8-పూడూరి కృష్ణయామాత్యుడు
భగవద్గీతకు అనువాదం తెలుగులో చేసిన పూడూరి కృష్ణయామాత్యుడు 18వ శతాబ్దివాడు .యోగానంద గురువరుని శిష్యుడను అని చెప్పుకున్నాడు .తన అనువాదానికి ‘’శ్రీ భగవద్గీతార్ధ దర్పణం ‘’అని పేరుపెట్టాడు అయితే యోగానంద అవధూత ‘’గురు శిష్య సంవాదము ‘’,ఆత్మైక్య గీత’’ద్విపద గ్రంథాలురాశాడు .పూడూరు గద్వాలకు దగ్గరున్న చారిత్రిక ప్రదేశం. జైన శైవ వైష్ణవాలకు నెలవు .అవధూతగారి రచనలు తెలంగాణలో బాగా ప్రచారంగా ఉన్నాయి –
‘’——(శిధిలం )మహిన్ జిన్మాత్రమై నిత్య శో –భా సంపన్నత చే ,త్రిమూర్తికలనన్ భాసిల్లు బ్రహ్మబు ,నెం
తే సమ్మోదమున౦ భజించి ,గురుభక్తిన్ నే కృతార్దు౦డనై-వ్యాసుం గొల్చి సరస్వతిన్ దలచెదన్ భవ్యార్ధ సంసిదికిన్’’అని మొదటిపద్యం రాశాడు .తర్వాత వచనం లో ‘’శ్రీభగవద్గీతా శాస్త్రంబ౦ధ్రభాష రచియి౦ప౦బూని రెండవ అధ్యాయంబు మొదలుగా భగవంతుండు అర్జునునకు తత్వోపదేశంబొసంగె గావున సాంఖ్య యోగం’’ నుంచి ప్రారంభిస్తున్నానని చెప్పాడు .ఒకేఒకపద్యము , చిన్నపీఠికతో ముగించటం ఆశ్చర్యంగా ఉందని వేదాంతం కవిని మింగేసిందని ఇంతటి విరాగి చరిత్రలో కనిపించడని బిరుదరాజువారు అన్నారు .అంటే అర్జున విషాదయోగాన్ని వదిలేశాడు కవి ..కనుక కావ్యం 17అధ్యాయాలకే పరిమితం .
‘’ఉదితాశ్రు పూర్ణ నేత్రుడు –సదయ హృదయుడై గిరీటి సమ్మద మెదలో
వదలుచు శోకంబందగ-పదిలంబుగ శౌరి పల్కె భాసుర ఫణితిన్’’
అనే కందపద్యం సాంఖ్య యోగం లోని ‘’తంతధా కృపయావిస్టు౦’’శ్లోకానికి అనువాదం .తర్వాత ఉన్న మూడు శ్లోకాలభావాన్ని ఒక్క సీసం లో కుది౦చాడుకవి .ఆ తర్వాత –
‘’భోగములర్ధ కామములు బొల్పగు రక్త విలేపనంబులౌ –నా గురుమిత్ర హంతనయి ,యట్టిది నే భుజియి౦ప నేరను-
ద్వేగమతిన్ విధర్మగతి విశ్రుతమౌ సమర ప్రకాశితో –ద్యోగము బూనగా జయము నోజ బరాజయ మెట్టు లుండునో’’అని సందేహించాడు కిరీటి .
శ్రీ కృష్ణుడు అర్జునునికి చెప్పిన స్థిత ప్రజ్నుని లక్షణాలను తరువోజ లో చెప్పాడు .మరో తరువోజలో ‘’తగుని౦ద్రియముల చేతను విషయాళి నాహరించుట( నిరా )హారియనగ’’అని చెప్పి కందం లో-
‘’స్థిరమగు ప్రజ్ఞ కలనం –బిరువొందుదు సాధనేచ్చ నెనయు నపుడ త
ద్గురుతర యత్నము జేయుట –పరమావశ్యకమ్ము సుమ్ము పాండవ వర్యా ‘’
ఇలాకొనసాగించి ఉపేంద్ర వజ్ర లో –
‘’ఈ సాంఖ్య యోగంబున నింద్ర సూనున్ –ధీ సంస్తుతిన్ బూన్చిన దేవదేవున్
శ్రీ సక్త పాదాబ్జుని చిత్స్వరూపున్- నే సంస్తుతిన్ జేసెద నిర్మలాత్మున్ ‘’అని పూర్తి చేసి గద్యం లో –శ్రీ మద్యోగానంద గురువర కరుణా పాత్ర వాసుదేవ ద్వాదశాక్షరీ మంత్రరాజ విద్యానుస్టాన పవిత్ర కౌండిన్యసగోత్ర పూడూరి కొదండయామాత్యపుత్ర, కృష్ణయ నామధేయ ప్రణీత౦బైన శ్రీ భగవద్గీతార్ధ దర్పణంబు నందు సా౦ఖ్యయోగ౦బను ద్వితీయాధ్యాయంబు .శ్రీ యోగానంద గురవేనమః –శ్రీ వేద వ్యాసాయనమః .
ఇది కేవలం గీతకు అనువాదమేకాక ‘’టీకాప్రాయమైన అనువాదం ‘’అన్నారు రామరాజుగారు .
ఆధారం -.–ఆచార్య బిరుదరాజు రామరాజుగారి ‘’చరిత్ర కెక్కని చరితార్ధులు ‘’-(విస్మృత కవులు –కృతులు )
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -16-5-19-ఉయ్యూరు

