శ్రీ వి౦ధ్య వాసిని బీజసాన్ దుర్గా దేవి ఆలయం –హోషంగాబాద్
మధ్యప్రదేశ్ లో నర్మదా పురం అనబడే హోషంగా బాద్ నర్మదానదీ తీరాన ఉన్న అందమైన పట్టణం .ఇక్కడున్న నర్మదానది ఘాట్లు చూపరులను విశేషంగా ఆకర్షిస్తాయి .ముఖ్యంగా ‘’సెతాంగి ఘాట్ ‘’అందాలొలక బోస్తూ పెద్ద ఆకర్షణగా నిలుస్తుంది .హోషా౦గ్ షా అనే మొదటి మాల్వా రాజు పేరిట నర్మదానగర్ ను హోషంగాబాద్ గా మార్చారు.నర్మదా నది ఒడ్డునున్న సత్సంగ భవనం లో సాదు ,సంతులు తరచుగా సమావేశమై ధర్మ చింతన చేస్తూ ప్రజలకు మార్గ దర్శనం చేస్తారు .ముఖ్యంగా తులసీ దాసు రచించిన రామ చరితమానస్,భగవద్గీత లపై చర్చలు జరుగుతాయి .దగ్గరలో పచ్ మర్హి అనే హిల్ స్టేషన్ కూడా ఉంది .ఇక్కడే సాత్పురా టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ ఉంది .అందమైన ప్రకృతి ని అనుభవించటానికి యాత్రికులు పెద్ద సంఖ్య లో వస్తారు .
హోషంగా బాద్ కు 35 కిలోమీటర్ల దూరం లోని సల్కన్ పూర్ లో శ్రీ దుర్గా దేవి దేవాలయం ఉంది .భోపాల్ నుంచి కూడా ఇక్కడికి చేరుకోవచ్చు .ఇది వి౦ధ్యవాసిని బీజసాన్ దేవి యొక్క సిద్ధ పీఠం .వెయ్యిమెట్లున్న కొండపై వెలసిన మాతను దర్శించటానికి నిత్యం వేలాది భక్త జనం వస్తారు .ఆమె కరుణ ఉంటె తమజీవితాలకు ఏ ఢోకా ఉండదని వారి విశ్వాసం .నవరాత్రి దినాలలో సల్కాన్ పూర్ లో అమ్మవారికి బ్రహ్మాండమైన ఉత్సవాలు నిర్వహిస్తారు .లక్షలాది భక్తులు సందర్శించి ధన్యులౌతారు .
పురాణకధనం ప్రకారం రక్తబీజ రాక్షస సంహారం చేశాక అమ్మవారు ఇక్కడికి వచ్చి విజయ దరహాసం తో కూర్చున్నది .కనుక ఆయుద్ధ అవశేషాలు ఇక్కడ గోచరిస్తాయి .’’సల్కాన్ దేవి ధాం రోప్ వే’’కూడా ఇక్కడ ఉండటం తో యాత్రికులు కొండమెట్లు ఎక్కి ఆయాసపడకుండా తేలికగా దేవాలయానికి చేరి అమ్మవారిని దర్శించుకో వచ్చు .అమ్మవారి శక్తి పీఠాలలో ఒకటి అయిన ఈ వి౦ధ్య వాసిని బీజసాన్ దుర్గా మాత క్షేత్రం తప్పక దర్శించి తరించాల్సినది .
మీ- గబ్బిట దుర్గా ప్రసాద్ -26-7-18 –ఉయ్యూరు
—

