కోన సీమ అందాలకు వేదపవిత్ర సొబగులు సౌరభాలు అలదిన ఆహితాగ్నులు -3
తీరాంద్ర లో అగ్ని స్టోమం అనేక రకాల అగ్ని చయనం తో చేస్తారు .దీనినే సూక్ష్మ౦ గా ‘’చయనం ‘’అంటారు .వేలాది ఇటుకలను దీనికి వాడుతారు .అడుగున స్యేన అంటే ఎగిరే గరుడ పక్షి ఆకారం గా చేస్తారు .దీన్ని స్యేన చితి అంటారు .అయిదు అంతస్తులలో ఇటుకలుపేర్చి ,అగ్ని హోత్రం చేయటానికి అనువుగా తయారు చేస్తారు .అగ్ని దేవుడికి ,పురుష ప్రజాపతికి హవిస్సులు సమర్పిస్తారు .శుక్ల యజుర్వేదానికి చెందిన శతపధ బ్రాహ్మణం అగ్ని చయనం పై విస్తృతంగా వివరించింది .పాశ్చాత్యులకు ఇది బాగా అర్ధమైన విషయం .చయనం చేసేవారు అగ్నిని తీసుకురావటానికి’’ ఉక్ష’’ అనే బూర్లమూకుడు లాంటి దానిని ఉపయోగిస్తారు .కానీ కోనసీమ బ్రాహ్మణ్యం తైత్తిరీయ విధానాన్నే ఉపయోగిస్తారు .అగ్ని చయనం అందర్నీ విశేషంగా ఆకర్షిస్తుంది .1975 లో కేరళ నంబూద్రి బ్రాహ్మణులు చేసిన అగ్ని చయనాన్నిఫ్రిట్స్ స్టాల్ ,రాబర్ట్ గార్డే నర్ లు రెండుభాగాల అతి పెద్ద గ్రంథంగా చిత్రాలతో సహా ముద్రించారు .దీనినే ‘’అల్టార్ ఆఫ్ ఫైర్’’ సినిమాగా కూడా తీశారు .దీన్ని’’ అతి ప్రాచీన సజీవ సాక్షాత్కార చివరి క్రతువు’’గా పేర్కొన్నారు . ఆంధ్రాలోమాత్రం ఏమాత్రం మార్పులు లేకుండా అగ్ని చయనం చేస్తూనే ఉన్నారు .చయనం చేసినవారిని గౌరవంగా చయనులు అని సంబోధిస్తారు.
అగ్ని చయనం తర్వాత ఆంధ్రలో ‘’వాజపేయం ‘’ప్రాముఖ్యత పొందింది .17 మంది ప్రజాపతులకు హవిస్సులు అందజేసే కార్యమిది .17 రోజుల దీక్షతో చేస్తారు .ప్రతిరోజూ సుర ను బియ్యం ,లేక బార్లీ లేకచిరు ధాన్యాలను పులియబెట్టి తయారు చేస్తారు .దీన్నే కిణ్వన ప్రక్రియ లేక ఫెర్మెంటేషన్ అంటారు .చివరి రోజు సోమలతను పిండి సోమ రసం తయారు చేసి మంత్రాలను చదువుతూ ఆహుతులుగా సమర్పిస్తారు .ఒకప్పుడు నల్లమేకను బలి ఇచ్చేవారు .యజమాని, భార్య కలిసి యూప స్థంభం ఎక్కి తమకు అమరత్వం సిద్ధి౦చి౦దని ప్రకటించటం ఇందులో పరాకాష్ట . దీనికి పైమెట్టుగా’’ పౌ౦డరీక౦’’అనే క్రతువు ఉంది .ఇది 40 రోజుల దీక్షతో చేసేది.ఈ క్రతువులన్నీ ఎన్నో రోజుల ముందు ఆలోచన,,వస్తుసేకరణ ,తగిన ప్రణాళిక లతో చేయాల్సినవి .వీటికి హోత, అధ్వర్యుడు ,ఉద్గారుడు ,బ్రాహ్మణులు కావాలి .మహావేది నిర్మాణం చేయాలి .ఎంతో డబ్బు ఖర్చుతో కూడుకున్న వ్యవహారం .అందరికీ వారి వారి అర్హతను బట్టి దక్షిణ సమర్పించాలి .పై నలుగురిలో ప్రతి ఒక్కరికీ ముగ్గురేసి సహాయకులు కావాలి .అంటే 16 మంది ఉండాలి 17 వవారు కొన్ని ప్రత్యేక విధులు చేస్తారు .18 వ వారు సదస్యం నిర్వహిస్తారు .వీళ్ళందర్నీ యజమాని అందులో నిష్ణాతులైన వారి సలహాతో ఎంపిక చేస్తాడు .ఇతనినే సోమప్రవాకుడు అంటారు .ఇందులో ఏమాత్రం దోషం జరిగినా తాను పాపకూపం లో పడినట్లు భావిస్తారు .
ఆహితాగ్నికి ఒకరు సహాయంగా ఉంటె చాలు. కొడుకు కాని తమ్ముడుకాని దగ్గర బంధువుకాని పనికొస్తాడు .ఇష్టిని పాడ్యమి ,పౌర్ణమి నాడు చేస్తారు .పంటలకాలం లో ‘’అగ్రయనం’’చేస్తారు .దీనికి యజమాని ఆధ్వర్య , హోత,బ్రాహ్మణ ,ఆగ్నీధ్ర లను ఏర్పాటు చేసుకోవాలి .ఆగ్నీధ్ర అధ్వర్యుడికి సాయం గా ఉంటాడు .అగ్రహారం లోని ఇతర ఆహితాగ్ని లను దీనికి వినియోగించుకో వచ్చు .ఆధ్వర్యుడు ,హోతా ఇద్దరు ఉంటే చాలు అని ఆపస్తంభ సూత్రాలు చెబుతున్నాయి
కోన సీమలోని శ్రీరామ పురం,ఇరగవరం ,కామేశ్వరి,వ్యాఘ్రేశ్వరం అగ్రహారాలలో ఆహితాగ్నులు అగ్ని హోత్రం అంతటి పవిత్రులు . వీరి గురించి వరుసగా తెలుసుకొందాం .
సశేషం
27-7-18 శుక్రవారం గురుపౌర్ణమి వ్యాస జయంతి శుభా కాంక్షలతో
మీ- గబ్బిట దుర్గా ప్రసాద్ -26-7-18 –ఉయ్యూరు
—

