1-అత్తాను రామానుజా చార్యులు
24శిధిల తాళపత్రాలలో ‘’రుక్మిణి కొర వంజిని’’ ద్విపదకావ్యం రచించిన అత్తాను రామానుజాచార్యులకాలాదులు తెలియవు .ఇది ప్రాచీన యక్షగానానికి చెందిన ప్రాచీన కొరవంజి .ఇస్ట దైవతాప్రార్ధన చేసి తర్వాత తనగురించి కవి చెప్పుకొన్నాడు .
‘’మునిగ్రామ వాసుడగు మూర్తిగలయట్టి – వనధి యగు పా౦డ్రాజు వంశపావనుడ
అత్తాను సంబంధమైనట్టి వాడ –అత్తాను రామానుజాచార్య సాహ్వయుడ
కరమొప్ప రుక్మిణీ కళ్యాణ సరళి –కరమర్ధితో యక్షగానంబు రీతి
కొరవంజి జేసెద కూర్మితో ననుచు –ధరణిపై మదిలోన దలచినయంత ‘’
శ్రీరంగనాధుడు మనసులో కనిపించి కృతి రచించ మనగా ‘’గురుతుగా మదన గోపాలునకు –కొరవంజి జేసెద కుంభిని వెలయ ‘అని మొదలుపెట్టి రాశాడు .గుంటూరు ,మహబూబ్ నగర్ జిల్లా,లలో మునిపల్లె గ్రామం ఉన్నది .కవి తండ్రిపేరుకాని, తాతపేరుకాని’’ పాండ్రాజు’’ అయి ఉండాలని బిరుదరాజువారు ఊహించారు .కాలం మాత్రం 16 వ శాతాబ్దికాదు అన్నారు. కావ్యం చివరలో కృతిభర్త అయిన స్వామిని స్తుతించాడు .కురవంజిలో జంపె సువ్వాల మంగళహారతులు ద్విపదలు ధవళాలు ఉన్నట్లు రాజుగారన్నారు.
రుక్మిణీ కృష్ణుల వివాహ సందర్భంగా కొట్నాలు దంచినప్పుడు’’ సువ్వాల ‘’రాశాడుకవి
‘’కూరిమితో బంగారు కుందనాలో కొలుచు నించి –గారవించి సతులు రోకళ్ళు దంపుచూ
సువ్వి రంగనాధ సువ్విసువ్వి వేంకటేశ సువ్వి –సువ్వి కృష్ణరాయ సువ్విలాలె’’
ముత్తైదువులు కా౦తుడైన కృష్ణుని పాటలతో ఇలా స్తుతించారు –
‘’నాదా వినోది కృష్ణ నాధా కృష్ణా – వన్నె సన్న సూది పచ్చ గన్నెరాలు క్రష్ణభోగి
సన్నరాజనాలు , జీలసర్లు దంపుచూ –ఉబ్బి నిక్కి జంగ జూచి ఉవిదలెల్ల చెమట జార
గబ్బి గుబ్బ లదరగాను కలయ దంచిరీ –ఎంచి పెండ్లి మోపు ఇంట –
పంచగతుల జేరి వాయించ దొణగిరీ’’.
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -19-5-19-ఉయ్యూరు

