరేసి కొద్దికాలానికే ఎన్నికలలో గెలిచి కాంగ్రెస్ ను నామ రూపాలు లేకుండా చేశారు .మళ్ళీ గవర్నర్ వత్తాసుతో కాంగీ -రామారావు ను గద్దె దింపి ,అదే కులానికి చెందిన భాస్కర రావు ను ఎక్కి౦చినా ,చంద్ర బాబు వ్యూహం తో ఇందిరా గాంధి మెడలు వంచి మళ్ళీ ఎన్టి ఆర్. కే .పట్టం కట్టించారు .ఆయనా ఇష్టం వచ్చిన వేషాలు కట్టి డైలాగులు చెప్పి ,పనికన్నా మాటలకు ప్రాధాన్యత పెంచి , మాయలో పడి పార్టీ, ప్రభుత్వాలకు దూరమైతే అల్లుడు చంద్రబాబు ఎదురు తిరిగి అందరినీ కూడా గట్టి పార్టీ చీల్చి గట్టి బలం తో ముఖ్య మంత్రి అయ్యాడు .రామారావు మరణం తర్వాత ఆయన పార్టీ క్షీణించి బాబుదే అసలైన తెలుగు దేశం పార్టీ గా నిరూపణ జరిగి ,ఎన్నికలలో గెలిచి పార్టీని గెలిపించి ఒక్కోసారి అధికారం కోల్పోయినా పార్టీని సమర్ధవంతంగా నడిపి ,తానున్నాను అన్న ధైర్యం ప్రజలలో కలిపించి ‘’పంచెకట్టు ‘’ఆయన ప్రభుత్వం లో అవమానాల పాలైనా ,బాబు ఉంటేనే తెలుగు దేశం అని పించుకున్నాడు .కేడర్ ను బలవత్తరం చేశాడు బామ్మర్దులు దోబూచులాడినా ,కొత్తత్త బజారున పడి యాగీ చేసినా ఏమాత్రం బెదరలేదు .ఇష్టం లేకుండా రాష్ట్రాన్ని చీల్చినా ఎన్నికలలో గెల్చి ‘’నవ్యాంధ్ర ‘’నిర్మాణానికి అనుక్షణం తపన చెంది మోడల్ రాష్ట్రం చేయాలన్న ధ్యేయంతో ముందుకే మును ముందుకే సాగి పోతున్నాడు .అన్నీ అందిస్తామని ,హోదా ఇస్తామన్న హామీతో కమలంతో పొత్తు పెట్టుకుని , గత నాలుగేళ్ళుగా అధికారం లో ఉంటూ , ,చివరికి మోడీది అంతా కల్లబొల్లి కబుర్లేఅని తెలుసుకొని ప్రజలకు ఎరుక కలిగించి స్నేహం కటాఫ్ చేసుకుని కేంద్రం తో పోరాటం చేస్తున్నాడు .
జగన్ నాలుగేళ్ళనుండీ జనాన్ని ఓదారుస్తూ ,వీలైనప్పుడు మోడీ ని అంట కాగుతూ దగ్గరౌతూ అదను కోసం ఎదురు చూస్తున్నాడు .నాలుగేళ్ళుగా తనకున్న 40 మంది ఏం ఎల్ ఏ లను పొట్టలో పెట్టి కాపాడుకొంటున్నాడు .ఇక పవన్ విషయానికి వస్తే క్లారిటీ లేని మైండ్ అని పిస్తాడు .ఇప్పుడు రాష్ట్రం లో కాపుల కోరిక అంతా ముఖ్యమంత్రిత్వం పై నే ఉన్నట్లు కనిపిస్తోంది .బాబు చుట్టూ ఉన్న వారుకూడా ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తారో చెప్పలేం .ఇప్పటికే ‘’సుజనా’’జనానికీ, పార్టీకీ దూరం అయ్యాడనే పుకార్లు పేపర్లలో షికార్లు చేస్తున్నాయి .ఇక ‘’ముద్రగడ ‘’లేచానంటే మనిషినికాదు అన్నట్లు ప్రవర్తిస్తున్నాడు .లేస్తాడో లేవగలడో లేదో చెప్పలేం .
ఇవన్నీ ఇలా ఉంటె బిజెపి వ్యూహాత్మకంగా ‘’కన్నా ‘’ను ‘’హాయి నా కన్నా’’అని కర్నాటక పోలింగ్ అయిన మర్నాడే కమలదళాధ్యక్షుడిని చేసేసి ఆ’’ కులానికి’’ అత్యంత ప్రాధాన్యత ఇచ్చినట్లు చాటుకున్నది .పూర్వపు సంప్రదాయాలను తుంగలో తొక్కేసింది .అలాగే రాష్ట్రం లో రాజుల కూ సమప్రాధాన్యం ఇచ్చామన్నట్లు ‘’బూతుల రాజు గారికి ‘’ఎలక్షన్ మేనేజ్ మెంట్ ‘’పదవి కట్టబెట్టింది .మేనేజ్ మెంట్ అంటే తెలుసుకదా ‘’ఎన్నికలలో గెలవటమే ధ్యేయం –‘’యైదర హుక్ ఆర్ క్రూక్ ‘’.కనుక ఇంతటి పకడ్బందీ వ్యూహం తో కమల దళ విన్యాసం, విస్తారం జరుగుతోంది .ఆంధ్రాలో ఆర్ ఎస్ ఎస్ కార్యకర్తలు ప్రతి ఊళ్లోనూ ఉన్నారు .కావాలంటే వేలాది మందిని పైనుంచి ముందే దింపి వోట్ల నిర్మాణానికి పునాదులేస్తారు .కనుకనే జాగ్రతోం జాగ్రత .
హంగు హంగామా నుంచి కర్నాటక బయటపడి ఒక వేళ గవర్నర్ కుమారసామి ని గద్దె ఎక్కించి కాన్గీతో బరాబరులు పలికించినా ,అది మూన్నాళ్ళ ముచ్చటే అవుతుంది .ఎందరో జంప్ జిలానీలై కమలం శరణ్యం అని తీర్ధం పుచ్చుకోక మానరు .కమల ప్రభుత్వం రాకా మానదు .అప్పుడు ‘’ద్వయం ‘’రెట్టించిన ఉత్సాహంతో తెలుగు నేల మీద ఐరన్ లెగ్ మోపక మానరు అని పిస్తోందినాకు .అందుకే బాబూ తస్మాత్ జాగ్రత జాగ్రత .
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -16-5-18 –ఉయ్యూరు

