శ్రీ వాణీ సమార్చనలో శ్రీమతి వాణీ కుమారి
తండ్రి గారి ఇంటిపేరు తుమ్మలపల్లి .తుమ్మలపల్లి వారిలో కవులు రచయితలూ ,చరిత్ర ,రాజకీయ ,వాణిజ్య ,కళా ,సాంస్కృతిక రంగాలలో లబ్ధ ప్రతి స్టులు. అందులో శ్రీ తుమ్మలపల్లి రామ లింగేశ్వరరావు ముఖ్యంగా పేర్కొన దగిన మహారచయిత ఆధ్యాత్మిక విషయ వివేకి .శ్రీ శృంగేరి పీఠాధిపతుల ఆశీస్సులు పుష్కలంగా పొందినవారు .మామగారి ఇంటిపేరు రాజనాల .అందరికీ సుపరిచితులు ,మహా కధకులు ,భారతీయ సాహిత్య పరిషత్ పూర్వాధ్యలు విమర్శకులు ,బుద్ధి జీవి ,ఆర్ .ఎస్ .ఎస్ .తో మమేకమైన,స్వీయ వ్యక్తిత్వం తో భాసించే బందరు హిందూ హై స్కూల్ లోప్రముఖ గణిత ఉపాధ్యాయులు, జాగృతి వారపత్రిక నిర్వహణలో సింహ భాగమైనవారు ,తెలుగు చలన చిత్రాలపై హాస్యం అ౦తర్లీనంగా అద్భుత సమీక్షలు రాసినవారు, అందరి చేతా ఆర్ .ఎస్ .కే . గా పిలువబడిన స్వర్గీయ శ్రీ రాజనాల శివరామ కృష్ణ మూర్తి గారు .రెండు వైపులా ఉన్న సాహిత్య సంబంధం తో శ్రీవాణీ సమార్చనలో దూసుకు పోతున్న వారు డా.శ్రీమతి వాణీ కుమారి గారు .
కృష్ణా జిల్లా అడ్డాడ దగ్గరున్న ఐనంపూడి మాతామహస్థానం .గుడివాడలో తండ్రి గారింట పెరిగి ,శ్రీ రాజనాల వెంకటరమణ గారిని వివాహం చేసుకొని ,అక్కడే మాంటిస్సొరి హైస్కూల్ లో ఉపాధ్యాయినిగా పనిచేసి ,ప్రస్తుతం హైదరాబాద్ విద్యానగర్ లో దంపతులు ఉంటున్నారు . ఆయన హైదరాబాద్ బాటరీస్ లో ఉన్నతాధికారి . ఉద్యోగానికి స్వస్తి చెప్పి ,సాహిత్యానికి పాదు చేసి ,రచనా నీరంతో పెంచి పోషిస్తున్న విదుషీమణి శ్రీమతి వాణీకుమారి .ధన్యజీవి .పుట్టింటి, అత్తింటి వ్యాసంగమైన సారస్వతాన్ని చక్కగా అభివృద్ధి చేస్తున్నారు .స్వర్గీయ డా.జి వి. .ఎస్ .సుబ్రహ్మణ్యం గారు మొదలైన సాహితీ భీష్ములతో మంచి పరిచయమున్నవారు . చారిత్రిక నవలా చక్రవర్తి డా.ముదిగొండ శివప్రసాద్ ,డా కసిరెడ్డి వెంకట రెడ్డి వంటి సరస్వతీ మూర్తులు ఈమెకు ఆరాధ్యులు .హైదరాబాద్ లోని సాహిత్య పరిషత్ లో క్రియా శీలి .మంచి వక్త ,కవి అవటం తో సభలలో రేడియోలో వందలాది ప్రసంగాలు చేసినవారు . అవధానాలలో పృచ్ఛకులుగా తమ సమర్ధత చాటుకున్నవారు . భర్తగారి ప్రోద్బలం తోడ్పాటు ఆమెకు శ్రీరామ ‘’సారీ’’ శ్రీరమణ రక్ష. దిల్ షుక్ నగర్ లో ఉంటున్న మాజీ ప్రిన్సిపాల్ శ్రీ పోతుకూచి విజయ గోపాల్ దంపతులు వీరి కుటుంబ మిత్రులు .కలిసి ఎన్నెన్నో కార్యక్రమాలు నిర్వహిస్తారు .