డా.శ్రీ మొవ్వ వృషాద్రి పతి గారి ‘’కసాపుర క్షేత్ర మాహాత్మ్యం ‘’-6

డా.శ్రీ మొవ్వ వృషాద్రి పతి గారి ‘’కసాపుర క్షేత్ర మాహాత్మ్యం ‘’-6

6-రామ కథా ఖండం

కస్వాదిమహర్షులకు ప్రత్యక్షమైన ఆంజనేయస్వామి రామకథ చెప్పటం ప్రారంభించాడు .’’త్రేతాయుగం లో శ్రీరాముడు తండ్రి ఆజ్ఞతో సీతాలక్ష్మణ సమేతంగా అడవికి వెళ్ళాడు .ముగ్గురూ ముని వేషాలతో గౌతమీ తీరం లో పంచవటి లో పర్ణశాల నిర్మించుకొని కొంతకాలం గడిపి ,జనస్థానం చేరి కుటీరం లో ఉన్నారు .ఒక రోజు శూర్పణఖ వచ్చి’’ రామ చక్కని’’ తనానికి మోహపడి వాళ్ళు ఎందుకు మునివేషం లో ఇక్కడికి వచ్చారు అనీ, ఖరుడు ఇక్కడ రావణ ప్రతినిధిగా పాలిస్తున్నాడు .వాడి తమ్ముడు దూషణుడు .ఇద్దరూ మహా రణ పండితులే .మీరిక్కడ ఉన్నారని వాళ్ళిద్దరికీ తెలిస్తే మిమ్మల్ని నంజుకొని తింటారు .వాళ్ళతో స్నేహం మీకు క్షేమం ‘’అన్నది .రాముడు ఉదాసీనంగా విని దైన్యం తో ఉన్నట్లు నటించి ‘’మాకు మేలు చేశావు .పాముల కాళ్ళు పాములకే తెలుసు .వాళ్లకి ఎలా సంతోషం కలిగించాలో వివరంగా చెప్పు ‘’అన్నాడు .

పరిహాసం గా రాముడు అన్నమాటలను అమె నమ్మిశూర్పణఖ  రాముడు తనవలలో పడ్డాడని ఆతనితో పొందు సౌఖ్యం హాయిగా అనుభవించవచ్చని ఊహించింది .భయం లేదనీ తాను వాళ్లకు అండగా ఉండగా వాళ్ళేమీ చేయలేరని పలికింది .ఇంకొంచెం ముందుకు వెళ్లి ‘’నాంతటి అందకత్తె రాక్షసజాతిలో లేదు  ,నాకోసం మా వాళ్ళు  అర్రులు చాస్తూ౦ టారు .కాని నాకు నిన్ను పెళ్ళాడాలని ఉంది .ఈమెను నీ తమ్ముడికిచ్చి పెళ్లి చేసెయ్యి .రోజుకో మహర్షిని చంపి నీకు కానుక ఇస్తా .రోజూ విప్పకల్లు తాగి సుఖాలలో తేలిపోదాం .పొట్టి కురూపి సీతతో ఇంతకాలం ఎలా కాపురం చేశావ్ ?దీన్ని మింగేసి మనకు అడ్డు లేకుండా చేస్తా ‘’అని ఆమెపైకి దూకబోయింది .సీత భయకంపితురాలవ్వగా లక్ష్మణుడు వెంటనే  ఆమె ముక్కూ చెవులూ కోసేశాడు .

