డా.శ్రీ మొవ్వ వృషాద్రి పతి గారి ‘’కసాపుర క్షేత్ర మాహాత్మ్యం ‘’-4
4-రక్షః ఖండం
కాలం గడిచి పోతోంది,చెడు సమసి పోయింది కాని ఆంజనేయ వ్రతంమాత్రం అంతా మర్చే పోయారు .ఒక రోజుమధ్యాహ్నం ఇద్దరు జటాధారులు ఆశ్రమం వైపు వస్తూ,ఎండ వేడి భరించలేక ,దూరం నుంచే ఆశ్రమ సౌందర్యానికి ముగ్ధులై ,ఆశ్రమం దగ్గరకొచ్చి తాము ధర్మమేథి దర్శనం కోసం వచ్చామని చెప్పగా కస్వ మహర్షి శిష్యులు ఆదరంగా ఆహ్వానించి ,ధర్మమేథి ఆశ్రమానికి తీసుకు వెడుతుండగా ఆయనే ఎదురొచ్చి స్వాగతం పలికి సకల సపర్యలు చేసి ,తాము వచ్చిన పని అడిగాడు. వాళ్ళు ‘’ మేము గౌతమీ తీరం లో ఉంటున్న కవశుడు అనే బ్రహ్మర్షి శిష్యులం .ఆయన బ్రాహ్మణ ఋషికి ,శూద్ర స్త్రీ కి జన్మించినవాడు .అయినా నిరుపమాన తపస్సంపన్నుడై బ్రహ్మర్షి అయ్యాడు .ఒకప్పుడు నైమిశం లో మహా క్రతువు జరిగితే ఈయన అక్కడికి వెళ్ళాడు .అక్కడి మునులు ఈయన్ను చూసి పిలువకుండా వచ్చినదుకు పరిహాసం చేసి,ఆయన కాలు పెట్టిన చోటు నిలువు లోతు పాపభూయిస్టం అవుతుంది కనుక ప్రవేశార్హుడు కాదు అని నిందించారు .కవశ మహర్షి అవమాన భారంతో కన్నీటితో వెనక్కి తిరిగి వెళ్ళిపోబోతుండగావెంటనే నైమిశారణ్యంలో ప్రవహించే సరస్వతీ నది పెద్ద ధ్వనితో పదిపాయలుగా చీలిపోయింది .ఒకపాయ వచ్చి ఆయన పాదాలను కడిగి పాపప్రక్షాళన చేసింది .మరోకపాయ యజ్నవాటికను ,ముని వాటికలను ముంచేసింది .పీకల్లోతు నీటిలో మునులందరూ చెల్లా చెదురై కవసుని ప్రభావం గ్రహించారు .విప్రత్వం బ్రహ్మత్వం చేసే కర్మలవలన కలుగుతాయి కాని జన్మవల్ల కాదన్న సత్యాన్ని గ్రహించారు .ప్రాయశ్చిత్తంగా ఆయన పాదాలపై వాలి క్షమాభిక్ష అర్ధించారు .ఆయన తనను ప్రార్ధిస్తే ప్రయోజనం లేదనీ తనను పరిశుద్ధుని చేసిన సరస్వతీ నదిని ప్రార్ధించమని చెప్పి తాను ఆ నదికి అభిముఖంగా నిలిచి ఆమెను ‘’వీళ్ళు అజ్ఞానంతో చేసిన చేసిన తప్పులను కాయమని’’ కోరాడు .నది శాంతించి యధాప్రకారం గా ప్రవహించింది .ముని తన ఆశ్రమానికి బయల్దేరి చేరాడు .ఆయనే ఇప్పుడు గొప్పక్రతువు నిర్వహించ సంకల్ప౦ చేసి ధర్మమేథి ని అర్ధాంగి, శిష్యసమేతంగా రావలసినదిగా కోరారు ‘’అని విన్నవించారు శిష్యులు .తాను అలాగే వస్తానని మాట ఇచ్చి వాళ్లకు వీడ్కోలు పలికాడు .
