సాలగ్రామ స్వయంభూ క్షేత్రం శ్రీ లక్ష్మీ అనంత పద్మనాభ స్వామి దేవాలయం-వికారాబాద్
మార్కండేయ క్షేత్రం
తెలంగాణా రంగారెడ్డి జిల్లా వికారాబాద్ అనంత గిరి గుట్టపై అందమైన ప్రకృతి
లో శ్రీలక్ష్మీ అనంత పద్మనాభస్వామి కొలువై ఉన్నాడు .స్కంద పురాణం, విష్ణు పురాణాల ప్రకారం ఈ ఆలయాన్ని మార్కండేయ మహర్షి ద్వాపర యుగం లో నిర్మించాడు .అందుకే’’ మార్కండేయ క్షేత్రం’’ అనీ అంటారు.ఇక్కడి ప్రశాంత వాతావరణానికి పులకించిన మార్కండేయముని తపోసాధనకు వచ్చాడు.అనంతగిరి పై ఉన్న ఒక గుహ ద్వారా యోగ సాధన వలన నిత్యం కాశీకి వెళ్లి గంగాస్నానం చేసి వచ్చేవాడు . ఒకసారి ద్వాదశి ఘడియలలో అనివార్య కారణాల వలన వెళ్ళలేక పోయాడు .కలలో శ్రీ మహావిష్ణువు దర్శనమిచ్చి ,గంగానదిని ఇక్కడే ప్రవహించేట్లు చేసి ఆయన స్నానాదులకు అవకాశం కలిపించాడు . ఏటా ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు గంగానది ఈ పుష్కరిణి లోకి ప్రవహించి పవిత్ర పరుస్తుందని విశ్వాసం .శేషుని శీర్షభాగం తిరుపతి ,మధ్యభాగం అహోబిలం అయితే తోకభాగం అనంతగిరి అంటారు .
ముచుకుంద వరదుడు
రాజర్షి ముచుకు౦ద మహర్షి రఘువంశంలో పుట్టిన మాంధాత కుమారుడు .క్రూర రాక్షసులతో దేవతల పక్షాన వెయ్యేళ్ళు పోరాడాడు .దీనికి సంతసించిన దేవేంద్రుడు ఆయనకు ఏమి వరం కావాలో కోరుకోమ౦టే తాను వెయ్యేళ్ళు యుద్ధాలు చేసి అలసిపోయాను కనుక వెయ్యేళ్ళు నిద్రపోవటానికి అవకాశం, అనువైన చోటు కలిపించమని ,తనకు నిద్రాభంగం చేసినవారు తనకంటి మంటకు భస్మమై పోయేట్లుగా వరం కోరాడు .తధాస్తు అని అనంతగిరి గుహలో హాయిగా నిద్రపొమ్మని సలహా ఇచ్చాడు ఇంద్రుడు . .దాని ప్రకారమే ముచుకు౦దుడు ,ఈ అనంతగిరి గుహలోకి వచ్చి అలసట తో నిద్ర పోయాడు . .కాలయవనుడు అనే రాక్షసుడు ద్వారకానగరం పై దండెత్తి స్వాధీనం చేసుకోగా ,వాడిని మామూలు పద్ధతిలో చంపటం కుదరదని తెలిసి ,మాయోపాయంగానే చంపాలని నిర్ణయించి వాడికి భయపడినట్లు నటించి శ్రీ కృష్ణ బలరాములు ఉపాయంగా తప్పించుకొని ఈ అనంతగిరి కి వచ్చి ఈ గుహలో దాగారు .ఇక్కడ ధ్యానం లో ఉన్న మార్కండేయమునితో గుహలో నిద్రిస్తున్న ముచుకు౦దుడే శ్రీ కృష్ణుడు అని వాడికి చెప్పి లోపలి కి పంపమని చెప్పారు .వీరిద్దరినీ వెంబడించి వచ్చిన కాలయవనుడు ఈ గుహలో కి ప్రవేశించి మార్కండేయ ముని సూచనతో ముచుకు౦ద మహర్షి నిద్రించే గుహలోకి ఆర్భాటంగా ప్రవేశించి ఆయనకు నిద్రాభంగం కలిగించగా ఆయన కంటిమంటకు కాలి బూడిదయ్యాడు . .ముచుకుంద మహర్షి లోక కంటకుడైన కాలయవనుని నాశనం చేసి నందుకు శ్రీకృష్ణుడు మెచ్చి ఆయన ఉగ్రత్వాన్ని ఉపసంహరించటానికి ఆయనకు అనంత పద్మనాభ స్వామిగా దర్శనమిచ్చాడు .అంతేకాదు ముచుకు౦దమునిని శాశ్వతంగా నదీ రూపం పొంది లోకానికి ఉపకారం చేయమని వరమిచ్చాడు .అందుకే ‘’ముచుకు౦ద వరద గోవిందో హరి’’అని భజనల్లో అనటం మనకు తెలుసు .
