9-లయగ్రాహి గరుడాచలకవి
‘’కౌసలేయ మహా ప్రబంధం ‘’అనే అయిదు ఆశ్వాసాల కావ్యరచన చేసిన లయగ్రాహి గరుడాచలకవి చరిత్రకెక్కని చరితార్ధుడు .పాకనాటి రెడ్ల బోరవెల్లి సంస్థానకవి .మిడమిళ్ళ గోత్రీకుడు .ఇంటిపేరు ముష్టిపల్లి ..ఒకప్పుడు స్వతంత్ర సంస్థానం గాఉన్న బోరవల్లి తర్వాత గద్వాల సంస్థానం లో కలిసిపోయింది .బోరవల్లి రాజుల కులదైవం శ్రీకేశవస్వామికి కవి తన రచన అంకితం చేశాడు .సంస్థానాధీశ్వారుల చరిత్రకూడా ఇందులో రాసి ప్రభుభక్తి చాటుకున్నాడు ,గద్వాల పెద సోమభూపాలునికి మనకవి సమకాలీనుడు .
మొదటిపద్యం –
ఉ-శ్రీ విలసిల్లు బోర్వెలి పురిన్ తెలిదీవిని నిల్చు వైఖరిన్ –భావము రంజిలన్ నిలిచి భాసిలు కేశవదేవు డాత్మ వ
క్షో వితతాలయంబునను కూర్మిన నిల్పిన రీతి నిల్పుతన్ –శ్రీవనితా శిరోమణిని,శ్రీ గిరియమ్మ గృహా౦తరంబునన్ ‘’
తర్వాత మిగిలిన దేవతల ,బోరవెల్లి రాజుల మరో ఇలవేల్పు పోల్గంటి సోమేశ్వరస్వామిని స్తుతించి ,తొమ్మిదవ పద్యం లో భారత,రామాయణాలు రాసినకవులకు అంజలి చేర్చి,నాలుగోపాదం లో మురారి కవిని ‘’కవి సన్నుతేత జగన్నాటకో ద్వ్రుత్తి పేరెన్న నలరు మురారి గొలుతు ‘’అని స్పెషలైజ్ చేశాడు .అంటే మురారి అనర్ఘ రాఘవ నాటకమేకాక జగన్నాటక రూపకాన్ని కూడా రాసినట్లు కవి చెప్పాడు .శేషాచలుడు అనేకవి జగన్నాటకం అనే ప్రబంధం రాశాడని ,ఇది ప్రబోధ చంద్రోదయంలాగా వేదాంత పరమైనదని బిరుదురాజువారు పేర్కొన్నారు .గరుడాచలకవి రచనకూడా ఇలాంటిదేనేమో .
11నుంచి 16వ పద్యం వరకు తనపూర్వులగురించి చెప్పాడు .అందులో మొదటివాడు మాధవకవి క్రష్ణదేవ రాయలచే సత్కరి౦పబడ్డాడు-
‘’మాధవ భక్తి యుక్తు డసమాన కవిత్వ గురుండు కృష్ణ-రాయాధిప దత్త సద్గజ వరాది మహాబలశాలి ,గం
గా ధర కీర్తి సాంద్రుడు జగత్కవి చంద్రుడు మత్కులే౦ద్రుడౌ-మాధవు డస్మదాదులకు మాన్యుడుగాడె తలంచి చూచినన్ ‘’.
