శాకంభరి పూజ ఉయ్యూరు శ్రీ సువర్చలా0జనేయ స్వామి దేవాలయం లో ఆషాఢ మాస ప్రత్యేక కార్యక్రమాలు

           శాకంభరి పూజ

శాకంభరి దేవి ఎవరు ?ఆపేరుకు అర్ధమేమిటి?

శాకంభరీ దేవి పార్వతీ దేవి అవతారం .మహాకాలుని అర్ధాంగి .పచ్చదనానికి దివ్య మాత. శాకాహారమైన ప్రతి వస్తువు ఆమె దివ్య  ప్రసాదమే  .కరువు కాటకాలలో ఆది పరాశక్తి శాకంభరీ దేవిగా అవతారం దాల్చి భూమిపైకి వచ్చిఅన్నార్తులకు  శాకాహారాన్ని సమృద్ధిగా లభించేట్లు చేస్తుంది .శాకాలను భరించేది ,ధరించేది కనుక శాకంభరి అంటారు .భ్రు అనే సంస్కృత ధాతువు నుండి భరి వచ్చింది .భ్రు అంటే మోయటం,.ధరించటం ,పోషించటం అనే అర్ధాలున్నాయి .

   శాకంభరీ దేవి అవతారం ఎందుకు అవసరమైంది ?

పూర్వం దుర్గమాసురుడు అనే క్రూర రాక్షసుడు ఉండేవాడు .వీడు  హిరణ్యాక్ష వంశం వాడు .తాను వేదాలను అధీనం చేసుకొని ,దేవతలతోపాటు యజ్న హవిర్భాగం పొందాలని తలచాడు .గాలిమాత్రమే పీలుస్తూ బ్రహ్మకోసం వెయ్యేళ్ళు తీవ్ర తపస్సు చేశాడు . ఆ తపో తేజానికి లోకాలన్నీ వణికి పోయాయి .బ్రహ్మ ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు .తనకు నాలుగు వేదాలు ఇవ్వమని కోరగా ఇచ్చి బ్రహ్మ అదృశ్యమయ్యాడు .

  ఆ రోజునుండి మహర్షులు వేదాలను మర్చి పోయారు .నిత్య స్నానం ,సంధ్యావందనం ,జపం, తపం అన్నీ గుంటపెట్టి గంట వాయించేశారు .కొంతకాలానికి దీన్ని భరించలేని  భూ దేవత తీవ్ర వేదనతో ఆక్రోశించింది .ఆమె ఆక్రోశానికి మునులకు జ్ఞానోదయం కలిగి తామెందుకు వైదిక కర్మలను మానేశాం  వేదాలేమైనాయి ఎక్కడున్నాయి అనే స్పృహ కలిగింది .భూమిపై అనేక కల్లోల పరిస్ధితులేర్పడ్డాయి  .మహర్షులు యజ్ఞాలు చేయకపోయేసరికి దేవతలకు హవిర్భాగాలు దొరకక చిక్కి శల్యమై పోయారు .అప్పుడే దుర్గమాసురుడు   దేవలోకం పై దాడి చేశాడు .వాడిని ఎదిరించలేకఇంద్రునితో సహా  దేవతలు పలాయనమంత్రం చిత్తగించారు .

దేవతలు సుమేరు పర్వతం చేరి అక్కడి గుహలలో కనుమల్లో ఆది పరాశక్తికోసం తపస్సు చేశారు.యజ్న యాగాదులు చేస్తే అగ్నిహోత్రం లో నెయ్యి మొదలైన పవిత్ర హోమద్రవ్యాలు వేస్తేనే  అవి సూర్యునికి చేరి తర్వాత వర్షాలకు కారణమౌతాయి .ఇవి ఆగిపోవటం తో వర్షాభావమేర్పడి  పంటలు పండక నదులు, చెరువులు, బావులు ఎండిపోయి  కరువు తాండవం చేసింది .తాగటానికి చుక్కనీరు కూడా లేని పరిస్ధితి ఏర్పడింది .ఇలా వర్షాలు లేకుండా వందేళ్ళు గడిచాయి .వేలాదిజనం పశువులూ ఆకలికి అలమటించి చనిపోయాయి .ఎక్కడ చూసినా శవాలకుప్పలే.దహనక్రియలు చేయటం కూడా కష్టమైపోయింది .భూమిపై ఈ ఘోరాన్ని చూసి తట్టుకోలేక మునీశ్వరులు కూడా ఏదో పరిష్కారం సాధించాలని హిమాలయాలకు వెళ్లి  ఆది పరాశక్తిఅనుగ్రహ౦  కోసం  నిద్రాహారాలు మానేసి తీవ్ర తపస్సు చేశారు .

