6-తురుమిళ్ళ రామన
‘’ప్రబంధ యుగానికి చెందినవాడైనా ,మరుగునపడ్డ మాణిక్యం –శేష ధర్మాలను ప్రబంధంగా రాసిన తురుమిళ్ళ రామన ‘’ అని వ్యధ చెందారు బిరుదరాజువారు .ప్రాచీనులలో తామరవల్లి తిమ్మయ్యావధాని ,వెణుతురుపల్లి విశ్వనాధకవి ,కొడిచర్ల శ్రీనివాసకవి ,కానాల నరసింహకవి,ఆధునికులలో చెదలువాడ సుందర రామ శాస్త్రి ,అల్లమరాజు సుబ్రహ్మణ్య కవి ,నోరి గురు లింగ శాస్త్రి ,ఎస్ శఠకోపాచారి మొదలైనవారు శేషధర్మాలను ప్రబంధాలుగా కూర్చారు .వీరందరికీ ప్రాచీనుడు తురుమిళ్ళ రామన అని రామరాజుగారి అభిప్రాయం .కోడి చెర్ల ,కానాల వారి గ్రంధాలు ముద్రి౦ప బడలేదని మిగిలినవారివన్నీ ముద్రితాలేనని కానీ రామన గారి గ్రంథం అముద్రితం అనీ రాజు గారు ఉవాచ .కాలం 16వ శతాబ్దం .వనపర్తి సంస్థానం వారు ఆంద్ర సారస్వత పరిషత్తుకు ఇచ్చిన వ్రాత ప్రతి ఉన్నది .
మొదటిపద్యం –
‘’శ్రీమించన్ సరసోదయుండయి ,మహా సింహాసనా రూఢుడై-దామస్పూర్తి నెసంగి తమ్ములకు సత్యానంద సంధాయియై
ప్రేమన్ జక్రమునేలు శార్వర హరున్ శ్రీరామ ధాత్రీశ భా –వామేయ ప్రథ మానుడై యలరు పద్మాదీశ్వరు న్ గొల్చెదన్ ‘’
ఆశ్వాసాంత గద్యం లో ‘’నందవర వంశ సుదాంభోనిదాన సుధాధామ ,మనీషా నిర్జిత భోగిరాజ నాగారాజామాత్య తనూజ ,సకల విద్వజ్జన జేగీయమాన సద్గుణ సాంద్ర తురుమిళ్ళరామన కవీంద్ర ప్రణీతంబైన’’హరివంశోక్త శేష ధర్మబు ‘’నందు సర్వంబును అష్టమాశ్వాసము .’’అని తనగురించి చెప్పుకొని శ్రీరామునికి అంకితం చేశాడు కవి .రెండవపద్యం లో సీతాసాధ్వి వర్ణన చేశాడు .తర్వాత రామ సోదరులగురించి చెప్పాడు .తనగురువు రఘురామ భట్టా చార్యుడని అన్నాడు .కంచర్లగోపన్న అనే రామదాసు కూడా ఒక రఘునాధ భట్టాచార్యులకు అంజలి ఘటించాడని బిరుదరాజు వారన్నారు .తర్వాత పూర్వకవులను, ఆ తర్వాత తనకు తోడ్పడిన కవిమిత్రులను పేర్కొన్నాడు .అందులో ‘’అత్యుత్తముడు భద్రిరాజు తమ్మన సూరి ‘’అన్నాడు .ఈయనకావ్యం కూడా మరుగునపడి పోవటం దురదృష్టం .
కలలో శ్రీరాముడు కన్పించిన వర్ణన పద్యం మొల్ల పద్యాన్ని పోలి ఉంటుంది .-
‘’వెడద కన్నులవాడు వేల్పురా రతనంబు నిద్దంపు మై నిగానిగలవాడు –మందహాసమువాడు,మందార శాఖి శాఖోప మాయత భుజాయుగమువాడు
మెరుగు చెక్కులవాడు ,మేలి పున్నమ చందమామ గేరెడు ముద్దుమోమువాడు –మణి కిరీటమువాడు ,మహనీయ ముక్తాసర౦బులు గల పేరురంబువాడు
తళుకు బంగరు వ్రాత దువ్వలువవాడు –జనక నందన చెంగట దనరువాడు
రమ్య భక్తాను వర్తి శ్రీరామమూర్తి –యలర సాక్షాత్కారించి యిట్లనుచు బల్కె’’.
‘’తురుమిళ్ళ కులాబుధిపూ-ర్ణరాజన్యధిరాజ రామన సుధీంద్ర భళీ
హరివంశ శేష ధర్మము –లురుమతి తెనుగించు భాగ్యమొదవెన్నీకున్ ‘’
అని మెచ్చి ‘’శేష ధర్మపావన చరితంబు తన్మహిమ వాక్పతి కైన గణింప శక్యమే’’అని చెప్పాడు జగదభిరాముడు .రామనకవి కూడా పోతన కవి లాగే దీన్ని తనకు పూర్వం ఎవరూ రాయకపోవటం తన అదృష్టం అనుకొన్నాడు .గౌతమ గోత్రీకుడైనకవి గోత్రకర్త గౌతముడని,ఆవంశం లో తిమ్మన, రామన,పెద్దఎల్లయ వగైరాలతర్వాత 12వ వాడైన లోకన్న గోపమ్మ దంపతులకు చిట్టెనమంత్రి ,పాపన ,రామనమంత్రి జన్మించారని చెప్పాడు .తర్వాత ప్రభువుల వర్ణన వారి ఉదారత రాసి వేములపుర పాలకుడైన కూనపులి చిన్ననాయకుడు కార్యనిర్వాహకర్త అన్నాడు .ఈ గ్రామం కడపమండలం పులివెందుల తాలూకాలో ఉంది ..కడప మండలం లోని కుమాళ్ళకాల్వ ,వేల్పుల పులివెందులమండలం లో పుణ్యకార్యాలు చేశాడుకవి .
రామనమంత్రి చిత్ర బంధ కవిత్వం’’ పేనటం ‘’లోనూ దిట్ట .నాలుగవ ఆశ్వాసం చివర భుజంగ ప్రయాత గర్భిత స్రగ్విణి వృత్తం రాశాడు –
‘’రాజమానోదయా రమ్య తేజోహారీ – యాజి భూ నిర్భయా ,యాత్మనానాహరీ
భ్రాజితార్యాశయా మ్రద్రు వాటీ హరీ –రాజితార్కాన్వయా రావణారీహరీ’’
పంచమాశ్వాసం చివర ఖడ్గబంధంతో ఒకపద్యం రాసి తన సత్తా ఏమిటో చాటాడు రామన కవి .-‘’ధీరవార సాహసార్క దివ్య సేవ్యభవ్యదా –దారితోగ్ర పంక్తికంఠదక్షజాభి వర్ణితా
తారహార తారకావదాతసద్గుణాస్పదా-దారుణాఘమేఘ మారుతా వనవ్రతా ‘’
ఇలాంటి ప్రతిభ, వ్యుత్పత్తులున్నతురుమిళ్ళ రామకవి ‘’హరివంశ శేషధర్మప్రబంధ కావ్యం ‘’వెలుగు చూడకపోవటం తెలుగువారి దురదృస్టమే.
ఆధారం -.–ఆచార్య బిరుదరాజు రామరాజుగారి ‘’చరిత్ర కెక్కని చరితార్ధులు ‘’-(విస్మృత కవులు –కృతులు )
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -14-5-19-ఉయ్యూరు

