జుమ్లా ఫిదా
‘’కన్నుకొట్టరోయ్ కౌగిలించరోయ్ ‘’అనే సినీ పాట వినే ఉంటారు అందరూ .నిన్న లోక్ సభలో ‘’నీట్ షేవెన్’’ రాహుల్ ,మోడీ జుమ్లాకు ఫిదా అయి మాట్లాడేమాటలు అమాంతం ఆపేసి కాసేపు మోడీ వెచ్చని కౌగిలి ఆనందాన్ని గడ్డం గుచ్చుకున్నా అనుభవించి ,పెద్దాయనను ‘’పప్పు ‘’చేశాను చూడండి అని కన్నుగొట్టి రెచ్చగొట్టి,సాటి ఎంపీలతో , బయటి స్టార్లతోకూడా కన్ను కొట్టించుకొని’’ లవర్ బాయ్ ‘’అనిపించి తాత నెహ్రూను ఈ విషయం లో బీటౌట్ చేసి ఎక్కువమార్కులు, లైకులు సంపాదించాడు . స్టాప్ స్టాపులుగా గా ఆర్ధికమంత్రి బడ్జెట్ పేపర్ చూసి పన్నుల దుడ్డుకర్రతో బాదినట్లు కాకుండా గంటసేపు నాన్ స్టాప్ గా ఆంధ్రాకు జరిగిన ,జరుగుతున్న అన్యాయం ,వివక్ష లను మోడీదీ, ఆయన ప్రభుత్వానిదీ ,ఆయన పార్టీ దీ’’ అయిన జుమ్లా’’ను ఎండకట్టి ,మంచినీళ్ళు కూడా తాగకుండా అధికార పక్షాన్ని నీళ్ళు తాగించాడు పదునైన వాడి యైన సూటి అయిన ఆంగ్ల పదజాలంతో గుండెల్లో గునపాలే గుచ్చాడుగల్లా జయదేవ్ ..మనకు మళ్ళీ ఒక సర్వేపల్లి రాధాకృష్ణన్ దొరికాడనే సంతోషం ,సంతృప్తి కలిగించి తల్లి అరుణ కు, తెలుగుతల్లికి తెలుగు దేశానికి ఋణం తీర్చుకున్నాడు .లోక్ సభలో మాట్లాడుతుంటే స్వపక్ష విపక్షాలు సైతం నివ్వెర పోయేట్లు చేసిన పార్లమెంట్ సభ్యుడు స్వర్గీయ కింజేరపు ఎర్రన్నాయుడి కుమారుడు ప్రస్తుత లోక్ సభ సభ్యుడు కింజేరపు రామ్మోహన్ నాయుడు శ్రీకాకుళం పౌరుషాన్ని ,వంశధార వేగాన్ని తన ఆవేశ హిందీ ప్రసంగం లో దట్టించి ఎదుటిపక్షం గుండెలలో రామ్ఢోళ్ళు మోగించి ,ఆంధ్రాకు గత నాలుగేళ్ళుగా జరిగిన అన్యాయాన్ని ఏకరువుపెట్టి అధికార పక్షాన్ని నిరుత్తరులను చేసి సెభాష్ అనిపించాడు .
పాపం హో౦ మంత్రి రాజనాధుడు ప్రశ్నలకు సమాధానాలిస్తే అమిత్ షా ,మోడీలు ఎక్కడ చీవాట్లు పెట్టి టికెట్ రాకుండా చేస్తారో నని అతి జాగ్రత్త పడి,ఆకుకు అందకుండా ,పోకకు పొందదకుండా కప్పదాట్లతో ,అలనాటి రామాయణ కదా సాగరం తో హుందాను కూడామరచి బాధ్యతను విస్మరించి మోడీ కనుసన్నలలో మెలగుతూ , మనస్సంతృప్తి కలిగిస్తూ ఆంధ్రా ఏమైనా సరే మనల్ని చూసి నవ్వుకున్నా ఫర్లేదు అనుకుని ముక్కస్య ముక్కః గా మాట్లాడి బరువు దించుకున్నాడు .నిన్నటి రోజు ప్రసంగాలలో సింహభాగం లాక్కున్న ప్రధాని ,హావభావాలతో ,వెకిలి నవ్వులతో ,ఇచ్చిన మాట జోలికి పోకుండా చేస్తామన్న సాయం సంగతి చెప్పకుండా ,ఆంధ్రాకు జరిగిన అన్యాయం గూర్చి ప్రస్తావించకుండా ,ఏవేవో కాకమ్మ కబుర్లు చెప్పి ,ఆనాడు మట్టికుండలో మట్టీ ,నీళ్ళు తెచ్చి అమరావతి లో కుమ్మరించినట్లు ,ఇప్పుడు మసిపూసి మారేడు కాయ చేసి హాం ఫట్ అని పించి ,బాబుది యు టర్న్ అని దెప్పి ,అసలు పాపమంతా కాంగ్రెస్ దే అని నెట్టేసి ,తన వాగ్దానాలజోలికి వెళ్ళనే వెళ్ళకుండా, మూక బలపు చప్పట్లతో మాట్లాడి ,మూక ఓటుతో అవిశ్వాసాన్ని నీరుగార్చి విజేత నని పించాడు .
