స్వర్గ దేవాలయం –బీజింగ్
చైనా బీజింగ్ లో స్వర్గ దేవాలయం ఉన్నసంగతి చాలా మందికి తెలిసి ఉండకపోవచ్చు .మధ్య బీజింగ్ కు ఆగ్నేయభాగం లో ఉన్న ఈఆలయాన్నిమింగ్ ,క్వింగ్ వంశానికి చెందిన అనేకమంది చక్రవర్తులు సందర్శించి ,మంచి పంటలు పండి దేశం సుభిక్షంగా ఉండేట్లు చేయమని ప్రార్ధించారు.ఇది ప్రసిద్ధ టావోయిస్ట్ దేవాలయంగా గుర్తింపు పొందింది .
ఈ ఆలయ సముదాయాన్ని యాంగిల్ చక్రవర్తి 1406లో నిర్మించటం ప్రారంభించి 14 ఏళ్ళు కస్టపడి 1420 లో పూర్తి చేశాడు .ఈయనే బీజింగ్ లో’’ ఫర్బిడెన్ సిటీ ‘’కూడా నిర్మించాడు .16 వ శతాబ్దిలో దేవాలయాన్ని క్రమంగా అభి వృద్ధి చేసి జియాపింగ్ చక్రవర్తి దీనికి ‘’స్వర్గ దేవాలయం ‘’అని పేరు పెట్టాడు .ఈయనే తూర్పున సూర్య దేవాలయం ,ఉత్తరాన’’ భూ దేవాలయం’’ ,పశ్చిమాన ‘’చంద్ర దేవాలయం ‘’అనే మూడు దేవాలయాలు నిర్మించాడు .18 వ శతాబ్దం లో స్వర్గ దేవాలయాన్ని క్వాన్ లాంగ్ చక్రవర్తి ఆధునీకరించాడు .ఖజానాలో తగినంత డబ్బు లేకపోవటం వలన పూర్తి చేయలేకపోయాడు.
రెండవ నల్లమందు యుద్ధం లో ఈ ఆలయాన్ని ఆంగ్లో ఫ్రెంచ్ వారు ఆక్రమించారు .1900లో బాక్సర్ తిరుగుబాటు కాలం లో ఎనిమిది దేశాల కూటమి ఆలయాన్ని ఆక్రమించి ఆర్మీ కమాండ్ గా వాడుకున్నది .దీనివలన ఆలయ రూపు రేఖలు మారి, వైభవం కోల్పోయి శిధిలావస్త కు చేరింది.ఆలయ నిర్వహణే వదిలేసి జల్సా చేశారు .క్వింగ్ వంశ పాలన అంతమయ్యాక మరీ నాశనమైంది దేవాలయం .
1914 లో రిపబ్లిక్ చైనా ప్రెసిడెంట్ యువాన్ షికాయ్ ఈ ఆలయం లో మింగ్ ప్రార్ధన ఉత్సవం నిర్వహించాడు . తర్వాత తానే చైనా చక్రవర్తి అని ప్రకటించాడు .1918 లో ఆలయం పార్క్ గా మార్చి మళ్ళీ ప్రజలకు దర్శనం చేసే వీలు కల్పించాడు .1998 లో ఈ స్వర్గ దేవాలయం ‘’యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ ‘’గా పేర్కొనబడింది .ఇక్కడ వేసిన శిలాఫలకం పై ‘’ఇది అత్యద్భుత కళాఖండం .ప్రపంచ ప్రసిద్ధ 10 నాగరకతలలో ఒకటిగా ఇది ప్రసిద్ధి చెందింది .దూర ప్రాచ్యం లో దీని శిల్ప నిర్మాణ ప్రభావం అనేక శతాబ్దాలుగా ఉన్నది.
స్వర్గ దేవాలయం 2.7 3కిలోమీటర్ల వైశాల్యం లో ఉన్నది .ఇందులో ముఖ్యమైన మూడు నిర్మాణ సమూహాలున్నాయి .ఇవన్నీ అక్కడి ఆధ్యాత్మిక తాత్విక భావనల ననుసరించే నిర్మించారు .అందులో ముఖ్యమైనది మంచి పంటలకోసం ప్రార్ధించే ప్రార్ధన మందిరం .ఇది మూడు అంతస్తుల వలయాకార భవనం .కింద అంతా చలువరాతి నిర్మాణం .పైన అంతా చెక్క తో చేయబడింది .ఒక్క మేకు కూడా వాడని నిర్మాణం .దీనిలోనే చక్రవర్తుల ప్రార్ధన చేసేవారు . 1889లో ఇది పిడుగుపాటుకు శిధిలమైంది .ఇప్పుడున్న భవనం చాలాకాలం తర్వాత కట్టబడింది .
