కిరాతార్జునీయం లో అర్జునుడు-2(చివరిభాగం )
పందిపై పార్ధుడు భయంకలిగించే తెల్లని లోహపు కొనఉన్న గోటి ఆకారం కల బాణాన్ని వేశాడు .దాని అగ్రం’’కోపించిన యముని చూపుడు వేలులాగా ‘’ఉన్నదట ‘’కుపితా౦త తర్జనా౦గు లిశ్రీః’’అంటాడు భారవి .ఇది ధనుంజయుని శత్రు సంహారక సామర్ధ్యాన్ని సూచిస్తుంది .వరాహం పై వాయునందనుడి తమ్ముడు ప్రయోగించిన ‘’పరమాస్త్రం ‘’ ఆ అరణ్యాలలో ఉల్క లాగా ప్రకాశిస్తోందట .వందలాది పక్షుల అరుపుల శబ్దాన్ని కలిగిస్తోంది –‘’ పరమాస్త్ర పరిగ్రహోరు తేజః స్పుర దుల్కాకృతి విక్షిపన్వేషు’’.ఆబాణ ప్రయోగవేగం ఊహించిన దానికంటే ముందే లక్ష్యా న్ని చేరుకొనేట్లుగా ఉన్నదట .అతనా బాణ ప్రయోగ వేగం, లక్ష్య సామర్ధ్యం లను కవి భారవి మంచి శ్లోకం లో నిక్షిప్తం చేశాడు –
‘’అవిభావిత నిష్క్రమ ప్రయాణః-శమితాయమ ఇవాతి రంహసా సః
సహ పూర్వతరం ను చిత్త వృత్తే-రపతిత్వా ను చకార లక్ష్య భేదం ‘’
ఈ వరాహ సంహార పరాక్రమం కొద్ది సేపట్లో జరిగే కిరాతార్జునీయ యుద్ధానికి నేపధ్యమై౦ద న్నమాట .
కిరాత వేషం లో ఉన్న శివునితో అర్జునుడు చేసిన యుద్ధం ,చూపిన పరాక్రమం శ్రేష్ట తరం ,అనుపమం .శివుడు అనేక మహిమలు చూపి,హింసించినా అడుగు వెనక్కి వేయకుండా తన పోరాట పటిమ ఆవిష్కరించాడు పార్ధుడు .చివరికి కిరాతుని పాదాలు పట్టుకుని గిరగిరా తిప్పి విసరి వేసే దాకా సాగింది .ఈ పరాక్రమోన్నతికి పరమ శివుడు పరమాశ్చర్యం పొందాడు .ఆయన హర్షాతి రేకంతో ధనుంజయుని ఆప్యాయంగా కౌగిలించుకొని తన మెప్పును చూపాడు .అప్పడే కిరాత రూప శివుడు మాయం చేసిన అర్జునుని కవచ ,గాండీవ, అమ్ములపొది మళ్ళీ ఆర్జునుడిని అలంకరిస్తాయి .విస్మితుడైన ధనుంజయుడు శివస్వామిని పరిపరి విధాలుగా స్తోత్రాలతో స్తుతించి యెనలేని తన భక్తి ప్రపత్తులను ప్రదర్శిస్తాడు .ఇక్కడ భారవి రచించిన స్తోత్రం ఎంతో ప్రాచుర్యం పొందింది .అది పరమేశ్వర తత్వాన్ని అద్భుతంగా ఆవిష్కరిస్తుంది .మనసునిండా అర్జున పరాక్రమాన్ని మెచ్చుకున్న మహేశ్వరుడు అతనికి పాశుపతాస్త్రాన్ని ,ధనుర్వేదాన్ని అనుగ్రహిస్తాడు .శివుని ఆజ్ఞతో దిక్పాలకులూ ఆశీస్సులతోపాటు వివిధాస్త్రాలు ప్రసాదిస్తారు .ఈవిధంగా లక్ష్య సాధనలో భీభత్సుడు దిగ్విజయం సాధించాడు .