              పార్వతీ దేవి శతాక్షి రూపం పొందటం

  మునులందరూ మహేశ్వరీ దేవిని మంత్రాలతో స్తోత్రాలతో ఏకకంఠంగాస్తుతించారు .మహేశ్వరి వీరి తపస్సుకుమెచ్చి పార్వతి రూపం లో ప్రత్యక్షమవ్వగా ఆమెకు జరిగిందంతా నివేదించి చూడమన్నారు  .కరువు కాటకాలను  చూసి చలించిపోయి  తన శరీరం నిండా నూరు కళ్ళు ఏర్పాటు చేసుకొని ’’శతాక్షి ‘’గా  అందరికి కనపడింది .ఆమె శరీరం దట్టమైన నీలం రంగుతో ,కనులు నీలి కలువలులాగా .కఠినమైన  విశాలమైన ఒకదానినొకటి తాకేట్లున్న  చనుగవ తో,రెండు చేతులతో కనిపించింది .అందానికే అందంగా ,సహస్ర సూర్య కాంతితో ,దయా వారాసిగా దర్శనమిచ్చింది .విశ్వంభరిఅయిన ఆమె జనుల కష్టాలను చూడలేక  కనులనుండి  ధారాపాతంగా కన్నీటిని కార్చి తన మాతృహృదయాన్ని చూపింది .దీనికి ప్రజలు, ఓషధులు  మిక్కిలి సంతసి౦చారు .ఆకన్నీరే నదులుగా ప్రవహించాయి .హిమాలయాలనుండి  మునులు సుమేరు గుహల్లోంచి దేవతలు బయటికి వచ్చి అందరూకలిసి ఆమెను అనేక విదాల స్తోత్రాలతో కీర్తించారు  .

                    శతాక్షి శాకంభరీ దేవిగా మారటం

శతాక్షీ దేవి తన శరీరాన్ని మార్చుకొని ఎనిమిది హస్తాలలోవివిధ రకాల ఆహార ధాన్యాలు ,పప్పుధాన్యాలు ,కూరగాయలు ,పళ్ళు ,వివిధ ఔషధాలతో నూ ,అందమైన ఆకుపచ్చని చీర కట్టుకొని ‘’శాకంభరీ దేవి ‘’గా దర్శనమిచ్చింది.దేవతలు మునులకు తన చేతిలోని రుచికరమైన ఆహారపదార్ధాలను తినటానికి అందజేసింది . ఆమెను బహు విధ స్తోత్రాలతో వారు మెప్పించారు .తర్వాత శాకంభారీదేవి మనుషులకురుచికరమైన  భక్ష్య పానీయాలను, జంతువులకు పచ్చగడ్డిమొదలైనవాటిని ఇచ్చింది .అప్పటినుంచి భూమిపై పంటలు సమృద్ధిగా పండాయి .ఇదంతా శాకంబరీ దేవి అనుగ్రహమే నని అందరూ భావించారు .

