కోన సీమ అందాలకు వేదపవిత్ర సొబగులు సౌరభాలు అలదిన ఆహితాగ్నులు -9

కోన సీమ అందాలకు వేదపవిత్ర సొబగులు సౌరభాలు అలదిన ఆహితాగ్నులు -9

2-   ఆహితాగ్ని – బ్రహ్మశ్రీ దువ్వూరి యజ్ఞేశ్వర పౌ౦డరీక సోమయాజులు  గారు -2

1922 లోశ్రీమతి సూర్య గారిని వివాహమాడిన దువ్వూరి యాజులుగారు 67 ఏళ్ళ వైవాహిక జీవిత సౌఖ్యం అనుభవవించి 10 మంది సంతానం పొందారు .వైవాహిక జీవితం పై పూర్తి  నమ్మకం,గౌరవం కలవారాయన .వివాహం లో పరమార్ధం ,శ్రర్ధ ,బ్రహ్మ లోకం ఉన్నాయని అంటారు .వివాహ వేడుక దంపతులకే కాక బంధు మిత్ర అభిమానులకూ ఆన౦ద  దాయకం కన్నుల పండుగ  .పెళ్లి చూపులలో మొదలైన చూపులు అయిదు రోజుల వివాహం లో ఎన్నో సార్లు భార్యను భర్త చూస్తాడు .ఆ చూపుల్లో ఆమె అంద చందాలనుకాక , ఆమె అంతస్సౌన్దర్యాన్ని తెలుసుకొనే ప్రయత్నం చేస్తాడు .అప్పుడే అది నిజమైన చూపు అవుతుంది .ఆమెకు 7 ఆయనకు 14 ఏళ్ళ వయసులో వివాహమైంది .యాజులుగారి తండ్రి, మేనమామ సంబంధం ఖాయం చేశారు. గౌతమి గోదావరిపై అన్ని వసతులు, రోడ్డు, పడవ ప్రయాణ సౌకర్యం ఉన్న  నేదునూరు కు చెందిన దూరపు బంధువు ఆమె .‘’ఆ అయిదు రోజుల పెళ్లి మరువరాని అనుభవం ‘’అంటారు ఆయన .మామగారు వంట చేసేవాడు అత్తగారుకాదు. మిఠాయిలు వండేవాడు.అవి ఎంతో పవిత్రమైన రోజులు .ఆయనకు కట్నంగా 116 వెండి రూపాయలిచ్చారు .ఆయన బామ్మర్ది వాటిని అన్గోస్త్రం లో మూటకట్టి మోసుకు వచ్చాడు .అప్పుడు ఒక రూపాయి అంటే రెండున్నర తులాల వెండి ..పెళ్లి కొడుక్కి పట్టు పంచలు ఆడపడుచుకు తలా13 రూపాయలు ఇచ్చారు .పెళ్లి కుమాతె నగలకోసం యాజులుగారు 200 రూపాయలు ఖర్చు చేసి వడ్డాణ౦ , ,నెక్లెస్ ,గాజులు చేయించారు .

యాజులుగారు భార్యకు తానే గురువై మంత్రార్ధాలు వివరిస్తూ  విధులకు ఎలా తోడ్పడాలో బోధించారు .అందులో ఆడవారికోసం చాలా ప్రత్యేక మంత్రాలున్నాయి .వీటిని భట్టీయం వేయాల్సిందే .పెళ్లి అయిన 16 ఏళ్ళకు యజ్ఞానికి ముహూర్తం ఏర్పాటు చేసుకున్నారు .ఆమెకు అగ్ని స్టోమ మంత్రాలు నేర్పారు .ఆమె చనిపోయిన నాలు గేళ్ళ తర్వాత సోమి దేవమ్మ గా ,ఆమె అంత్యేస్టికి పునర్ధహనం చేశారు .ఆహితాగ్ని భార్యకు ఇలాచేయటం సంప్రదాయం .ఆమె తనలాగా సోమపానం చేయక పోయినా దాని ప్రభావం ఆమెకు లభించాయి అని యాజులు గారు వివరించారు .ఆమె చనిపోయే దాక భర్త వదిలేసిన భోజనం అంటే ‘’ఉచ్చిస్టం ‘’తినేది .ఈ నియమాన్ని జీవితా౦త౦ పాటించిన సాధ్వి .

