త్రిమూర్తి దేవాలయాలు –ఇండోనేషియా
ఇండోనేషియాలో ప్ర౦బనాన్ వద్ద త్రిమూర్తులకు దేవాలయాలున్నాయి .వీటిలో మధ్యలో ఉన్న శివాలయం అన్నిటికంటే ఎత్తైనది .మిగిలిన రెండు బ్రహ్మ విష్ణు దేవాలయాలు .ప్రతి ఆలయం లో ప్రధాన స్థానం లో ఆ దేవుని విగ్రహం ,దానికి ఆనుకుని అనేక గదుల సమూహం ఉంటాయి .10 వ శతాబ్దం లో నిర్మించబడిన ఈ త్రిమూర్తి ఆలయ సముదాయం హిందూ శిల్ప నిర్మాణ వైచిత్రికి గొప్ప ఉదాహరణ .ఇక్కడ అంటే ప్ర౦బనాన్ లో మొత్తం 240 దేవాలయాల సముదాయం .అందులో త్రిమూర్తులకున్న మూడు ఆలయాలతో బాటు ,మూడు వాహన ఆలయాలు వగైరాలున్నాయి .ప్రధానాలయం శివాలయం ఎత్తు 130 అడుగులు .పెద్ద శివలింగం తోపాటు అమ్మవారు దుర్గాదేవి విగ్రహమూ పెద్దదే .
ప్రాచీన జావా లో ఉన్న ఈ దేవాలయనిర్మాణం క్రీ.శ 850 లో సంజయ వంశానికి చెందిన రాకే పికటన్ ప్రారంభించాడు .బౌద్ధ శైలేంద్ర వంశ రాజులు కట్టిన బోరోబుదూర్ ,సేవూ దేవాలయాలకు దీటుగా నిర్మించాడు .దీనితో హైందవ సంజయ వంశ పాలన మరలా ప్రారంభమైనట్లు ప్రపంచానికి చాటి చెప్పాడు . అక్కడ అప్పటిదాకా ప్రబలం గా ఉన్న మహాయాన బౌద్ధం క్రమంగా హిందూ శైవ౦ గా మారిపోయింది .పికటన్ తర్వాత లోకపాల ,బైలుంగ్ మహారాజులు అభివృద్ధిచేశారు .856 లో వేసిన ‘’శివ గృహ’’ శిలాఫలకం ప్రకారం ఈ ఆలయం శివ మహాదేవునికి అ౦కితమివ్వబడింది .శివ గృహం అంటే శివాలయం .ఆలయానికి పడమర వైపు సమీపం లో ఒపాక్ నది ఉన్నది .ఇప్పుడానది ఉత్తర౦ నుండి దక్షిణానికి ప్రవహిస్తోంది .ఒకప్పుడు ఇది తూర్పువైపు ప్రవహిస్తూ శివాలయానికి అతి సమీపం లో ఉండేదని చారిత్రకులు తెలియ జేశారు .బైలుంగ్ మహారాజు మరణానంతరం శివలింగం లో ఆయన కోరిన మార్పులు జరిగినట్లు తెలుస్తోంది .తర్వాత మాతరం రాజులైన దక్ష ,తులోడాంగ్ ల పాలనలో ఆలయం అభివృద్ధి చెందింది .మాతరం రాజ వంశస్తుల కులదైవం ఇక్కడి శివుడు .వందలాది బ్రాహ్మణులు శిష్యగణం తో ఈ ఆలయం వెలుపల ఆవాసంగా ఉండేవారు .
930లో రాజధాని తూర్పు జావాకు మార్చాడు రాజు ముంపు సి౦డొక్.అతని వంశాన్ని ఇసియాన వంశం అంటారు .ప్ర౦బ నాన్ నుంచి రాజధాని మార్చటానికి కారణం దీనికి ఉత్తరాన ఉన్న మౌంట్ మేరాపి అనే అగ్నిపర్వతం బ్రద్దలవ్వటమే.దీనితో ఈ ఆలయ ప్రాభవం క్రమేపీ తగ్గిపోయి, ఆ ప్రదేశాన్నివదిలి వేయటం తో క్షీణ దశ ప్రారంభమైంది .16 వ శతాబ్దం లో సంభవించిన అతిపెద్ద భూకంపం ఈ ఆలయాన్ని పూర్తిగా శిధిలం చేసింది .ప్రధానాలయాలు ఉన్నప్పటికీ మిగిలిన వందలాది ఆలయాలు నాశనమై రాళ్ళు రప్పలతో ఆ ప్రాంతం నిండి పోయింది .దీనిప్రాచీన వైభవం పై అనేక కధలు గాధలు ,పాటలు రూపం లో జానపదులలో ఇప్పటికీ ప్రచారం లో ఉన్నాయి.1755 లో మాతరం వంశం చీలిపోయి యోగ్యకర్తా, సురకర్త సుల్తాన్ వంశాలుగా చీలిపోయాయి .వీరి సరిహద్దు నిర్ణయించటానికి ఈ శిధలాలు, ఒపాక్ నది ఉపయోగపడినాయి .ప్రాచీన జావాలో ఇదే అతి పెద్ద హిందూ దేవాలయం .