పోతుకూచి దంపతులు ఆమ్మాయి శ్రీ మతి పద్మశ్రీ దగ్గరకు అమెరికా వెళ్ళినా ,నిత్యం వాణీ గారితో మాట్లాడనిది నిద్రపోరట . ఇంతకీ ఈ పద్మశ్రీయే అమెరికా లో నార్త్ కారోలీనా రాష్ట్రం షార్లెట్ లో ఉంటున్నమా మనవళ్ళు చి ఆశుతోష్ ,పీయూష్ లకు అంటే మా అమ్మాయి శ్రీ మతి కోమలి విజయ లక్ష్మి అల్లుడు శ్రీ సా౦బావధాని దంపతుల కుమారులకు సంగీతః౦ నేర్పే టీచర్ .మా పెద్దమనవడు చి శ్రీకేత్ ఉపనయనం మాఅమ్మాయి వాళ్ళు అమెరికా నుంచి వచ్చి హైదరాబాద్ లో ఏప్రిల్ 2 న చేసినపుడు పోతుకూచి వారు పరిచయమయ్యారు . ఈల శివప్రసాద్ ,శ్రీ మంగళగిరి ఆదిత్య ప్రసాద్ గార్లతో పాటు ఈ దంపతులకు సన్మానం చేసి నగదు బహుమతి నంది౦చా౦ . అప్పటి నుంచి ఇప్పటిదాకా మామధ్య గప్చీప్ సాంబారు బుడ్డి . అంటే పలకరింపులు లేవు ..
వర్తమానానికి వస్తే ఈనెల 3 వ తేదీ మధ్యాహ్నం నాకు ఒక ఫోన్ వచ్చి ఆగి పోయింది .ఎవరో తెలీని వారు . అరగంట తర్వాత ఆ నంబర్ కు నేనే ఫోన్ చేశాను .అప్పుడు అవతలి గొంతు తాను వాణీ కుమారినని ,ఆర్ ఎస్కే గారి రెండవ కోడలినని ,గుడివాడ మాంటిస్సొరిలో పని చేశానని , అడ్డాడ దగ్గర ఐనంపూడి తన అమ్మమ్మ గారి ఊరు అనీ ,చిన్నతనం అక్కడే గడిచిందని ,28వ తేదీ గుడివాడ మాంటిస్సొరి పూర్వ విద్యార్ధుల సమ్మేళనానికి వస్తున్నానని ,అప్పడు ఉయ్యూరు రావచ్చా అనీ అడిగింది .తప్పని సరిగా రమ్మని ఆహ్వానించా .సరసభారతి బ్లాగ్ ను నిత్యం చదువుతానంటూ , ,పోతుకూచి వారితో అనుబంధమూ చెప్పింది .నేను ఆమెతో 5 వ తేదీ బయల్దేరి హైదరాబాద్ వస్తున్నాననీ ,8 ఉదయం నల్లకుంట వస్తాననీ చెప్పగా తమ ఇంటికి రమ్మని కోరింది .సరే అన్నా .అలాగే 8 ఆదివారం వాళ్ల ఇంటికి నేనూ మా పెద్దబ్బాయి శాస్త్రి ,కోడలు సమత వెళ్ళగా ఆత్మీయంగా ఆహ్వానించారు రమణ దంపతులు .’’షార్లెట్ సాహితీమైత్రీ బంధం ‘’వారికి కానుకగాఇచ్చాను . నాకు వాణీకుమారి రచించిన 1-తెలుగు చారిత్రిక కావ్యాలలో సాంస్కృతిక మూల్యాలు అనే ఆమె రిసెర్చ్ గ్రంధం 2- సాహిత్య సౌజన్యం ౩-వాల్మీకి వ్యాసులు తీర్చి దిద్దిన రామకధ 4-ఊరు కొత్తబడిందిఅనే నాస్టాల్జియా ఇచ్చారు .ఆర్ ఎస్ కే గారితో నా అనుబంధం ఆయనతో కలిసి రాజమండ్రి సభలకు వెళ్ళటం కొల్లూరి ఎన్నికల ప్రచారం నిర్వహించటం అంతా మాట్లాడుకున్నాం .మా మేనల్లుల్లు అశోక్ ,శాస్త్రి ,మా అన్నయ్యగారబ్బాయి రామనాథ్ లతో రమణ కున్న అనుబంధం చెప్పారు .స్వర్గీయ కాంతారావు గారితో సాహితీ మైత్రిని, కొల్లూరి కోటేశ్వరరావు గారితో మాకున్న స్నేహాన్నీ ,ఆయనకూ కాంతారావు కు ఉన్న గాఢ మిత్రత్వాన్ని ,ఆర్ ఎస్ కే గారితో మా అందరికీ ఉన్న స్నేహ పరిమళాలను జ్ఞాపకం చేసుకొని ,అక్కడే పవిత్రంగా భద్రంగా ఉంచిన మూర్తి గారి చిత్ర పటానికి నమస్కరించి ఫోటో తీసుకున్నాం .మిగిలిన వివరాలు 8వ తేదీ ‘’సాహిత్యాదివారం ‘’లో రాసేశాను . గీర్వాణా౦ధ్ర ,ఆంగ్ల సాహిత్య కృషీ ,పోషణ బాధ్యతగా నిర్వహిస్తున్న శ్రీమతి వాణీ కుమారి అంతకంటే గొప్ప బాధ్యతను చిత్తశుద్ధితో నిర్వహించటం ప్రశంసనీయం .
