1987-88పామర్రు జిల్లాపరిషత్ హైస్కూల్ పూర్వ విద్యార్ధుల అపూర్వ ఆత్మీయ చిరస్మరణీయ కలయిక
పదవ తరగతి పూర్వ విద్యార్ధులు మరొక్కసారి కలుసుకోవాలన్న కోరికను సుమారు పదేళ్లనుంచి అన్ని పాఠశాలలలో ఆత్మీయంగా తీర్చుకుంటున్నారు .ఇదొక అపూర్వ సన్నివేశంగా విద్యార్ధులు ,వారికి బోధ చేసిన ఉపాధ్యాయులు భావి౦చి పులకిస్తున్నారు .ఇది మంచి సంప్రదాయం గా వర్ధిల్లు తోంది .ఇందులో విద్యార్దులశ్రమ అత్యంత విలువైనది .వారి గురుభక్తి వెలకట్టలేనిది .ఆప్యాయత మరచిపోలేనిది .ఇదిగో ఇలాంటి ఆత్మీయ సమ్మేళనాన్ని పామర్రు జిల్లాపరిషత్ 1987- 88 బాచ్ విద్యార్ధులు ఈ రోజు 27 -5-18 ఆదివారం పామర్రులో ఆరేపల్లి వారి ఏ సి కళ్యాణ మండపం లో అద్భుంగా నిర్వహించారు .సుమారు నెల రోజులకు ముందే తమ గురువుగార్లను వాళ్ల ఇంటికి వెళ్లి కలిసి విషయం చెప్పి ,అంగీకరి౦ప జేసి మధ్యమధ్యలో ఫోన్ లద్వారా జ్ఞాపకం చేస్తూ ,తప్పక రావాలని వేడుతూ ఉన్నారు .వారి ఆత్మీయ పిలుపుకు అందరూ చక్కగా స్పందించి వచ్చారు .130 మంది విద్యార్ధులను వారి ఫోన్ నంబర్లు సంపాదించి సంప్రదించగా ఇవాళ 110 దాకా వచ్చి అందరికీ సంతోషం కలిగించారు .అలాగే ఉపాధ్యాయులను కూడా దాదాపు అందరినీ కలిసి ఆహ్వానిస్తే ,ఇద్దరు తప్ప అందరూ విచ్చేసి సంతృప్తి కలిగించారు .ఇదంతా గత ఆరునెలల వారి అపూర్వ కృషి .ఫాలోఅప్ యాక్షన్ . ఇందులో శ్రీమతి తుమ్మల శివలక్ష్మి ,శివగంగ వరప్రసాద్ ,శ్రీనివాసకుమార్ ఏ సత్యనారాయణ ,రొంపిచర్ల గంగాప్రసాద్ వగైరాల పాత్ర మరువ లేనిది. ఆనాడు వాళ్ళు మీసాలు రాని 16 ,17 ఏళ్ళ వారైతే ఇప్పుడు అర్ధశతాబ్ది వయసుకు దగ్గర పడినవారు .అయినా వారిలోని ఉత్సాహం ఉరకలు వేసి ఇంతటి పనిచేసి తమ శక్తి సామర్ధ్యాలను చాటి చూపించారు .
వచ్చిన వారిని సాదరంగా నమస్కారాలతో గౌరవంగా తమ పేర్లు చెప్పుకుని ఏ సెక్షనో వివరించి ఆహ్వానించి ఆసనాలలో కూర్చోబెట్టారు .తరువాత ప్రక్కనే ఉన్న ఎ.సి.భోజన శాల లో అల్పాహార విందుగా గారే ,ఇడ్లీ చట్నీ సా౦బార్లతో కొసరి కొసరి తినిపించి కమ్మని కాఫీ ఇప్పించారు .వచ్చినవారందరిపైనా ఇదే రకమైన ఆత్మీయత కనబరచారు .ఉదయం 10-30 కు సభ ప్రారంభమైంది .జాతీయగీతాలతో ప్రారంభమై జ్యోతి ని మా అందరిచేత వెలిగి౦ప జేశారు .ముందుగా 91 ఏళ్ళ వయసున్న డ్రిల్ మాస్టారు శ్రీ పద్మా రెడ్దిగారిని వేదిక పైకి విద్యార్ధులు ఆహ్వానించి అందంగా అలంకరించబడిన ప్రత్యేక ఆసనం పై కూర్చోబెట్టి శాలువా ,పుష్పహారం ,వేసి పన్నీరు చల్లి కొండపల్లి బొమ్మ తోపాటు ఉపాధ్యాయుని ఫోటో ఉన్న ప్రత్యేక జ్ఞాపికను అందించి పాదాలకు నమస్కారాలు సభక్తింగా చేసి పుష్పాలు పాదాలపై శిరసునా ,అలంకరించి తమ గురు భక్తిని అపూర్వం గా చాటుకున్నారు .శ్రీ రెడ్డిగారు తనకు జరిగిన సన్మానానికి ఉచిత రీతిగా సమాధానం చెబుతూ తాను విద్యార్ధులకు చేసిన విలువైన బోధనను ,సాధించిన ట్రోఫీలను వివరించారు . పద్దా రెడ్డి అని అందరి చేత పిలిపించుకునే ఆయన మాట శాసనం గా ఉండేది అప్పుడు .అయన గొంతు కంచు మోగినట్లు ఉండేది .ఐరన్ డిసిప్లిన్ కు మారు పేరుగా ఉ౦డేవారు. హెడ్ మాస్టర్లు ఎవరున్నా రెడ్డి గారి చేతిలో బెత్తం ఉంటె చాలు క్రమశిక్షణ ఆటోమాటిక్ గా వచ్చేది .పిల్లలకు ఆటలలో గొప్ప శిక్షణ నిచ్చేవారు .వాళ్ళు కస్టపడి ఆది ట్రోఫీ తేవాల్సిందే .రిటైరయ్యాక పెన్షనర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా కూడా చేసి పించను దార్లకు అండగా ఉండేవారు .