మరో కధనం ప్రకారం ముచుకు౦దుదు అనంత పద్మనాభస్వామి పాదాలను తన కమండల జలం తో కడిగాడని ,ఆ జలమే ఈ అనంత గిరులలో ‘’ముచుకుందనదీ’’ రూపాన్ని పొంది ,కృష్ణానదికి ఉపనది యై ప్రవహించిందని అంటారు .ఆ ముచుకుంద నదే ఇప్పుడు ‘’మూసీ నది ‘’గా పిలువబడుతోంది .హైదరాబాద్ లో మూసీనది కంపు మూడు మైళ్ళ నుంచే వికారం కలిగిస్తుంది .అంతటి పవిత్రనది కల్మషమై నేడు దుర్గంధ భూయిస్టంగా మద్రాస్ లోని ‘’ కూం రివర్ ‘’కంపుకు రెట్టింపు కంపుతో వొడలు జలదరించేట్లు చేస్తోంది .ఈ కంపు కత వదిలేసి ముందుకు పోదాం .
స్వయంభూ శిలా విగ్రహమూర్తి
ముచుకు౦దునికి దర్శనమిచ్చిన నవాడు తనపై ఉపేక్ష ఎందుకు చేశాడో అని మార్కండేయ ముని వ్యధ చెందుతుండగా , అనుగ్రహం తో ఈ అనంతగిరిలోనే అనంత పద్మనాభస్వామి మార్కండేయ మహర్షికి దర్శనం అనుగ్రహించి ఆయనను ,తన చక్రం గా మార్చుకున్నాడు .తాను స్వయంభూ సాలగ్రామ శిలారూపం లో ఇక్కడే వెలసి భక్తుల మనోభీస్టాలను నెరవేరుస్తూ ఉంటానని మునికి అభయమిచ్చాడు . అమ్మవారు లక్ష్మీదేవి .అందుకే స్వామి శ్రీ లక్ష్మీ అనంత పద్మనాభ స్వామి గా ప్రసిద్ధుడు .
నిజాం కట్టిన దేవాలయం
నాలుగు వందల ఏళ్ళక్రితం నిజాం నవాబు ఇక్కడి ప్రశాంతతకు ముచ్చటపడి విశ్రాంతి తీసుకున్నాడు .స్వామి ఆయనకు కలలో కన్పించి ఇక్కడ తనకు దేవాలయం నిర్మించమని కోరగా హైదరాబాద్ నవాబు ఆలయ నిర్మాణం చేశాడు అనంత పద్మనాభ స్వామికి .
తెలంగాణా ఊటీ అనంతగిరి
అనంతగిరిని ‘’తెలంగాణా ఊటీ ‘’అని పిలుస్తారు .అంతటి ఆహ్లాద మైన చల్లటి వాతావరణం ఇక్కడ ఉంటుంది .హైదరాబాద్ కు 75 ,వికారాబాద్ కు 5 కిలోమీటర్ల దూరం లో అనంతగిరి ఉంది .ఇక్కడి పుష్కరిణీ స్నానం అనంత ఫలదాయకం .దగ్గరలో శివాలయం ఉన్నది .పుష్కరిణి కి వెళ్ళేదారిలో మార్కండేయమహర్షి తపస్సు చేసిన తపోవనం ,దేవాలయం ఉన్నాయి .అనంతపద్మనాభాలయం గర్భగుడిలో ఎడమవైపు మార్కండేయముని కాశీకి వెళ్ళిన బిలమార్గం ఉన్నది .ఆలయం బయట అతి పెద్ద శ్రీ ఆంజనేయ విగ్రహం ,గరుడ విగ్రహాలు సుదూరం నుంచి భక్తులను ఆకర్షిస్తాయి . సాలగ్రామ స్వయంభూ శ్రీ లక్ష్మీ అనంతపద్మనాభ స్వామి దర్శనం సకల విధ శ్రేయోదాయకం .
రేపు 23-7-18 సోమవారం తొలి ఏకాదశి (శయన ఏకాదశి )శుభాకాంక్షలతో
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -22-7-18 –ఉయ్యూరు
—