అంద వికారి అయి పోయిన శూర్పణఖ ఏడుస్తూ ఖర దూషణుల దగ్గరకు పోయి విషయం చెప్పింది .వాళ్ళు  అత్యంత రౌద్రం తో సేనా సమేతంగా వచ్చి రాముని పై పడితే  నిమిషాలమీద  వారందరినీ  రాముడు నిర్జించాడు .ఈ విషయం తెలిసిన రావణుడు మారీచుని సాయంతో జనస్తానానికి వచ్చి,వాడు మాయలేడిగా మారగా సీత దాన్ని పట్టితెమ్మనగా రాముడు దాని వెంబడించి సంహరించాడు .మాయావి రావణుడు సీతను అపహరించి లంకకు తీసుకు పోయాడు . రామ లక్ష్మణులు  వచ్చి సీత జాడ తెలియక అరణ్యమంతా గాలిస్తుంటే జటాయువు ఆమె వృత్తాంతం చెప్పి మరణిస్తే అతనికి అగ్ని సంస్కారం చేసి ,కబంధుని చంపి ఋష్యమూకపర్వతం చేరి ,మా రాజు సుగ్రీవునితో రాముడికి స్నేహం నేనే మంత్రిగా కలిగించాను .రాముడు సప్త సాలాలను భంజించి ,వాలిని చంపాడు .సుగ్రీవాజ్ఞ ప్రకారం నేను సముద్రం దాటి లంకను చేరి సీతామాతను దర్శించి అశోకవనం నాశనం చేసి ,లంక  కాల్చి పరశురామ ప్రీతికలిగించి ,సముద్రం దాటి వానరులను చేరి సీతా వృత్తాంతమంతా  చెప్పాను .

అపార వానర భల్లూక సేనతో రామ లక్ష్మణులు దక్షిణ సముద్ర తీరం చేరారు .దారి ఇమ్మని సముద్రునికోరి ఇవ్వకపోతే ప్రాయోపవేశం చేసి చివరికి బ్రహ్మాస్త్రం సంధించగా సముద్రుడు ప్రత్యక్షమై  రాముని శరణు వేడాడు .ఆ అస్త్రాన్ని రాముడు ద్రుమ కుల్యం పై ప్రయోగించాడు .నూరు యోజనాల సముద్రం పై  కపి సేన సేతువు నిర్మించి ,చివరగా  సీతను తెచ్చి అప్పగింపుమని అంగదుడిని రాయబారిగా పంపినా వాడు ఒప్పుకోకపోతే ,యుద్ధం చేసి రావణ ,కుంభకర్ణ ,ఇంద్ర జిత్తులను జయించి ,విభీషణుడికి,పట్టం కట్టి ,సీతాదేవితో అయోధ్యకు వచ్చి పట్టాభి షిక్తుడు అయిన సంగతి మీకు తెలిసిందే ‘’అన్నాడు హనుమ .

మళ్ళీ చెప్పటం ప్రారంభించి ‘’రామ రావణ యుద్ధంలో ఒక రోజు రావణుడు మయుడు ప్రసాదించిన శక్తి తో రాముడిని చంపాలని   యుద్ధానికి వచ్చాడు .దారిలో విభీషణుడు ఎదురవ్వగా  ఇద్దరూ ఘోర యుద్ధం చేశారు .అప్పుడు అన్న తమ్ముడిపై ఆ శక్తిని ప్రయోగించాడు .విషయం తెలిసిన లక్ష్మణుడు విభీషణ రక్షణార్ధం ,అతన్ని వెనక్కి నెట్టి తానె ముందు నిల్చి దశ కంఠుడితో తలపడ్డాడు .శక్తి అతని బాణాలన్నిటినీ తుత్తునియలు చేసి రామానుజుని తాకగా మూర్ఛపోయాడు .ఆ౦జ నేయాదులకోరికపై రాముడు రావణుడితో యుద్ధం చేసి వాడి పరాక్రమాన్ని నిర్వీర్యం చేశాడు .తమ్ముడు మరణించాడని భావించి దుఃఖించాడు .సుషేణుడు వచ్చి అది మూర్ఛ యేకాని .మరణం కాదని చెప్పి ఊరడించి ద్రోణాద్రిపై సంజీవకరణి, విశల్యకరణి మొదలైన వనౌషధాలున్నాయని ,సూర్యోదయానికి ముందే వాటిని తీసుకురమ్మని రాముని చేత  ఆజ్ఞాపి౦ప బడి నేను బయల్దేరాను .నన్ను ఆపటం ఎలాగా అని రావణుడు ఆలోచించి ,మారీచాశ్రమం చేరి వాడికొడుకు కాలనేమి నిమచ్చిక చేసుకొని నాపైకి పంపాడు.వాడు ద్రోణాద్రి చేరి అక్కడ ఒక తపశ్శాల నిర్మించుకొని తపస్సు చేసే నెపంతో ఉన్నాడు .’’’అనిచెప్పాడు మునులకు మారుతి .

సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -18-7-18 –ఉయ్యూరు

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 


Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.