నడి రోడ్డుపై ప్రజాస్వామ్యం
కర్ణాటకలో గవర్నర్ తీరు సరైనది కాదన్నట్లు వ్యాఖ్యానించిన సుప్రీం కోర్ట్ ,ఆయనిచ్చిన 15 రోజుల గడువు సరికాదని మర్నాడే బలనిరూపణ జరగాలని నిన్న మళ్ళీ ఉత్తర్వు లిచ్చింది .ప్రోటెం స్పీకర్ సమక్షం లో బలనిరూపణ జరగాలని చెప్పింది .కానీ ఇప్పటికే రాజ్యాంగానికి తూట్లు పొడిచిన ఆయన స్పీకర్ విషయ౦ లో న్యాయం చేస్తాడనే, అంటే సీనియర్ మోస్ట్ సభ్యుడిని చేస్తాడనే నమ్మినట్లుంది .అందుకే దానిపై నిన్న చెప్పలేదు .కాని బమ్మిని తిమ్మిని చేసే మహానుభావులున్నకాలం లో దానిపైనా ఆంక్ష పెట్టి సీనియర్ మోస్ట్ సభ్యుడినే ప్రోటెం గా ప్రకటించమని సూచనకూడా చేసి ఉంటె ఇంత రాద్ధాంతం జరిగి ఉండేదికాదు .అది కోర్ట్ పరిధిలోని విషయమో కాదో మనకు తెలియదుకదా .జరిగిందానిపై మన ఆలోచన ఉంటుంది .ఘన గవర్నర్ బిజెపి ఆయన, ఒకప్పుడు కోర్ట్ చేత అక్షతలు వేయి౦చు కున్నాయనను ప్రోటెం గా డిక్లేర్ చేసి ప్రమాణం కూడా చేయించేశాడు –‘’తాంబూలాలిచ్చేశాను తన్నుకు చావండి ‘’అని కన్యాశుల్క లుబ్దావదాన్లలాగా .మళ్ళీ మొదటికే వచ్చింది విషయ౦ .మళ్ళీ కోర్టు ను ఆశ్రయించటం వారు ఈ రోజు ఉదయం అంటే కర్ణాటకలో శాసన సభ ప్రారంభ౦ అవటానికి ఒక్క అరగంట ముందు విచారణలు చేబట్టు తున్నట్లు తెలపటం జరిగింది .తెగని ఉత్కంఠ. సభ్యులను మళ్లేయ్యటం ,నిఘా ,మేపుడు ,రక్షణ ,తోలుకురావటం ,విలాస హోటళ్ళలో బస ,జారిపోకుండా కాపలా ,అసెంబ్లీకి చేర్చేదాకా గుండె దడ తో అన్ని పార్టీలు ఊపిరి పీల్చుకోలేక సతమత మవుతున్నాయి .తీరా బలనిరూపణకు ఇంకా ఖచ్చితమైన మార్గ దర్శనం లేదు .రహస్య వోటింగ్ ఉండకూడదని ముందే కోర్టు చెప్పేసింది .కనుక తలల పరీక్షే .లేక చేతులేత్తేయ్యటమే .తల అంటే మనిషికి ఒకటే ఉంటుంది .కనుక ఇబ్బంది లేదు .కానీ రెండు చేతులూ ఎత్తేస్తే ఏమిటి గతి ?లేక్కి౦చేదేవరు? లెక్క తేల్చేదేవరు ?మళ్ళీ చిక్కు ప్రశ్నే .ఇప్పటికిప్పుడు గవర్నర్ ను మార్చలేరు .స్పీకర్ దే ఇస్టా రాజ్యం .ఆయనకే జోహుకుం అందుకే అనుకూలమైన వాడినే పెట్టుకున్నది రెండురోజులుగా అధికారం లో ఉన్నపార్టీ-ఎటునుంచైనా నరుక్కు రాగలడనే ధీమాతో నేమో?ఇదీ మన ప్రజాస్వామ్యం .దీన్ని ఉద్ధరించే వారు లేరా ?అన్నిటికీ కోర్ట్ నే ఆశ్రయి౦చాలా ? అర్ధరాత్రి కోర్టు తలుపులు తట్టాలా ?దీనికి పరిష్కారం లేదా ,రాదా, రానివ్వరా ?
దేశీయ ప్రభుత్వం ఏర్పడి 70 ఏళ్ళు దాటింది .కానీ ఇప్పటికీ మెజార్టీ నిరూపణ ఎలా చేయాలి ? ముఖ్యమంత్రి లేక ప్రధానిగా ఎవరిని ఎలా నియమించాలి?అన్నవాటిల్లో స్పష్టత లేదు .ఎవరో చేసిన తప్పుకు రాజ్యాంగం ప్రజాస్వామ్యం బలై పోతున్నాయి .విలువైన కోర్టు సమయం దీనికి వెచ్చించటం న్యాయమా ?అన్ని పార్టీలు కూర్చుని చర్చించి ఒక నిర్దుష్టమైన ఆలోచనకు వచ్చి దాన్ని బిల్లుగా ఆమోదించి అమలు చేయలేరా ?యువతకు ‘’ముసళ్ళు’’ స్పూర్తి నివ్వలేరా ?ఇలాగే గేమ్స్ ఆడుకుంటూ చోద్యం చూస్తూ ఉంటారా ? వీటిపై మీడియా స్పందించదా?అదుగో ఎమ్మెల్యేలను ఎత్తుకు పోతున్నారు ఇదిగో ఫోన్ టాపింగ్ ,అదుగో కోట్లు ఆశ పెడుతున్నారు అనే వాటి పై చూపిన శ్రద్ధ ఇలాంటి విషయాలపై చర్చలు జరపదా, జరపలేదా? అందరూ తూట్లు పొడిచే వారే కాని అతుకుల బొంత ను కుట్టి సరి చేసేవారు కనిపించటం లేదు .హతోస్మి ప్రజాస్వామ్యం. యెంత అపహాస్యం పాలౌతోంది ?సరే కాసేపట్లో కర్నాటక నాటకం షురూ అవబోతోంది .క్లైమాక్స్ కు చేరబోతోంది .కర్నాటక విషయం లో సుప్రీం ఆఘమేఘాలమీద స్పందించటం ప్రజాస్వామ్య వాదులకు గొప్ప ఊరట నిచ్చింది .కర్నాటక తీర్పు దేశ రాకీయాలను మంచి మలుపు తిప్పుతుందని ఆశిద్దాం .
మీ- గబ్బిట దుర్గా ప్రసాద్ -19-5-18 ఉయ్యూరు