24 ఏళ్ళకే విద్యపూర్తి  చేసిన యజులుగారు మొదట కొడుకును తర్వాత కుమార్తెకు తండ్రి అయ్యారు ‘’నాభార్య 14 కాన్పులు కన్నది .అన్నీ ఇంట్లోనే .ఎరుకలసాని వచ్చి 4 రూపాయలకే పురుడు పోసేది  .ఆకాలం లో మందులు , సాధారణమైనవి ,చవక, తేలికగా దొరికేవి .నలుగురు పిల్లలు చిన్నతనం లోనే చనిపోయారు .’’బహు సంతానానికి తండ్రి గా గర్వపడే వాడిని.ఒక సారి హైదరాబాద్ లో  నా సంతానం సంగతి తెలిసిన ఒక స్త్రీ అమాంతంగా నాపాదాలను స్పృశించి కళ్ళకు అద్దుకుని నమస్కారం చేసింది .అగ్రహారాలలో ఉండేవారికి  కనీసం 20 మంది మనవాళ్ళు మనవ రాళ్ళు ఉండటం  ఆనాడు సహజం, సమంజసం .నాకు 40 మంది ఉండటం నా అదృష్టం ‘’అని చెప్పారు .

తేలికగానే అయిదుగురు ఆడపిల్లల వివాహాలు చేశారు వరకట్నం ను ఆక్షేపించే వారిని లెక్క చేసేవారు కాదాయన .1940 -50 దశకం లో డెల్టా ప్రాంతమంతా ఆయన పేరు మారు మోగేది .1990 నాటికి పరిస్థితులు చాలామారిపోయాయని ,పెళ్ళిళ్ళు కుదర్చటం కష్టమై పోతోందని బాధ పడ్డారు .విలువలు పతనమయ్యాయని అన్నారు .వేదం ,యజ్నయాగాది క్రతువులపై  జనం లో ఆసక్తి తగ్గిందని వ్యధ చెందారు .తన కుటుంబంలోనే మనవరాళ్ళ పెళ్ళిళ్ళు   చేయటం తనకు ఆశక్యంగా ఉందని కారణం కట్నకానుకలు విపరీతంగా పెరగటమే నని అన్నారు .

1936 లో యాజులుగారబ్బాయి సర్వేశ్వర సోమయాజులు ఆహితాగ్ని అవుతాడని ఆశించారు .19 ఏళ్ళప్పుడే తండ్రివద్ద  వేదం పూర్తి చేసి ,పెళ్లి చేసుకొని ,గొర్తి వారి వద్ద చేరి  ఘన పాఠీ అవుదామనుకొంటే ఈశ్వరానుగ్రహం వేరుగా ఉండి ,శివ పురాణం పై ఆసక్తిపెరిగి ,తరచుగా కాశీవెళ్లి   గంగా స్నానం విశ్వేశ్వర దర్శనం చేస్తూ,కోన సీమలో శుభార్యాలలో సంభావన తీసుకొంటూ శతరుద్రీయం సాధించి వేద పండితుడై జీవనం గడపాల్సి వచ్చింది .దీనిపై అతన్ని కదిలిస్తే ‘’యోగం దైవం ఈశ్వర ఈశ్వర ‘’అనేవాడు శివారాధనమే ముక్తి నిస్తుందని నమ్మాడు .యాజులు గారు 25 ఏళ్ళు ఈకొడుకు పేరు ఎక్కడా ఎత్తలేదు .సర్వేశ్వర ఇద్దరు కొడుకులు వేదం నేర్వలేదు. కాని ఒకమ్మాయిని మాత్రం వేద పండితుడికిచ్చి పెళ్లి చేశాడు .వీళ్ళ కొడుకు ఇరగవరం వెళ్లి ముత్తాత గుళ్ళపల్లి సీతారామ శాస్త్రి గారి వద్ద  అధ్యయనం చేశాడు..

‘’ నేదు నూరు ఋషి’’గా ప్రసిద్ధులైన లంకా వారు సర్వేశ్వరను ఆపస్తంభ సూత్రాలు బోధించమని కోరినా వినలేదు .దువ్వూరి కుటుంబలో ఎగుడు దిగుడులు  వచ్చి శ్రౌతమార్గం గాడి తప్పింది .సర్వేశ్వర శివ భక్తుడు అనిపించుకున్నా పౌరాణికుడు,వేదపండితుడు ఘనాపాఠీ కాకపోయినా తిరుపతి దేవస్థానం ఆయనకు వృద్ధాప్యపు పెన్షన్ 1994,లో అందజేసింది. ఆయన  వేదవిధి  –హిందూ మత౦   మధ్య క్రాస్ రోడ్ పై ఉండిపోయాడు .20 07 లో అకస్మాత్తుగా అయన నిత్యాగ్ని హోత్రునిగా  అగ్ని స్టోమం చేయాలని అనుకొన్నాడు .అదే సమయం లో చిన్నతమ్ముడు సూర్య ప్రకాశ అవధాని ,భార్య కనకదుర్గ అదే నిర్ణయానికి వచ్చారు .కానీ ఈ ఇద్దరూ’’ వైశ్వ దేవం’’ దాటి ముందుకు పోలేకపోయారు .యాజులుగారి రెండు నాలుగు అయిదవ కుమారులు వేదమార్గం వదిలి లౌకికం లో ఉన్నారు .

