చూసే వ్యక్తి ఎత్తును బట్టి అంతే ఎత్తులో కనిపించే ‘’శ్రీ శృంగార వల్లభ స్వామి ‘’
తూర్పు గోదావరి జిల్లాలో పెద్దాపురం మండలం’’ తొలి తిరుపతి’’ గ్రామం లో 9 వేల సంవత్సరాల నాటి శ్రీ వేంకటేశ్వర దేవాలయం ఉన్నది .దీనినే’శ్రీ శృంగార వల్లభ స్వామి దేవాలయం ‘’అంటారు .ఇది చిత్తూరు జిల్లా తిరుపతి శ్రీ వేంకటేశ్వర దేవాలయం కంటే అతి ప్రాచీనమైనదని పురావస్తుశాఖ ధృవీకరించింది . ఈ ఆలయం లో మూడు విశేషాలున్నాయి .మొదటిది స్వామి నగుమోముతో దర్శన మివ్వటం .రెండవది చిన్నపిల్లలకు చిన్నవాడిగా ,పెద్దవారికి పెద్దవాడుగా స్వామి దర్శన భాగ్యం కలిగించటం. మూడవది తిరుమలలో ఉన్నట్లు కాకుండా స్వామి శ౦ఖం ,చక్రం వ్యత్యస్తంగా ఉండటం .అంటే తారుమారుగా ఉండటం .108వైష్ణవ క్షేత్రాలలో ఇది కూడా ప్రాముఖ్యతను సంతరించుకున్నది .కాకినాడకు కేవలం 27 కిలోమీటర్ల దూరం లో ఉన్న ఈ తొలి తిరుపతి నిఅందరూ దర్శించి తరించాలి .
స్థల పురాణం ప్రకారం వైవశ్వత మనువు కుమారుడు ఉత్తాన పాదుడు అనే మహారాజుకు ఉన్న ఇద్దరు భార్యలు . సునీతి పెద్దభార్య కొడుకు ధృవుడు . సురుచి చిన్న భార్య .కొడుకు ఉత్తముడు .ఒక రోజు రాజుగారి తొడపై చిన్నభార్య కొడుకు కూర్చుని ఉండగా,ధృవుడు కూడా కూర్చోటానికి ఉబలాటపడి వస్తే సురిచి అతన్ని లాగేయ్యటం అలా కూర్చునే అర్హత లేదనటం ఆ అర్హత సాధించాలంటే తపస్సు చేయమనటం ,అతడు తల్లి సునీతి ఆజ్ఞ పొంది ,తండ్రి అనుమతితో ఘోరాటవిలో తపస్సు చేయటానికి వెడుతుండగా నారద మహర్షి ప్రత్యక్షమై దిశా నిర్దేశం చేయటం ,అతడు శ్రీమన్నారాయణ మూర్తిని ప్రసన్నుని చేసుకోవటంకోసం ఘోర తపస్సు చేయటం వరకు మనకు తెలుసు .ఆయన ప్రత్యక్షమైతే ‘’స్వామీ నువ్వు అంత ఎత్తుగా ఉన్నావు నేను చిన్నపిల్లాడిని .నేను నిన్ను ఎలా చూడగలను?’’అని అడిగాడు .దానికి శ్రీహరినవ్వి’’ నేనూ నీ అంతేఅవుతాను చూడు’’ అని చెప్పి ధృవుడు ఎంత ఎత్తులో ఉన్నాడో అంతే ఎత్తు కు మారి దర్శనం కలిగించి ఆనందం కలిగించాడు .ముక్తిని ఇవ్వమని ధృవుడు కోరితే ,ఇప్పుడుకాదు నువ్వు దేనికోసం తపస్సు చేశావో దాన్ని పొందాలి కనుక రాజ్యపాలన చేయమని చెప్పటం ,చివరలో ధృవుడు నక్షత్రంగామారి ఆకాశం లో అందరికీ ఆదర్శం గా నిలవటం ,తండ్రిని సమీపించి జరిగిన విషయం చెప్పటం ఆయన ఎంతో సంతోషించి రాజ్యభారం అప్పగించటం మనకు తెలిసిన కధ యే . భక్త ధృవుని అమేయ తపో దీక్షకు ముచ్చటపడి చిరునవ్వు చిందిస్తూ స్వామి శిలా రూపంగా వెలిశాడు .నారద మహర్షి శ్రీదేవి విగ్రహాన్ని ,శ్రీ కృష్ణ దేవరాయలు భూదేవి విగ్రహాన్నీ ప్రతిష్టించారు .అందుకే స్వామి ఇక్కడ చిరునవ్వులు చిందిస్తూ భక్త సులభునిగా కనిపిస్తాడు .
తన భక్తుడు ధృవుని కోసం ఆకార స్వరూపం మార్చుకున్న శ్రీ మన్నారాయణుడు అప్పటి నుంచి ఈ తొలి తిరుపతి లో శ్రీ శృంగార వల్లభ స్వామి గా కొలువై భక్తుల మనోరదాలను నెరవేరుస్తూ ,ఎవరి ఎత్తుని బట్టి వారికి అంతే ఎత్తులో ఆనాటి నుండి నేటి వరకు దర్శన భాగ్యం కలిగించి ధన్యులను చేస్తున్నాడు .ఇంతటి అత్యంత విశేష పురాతన ప్రసిద్ధ దేవాలయమే అయినా ఇంకా దీనికి ప్రచారం ,ప్రాభవం రాక పోవటం దురదృష్టం .
మీ- గబ్బిట దుర్గాప్రసాద్ -24-5-18 –ఉయ్యూరు