దీనికి దాక్షిణాన ‘’ఇంపీరియల్ వాల్ట్ ఆఫ్ హెవెన్ ‘’ అనే గొప్ప భవనం ఉంది .ఇది ఇంచుమించుగా పైదానిలాగే కట్టబడి ‘’ఈకో వాల్ ‘’అంటే ప్రతిధ్వని గోడ తో శబ్దాన్ని ఎంతోదూరానికి వినిపించేట్లు చేస్తుంది .ఇది ప్రార్ధనామందిరానికి మెట్ల త్రోవద్వారా కలుపబడి ఉంటుంది .దీనికి కూడా బీమ్స్ ను వాడలేదు .ఇ౦పీరియర్ వాల్ట్ కు దక్షిణాన ‘’సర్కులర్ మౌంట్ అల్టార్’’భవనం ఉంటుంది .దీని నిర్మాణమూ ఆశ్చర్యం కలిగిస్తుంది . ఇదీ పై రెండిటి లాగానే మార్బుల్ బేస్ తో వర్తులంగానే ఉంటుంది .దీనిమధ్యభాగాన్ని ‘’హార్ట్ ఆఫ్ హెవెన్ ‘’అంటే ‘’స్వర్గ హృదయం ‘’లేక ‘’సుప్రీం యాంగ్ ‘’అంటారు .ఇక్కడ చక్రవర్తి దేశం లో మంచి వాతావరణం కోసం ప్రార్ధనలు చేస్తాడు .ఇక్కడి ధ్వనులన్నీ ప్రతిధ్వనులుగా మారి ఎక్కడో సుదూరం లో ఉన్న స్వర్గానికి వినిపిస్తాయని వారి పూర్తి విశ్వాసం .1530 లో దీన్ని జియాజింగ్ చక్రవర్తి కట్టించాడు .ఇదికూడా 1740లో పునర్నిర్మి౦చ బడింది .
చైనాలో చక్రవర్తులంతా ‘’స్వర్గ కుమారులు’’ అనే నమ్మకం బాగాఉంది .స్వర్గ లోకాధిపతి తరఫున భూమిని అతడు పరిపాలిస్తాడని విశ్వాసం .స్వర్గ దేవతకు అనేక బలులు ఇస్తారు .ఏడాదికి రెండు సార్లు చక్రవర్తి ప్రత్యేక దుస్తులతో ఫర్బిడెన్ సిటీ నుంచి ఇక్కడి సపరివారంగా విచ్చేసి ప్రార్ధనాదికాలు నిర్వహిస్తాడు .శీతాకాలం లో చక్రవర్తి భూదేవాలయానికి వచ్చి ప్రార్ధనలు చేయటం తో ఈ తంతు పూర్తి అవుతుంది .ఈ ఉత్సవాలలో ఏ చిన్న పొరబాటు జరగ కుండా జాగ్రత్త పడతారు .పొరబాటు జరిగితే దేశానికి అరిష్టం గా భావిస్తారు .
ఆలయనిర్మాణం లో అంతరార్ధం తెలుసుకొందాం .భూమి చదరంగా ,స్వర్గం వర్తులంగా ఉంటుంది .అందుకే ఆలయ నిర్మాణం అలా చేశారు .మొత్తం ఆలయ సమూహం అంతా రెండు రక్షణ వలయాల గోడల తో ఉంటుంది .బయటి గోడ అత్యంత ఎత్తుగా అర్ధవలయాకారంగాఉత్తరం వైపుచివరలో ఉంటుంది . ఇది స్వర్గానికి ప్రతీక ..దక్షిణ చివర గోడ ఎత్తు తక్కువగా దీర్ఘ చతురస్రాకారంగా ఉండి భూమికి సింబాలిక్ గా ఉంటుంది .ప్రార్ధనా మందిరం ,మౌంట్ ఆల్టార్ లురెండూ వలయాకారం గా చతురస్రపు భూమి పై ఉండి మళ్ళీ స్వర్గ౦ భూమి లకు ప్రతీకలుగా ఉంటాయి .సర్కులర్ మౌంట్ లొ 9 సంఖ్య చక్రవర్తికి చిహ్నం .ప్రార్ధనామందిరం నాలుగు లోపలి ,12 మధ్య ,12 బయట పిల్లర్ల తో కట్టబడింది .ఇవి నాలుగు రుతువులకు ,పన్నెండు నెలలకు ,12 చైనా సాంప్రదాయ గంటలకు ప్రతీకలు .మధ్య ,బయటి పిల్లర్లు మొత్తం మీద చైనా సౌర విషయాలను తెలియ జేస్తాయి .దేవాలయం లోపలి భవనాలన్నీ నల్ల రూఫ్ టైల్స్ తో స్వర్గానికి చిహ్నంగా ఉంటాయి .ప్రార్ధన మందిరం లోని ఏడు నక్షత్ర రాళ్ళ సమూహం తైషాన్ పర్వతానికున్న ఏడు శిఖరాలకు ప్రతిరూపం .ఇదే క్లాసిక్ చైనా స్వర్గ లోక ప్రార్ధనా నిలయం .వీటిలోని డ్రాగన్ పిల్లర్లు సీజన్ లకు ప్రతిరూపాలు .
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ –4-6-18 –ఉయ్యూరు