               దుర్గావతారం

పార్వతీదేవి  దేవి దుర్గామాసురిడికి కబురు పెట్టి వేదాలను తెచ్చి ఇమ్మని ,స్వర్గాన్నిఇంద్రునికి అప్పగించి   వదిలి పెట్టి పొమ్మని కబురు చేసింది .వాడు వినలేదు .వెయ్యి అక్షౌహిణుల సైన్యంతో వాడు పార్వతీదేవిపైకి యుద్ధానికి వచ్చాడు .దేవ ,మునులు భీతి చెందగా వారిచుట్టూ రక్షగా ఒక తేజో వలయాన్ని సృష్టించి తాను బయటనే ఉండి యుద్ధం చేసింది .తన రూపాన్ని అత్యంత భయంకర౦గా ,వివిధ మారణాయుధాలు ధరించి  సింహవాహనమెక్కి శత్రు భీకరంగా కనిపించింది .భయంకర యుద్ధం సాగింది ఇద్దరిమధ్యా .రాక్షసుల బాణాలకు సూర్యుడు కనిపించలేదు.అంతా చీకటి .ఆయుధాల పోరులో అవి అంటుకొని వెలుగులు చిమ్మాయి .భీకర భయంకర శబ్దాలతో ఒకరిమాట ఒకరికి వినబడం లేదు .

          శక్తి స్వరూపిణి  దుర్గా మాత

ఈ సమయం లో దేవి శరీరం నుంచి కాళి ,తరిణి ,త్రిపురసుందరి ,భువనేశ్వరి, భైరవి ,ఛిన్న మస్త , ధూమావతి ,భగళముఖి ,మాతంగి ,కమలాత్మిక అనే నవ శక్తులు, శైలపుత్రి ,బ్రహ్మచారిణి,చంద్ర ఘంట ,కూష్మాండ ,స్కందమాత ,మృత్యు ,శరణ్యు మొదలైన శక్తులు ఉద్భవించి వంద అక్షౌహిణుల రాక్షససైన్యాన్ని నాశనం చేశాయి .జయజయ ధ్వానాలు మిన్నుముట్టాయి.

            దుర్గమాసుర సంహారం

అప్పుడు దుర్గామాసురుడు దేవి ఎదటబడి యుద్ధం చేశాడు .పది రోజులు సాగిన సమరం లో వాడి సైన్యమంతా నాశనమైంది .పదకొండవ రోజు వాడు యెర్ర దుస్తులు, యెర్ర హారాలు వేసుకొని,  యెర్ర చందనం పూసుకొని యుద్ధానికి వచ్చాడు  .పార్వతీ దేవి వివిధ శక్తులన్నీ ఆమెలోకి తిరిగి చేరి మరింత శక్తి స్వరూపిణి అయింది  .ఆరుగంటల తీవ్ర పోరు జరిగి ,ఆమె వాడిపై 15 తీవ్ర బాణాలు సంధిస్తే వాడి నాలుగు గుర్రాలను నాలుగు ,సారధిని ఒకటి ,రెండు వాడి రెండు కళ్ళను ,రెండు వాడి బాహువులను ,జండాను ఒకటి ,వాడిగుండెను అయిదు బాణాలు చీల్చిపారేశాయి .రక్తం కక్కుకొని భూమిపై దుర్గమాసురుడు పార్వతీ దేవి పాదాల చెంత వాలిపోయి మరణించాడు  .వాడి ఆత్మశక్తి పంచభూతాలలో కలిసిపోయింది .,ముల్లోకాలు వాడి చావుకు సంతోషించి దేవి పరాక్రమాన్ని శ్లాఘించాయి .త్రిమూర్తులతో సహా దేవతలు, మునులు వచ్చి ఆమెను కీర్తి౦చగా ఆమె సంతృప్తి చెంది  నాలుగు వేదాలను మునీశ్వరులకు అందజేసి ,వారినుద్దేశించి ప్రసంగించి వేద ధర్మాన్ని వ్యాప్తి  చేయమని ,యజ్ఞయాగాదులు నిర్వహించి ప్రకృతి సమతుల్యానికి తోడ్పడమని కోరి దుర్గామాసుర సంహారం చేసిన తాను ఇకనుండి ‘’దుర్గామాత’’గా పిలువబడుతానని చెప్పి,సత్య శివ సుందరమైన ఆ దేవి అదృశ్యమైంది .

 ఎక్కడెక్కడ శాకంభరీ ఆలయాలున్నాయి ?

