‘’డా .శ్రీ మొవ్వ వృషాద్రి పతి గారి ‘’శ్రీ కృష్ణ దేవరాయ విజయ ప్రబంధం ‘’ -2

‘’డా .శ్రీ మొవ్వ వృషాద్రి పతి గారి ‘’శ్రీ కృష్ణ దేవరాయ విజయ ప్రబంధం ‘’ -2

‘సాహితీ వాచస్పతి’’ ,’’ఉపన్యాస చతురానన’’ డా .శ్రీ మొవ్వ వృషాద్రి పతి గారి రాయ ప్రబంధం లో తొమ్మిది ఖండాలలో నేటి దుస్థితి తోబాటు ,ఆనాటి ఉత్కృష్ట స్థితీ వర్ణించారు .వీరి పద్య వ్యధ కళాతపస్వి విశ్వనాథ్ తనదైన శైలిలో తీసిన శంకరాభరణం ,స్వర్ణకమలం ,వంటి చిత్రాలలో భక్తీ , రక్తి ,భుక్తి నిచ్చే భారతీయ దివ్య  కళామూర్తులు ,నాట్యం ,సంగీతం వంటి మహోన్నత విద్యలకు నేటి కాలం లో పట్టిన దుర్గతి ,వ్యతిరేక సంవిదానకం అంటే కాంట్రాస్ట్ ద్వారా చూపించిన రీతి మనకు తెలుసు .అదే దృష్టితో మొవ్వవారి వ్యధను కూడా చూడాలి కూచి పూడినాట్య౦  లాంటి తెలుగు భాషా మాధుర్యం గా౦భీర్యాదులున్నపద్యం తెలుగు సరస్వతికి కిరీటం అంటారు డా తుమ్మపూడి వారు –

‘’తెలుగుకు ప్రాణము పద్యము –వెలదికి ప్రాణమ్ము శీల వినయాదికముల్

చెలమకు ప్రాణము నీరము – పొలముల ప్రాణమ్ము సస్య సంపూర్ణత్వంబుల్’’

మరి దీనికి వైముఖ్యం చూపించటానికి కారణం ఏమిటి ?అనుభవించే హృదయం లోపించటమే అని తేల్చారు .మహాకావ్య సంప్రదాయం కనుమరుగు అవటం బాధాకరమే అన్నారు తుమ్మపూడి .తిక్కన్న గారి భాషలో రాజరికపు ఠీవి ఉంటె ,రాయల భాషలాగా ,ఎర్రన హరివంశం లోని అమాయక పల్లెటూరి తెలుగు తీపి కనిపిస్తుంది .దీనికి వ్రేపల్లెలో యాదవుల వర్ణన హరి వంశం లో కనిపిస్తుంది .అందుకే ఈ కవి ‘’గ్రామీణ ప్రజాలు  మాటలాడు కొను వాగ్వరాశిలో’’ ,అని , ‘’పల్లెను వీడి వచ్చి పలువర్షములైనది ‘’లోను ‘’వారక ఆంగ్ల తెల్గు పదబంధము లేర్పడి సంకరంపు ‘’అని బాధ పడ్డాడు .గ్రామీణ భాషా మాదుర్యమంతా వాడి హృదయ నైర్మల్య వ్యక్తీకరణమే .ఇదిపోవటం యాంత్రిక మానవ సమాజావిర్భావం .విశ్వనాథ వేయిపడగలు లో ధర్మారావు ‘’మానవ సమాజం పోయి ,దానవ సమాజం వచ్చింది ‘’అని బాధ పడినట్లుగానే .’’మనిషిలో అమాయికత్వం పోరాని దివ్య ద్రవ్యం .అది ఉంటె సృష్టి అంతా అందాలరాశిగా ద్రస్టవ్యమౌతుంది .పోయిన స్థితి మనం చూస్తున్నాం ‘’‘’అంటారు తుమ్మపూడి .

