10-నాడ గౌడు ముష్టిపల్లి వెంకటభూపాలుడు
గద్వాల సంస్థానం లోని రాజవోలు ను ఇప్పుడు రాజోళి అంటున్నారు ,ఇక్కడ తుంగభద్రానది తుంగ ,భద్ర అనే రెండు పాయలుగా ప్రవహిస్తుంది .రెండుపాయలమధ్య ఏర్పడిన లంకలో రాజవోలు కోటలు ,ప్రాసాదాలు శిధిలమై కన్పిస్తాయి .దుర్గమధ్యమం లో శ్రీ రామనారాయణ ఆలయం ,ఊరికి రెండుమైళ్ళ దూరం లో నది ఒడ్డున రామేశ్వరాలయం ,ఆలయం ముందు చాళుక్య భూలోకమల్లుని శాసనం ఉన్నట్లు శ్రీ మారేమండ శ్రీనివాసరావు తెలియజేశారు .రెడ్డిరాజులైన పాకనాటి ,మిడిమిళ్ళ గోత్రీకుల ఇంటిపేరు ఒకటే ‘’ముష్టిపల్లి ‘’.రాజవోలు రాజధానిగా ఈ రెండుప్రాంతాలను పాలించారు .కొంతకాలం స్వతంత్రంగా ఉండి తర్వాత గద్వాల సంస్థానం లో కలిసిపోయారు .
రాజవోలు రాజు నాడగౌడు వెంకటభూపాలుడు అనేక గ్రంధాలు రాసిన భక్తకవి కూడా .ఈతడు రాసిన ‘’దివ్య దేశ మహాత్మ్య దీపిక ‘’అనే ద్విపదకావ్యం 23తాళపత్రాలలో లభించింది .ఇందులో 108 వైష్ణవ దివ్య క్షేత్రాలు వాటి మహాత్మ్యం వర్ణించబడి ఉంది .మొదట్లో కృతికర్త ,కృతిభర్త వంశ చరిత్రలు చెప్పాడు .ఈ కృతిని రాజవోలు కేశవస్వామికి అంకితమిచ్చాడు .ఈ రాజులకు ప్రోల్గంటి సోమేశ్వరుడు మరొక ఇలవేల్పు .గ్రంధకర్త మూలపురుషుడు ముష్టిపల్లిఇమ్మడి ఎల్లారెడ్డి సోదరుడు చినరెడ్ది.భార్య లక్ష్మాంబ.వీరికొడుకు పిన విభుడు కొడుకే మన వెంకట భూపాలుడు .
సరళమైన తెలుగులో గ్రంథం నడిపించాడు .అడుగడుగునా భగవద్భక్తి ప్రవహిస్తుంది .ఈ రాజు దీనినేకాక ‘’రాజవోలి వెంకటేశ్వర శతకం ‘’కూడా రాశాడు కాని అది శిధిలంగా ఉందని రామరాజుగారన్నారు .ఇందులో 108పద్యాలు . రాజవోలి వెంకటేశ్వర స్వామికి అంకితం .
కం-శ్రీ రమణీ ప్రాణేశ్వర –వారిజ లోచన మురారి —నమ
స్కారమిదె,రాజవోలి వి-హారుని వలెకరుణ వేంకటాచల రమణా’’’
చివరిపద్య౦ – ‘’నరహరి యెప్పుడు చాలా –నిరతము మదినమ్మినాడ,నీ దాసుని ననున్
మరువకుము రాజవోలీ –హరిలీలలను కరుణ వేంకటాచల రామణా’’
శతకం లో కొన్నిపద్యాలు ర ప్రాసతో కొన్ని న ప్రాసతో కొన్ని ల ప్రాసతో ,మరికొన్ని బిందుపూర్వక ద కారప్రాసతో ఉన్నాయని రాజుగారు చెప్పారు .శతకం ముగియగానే ‘’రాజవోలి వెంకటేశ్వర కీర్తనలు ‘’రాశాడు .అందులో తోడిరాగం ఆటతాళంలో ఉన్న కీర్తన –
‘’భారంపు సంసార వలల మిమ్ము చేరనైతిగా ఓరంగా –ఏ రీతిగ నను దయజూచి రక్షించెదొ కారుణ్యము మీరగా ఓ రంగా .
ఈ కీర్తనలమధ్య కొన్ని ద్విపదలు కూడా ఉన్నాయట.అందులో ఒకటి –
‘’శ్రీరామ చంద్ర యాశ్రిత సన్మునీంద్ర-కారుణ్య సాంద్ర భాస్కర వంశ చంద్ర ‘’
ఒక కీర్తన శివపరంగా కూడా రాశాడు –
‘’మరచేవేలరా నన్నూ –కోరి చేరితి నిన్నూ
’మరచేవేలరా నన్నూ-మరువవద్దురనన్ను పరవతాల మల్లేశ్వరా ‘’
రజతాచల నివాసా ఎప్పుడు నిన్ను –భజియింతు చిద్విలాసా
భుజగే౦ద్రహార –సకలభువనాదార భక్తవరదా
గజచర్మా౦బర ధారా-సకలముని స్తోత్ర
నిజముగ వరము –—-ద్విజరాజ శేఖరా ఎరా దిగ్విజయమీయరా
ఆనందకరమైన రాజవోలి హరి-పూనిక వేంకటేశుని మానుగ సఖుడైన మల్లేశ్వరా –దాసుని నన్నేలరా ‘’
ఇవన్నీ 17వ శతాబ్దపు రచనలై ఉండవచ్చునని ఆచార్య రాజుగారు భావించారు .
ఆధారం – ఆధారం -.–ఆచార్య బిరుదరాజు రామరాజుగారి ‘’చరిత్ర కెక్కని చరితార్ధులు ‘’-(విస్మృత కవులు –కృతులు )
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -17-5-19-ఉయ్యూరు