భారవికవి చిత్రించిన అర్జునుడు తొందర పాటు లేని స్థిర సంకల్పుడు .యుద్ధం తక్షణ కర్తవ్యం అని ద్రౌపది భీముడు ధర్మరాజుపై పరిపరి విధాల అంతకు ముందే ఒత్తిడి తెచ్చారు .అర్జునుడు ఒక్కడే సంయమనం పాటించాడు .తన అభిప్రాయం మాత్రం చెప్పడు .అన్న ధర్మన్నపై అర్జునుని భక్తివిశ్వాసాలు అపారమైనవి .అన్నగారిఆజ్ఞను తూచా పాటిస్తాడు .వృద్ధ ముని వేషం లో వచ్చిన ఇంద్రునికి అతడు తన వృత్తాంతాన్నినివేదించి తాను ‘’ దాయాదులచేరాజ్య భ్రస్టు డై ఉంటున్న జ్యేష్ట భ్రాత శాసనం లో ఉంటున్న వాడినని –‘’స్థితః ప్రాప్తస్య దాయాదైః భ్రాతుః జ్యేష్టస్య శాసనే ‘’అనిపిస్తాడు భారవి .’’నేను లేని వియోగంతో మా అన్న ధర్మరాజు ద్రౌపదితోను సోదరులతోనూ రాత్రి వేళలో ఎక్కువ బాధ పడతాడు అంటూ ‘’మయా వినా భ్రుశం అభితవ్య తే’’అంటాడు .
మంచి ఆలోచనా పరుడైన అర్జునుడు మంచి చెడ్డల విషయం లో గొప్ప వివేకం కలవాడు .దుష్టులైన కౌరవులతో మైత్రి అంటే ‘నీడకోసం నదీ తీరాన్ని చేరటం లాంటిది ‘’అని ముని వేషం లో వచ్చిన ఇంద్రునికి కుండ బద్దలు కొట్టినట్లు చెప్పాడు .-
‘’ధార్త రాస్ట్రైః సహప్రీతి ర్వైర మస్మా స్వసూయత –అసన్మైత్రీ హి దోషాయ కూల చ్ఛేయేవ సేవితా ‘’
నీడ కోసం నది ఒడ్డుకు చేరితే అది కాసేపట్లోనే కూలి పోయి పెద్ద ప్రమాదమే కలిగిస్తుందని ,అలాంటిదే కౌరవులతో మైత్రి అనీ అంటాడు .ఇక్కడే అభిమానవంతుడి స్వభావాన్ని భారవి చాలా శ్లోకాలలో వర్ణిస్తాడు .మూకాసురుడు భయంకరం గా మీదకు విరుచుకు పడుతుంటే ‘’పూర్వ జన్మ లో నాతో శత్రుత్వం ఉన్న దానిలాగా వరాహం వస్తున్నట్లు ఉంది .నామనసు కల్మషం చేసి నన్ను చంపటానికి వచ్చే శత్రువై ఉండాలి .అరణ్యం లోని ఏ జంతువుకూ లేని పౌరుష పరాక్రమాలు దీనిలో కనిపిస్తున్నాయి .కనుక ఇది వేషం మార్చుకు వచ్చిన దానవుడో రాక్షసుడో అయి ఉండాలి .కాకపొతే దుర్యోధనుడికి ప్రీతికల్గి౦చ టానికి ఎవడో ఈ పందిరూపు ధరించి వచ్చి ఉంటాడు .ఒకవేళ ఖాండవ దహనం వలన ప్రతీకారేచ్చ తో తక్షకుని కొడుకు ఈ రూపం లో వచ్చాడేమో ?కాకపొతే భీముడి కోపానికి గురైన వాడెవడో ఇలావచ్చాడా ‘’?అని పరిపరి విధాల వితర్కి౦చు కున్నాడు .ఇవన్నీ అర్జునుని నిశిత ఆలోచన సరళికి దృష్టాంతాలు .
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -15-6-18 –ఉయ్యూరు
—