గాజు బొమ్మ
శ్రీ రమణ వాణీ దంపతులకు ఒకకుమారుడు చి రవికిరణ్ ,కుమార్తె ఉన్నారు .అమ్మాయి చదువు పూర్తి చేసి వివాహం చేసుకొని అమెరికా లోని మేరీ లాండ్ లో ఉంటోంది .రవి వయసు 30 .అతనికి టెన్త్ క్లాస్ చదివేటప్పుడు యాక్సి డెంట్ జరిగి హెడ్ ఇంజరి అయి ,మూడు నెలలు కోమాలోనే ఉండిపోయాడు .అప్పటికి ఇంతటి ఆధునిక వైద్యం అందుబాటు లోకి రాలేదు .ఫలితం గా అతను మాట్లాడలేడు.అన్ని శబ్దాలూ పలుకుతాడు కానీ వాటి ధ్వని మనకు వినిపించదు . ఒక రకంగా ధ్వని లేని మాట గా వస్తుంది .దీన్ని పశ్యన్తి వాక్కు అనవచ్చు నేమో ? మంచి అందగాడు రవి కిరణ్ .నిరంతరం చిరునవ్వుతో ఉండటం అతని ప్రత్యేకత .అదే అతని వైపుకు మనల్ని ఆకర్షిస్తుంది .వీల్ చైర్ కే పరిమితమవటం బాధాకరం.వీల్ చైర్ లో ఉన్న’’గుబురుమీసాల యవ్వన కమల్ హసన్’’ అనిపిస్తాడు . స్వాతి ముత్యం లా భాసిస్తాడు .మాట్లాడలేడుకాని అతనికి తెలియని విషయం లేదు .మనం మాట్లాడింది చక్కగా అర్ధం చేసుకొని దానికి తనదైన శైలిలో సమాధానమిస్తాడు .వాళ్ల అమ్మగారు దాని భావం మనకు స్పస్టపరుస్తారు .మన వైఖరీ ప్రవర్తన పసిగట్టి అభిప్రాయం ఏర్పరచుకొంటాడు .మనలో ఉన్న క్వాలిటీని గుర్తించి దాన్ని బహిర్గతం చేస్తాడు .వీటితో పాటు అతనికి మంచి జ్ఞాపక శక్తి ఉంది. తెలుగులో కవిత్వం రాస్తాడు .అతని కవితలను తలిదండ్రులు ముచ్చటపడి ముద్రించి అందరికీ అందజేశారు .వాటి డిమాండ్ ఎలాంటిది అంటే ఇప్పుడు వారిదగ్గర ఒకే ఒక్క కాపీ ఉంది .కంప్యూటర్ పై కాలం గడుపుతాడు .తెలుగూ ఇంగ్లీష్ లలో దానిలో రాస్తాడు .నా సంభాషణా ధోరణి గ్రహించి ,నాకు గొప్ప జ్ఞాపక శక్తి ఉంది అని తనభాషలోనూ, సౌ౦జ్ఞలతోనూ చెప్పాడు. దాని భావాన్ని అడిగితె వాణీ గారు చెప్పారు.అతని కుడి చేతిమీద ముద్దు పెట్టుకొని నా అభినందన తెలియజేశాను .తలిదండ్రులు అమెరికా వెళ్ళేటప్పుడు రవినీ తమతో తెసుకు వెడతారు .వాళ్లమ్మాయి అక్కడ వీలున్నప్పుడల్లా అతన్ని కారులో తిప్పి అన్నీ చూపిస్తుందట .అందమైన ‘’గాజు బొమ్మ ‘’లా ఉన్న రవి కిరణ్ ను అంతే జాగ్రత్తగా ,పదిలంగా ప్రేమ ఆప్యాయతా రంగరించి బాధ్యతగా రమణ ,వాణీ దంపతులు సాకుతున్నారు .వారికి శతాధిక అభినందనలు . .