‘’కాలమూర్తి’’ ఖండం తెలుసుకోవాలి అంటే –వ్యాళః,కాలః ,ప్రత్యయః ‘’అని కాలానికి పేర్లున్నట్లు విష్ణు సహస్రనామం చెబుతోంది .దీన్ని వ్యాఖ్యానిస్తూ సద్గురు శివానందమూర్తిగారు వ్యాళం అంటే కాలసర్పం అని ,దానిలాగా గ్రహించటానికి వీలు కానివాడు విష్ణు మూర్తి అని చెప్పారు వస్తువులను కాలం గ్రసిస్తుంది అని జార్జి గామో తన ‘’ఇన్ ఫినిటి’’లో చెప్పాడు అన్నారు ఆచార్య .మనిషి నిలుచున్న చోట నిలబడే ఉంటె ,కాలం అతని మీదుగా ప్రవహిస్తుందట  .చెట్టు చుట్టూ నదీ ప్రవాహం ఉన్నట్లు అన్నమాట .చివరికి కదలని చెట్టులాగా మనిషి కూడా వృద్ధుడై జీర్ణించి  నశించి పోతాడట .కాలం మనమీదనుంచి పోతోంది అని అర్ధం చేసుకోవాలి .కాలం అంటే గమన శీలం .దానికి రూపం లేదు .దానికి మూర్తి విశ్వం (స్పేస్ ).అది జడం .జగత్తు కదిలేదానిలాగా మారటం కాలం వలన కనుక కాలం రైల్ ఇంజన్ లాంటిది .సమస్త వస్తు ప్రపంచం కంపార్ట్ మెంట్ లాంటివి .వీటిని అది తీసుకు పోతుందన్నమాట .దాని శక్తి వలన అది కదలినట్లు అనిపిస్తుంది .పదం చివరలో చేరె-డు,ము వు మొదలైనవాటిని ప్రత్యయాలు అంటారు .ఇవి పదానికి అర్ధాన్ని కల్పిస్తాయి .కాలం కూడా ప్రత్యయం లాంటిదే . ఇది నాల్గవ దశ అంటే ఫోర్త్ డైమెన్షన్ అన్నమాట .విశ్వం మాత్రం త్రిదశాత్మకం అని మనకు తెలుసు ఇది ఒక చోటునుండి మరొక చోటుకు జరగటం వలన కాలం యొక్క పరిగణనం  ఏర్పడుతుంది .ఏతావాతా తేలింది ఏమిటి అంటే కాలం అనగా  ‘’ఉన్న ఉనికికి రూపం లేనిది ‘’.మరి దీన్ని గుర్తించటం యెట్లా ?వస్తు చలనం వలన గుర్తించవచ్చు .కనుక ‘’కాలమూర్తి ‘’అంటే విశ్వం యొక్క ‘’అమూర్త పదార్ధం ‘’అని భావన .విశ్వ చలనమే కాలం .ఈ మహాకాల మూర్తియే పరమేశ్వరుడు ‘’అని చాలా చక్కని వ్యాఖ్యానం చేశారు ఆచార్య తుమ్మపూడి .

‘’ ఈభావన ఉన్నకవి వృషాద్రి పతి గారు .తాను కాలపురుషుడు అన్న ఎరుక ఉన్నవాడు ఈయన ద్వాదశ ఉపనిషత్తులను పద్యాల్లో బంధించిన ప్రజ్ఞాశాలి .వంశావతార ఘట్టం లో ఇదంతా మనకు తెలుస్తుంది. వారసత్వం గా వైష్ణవ మత కవితా విద్య  సంక్రమించినవాడు కనుక కాలభావన మహా ఉదాత్తంగా చేయగలిగాడు ‘’అని మెచ్చారు తుమ్మపూడి .భారతీయ రాజపరంపర పొందిన అపజయాలు మనదేశం పొందిన దౌర్భాగ్య స్థితి కి మూలం ఈ కాలమే అని వ్యంగ్యార్ధకంగా చెప్పారు .కథలోవిద్యారణ్య స్వామి విజయనగర స్థాపనకు  ,శంకు స్థాపన ముహూర్తం నిర్ణయించటానికి ,,దానిలోని లోపానికీ ఈ కాలమూర్తిఖండిక ‘’వ్య౦జకం ‘’అని జరుగబోయే దానికి ఇక్కడే బీజాలు వేశారని ఆచార్యశ్రీ వివరించారు .