తర్వాత 82 ఏళ్ళ వయసున్నశ్రీ పొట్లూరి గోపాల కృష్ణారావు గారికి పై విధంగా సత్కారం చేశారు .రావు గారు ఇంగ్లీష్, సోషల్ బాగా బోధించేవారు.రూల్స్ అన్నీథరో గా ఉ౦డేవారు .మాప్లేకుండా క్లాస్ కు వెళ్ళేవారుకాదు .పరీక్షలకు విద్యార్ధులను బాగా ప్రిపేర్ చేసేవారు .క్రమశిక్షణకు మారు పేరు అనిపించారు .నేనంటే పరమ ఆత్మీయత కనబరచేవారు .కారణం నాకు తెలియదు .వారి శ్రీమతి శ్రీమతి లక్ష్మీశ్వరమ్మ గారు కూడా అంతే అంకితభావం తో పని చేసేవారు . ఆమె మరణించినట్లు రావు చెప్పారు .మా అబ్బాయి శర్మ మోతీనగర్ లో హైదరాబాద్ లో ఉన్నప్పుడు ఒకసారి ఆయన కనిపించారు .చాలాకాలానికి కలుసుకొన్నాం కనుక ఆప్యాయంగా మాట్లాడుకున్నాం .మళ్ళీ ఇప్పడే చూడటం .కొత్త పి ఆర్ సి వస్తే దాదాపు 60 మంది స్టాఫ్ ఉన్న ఆస్కూల్ లో అందరి బిల్స్ చేయటానికి గోపాలకృష్ణగారు నేనూ స్వర్గీయ యెన్. టి.శాస్స్త్రి గారు మాక్లాసులపని చూసుకుని బిల్స్ మూడు కాపీలు తయారు జిల్లాపరిషత్ కు పంపే ఏర్పాటు చేసేవాళ్ళం .అవి సాంక్షన్ అయ్యే ఏర్పాటు హెడ్మాస్టారు ,గుమాస్తాలు చూసేవారు
ఆతర్వాత 80 ఏళ్ళ వి .రఘురాములు అనే సోషల్ మాస్టారుకు సత్కారం చేశారు .ఆయన బావగారు శ్రీ పూర్ణ చంద్ర రావు గారు ఉయ్యూరు లో పి డబ్ల్యు సూపర్ వైజర్ గా ఉండేవారు .మా ఆత్మీయ బృందం అంటే కాంతారావు ఆంజనేయ శాస్త్రి ,హిందీరామారావు ,జ్ఞానసున్దరరావు ,లో ఆయనా ఒకరు .కలిసే సినిమాలు షికార్లు మాకు .ఆయన ఆడపిల్లలు ,చిన్నకొడుకు ఉయ్యూరులో నాదగ్గర ట్యూషన్ చదివేవారు .ఆయనా గతి౦చారని రఘురాములు చెప్పగా విచారించాను.రాములు నేను అడ్డాడ హెడ్ మాస్టర్ గా ఉన్నప్పుడు పెంజేండ్ర హెడ్మాస్టర్ గా పని చేసి నాకంటే రెండేళ్ళ ముందు రిటైరయ్యాడు . సరదా మనిషి. ఈజీ గోయింగ్ తత్త్వం .
