డా. శ్రీ మొవ్వవృషాద్రి పతి గారి ‘’కసాపుర క్షేత్ర మాహాత్మ్యం ‘’-2
1-నైమిశ ఖండం –
ఒకప్పుడు మహర్షులు సత్యలోకానికి వెళ్లి బ్రహ్మ దేవుని దర్శించి తాము దీర్ఘ సత్రయాగం చేయాలను కొంటున్నామని దానికి అనువైన చోటు ఏదో చెప్పమని కోరగా ,సంకల్ప మాత్రంగా ఒక రధాన్ని సృష్టించి ,అది ఆకాశ౦ లో సంచరిస్తూ రథ చక్రం యొక్క శీల ఎక్కడ జారి పడుతుందో అదే తగిన స్థలం అని చెప్పాడు .రధం వెంట మహర్షులు వెడుతూండగా దాని నేమి అంటే శీల ఒక దట్టమైన అరణ్యప్రాంతం లో పడింది .అదే నైమిశారణ్యం .
మళ్ళీ మహర్షులుమహా విష్ణు సందర్శనం చేసి ఒక దీర్ఘ కాల యజ్ఞం సంకల్పించామని ,తగిన స్థలం తెలుపుమని అడగగా ,తన సుదర్శన చక్రాన్ని వదలి అది యెంత దూరం వెడితే అది అంతా అనువైన ప్రదేశమే అని చెప్పాడు .ఆ చక్రం సంచరించిన ప్రదేశమే నైమి శారణ్యం .మహర్షులు ఇక్కడే 12 ఏళ్ళు యజ్ఞం చేశారు .దీన్ని చూడాలని సూతమహర్షి వచ్చాడు .మహర్షులు ఆయన చుట్టూ చేరి ఆయన వలన సకల పురాణాలు విన్నారు .కాని వారికి తృప్తికలగక కలియుగం లో శ్రీ వేంకటేశ్వర స్వామి ,శ్రీ ఆంజనేయస్వామి భక్తుల కోర్కెలు తీర్చే వారుగా ప్రసిద్ధి చెందారు ,వెంకటేశ్వర గాథలు విని తరించామని, ఇప్పుడు వాయు సుతుని విశేషాలు వినాలని కోరికగా ఉంది కనుక తెలియ జేయమని ‘’ముఖ్యంగా కసాపుర క్షేత్రం లో,నెట్టేకంటి ఆంజనేయ క్షేత్రం మహా మహిమాన్వితం అని విన్నామని వ్యాసరాయలు నమలిన వేపపుల్ల చిగిర్చిన చోట స్వామి ఆలయ నిర్మాణం జరిగిందని తెలిసిందని కనుక ఆక్షేత్ర మాహాత్మ్యాన్ని సవివరంగా తెలియ జేయమ’’ని అర్ధించారు . తనకూ ఆ విశేషాలు చెప్పాలని మనసులో ఉందని సూతర్షి చెప్పి ‘’వ్యాసరాయలు తిరుపతి లో తపస్సు చేశారని ,కృష్ణ దేవరాయలకు అక్షరాభ్యాసం చేశారని ,మంత్రాలయ రాఘవేంద్ర స్వామికి సన్యాస దీక్షనిచ్చారని ,శిల్పగిరి అంటే నేటి చిప్పగిరి ప్రాంతం లో కసాపురం లో సమీర కుమారా లయాలు నిర్మించిన హనుమ భక్తులు . హనుమ మహిమలను వివరించటం మానవ మాత్రులకు అసాధ్యం .అయినా తెలిసి న౦తవరకు వివరిస్తాను .‘’అనీ చెప్పటం ప్రారంభించారు . 2- శాప ఖండం
కస్వుడు అనే మహర్షి ఒక ఆశ్రమం నిర్మించుకొని ఘోర అతపస్సు చేస్తుండగా ఎందరెందరో మునులు జనులు ఆయన దగ్గరకు చేరి నివాసమున్నారు .వారికి ఆశ్రమ ధర్మాలు బోధించి వాటిని కట్టు బాట్లను తప్పక పాటించాలని హితవు చెప్పి వారికి నివాస స్థలం చూపించాడు .దూర దేశాలనుండి వచ్చిన వారికి ఆశ్రమ వాసులు మర్యాదతొ ఆహ్వానించి అతిధి మర్యాదలు చేసేవారు .గౌతమాది మహర్షులు విచ్చేసినప్పుడు ప్రత్యేక గోస్టులు నిర్వహించేవారు .ఆశ్రమానికి దగ్గరలో దాని చుట్టూ ఒక జీవనది ప్రవహిస్తూ ఉండేది .కస్వ మహర్షికి ధర్మ మేథి అనే సకల శాస్త్ర పారంగతుడు శిష్యుడుగా ఉండేవాడు. అతని ధర్మ పత్ని విశాల సకల సద్గుణ రాశి .మహా పతివ్రత.