   రాజస్థాన్ లో ఉదయపూర్ కు 15 కిలోమీటర్ల దూరంలో శాకంభరీ దేవి దేవాలయం ఉన్నది .జార్ఖండ్ లో ‘’పాకూరు’’ వద్దా ,కలకత్తాకు 150కిలో మీటర్లలో ‘’సకారియా’’లో ,బెంగుళూర్లో  ‘’బాదామి’’ లో ,సతారా ,సహరాన్ పూర్,  కాన్పూర్ లలో కూడా ప్రాచీన శాకంభరీ మాత దేవాలయాలున్నాయి .చైత్ర శుద్ధ సప్తమి ,నవరాత్రులలో  సప్తమినాడు రాత్రివేళల్లో జాగరణ చేస్తారు .

  అందుకే ఆషాఢ మాసం లో దేవీ దేవాలయాలలో  శాకంభరీ పూజను వివిధ కాయగూరలతో చేయటం ఆనవాయితీగా వస్తోంది .ఉయ్యూరు శ్రీ సువర్చలా౦జనేయ స్వామి దేవాలయం లో 21-7-18 శనివారం ఉదయం 9-30 గం.లకు స్వామివార్లకు శాకంభరీ పూజ నిర్వహిస్తున్నాము .

 శాకంభరీ పంచకం –రచన –జగద్గురువులు  శ్రీ ఆది శంకరాచార్య

1-శ్రీ వల్లభ సోదరీ ,శ్రిత జనశ్చద్వాహినీ ,శ్రీమతీ –శ్రీ క౦ఠార్ధశరీరగా ,శృతి లసన్మాణిక్య తాటంకకా

శ్రీ చక్రాంతర వాసినీ ,శృతి శిరః సిద్ధాంత మార్గ ప్రియా –శ్రీ వాణీ ,గిరిజాత్మికా ,భగవతీ ,శాకంభరీ పాతు మాం .

2-శాంతా ,శారదా చంద్ర సుందరముఖీ ,శాల్యన్న భోజ్య ప్రియా –శాకైః పాలిత విస్టపా,రాతదృశా,శాకోల్లాస ద్విగ్రహా

శ్యామాంగీ ,శరణాగతార్తి శమనీ ,శక్రాదిభిః శా౦సితా –శంకర్యాస్ట ఫలప్రదా ,భగవతీ ,శాకంభరీ పాతుమాం.

3-కంజాక్షీ ,కలశీ ,భవాది వినుతా ,కాత్యాయినీ ,కామదా –కళ్యాణీ ,కమలాలయా ,కరకృతాం భోజాసి స్వేటాభయా

కాదంవాసవ మోదినీ ,కుచలత్కాశ్మీరజా లేపనా –కస్తూరీ తిలకా౦చితా,భగవతీ శాకంభరీ పాతుమాం .

4-భాక్తానంద విధాయినీ ,భవభయ ప్రధ్వంసినీ ,భైరవీ -భర్మాలంకృతి  భాసురా ,భువన భీక్రుద్ దుర్గ ,దర్పాపహా

భ్రూభ్రున్నాయక నందినీ ,భువన సూ భాస్యత్పరః ,కోటిభా –భౌమానంద విహారిణీ ,భగవతీ ,శాకంభరీ పాతుమాం.

5-రీతామ్నాయ శిఖాస్తు,రక్త దశనా ,రాజీవ పత్రేక్షణా-రాకా రాజ కరావదాత హసితా ,రాకేందు బి౦బ స్థితా

రుద్రాణీ,రజనీ కరార్భ కలసన్మౌళీ ,రజో రూపిణీ –రక్షః,శిక్షణా దీక్షితా ,భగవతీ ,శాకంభరీ పాతుమాం.

6-శ్లోకానామిహ పంచకం పఠతియః స్తోత్రాత్మకం శర్మదం-సర్వాపత్తి వినాశకం ప్రతిదినం భక్త్యా స్త్రి సంధ్యాం నరః

ఆయుః పూర్ణ మపార మర్థ మమలాం ,కీర్తి ప్రజా మక్షయాం –శాకంభర్య ను కంపయా  స లభతే విద్యాం చ విశ్వార్ధకాం .

ఇతి శ్రీ మచ్ఛ౦కరాచార్య  విరచితం శాకంభరీ పంచకం సంపూర్ణం

మీ-  గబ్బిట దుర్గా ప్రసాద్ -21-7-18 –ఉయ్యూరు

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in సమయం - సందర్భం and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.