పైసా పండగ
‘’నాన్నా !పెట్రోల్ ధర పైసా తగ్గించారట కదా ?’’
‘’అవునమ్మా .మీరు వెంటనే వేసవి సెలవులకు ఇండియా వచ్చేయండి హాయిగా రెంటల్ కారు లో మీరూ పిల్లలూ దేశమంతా తిరిగి చూడచ్చు .మీ అమ్మ ఊరగాయలు , పిల్లలకు మామిడి తాండ్ర రెడీ చేసింది వచ్చేయండి వచ్చేయండి. పిల్లలకు కూడా సెలవలేగా .హాయిగా ఎంజాయ్ చేస్తారు రండమ్మా .’’
‘’సరే మీ అల్లుడితో ఆలోచించి చెబుతా ‘’
‘’ఒరే పెద్దాడా !పెట్రోలు పైసా తగ్గింది .హాయిగా స్కూటర్ మీద మీ ఇద్దరూ వచ్చేయండి .మామిడి పళ్ళు ఎంచక్కా తినచ్చు.’’
అలాగే నాన్నా !మీ కోడల్ని సంప్రదించి పిల్లాడితో సహా వస్తాం .’’హోమ్ డిపో’’ అనుమతి లేనిది మనం ముందుకు అడుగు వేయలేం కదా నాన్నా. నీకూ అనుభవమేగా ?’’
‘’ఒకే రా. మీ ఇష్టం ఆలస్యం అమృతం విషం ‘’
‘’తాతా.ఆయిల్ ధర పైసా తగ్గిందట కదా. వి ఆర్ వెరీ హేపీ తాతా.’’
‘’ఒరే మనవడా .వొట్టి మాటలు కాదు .పెద్ద బండీ కొన్నావుకదా.అదొక సారి మేమందరం చూస్తాం అందులో మీ మామ్మ తెగ ఉబలాటపడుతోంది .దానిమీద ఎక్కించుకొని గుడికి తీసుకు వెడతావని ఆశ పాపం .’’
‘’సరే లే తాతా!కొత్తగా ఉద్యోగం లో చేరటం ,బండీ కొనటం తో ఖర్చులు ఎక్కువై మనీ టైట్ గా ఉంది .అయినా పైసా ధర తగ్గిందికనక వెంటనే బండీమీద బయల్దేరుతున్నాను. మామ్మకు చెప్పి సంతోషం కలిగించు .
‘’నాన్నా!ఇవాళ ఇంటిల్లిపాదీ తెగ సంతోషపడ్డాం .’’
‘’పిల్లలు పరీక్షల్లో పాసయ్యారా ?’’
‘’అదికాదు .పెట్రోల్ ధర పైసా తగ్గినందుకు ఉబ్బి తబ్బిబ్బయ్యాం’’
‘’సరేకాని.ఇక్కడికి వచ్చి చాలా రోజులయింది .పెట్రోల్ తగ్గిందికదాపైసా.అందరూకలిసి స్కూటర్ మీద రాకూడదా ?’’
‘’అలాగే నాన్నా !ఇంతకంటే మంచి చాన్స్ రాదేమో. సాయంత్రమే బయల్దేరి వస్తున్నాం .అమ్మను అడిగినట్లు చెప్పు .’’
‘’బావా !ఎప్పుడూ మోడీ ని దెప్పుతూ ఉంటావ్ .ఇప్పుడు చూడు ఒక్కసారిగా పెట్రో ధర ఒక్క పైసా తగ్గించి పారేసి అందర్నీ పరేషాన్ చేశాడు ‘’
‘’నిజమేరా .నేనె పొరబడ్డాను .యెంత ఉదార హృదయంరా ఆయనది.ఒక్క పైసా తగ్గించటం అంటే మాటలా ?ఎన్ని నిద్ర లేని రాత్రులు ఆలోచించి చించి చించి ఈ నిర్ణయం తీసుకున్నాడో హాట్సాఫ్ రా’’
‘’ఇప్పుడు దారిన పడ్డావ్ బావా .ఎప్పుడూ ముక్కు సూటి పనికి రాదు బా ‘’
‘’గురూ గారూ !ముందు ఈ స్వీటు తినండి ‘’
‘’ఏమిటి విశేషం ?ఎవర్ని ముంచి ఈతీపి తినిపిస్తున్నావ్ ?’’
‘’అదేమీ లేదు గురూజీ .అర్ధరాత్రి వార్త మీరు వినే ఉంటారు .పెట్రోల్ ఒక్కపైసా తగ్గి పోయింది .అందుకే గురూగారూ ఈ స్వీటు .’’
‘’మనకు ఏం ఒరుగుతుంది ?.’’
‘’అన్ని ధరలూ బాగా తగ్గి పోతాయి .ప్రజలకు అన్నీ అందుబాటులో ఉంటాయి .ఇక ఆనందో బ్రహ్మ .ప్రజలసుఖ సంతోషాలకు అడ్డూ ఆపూ ఉండదు .’’
‘’నిజం చెప్పావ్ .యెంత మంచి వార్త చెవిలో వేశావోయ్.ఒక్కస్వీటే౦ ఖర్మ.డబల్ స్వీట్ తిందాం .చెవిలో మధువు పోసినంత ఆనందం గా ఉంది .’’
‘’అబ్బాయ్ గారూ !పెట్రోల్ పైసా తగ్గింది కాని మీ మొహం లో ఆనందం ట్యూబ్ లైట్ లా వెలగటం లేదు .’’
‘’ఎందుకురా ఈ వెర్రి ఆనందం ?’’
‘’టాంక్ నిండా పెట్రోల్ కొట్టించండి .ఒక్కసారి మన పొలాలన్నీ తిరిగి చూసొస్తా .వెళ్లి నాలుగు మూడు నెలలయింది . రోజు రోజుకూ పెరిగే పెట్రోల్ కు భయపడి అరలీటర్ కొట్టించినెలంతా లాగిస్తున్నారు ‘’
‘’అలాగే అలాగే . ఒరేయ్ రండి వెంటనే .అమ్మా మీరుకూడా రావాలి ‘’
‘’ఏమండీ! ఏమిటి ఈ పగటి కలలు ? లేచి పళ్ళు తోము కోండి.కాఫీ రెడీ .ఇంతకూ అంత పట్టపగ్గాలు లేని ఆనందం దేనికో ?’’
‘’రాత్రి వార్తల్లో పెట్రోల్ ధర మోడీ ఒకపైసా తగ్గించినట్లు వార్త విని ఆ ఆనందం లో నిద్రపోయా నిద్రలోఅనేక అందమైన కలలలో తేలిపోతుంటే కొ౦పమునిగినట్లు నిద్ర లేపావ్ .ఇంత ఆనందం జన్మలో చూడలేమేమో నే .అందమైన పైసా పండగ ను నేల పాలు చేశావే’’అని విసుక్కొంటూ మంచం మీంచి లేచా .
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -31-5-18 –ఉయ్యూరు