ఈభావన విస్త్రుతే ఈ కావ్యం .ఆ పునాదిపై కట్టిన మహా సౌధం .కవిసామ్రాట్ విశ్వనాథ కూడా ‘’ఝాన్సీ రాణి ‘’అన్నతన కావ్యం లో ఆమె అపజయాలకు కారణాలను ప్రతి ఆశ్వాసాంత పద్యాలలో గతిని వర్ణించారు .అంటే అపజయం కాలప్రభావం అని ధ్వనితం చేశారు అన్నారు కోటేశ్వరార్య .

‘’ అసలు ఈ ఖండిక రాయాలన్న భావన మొవ్వ వారికి కలగటమే మెచ్చుకోదగ్గ విషయం .’’యస్య వశాత్ అగాత్ స్మృతి పథం కాలాయ తస్మైనమః ‘’అని భగవాన్ భర్తృ హరి అని అందుకే అన్నాడు .అంతా పోయి౦దనుకోవటం బాధపడటం ,ఈ బాధను కావ్యం లో వ్యక్తీకరించటం కళ.అందుకే రాజతరంగిణి లో కల్హణ కవి –‘’క్షణ భంగినిః జ౦తూనాం స్ఫురితే పరి చి౦తితే –అర్దాభిషేకం శాంతస్య రసస్యాత్ర విచార్యతాం ‘’అన్నాడు .దీనిభావం ఏమిటి అంటే జాతి జీవనమంతా క్షణ భంగురం .కనుకనే శాంత రసానికి పట్టాభి షేకం జరిగింది అని .అయితే ఇదంతా తాత్విక ధోరణి .తత్వ చింతన లేని చోట ఇది కుదరని విషయం కూడా అని తేల్చారు ఆచార్య .

ఇష్ట దేవతా స్తుతిని కవి  తెలుగు రాయలతో ప్రారంభించటం పరమ ఔచిత్యం .కావ్య వస్తువు విజయనగర ప్రభువు ఆముక్తమాల్యదా మహా కావ్య నిర్మాత శ్రీ కృష్ణ దేవరాయల కథ .ఇతడేకన్నడ రాయడు .ఈకన్నడ రాయడు  వచ్చి ‘’తెలుగు రాయని ‘’దర్శనం చేయటం  చేత  ఆ మహా ప్రబంధం మనకు దక్కింది .విశ్వనాధ వారి ‘’ఆంద్ర ప్రశస్తి ‘’ఖండ కావ్యం శ్రీకాకుళస్వామి సంకీర్తనతోనే ప్రారంభమైంది .అతడే మొదటి చక్రవర్తిగా శ్రీకాకుళం రాజధానిగా తెలుగు మహాసామ్రాజ్య నిర్మాతగా ప్రసిద్ధుడైనాడు .కనుక ఎవరు ఆంధ్రుల చరిత్ర రాసినా ముందుగా శ్రీకాకుళస్వామి కి నమస్కరించాల్సిందే .ఆయనకు ప్రధమ తాంబూలం సమర్పించాల్సిందే .అందుకే ఈ మహాకావ్య ప్రారంభం పరమ ఔచిత్యంగా ఉంది అన్నది .ఇందులో సీతాదేవి ప్రార్ధన అచ్చ తెలుగులో చేశాడుకవి –కారణం ఈ కవి కూచిమంచి తిమ్మకవి అచ్చ తెలుగు రామాయణానికి వ్యాఖ్యానం రాసి ప్రచురించాడు. .

‘’జన్నపు నేల దున్ను తరి జక్కని బంగరు పెట్టె బుట్టి ,పెం –పన్నుగ దండ్రిపేర నలరారెడు రేని  బిడారు నందు ,దా

విన్నను వొంది ,బేసి కను వేలుపు వింటిని ద్రుంచి నట్టి రా –మన్నను బెండ్లి యైన జవరాలిని గొల్చెద,నేల బుట్టువున్’’ అనిశ్లాఘించారు తుమ్మపూడివారు మొవ్వవారిని .

సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -29-6-18 –ఉయ్యూరు

,

 

 

 

 

 

— 

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.