రాయలచే సత్కరింపబడిన ఆమాధవకవి రచనలు ఏమయ్యాయో తెలీదు .మాధవకవికున్న ముగ్గురు కొడుకులలో రెండవవాడు రామభద్రుడి చిన్నకోడుకుకి తిమ్మయ్య ,కృష్ణయ్య రామన్నలు కొడుకులు .రామన్నకు నారాయణ, సీతాపతులు కుమారులు మనకవికి తాతలు .లయగ్రాహి గరుడాద్రి అనే మనకవి తండ్రి నృసింహకవి .కనుక వంశం లో అందరూ కవులే .తర్వాత శార్దూలం లో తన గురువు యోగానంద కవీంద్రుడు అని చెప్పుకొన్నాడు .బహుశా మనకవికి అతడు అన్నయ్య అయి ఉంటాడని రాజుగారి ఊహ .కందంలో తన తండ్రులగూర్చి –
‘’సీతాపతి తనయుల వి-ఖ్యాతుల సంజీవి వెంకటాఖ్యుల సుకవి
వ్రాత స్తుత కవితాఘను –మా తండ్రి నృసి౦హ కవిని మాటికి దలతున్ ‘’
తర్వాత కుకవి నిందా చేశాడు .ఒకరోజు కలలో కేశవస్వామి కనిపించి ‘’బాలక నా గృహంబెపుడుబాయక విద్యలు నేర్చినావు –భూపాల సభా౦తరాళముల పండితులౌనన’’సత్కవిత్వం రాశావని ,కౌసలేయ చరితం రాసి అంకితమివ్వమని కోరాడు .తనకు గుడికట్టిన గిరియమ్మ తనపై కృతి రచన కోరిందనీ చెప్పాడు
‘’కం –‘’గిరియమ్మ నాకు మెచ్చుగ-శరణము గట్టించి ,యొక్క సత్కృతి నాపై
విరచి౦ప జేయవలెనని –కరమరుదుగ దలచినది జగద్ధితమిదియున్ ‘’అన్నాడు స్వామి .ఆమెకుకూడా కలలో కన్పించి నువ్వు రాస్తున్నట్లు చెప్తాలే అనీ అన్నాడు ..నీ అభీష్టాలు తీర్చే నీ ఇలవేలుపు శ్రీ నరసింహ మూర్తిని నేనే ‘’అని అభయమూ ఇచ్చాడు కేశవుడు .మర్నాడు ఉదయాన లేచి కృష్ణ వేణికి వెళ్లి పుణ్య స్నాదులు చేసి గిరియమ్మను సందర్శించగా ఆమె కృతి రాయమని కోరి సత్కరించి పంపింది .
కవి గిరియమ్మ వంశ చరితను ని౦డుగా రాశాడు .గిరియమ్మ గద్వాలరాజు పెదసోముని కూతురు ,బోర్వెల్లి చినసోముని భార్య గద్వాల, బోర్వేల్లివారిది ఒకటే గోత్రం .అంటే సగోత్రీకులమధ్య వివాహం అన్నమాట .అయోధ్యానగర వర్ణన పద్యం –
‘’శ్రీ నిలయాగ్ర జస్థితి ధరించి గురూన్నత ఠీవిచే సుద-ర్మానగు భోగభాగ్యము లహర్నిశ మీయగనోపిసౌద శో
భానిరవద్య నిర్జర శుభక్రియ లూని యసాధ్యమై యయో –ధ్యానగరంబు పోల్చు వసుధన్ వసుధామ నియుక్తి స్వర్గమై ‘’
గ్రంథం రాయబడిన లిపి ఒకరకంగా ,ఆశ్వాసాంత గద్యాల లిపి మరొక రక౦గా ఉందని ఆచార్య బిరుదరాజువారన్నారు .ఒకగద్యం లో’’అష్టవిధ భాషా కవిత్వ సంపన్న సారస్వ తాభినందిత ‘’అనే విశేషణం అధికంగా కనిపించిందట .అదే కాలం లో గిరియమ్మ దత్తపుత్రుడు వెంకటపతి కాలం లో చింతలపల్లి చాయాపతి అనేకవి రాఘవాభ్యుదయం అనే మహా ప్రబంధాన్ని రాశాడట .
ఆధారం – ఆధారం -.–ఆచార్య బిరుదరాజు రామరాజుగారి ‘’చరిత్ర కెక్కని చరితార్ధులు ‘’-(విస్మృత కవులు –కృతులు )
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -16-5-19-ఉయ్యూరు