వాణీ కుమారి గారి రిసెర్చ్ బ్రెయిన్ యెంత విశిస్టమైనదో ‘’ చారిత్రకకావ్యాల లో సాంస్కృతిక మూల్యాలు’’బాగా విశదీకరిస్తుంది .ఆమె పరిశీలనా, పరిశోధనా ఫలితమే ఇది. దీనికే డాక్టరేట్ అందుకొన్నారు .ఒకరకంగా అది ఆమె’’ ప్రతిభా సర్వస్వం’’.సాహిత్య సౌజన్యం లో ఆమె తుమ్మలపల్లి కవుల పై రాసిన వ్యాసం వారిపై ఆరాధనా ,వారి కృషికి ప్రతిఫలం .విశ్వనాథ రామాయణం లో శూర్పణఖ మూర్తి మత్వాన్ని దర్శించిన సౌజన్య శీలి ఆమె .వాల్మీకి స్త్రీ మూర్తులను, భారతం లో జాతి ధర్మం వంటి 21 వశిష్ట వ్యాస గుచ్చం ఇది .రామకథ ను వాల్మీకి వ్యాసర్షులు ఎలా తీర్చి దిద్దారో తులనాత్మక పరిశీలన చేసి రాసిన గ్రంథం ఆమె వాజ్మయ పరిచయానికి అద్దం పట్టేది గా ఉంది .ఆమెకున్న గాఢ సంస్కృత పరిచయమూ ,అభిజ్ఞత ,లోతులు తరచే విశిష్టత కు ఆశ్చర్యపడుతాం .వాణీ కుమారికి తనబాల్యం గడిపిన ఐనంపూడి అంటే మహా మోజు .అక్కడికి వెళ్ళిన ప్రతిసారీ ఆమెలో పాతజ్ఞాపకాలు గుఫ్ఫుమని గుబాళిస్తాయి అప్పుడు తనకు ఆ ఊరు కొత్తదిగా అనిపిస్తుంది .అందుకే’’ఐనంపూడి ఊసులను ‘’ఊరు కొత్తబడింది ‘’గా అక్షరబద్ధం చేసి ప్రచురించారు.ఎవరి చూపు వారిది .ఆ చూపులో లో చూపూ ఉండటం ఇక్కడి ప్రత్యేకత .ఒక మంచి సహృదయ శీలి అయిన రచయిత్రి ,నాకు ఆరాధనీయులు ఆర్ ఎస్కే మూర్తిగారి కోడలుగా ,వారబ్బాయి వెంకటరమణ గారి ఇల్లాలుగా శ్రీమతి వాణీ కుమారి పరిచయమవటం ఆనందంగా ఉంది .శ్రీ వాణీ సమార్చనలో శ్రీమతి వాణీ కుమారి మరిన్ని సాహితీ కుసుమాలను సృష్టించి అలంకరించాలని కోరుకుంటున్నాను .
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -12-7-18 –ఉయ్యూరు
‘’
—
గబ్బిట దుర్గా ప్రసాద్
https://sarasabharati.wordpress.com
http://sarasabharativuyyuru.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com
Gabbita Durga Prasad
Rtd. head Master Sivalayam Street
Vuyyuru 521165 Krishan District
Andhra Pradesh
India
Cell : 9989066375
8520805566
Land Line : 08676-232797
Attachments area

