డా.శ్రీ మొవ్వ వృషాద్రి పతి గారి ‘’కసాపుర క్షేత్ర మాహాత్మ్యం ‘’-3
3-మాయా ఖండం( అనే మలుపుల మెరుపులు )
ఇంతలో చీకట్లు దట్టంగా వ్యాపించగా కస్వమహర్షి మునులవద్దకు రాగా పర్ణాశనుడు ఆయన కాళ్ళపై పడి తాను తాపసస్త్రీలను మాతృ మూర్తులుగా భావిస్తానని ,తానే తప్పూచేయలేదని,తనకు అనవసరంగా శాపమిచ్చారని అంటూ’’పూర్వం శ్రీ రాముడు తన ధనుస్సు కొనను తెలీకుండా ఒక కప్పుపై ఉంచి మునులతో సంభాషిస్తుంటే ,దాన్ని గమనించిన ఒక మహర్షి రాముడి దృష్టికి తెస్తే , వింటిని దూరంగా విసిరేసి కప్పను ఎందుకు అరవలేదని దానిబాద తనకెట్లా తెలుస్తుందని అడిగితే అది ‘’ఇతరులు బాధిస్తే రక్షణకోసం నిన్ను ఆశ్రయిస్తాం .ఇప్పుడునువ్వే బాధిస్తుంటే ఇంకెవరికి చెప్పుకోను “?అని ప్రశ్నించింది ..అని చెప్పి సత్వ సంపన్నులైన మహర్షులే తనను బాధిస్తే ఎవ్వరికీ చెప్పుకోగలం “?అని బావురుమన్నాడు .మహర్షి శిష్యుని ఊరడించి పూర్వ కర్మానుసారం ఇలా వస్తాయి ,బ్రహ్మాదులైన అనుభవించాల్సిందే .తప్పదు .మహర్షులకోపం గడ్డి మంట వంటిది .సత్యం తెలిస్తే ఊరికే ఆరిపోతుంది అని అనునయించి ,విశాలను చూసి ఆమె దీనవదన గా ఉండటానికి కారణమడిగాడు .ఆమె అమాంతం ఆయన పాదాలపై పడి,కన్నీటితో అభిషేకించి తన గోడు వెళ్ళ బోసుకొంది..ఆయన సంసారులు తప్పు చేస్తే లోకం సహిస్తు౦ది కాని తపస్వులు చేస్తే లోకం నిందిస్తుంది అని ,ధర్మ మేథి తో తాపసులకు కోపం పనికి రాదనీ ,ఉచితానుచితాలు చూడకుండా శాపాలు ఇవ్వరాదనీ ,మనకు కనిపించేవన్నీ నిజాలు కావని హితవు చెప్పాడు .విశాలను జరిగిన విషయం చెప్పమని అడిగాడు .ఆమె చెప్పుతుండగా ఒక వింత జరిగింది .
వానర భల్లూకాలు పర్ణా శనుని ఈడ్చుకొని వచ్చి మునుల ఎదుట పడేశాయి .అతడు అచ్చగా కస్వ శిష్యుడి పోలికలో ఉండటం అందరికీ ఆశ్చర్యం కలిగించింది .విశాల దుఖం తో వచ్చినవాడేవడో తనకు తెలియదని ,శిష్యుని వేషం లో వచ్చిన రాక్షసుడేమో నని అనుమానపడింది .అప్పుడు మాయా పర్ణా శనుడు ‘’ఈ మాయలాడి మాటలు నమ్మకండి .నన్ను రోజూ ఇంటికి పిల్చి ,మునుల ఎదుటే నాశరీరం నిమిరి నన్ను రెచ్చగొట్టి ముగ్గులోకి దించి, తనకామ తృప్తి తీర్చుకొంటుంది .ఆ రోజు కూడా నన్ను ఏటి వద్ద సిద్ధంగా ఉండమని చెప్పి వచ్చింది .అయినా ముక్కు మూసుకొని ఎప్పుడూ తపస్సు, ధ్యానం, జపం తపం అని మీరు కూర్చుంటే మీ భార్యల తాపం ఎలా తీరుతుంది ?స్త్రీలు శృంగార సౌఖ్యం కోరుకొంటారు .ఈమె భర్త ముసలివాడు .ఈమె లేత తీగ వంటిది .విశాల విషయం మీకందరికీ తెలియటం మంచిదే అయింది. రాత్రి వేళల్లో మీ ఆశ్రమాలలో ఎన్ని శృంగార గాధలు మీకు తెలియ కుండా జరుగుతున్నాయో మీకు తెలియదు .ఆమె ఆ రోజు నా పొందు సౌఖ్యానికి వచ్చి ఏదో అలికిడికాగా గుట్టు రట్టు అవుతుందని ఇంత కథ అల్లింది .అందిన ద్రాక్ష పళ్ళను అనుభవించకుండా ఉండే వెర్రి వాడు ఉంటాడా “?అని ఎదురు తిరిగాడు .మునులందరూ అవాక్కయ్యారు .ఈ కట్టు కధకు విశాల నరకబడిన లేత అరటి చెట్టులాగా కుప్పకూలి పోయింది .ఇదంతా కస్వ ముని మౌనంగా చూస్తున్నాడు .ఇద్దరు పర్ణాశనులను చూసి కోపంతో అందులో ఎవరు తన అసలైన శిష్యుడో చెప్పకపోతే బూడిద చేసేస్తానన్నాడు .అసలు శిష్యుడు ఏడుస్తూ ముని పాదాలపై పడి తనకెవ్వరూ అన్నదమ్ములు లేరని చెప్పి మాయావి ని తన రూపం ఎందుకు వేసుకొని వచ్చాడని ప్రశ్నించాడు .దానికి వాడు ‘’నువ్వే నా రూపం ధరించి ఇక్కడ మోసం చేస్తున్నావు ?’అంటూ కత్తి తీసుకొని అతని తల నరకబోయాడు.మాయావి చేతిని మహర్షి స్తంభింప జేసి వాడు మాయంకావాలని కమండలం నీటిని చల్లగా వాడు అదృశ్యమయ్యాడు .