యాజులు గారి అంతిమ యాత్ర

1 996 డిసెంబర్  .ఒక  రోజు యాజులు గారి భార్య  సూర్య ఆవూళ్ళో సామవేదం వారింట్లో జరిగిన పెళ్ళికి వెళ్లి రాత్రి ఆలస్యంగా ఇంటికి చేరి భర్తకు,ప్రోదున్నే లేచ్చి కాలకృత్యాలతర్వాత తులసి కోట చుట్టూ ప్రదక్షిణం చేసి నవరాత్రుల సందర్భం గా ప్రత్యేక ప్రసాదం వ౦డాలనుకొన్నది  . ఇంతలో గోడకు ఆనుకొని ఆమె  పడి పోయారు .అప్పుడాయన అగ్ని హోత్రం చేస్తున్నారు .వెంటనేబయటికి వచ్చి ,అప్పటికే ఆమె ప్రాణాలు అనంత వాయువులలో కలిసిపోతున్నాయని గ్రహించి ఆ సమయం లో చదవాల్సిన కర్మ మంత్రాలు చదివారు .అవి తైత్తిరీయ ఉపనిషత్ మంత్రాలు .ఈమెకు ప్రాయశ్చిత్త కార్యక్రమం చేయాల్సిన అవసరం లేదు .దంపతులిద్దరూ అప్పటికే దీపావళి నాడు అగ్రయనం చేసి ఉన్నారు .పునిస్త్రీ మరణం పొందినదుకు కాలవదగ్గర మూసివాయనం జరిపారు .పత్నిగాబ్రహ్మమేధం చేశారు .అప్పటికే కళ్ళు కనిపించని ,51 ఏళ్ళుగా ఇష్టి,సోమయాగం చేసిన ఆయన ఆమె చితివడ్డ  నిశ్చేస్టంగా  మౌనంగా ఉన్నారు ‘’అగ్నిని ఆమె తనతో తీసుకు వెళ్ళింది .నాకు వంటింటి అగ్గిపుల్లలే మిగిలాయి ‘’అని విచారించారు .62 ఏళ్ళ నిండు దాంపత్యం విచ్చిన్నమైంది .అగ్నికి ఆమె పార్ధివ దేహం ఆహుతైంది .ఆమెఅస్తులకూ పునర్దహనం చేశారు .

చాలాకాలం క్రితం  అగ్ని స్టోమం చేసి, ఆయన ఒక సారి గోదావరి జిల్లా లో జరిగిన వేద సభకు శ్రావణ మాసం లో వెళ్ళారు .అప్పుడు ఒక ముసలాయన ‘’నువ్వేనా యజ్ఞం చేసిన వాడివి ?’’అని అడిగాడు .’’నేనే ‘’అన్నారు .’’చాలా డబ్బు అనవసరంగా ప్రయోజనం లేకుండా ఖర్చు చేశావు ‘’అనగానే యాజులుగారు నివ్వెరపోగా ఆయన ‘’భయపడకు .నీకు 80ఏళ్ళు దాటాక నీఅగ్ని హోత్రాన్ని నీ భార్య  తీసుకు వెడుతుంది ‘’అన్నాడు .పెద్దాయన ఆనాడే నిజం చెప్పాడు అనుకున్నారిప్పుడు .తన నాయనమ్మగారు కూడా తాతగారి కంటే ముందే చనిపోయారు .ఆమె అత్తగారూ ,తండ్రిగారి పెద్దన్న భార్యా అలాగే పోయారు .

భార్య మరణం తర్వాత యాజులు గారు రాత్రి పూట భోజనం చేయకుండా మధ్యాహ్నం  ఫలహారం మాత్రమే చేసేవారు  .చివరికాలం లో 86 వ ఏట ఒకరోజు ఆయన తనతల్లిని జ్ఞప్తికి తెచ్చుకున్నారు .ఒక రోజు తననుఆమె  ఒక వింత ప్రశ్న అడిగిందట ‘’ఒరే నాయనా !దేవుడు నన్ను మరచి పోయాడేమోరా ? ఎవరైనా ఆయనకు జ్ఞాపకం చేస్తే బాగుండు ‘’అని .ఇప్పుడు ఆ మాటలు  ఆయన తలచుకున్నారు .2005 జులై 30 న శ్రీరామ పురం లో ఆయన పేరిట ఏర్పాటు చేసిన వార్షిక వేద సభ జరిపిన నాలుగు నెలలకు  యాజులుగారు తుది శ్వాస విడిచారు .పదేల్ల క్రితం భార్య సూర్య అంత్యక్రియలు జరిపిన చోటే యాజులు గారివీ జరిపారు .

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -29-7-18 –ఉయ్యూరు

 

 

— 

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.