తర్వాత జావా స్థానికులు ఈ ఆలయాన్ని గుర్తించారు కాని వారికి చారిత్రిక విషయాలేమీ తెలీదు .అందువలన తరతరాలుగా ప్రచారం లో ఉన్న గాధలను భక్తీ ,వీరత్వం దట్టించి బాగా ప్రచారం చేశారు .ఇవన్నీ లోరో జాన్గ్రాంగ్ లెజెండ్ గా గుర్తింపు పొందాయి .1811 లో బ్రిటిష్ పాలనలో డచ్ ఈస్ట్ ఇండీస్ ఉన్నప్పుడు కోలిన్ మెకంజీ అనే సర్వేయర్ అనుకోకుండా ఈ ప్రాంతాన్ని చూడటం తటస్తించింది .చాలాకాలం దేవాలయం ఉపేక్షకు గురైనట్లు గుర్తించాడు . డచ్ వాళ్ళు ఇక్కడి శిల్పాలను తమ పెరటి తోటలకు అలంకరణగా ,బిల్డింగ్ లకు ఫౌండేషన్ రాళ్ళుగా ఉపయోగించారు .1880 లో పురావస్తు శాఖ అడ్డగోలు , నిర్లక్ష్యపు త్రవ్వకాల వలన మరింత దోపిడీకి గురైంది .1953 లో శివాలయం పునర్నిర్మాణం పూర్తయి ‘’,సుకోమా’’తో ఆవిష్కరణ జరుపబడింది .అప్పటి నుంచే మరింత దోపిడీకి గురైంది .ఉన్నవాటిని ఉపయోగించి 75 శాతం ఆలయాలు పూర్తీ చేయగలిగారు .
1990లో ప్రభుత్వం అక్కడ ఆక్రమించుకున్న మార్కెట్ యార్డ్ ను ఖాళీ చేయించి ,చుట్టుప్రక్కల గ్రామాలు ,పొలాలను స్వాధీనం చేసుకుని ‘’ఆర్కేలాజికల్ పార్క్ ‘’ఏర్పాటు చేసింది .ఒపాక్ నది ప్రక్కన అందమైన ఆరుబయలు రంగస్థలాన్ని ఏర్పరచి,సంప్రదాయ రామాయణ గాధను ప్రదర్శింప జేసింది .ఈ నృత్యం శతాబ్దాల పురాతన జావన్ నృత్యం .దీనిని ప్రతి పున్నమి నాడు ప్రదర్శించేట్లు చర్యలు చేబట్టింది .ఇప్పుడు ప్ర౦బనాన్ దేవాలయం ఆర్కేలాజికల్ ,కల్చరల్ కేంద్రం గా రూపొందింది .1990నుండి బాలీ, జావన్ దేశ గొప్ప హిందూ సాంస్కృతిక కేంద్రమే అయింది .
2006 లో యోగ్యకార్తా భూకంపం వలన శివాలయం మళ్ళీ కొంతవరకు శిధిలమైంది .దైవ దర్శనం తాత్కాలికంగా రద్దు చేసి పురాతత్వ శాఖ ప్రత్యేక శ్రద్ధ చూపి కొద్దివారాలలోనే పునర్నిర్మాణం పూర్తీ చేసి మళ్ళీ భక్తులకు దర్శనసౌకర్యం కల్పించింది .2009 లో నంది దేవాలయనిర్మాణం పూర్తయింది .2014 నాటికి యాత్రికుల సంఖ్య ఇబ్బడి ముబ్బడిగా పెరిగి పోయింది .2012 లో బాలి ప్రెసిడెంట్ ఈ ప్రాంతాన్ని అంతటినీ రక్షణ ప్రదేశంగా ప్రకటించాడు .
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ –3-6-18 –ఉయ్యూరు