పాపం పవన్ జనం లోకి రాలేక పెరిగిన గడ్డం తో ట్విట్టర్ లో తిట్ల దండకం లంకించుకున్నాడు తెలుగు దేశంపై . లోక్ సభ సీట్లకు హంగామాగా హడావిడి గా రాజీనామా చేయించి ,తన పార్టీ వాళ్లకు వాయిస్ లేకుండా చేసి ,వాళ్ళను ‘’భభ్రాజమానం భజగోవి౦దాలు’’గా, ‘’రెంటికీ చెడ్డ రేవణ్ణలు ‘’గా మార్చి తన అసహనానికి ,భావి దృష్టి లేనిదానికి గొప్ప ప్రత్యక్ష ఉదాహరణగా మిగిలి పోయిన ఫ్యాన్ గుర్తాయన ఇవేవీ పట్టించుకోకుండా ,ఓదార్పు కౌగిలింతల్లో తేలిపోతూ వీలున్నప్పుడు నాలుగు బూతులు బాబుని తిడుతూ ,కాషాయం నీడన తలదాచుకొంటూ శిక్ష తప్పించుకోటానికి అంట కాగుతూ ,మోడీ గ్రీన్ సిగ్నలిస్తే తానే కాబోయే సి .ఎం .అని పగటికలలు కంటూ కాలక్షేపం చేస్తున్నాడు . మాటల్లో, చేతల్లో హావభావాలలో ,నవ్వి౦త లలో జే.సి ..పెట్టింది పేరు .ఎందుకు ఎప్పుడు అలుగుతాడో ఆయనకే తెలీదు .అవిశ్వాసం ముందు ఇదే నాటకం ప్రదర్శించి’’దువ్వించుకొని’’ రాజీపడి ,మళ్ళీ ఇవాళ మీసం మెలేస్తున్నాడు .నమ్ముకుంటే నట్టేట ముంచినట్టు గా ఉంటున్నాడని చెవులు కొరుక్కుంటున్నారు .
ఇలా’’ జుమ్లా ఫిదా ‘’ నాటకం లో ఎవరిపాత్ర వాళ్ళు పోషించి రక్తి కట్టించారు .దీని వల్ల జరిగేదేమిటి ?అని సామాన్యుని మాన్య ప్రశ్న .దీనికెవ్వరూ సమాధానం చెప్పలేరు .’’శుష్క ప్రసంగాలు శూన్య హస్తాలు’’గా నే మిగిలింది అని ‘’ఆంధ్రా ఆం ఆద్మీ’’ గొణుగుడు. నాలుగేళ్ల క్రితం సీనే మళ్ళీ రిపీట్ అయింది .నాడు వద్దన్నా ,తలుపులు మూసి ,చీకట్లో మెజార్టీఉందో లేదో అన్న బ్రహ్మ పదార్ధంగా, చీల్చి చి౦చిపారేస్తే కాంగ్రెస్ , ‘’మై హూనా’’అంటూ అంగలార్చి అక్కున చేర్చి ,ఊపిరాడనీయక మట్టీ మశాన్నమే వెదజల్లిన మోడీ తానూ’’ చేయిచ్చి’’ ఎవరొచ్చినా ఇంతేభాయ్ ‘’అన్న సత్యాన్ని తెలియ జేశాడు .మోసపోవటం మనవంతు అయిపోయినట్లు చరిత్ర సాక్ష్యం చెబుతోంది .అందరూ జుమ్లా గాళ్ళే అయి మనల్ని ఫిదా చేశారు .
మీ- గబ్బిట దుర్గా ప్రసాద్ -21-7-18 –ఉయ్యూరు
—