ఇంతలో మరో అద్భుతం జరిగింది .ఆశ్రమ నుంచి మరో ధర్మ మేథి ,విశాల చెయ్యి పట్టుకొని లాక్కొచ్చి అసలు ధర్మ మేథి ని చూపిస్తూ’’ ఈ రంకు ఎంతకాలం నుంచి సాగుతోంది’’? అని కోప౦తో తనరూపాన్ని మక్కికి మక్కి అనుసరించి ఆశ్రమం లో పాపాలు చేస్తున్నాడని ఖడ్గం బయటికి తీయగా కస్వర్షి క్రోధం తో కమండలజలం చేతిలోకి తీసుకోగానే వాడూ అదృశ్యమయ్యాడు .కన్నీరు మున్నీరుగా ఏడుస్తున్న విశాలదగ్గరకు వానర ,భల్లూకాలు వస్తే వాటి విశ్వాసానికి ఒక అరటి గెల ఇస్తే దాన్ని పట్టుకొని రెండూ అడవిలోకి పారిపోయాయి .
విశాల మూలంగా ఆశ్రమ పవిత్రత దెబ్బతిన్నదని మునులు భావించి అ విషయమై తర్జనభర్జన చేస్తుండగా మరో వింత జరిగింది .ఆమెను రక్షించిన కోతి మళ్ళీ వచ్చి ఆమెను బుజ్జగిస్తున్నట్లు నటించి ఆమె చీర కొంగు లాగటం మొదలు పెట్టి చివరకు బలంగా చీరను లాగి పారేస్తే కస్వ ముని తన శాటీని ఆమెకు కప్పాడు .ఇది ఆమెను రక్షించిన కోతికాదు .మాయా పర్ణా శనుడే ఈరూపం లో వచ్చాడు. ఇంతలో అసలైన కోతివచ్చి మాయ కోతి గుండెలపై తన్నగా అది దిమ్మదిరిగి నేలపై పడి పోయింది .కోతీ ఎలుగు బంటీ రక్షించటం ఏమిటి అని కుర్రకారు మునులకు అనుమానం వచ్చింది . ముసలి మునులు వాళ్ళను వారించి నిజానిజాలు తెలుసుకోకుండా ని౦దించ రాదని బుద్ధి చెప్పారు .
కస్వముని వార౦దరితో’’ఎవడోరాక్షసుడు ఈ పన్నాగం పన్నాడు విశాల తప్పు ఏమీ లేదు .ఆమె పరమ పతివ్రత.వాడెవడో ఈ ఆశ్రమపై అకారణంగా క్రోధం పెంచుకొని ఇలా చేసి ఉంటాడు .దైవ ప్రేరణ చేత ఆమె ఆసమయం లో నదికి వెళ్ళింది .ఈ దోష పరిహారార్ధం మనమందరం శ్రీ ఆంజనేయ స్వామి ప్రీత్యర్ధం ఒక మహా యజ్ఞం చేద్దాం .అప్పుడు హనుమ దయ మనపై ప్రసరించి ఇకపై ఆపదలు రాకుండా చూస్తాడు ‘’అనగానే మునుల హృదయాలు శాంతించాయి .ధర్మ మేథి పర్ణాశనుడితో ‘’కోపం లో నిన్ను శపించాను .కాని ఆశాపం ఇప్పుడు ఫలించదు .ఎప్పుడో ఒక ఏడాదికాలం మాత్రం నువ్వు నక్రంగా ఉంటావు .దానికీ ఏదో కారణం ఉండే ఉంటుంది ‘’అని ఊరడించాడు .తనవలన నిరపరాధి అయిన అతనికి ఇంతటి శాపం వచ్చినందుకు క్షమించమని కోరింది .వేదనా భారం తో పర్ణా శనుడు కస్వ మహర్షి వెంట ఆశ్రమానికి వెళ్ళగా ఎవరిదారిన వారు వెళ్లి పోయారు .
సశేషం
మీ- గబ్బిట దుర్గాప్రసాద్ -16-7-18 –ఉయ్యూరు
—