ఆపిమ్మట శ్రీ యెన్ వి గోపాలరావు అనే నేచురల్ సైన్స్ టీచర్ ను సత్కరించారు. ఈయన మొవ్వ వారు .తర్వాత నాకు సన్మానం .నేను ముందుగా ఇంతటి కార్యక్రమాన్ని భుజస్కంధాలపై వేసుకుని నిర్వహించిన వారినందరినీ అభినందించాను .నేను ఫిజికల్ సైన్స్ ఇంగ్లీష్ బోధించాను .సరసభారతి గురించి వివరించి మన బ్లాగుల పేర్లు తెలియజేసి పుస్తకాలు కావాల్సిన వారు దౌన్ లోడ్ చేసుకోవచ్చునని ,నా మెయిల్ కు లెటర్ రాస్తే పోస్ట్ ఖర్చులు పెట్టుకొనిఉచితంగా పంపిస్తాం అని చెప్పాను . మాతోపాటు పనిచేసిన శ్రీమతి వి కస్తూరి గారికి ,శ్రీమతులు సీతామహలాక్ష్మి మొదలైన వారందరినీ వరుస క్రమం లో సన్మానించారు .ఈ తతంగం దాదాపు మూడు గంటలు కన్నుల పండువ గా జరిగింది .
ఆ తర్వాత ఒజ్జలందరికి అంటే ఉపాధ్యాయులకు (ఉపాధ్యాయుడు ప్రకృతి –ఒజ్జ వికృతి ) వెజ్జు భోజనం, నాన్ వెజ్జు భోజనం సెపరేట్ గా పెట్టారు .పద్దారెడ్డి గారు నాపక్కనే కూర్చుని వెజ్ భోజనం చేశారు .అదేమిటి అంటే ‘’నాచిన్నప్పటి నుంచి వెజ్ మాత్రమె తిన్నా నాన్ వెజ్ నాకు పనికిరాదు ‘’అన్నారు ఆ అహింసా మూర్తి .ఏవేవో చేశారుకాని తిన్నదేమీ లేదు కతికాను అంటే బాగుంటుంది .
మధ్యాహ్నం 2-30 కు మళ్ళీ అందరం సమావేశమయ్యాం .గురువులమీద వాళ్ళు తయారు చేసిన ‘’పవర్ పాయింట్ ప్రెజెంటేషన్’’ బాగానే ఉంది.కాని ఇంకాస్త క్లారిటీ గా ఉంటె బాగుండేది .తర్వాత అప్పటి విద్యార్ధినీ విద్యార్ధులంతా మాతో కలిసి ఫోటోలు తీయించుకున్నారు .ఆతర్వాత సెక్షన్ వైజ్ గా మాతో ఫోటోలు దిగారు .వాళ్ల ఆకాంక్ష తీర్చుకున్నారు. మాతో ఫోటో దిగిన ఆన౦దానుభూతి పొందారు .మా అందరికీ ఆనాటి చిన్నారుల నిష్కల్మష హృదయం అవగతమైంది అందరం వారినందరినీ మనస్పూర్తిగా ఆశీర్వది౦చి ,వారి అభి వృద్ధిని నిండుమనసుతో ఆకా౦క్షించాం .
చివరికి నేను మాట్లాడుతూ ‘’ఇంతటి అపూర్వ ఆత్మీయ సమ్మేళనం నభూతో గా నిర్వహించి మిగిలిన వారికి ‘’ ట్రెండ్ సెట్టర్స్‘’గా మార్గ దర్శులుగా ఉన్న మీకందరికీ అభినందన శతం .ఈ ‘’త్రిదశాబ్దానంతర’’ ఆత్మీయ సమ్మేళనం ‘’తో ముసలి వారమైన మేము నిజంగా’’త్రిదశులం ‘’అయ్యాం .దేవతలు త్రిదశులు .అంటే వాళ్ల వయస్సు ఎప్పుడూ 30 యేళ్ళేఅంటారు .మమ్మల్ని ‘’గురుర్బ్రహ్మా ‘’అని సంబోధించి దేవతలనే చేసేశారు మీరు.కనుక మేము ఇప్పుడు 30 ఏళ్ళ యువకులమయ్యాం మీ ఆత్మీయత, ఆదరణ, ఆదరణ, మర్యాదా, మన్ననా ,గౌరవం వలన .మమ్మల్నిదేవతలను చేసిన మీకందరికీ మా మనః పూర్వక శుభాభినందనలు దీవెనలు .’’ అని ముగించాను .వెళ్ళేటప్పుడు అందరికీ చల్లని మజ్జిగ పాకెట్ అందించారు చల్లని మనసులతో .
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -27-5-18 –ఉయ్యూరు