ఒక రోజు ధర్మ మేథి ఒక క్రతువు చేశాడు. పెద్ద సంఖ్యలో ప్రజలు వచ్చారు .ఇష్టం వచ్చినట్లు వాళ్ళు ప్రవర్తించారు .ఆశ్రమ ధర్మాలను మర్చి పోయారు .మునులు ఏమీ చేయలేక మౌనంగా ఉండి పోయారు .సాయం కాలమైనది .సంధ్యోపాసన చేసుకోవటాని భర్త ఇంటికి వస్తాడని ,ఇంట్లో నీళ్ళు లేనందున నదికి వెళ్లి నీరు తీసుకు రావటానికి లోన భయంగా ఉన్నా బయల్దేరింది .చిమ్మ చీకటులు కమ్మేశాయి .ధైర్యంగా ,కర్తవ్య నిర్వహణగా నదికి వెళ్లి పాత్రలో నీరు తీసుకొని ఇంటికి బయల్దేరింది .బాగా లతలు అల్లుకున్న ప్రదేశం వచ్చింది .కాళ్ళు తడబడి తీగలలో తగుల్కొని కింద పడిపోయింది .ఇంతలో అక్కడ ఒక యువ కాముకుడు వచ్చి ఆమెను పట్టుకో బోయాడు .దిగ్భ్రమ చెంది ఆమె పరిగెత్తింది .వాడు ఆమెను గట్టిగా పట్టుకున్నాడు .వివస్త్రను చేసే ప్రయత్నం చేస్తుండగా ‘’అన్నా !తాపసభామినిని.చెల్లి వంటిదాన్ని .ఇది తగదు ‘’అని వేడుకొన్నది.హద్దుమీరితే మహర్షుల శాపానికి గురికావాల్సి వస్తుందనీ హెచ్చరించింది .అప్పుడామే నిశ్చలభక్తితో భగవంతుని ధ్యానించింది .అప్పుడొక మెరుపు మెరవగా వాడి ముఖాన్ని గుర్తు పట్టింది .వాడు కస్వమహర్షికి ఇష్టమైన శిష్యుడు’’ పర్ణాశణుడు ‘’ నిరంతరం ఆయన వెంటే ఉంటాడు ధర్మ శాస్త్రాలన్నీ మహర్షుల వద్ద నేర్చాడు వినయశీలి. అందరికి తలలో నాలుక .అలాంటి సద్గుణ సంపన్నుడు ఇంతటి నీచ కార్యానికి వొడగట్టటం ఆశ్చర్యమేసింది .వాడి వేమీ పట్టించుకోకుండా ఆమెను గాఢంగా బాహువుల్లో బంధించ బోయాడు .ఇంతలోఅనుకోకుండా మబ్బులు మాయమై ఒక కోతి ,ఒక భల్లూకం అక్కడికి వచ్చాయి .వానరం భయంకరంగా గర్జించి తోక ఎత్తి వాడి చాతీమీద తన్నగా ఇద్దరిమధ్య పోరాటం జరుగుతుండగా ,ఆమె పారిపోతుండగా ఎలుగు బంటి ఆమెకు రక్షణగా వెంట నడిచింది .ఆమె ఆశ్రమం చేరి భోరున విలపిస్తూ జరిగినదంతా భర్తకు నివేదించింది .ఆయనకు విపరీతంగా కోపం వచ్చింది .విషయం అంతా చుట్టుప్రక్కల పాకి పోయింది .
ముని పల్లె అంతా ధర్మ మేథి దగ్గరకు చేరి ఓదార్చి ఆశ్రమ స్త్రీలకే రక్షణ కరువైతే మిగిలిన వారి సంగతేమిటి అని ప్రశ్నించి మళ్ళీ ఇలాంటివి జరగ కుండా చర్యలు తీసుకోవాలని కోరారు . ఈ విషయ౦ క్రతు ,పూజాదికాలలో మునిగి పోయిన కస్వమహర్షికి తెలియదు .పర్ణాశనుడు యధావిధిగా గురువు గారికి సకలోపచారాలు చేస్తున్నాడు .ఇతడికీ ధర్మమేధి ఆశ్రమదగ్గర జరుగుతున్న విషయాలు తెలీవు .తన క్రతువు పూర్తి అవగానే పర్ణాశనుడికి యజ్న ప్రసాదం ఇచ్చి , మహర్షులందరికి అందజేసి రమ్మని పంపాడు .
అమాయకుడైన అతడు ధర్మ మేథి ఆశ్రమానికి వచ్చి ప్రసాదం ఇవ్వబోగా అతడిని అక్కడి వారంతా నానా దుర్భాషలాడి నిందించారు. అతడు తాను నిరపరాధిని అని నెత్తీ నోరూ మొత్తుకున్నాడు .తీవ్ర కోపం తో ధర్మమేథి అతడిని మొసలి గా మారిపోవాలని శపించాడు .తన తప్పు లేకపోయినా శపించటం దారుణం అంటూ కాళ్ళమీద పడి క్షమించమని అర్ధించాడు .అతనివలన ఆశ్రమం మలిన మై౦దని కాళ్ళు లాగేసుకున్నాడు ధర్మ మేథి .ఈ వింత పరిణామానికి అందరూ నిశ్చేస్టులై , కస్వ మహర్షికి ఈవిషయం తెలిసి ఉండదని భావించారు.
సశేషం
మీ- గబ్బిట దుర్గా ప్రసాద్ -15-7-18 –ఉయ్యూరు
—