అర్ధాంగి తో కలిసి వెళ్ళాలి అనుకొన్నాడుకానీ కాని, అనివార్యకారణాలవల్ల ఒంటరిగా బయల్దేరాడు .దారి అంతా ముళ్ళకంపలతో భీభత్సంగా ఉంది. ముళ్ళు గీసుకొని యమబాద అనుభవించాడు .మిట్టామధ్యాహ్నపు ఎండకు తట్టుకోలేక పోయాడు .క్రూర మృగ బాధ కు తల్లడిల్లాడు .కొంతసేపటికి దూరంగా ఒక ఆశ్రమం కనిపిస్తే ప్రాణం లేచి వచ్చినట్లని పించింది కాని, ఎడమ కన్ను, ఎడమభుజం అదిరి అపశకున౦ గా గోచరించింది .అయినా ముందుకే కదిలాడు .కుక్కల అరుపులు,చచ్చిన జంతువుల దుర్వాసన వాటిని పీక్కు తినే నక్కల కుక్కలు మరింత రోతపుట్టించాయి .ఇంతలో కిరాతులగుంపు వచ్చి ఆయనే తమ పోలి తో కాపురం చేసి పారిపోయిన దొంగ సన్నాసి అని జుట్టుపట్టుకొని తలపై కొట్టారు .ఆయన యోగదండాన్ని, కమండలాన్ని యజ్నోపవీతాన్నీ ముక్కలు చేశారు .ఇంతలో రాకాసిలాంటి భారీ ఆకారం తో ‘’పోలి’’ అక్కడికొచ్చి ‘’ఏరాపోలిగా !ఇన్నాళ్ళు ఎక్కడ చచ్చావ్ .నానోట్లో నోరు బెట్టి కల్లు తాగకుండా ఎట్టా ఉన్నావ్ .నాతో రాత్రిళ్ళు పడక సుఖం అనుభవించి చెప్పకుండా ఏడకు జారుకున్నావ్ ‘’అంటూ నానా దుర్భాషలు ఆడింది .మహర్షి కోపంతో ఒక్క తోపు తోస్తే అది రొచ్చు గుంటలో పడింది .ఆయన కిరాతులను నానా విధాలుగా తిట్టుతుండగా పోలి లేచి వచ్చి మళ్ళీ తిట్లదండకం లంకి౦చుకొన్నది .అవాక్కయ్యాడాయన .చివరికి వాళ్ల నాయకుడి దగ్గరకు బంధించి తీసుకు వెళ్లి జరిగింది చెప్పి ఆయనకు శిక్ష వేయమని కోరారు .
నాయకుడు భయంకరాకారుడు .పోలిని జరిగిన అన్యాయం చెప్పమంటే కల్లబొల్లి ఏడ్పులతో కహానీ అల్లి చెప్పింది .ఆయన్ను అడిగితె తాను ఇంతవరకు ఆస్త్రీని చూడనే లేదని ,కస్వమహర్షి తన గురువు అని నిజాన్ని నిర్ధారించి శిక్ష వేయమని కోరాడు .అందరూ వాళ్ళిద్దరూ గూడెం లో కలిసి కాపురం చేశారని సాక్ష్యం చెప్పారు .అప్పుడా దొర న్యాయనిపుణులను పిలిచి విచారించమని ఆదేశించాడు .వాళ్ళు కూడా ఆడది పరాయి వాడిని తనభర్త అని చెప్పదని ,వచ్చినవాడు బ్రహ్మర్షి వేషం లో ఉన్న పోలిగాడేనని ,వంచకుడు కనుక శిక్ష వేయాల్సిందేనని నని తీర్పు చెప్పారు .దొర ధర్మమేథితో పోలిని ఏలుకొంటూ ఇక్కడే కాపురం చేస్తూ ఉండిపోమ్మన్నాడు .ధర్మమేథి తాను తన సహధర్మచారిణి విశాలకు అన్యాయం చేయలేనని ,తనను ఖండఖండాలుగా కోసినా అధర్మాన్ని అంగీకరించనని తెగేసి చెప్పగా దొర అగ్గిమీద గుగ్గిలమై ‘’ఎక్కడో కాలి ‘’అతడు మోసగాడని నమ్మి చీకటి గుహలో వంటరిగా బంధించమని శాసించగా వాళ్ళు ఈడ్చుకు పోయి అలానే బంధించారు .
సశేషం
మీ –గబ్బిట దుర్గాప్రసాద్-16-7-18 –ఉయ్యూరు
—

