14-పొత్తపి వెంకటామాత్యుడు
‘’నూట ఎనిమిది దివ్య తిరుపతుల సుబ్బరాయ శతకం ‘’రాసిన పొత్తపి వెంకటామాత్యుడు రాయలసీమకవి .అన్నీ సీసాలే .మొదటిపద్యం చివర –మహితరోపాయ ధూర్జటి మతః విదేయ –సూర్య శతకోటి నిభకాయ సుబ్బరాయ ‘’అని ఉంది .ప్రారంభం లో అశ్వత్ధ నారాయణుడు .పెన్న జూటురి చేన్నరాయలను ,వజగిరి నృసిమ్హుని ,కోన రంగేశుని ,హోన్నూరి రాయని స్తుతించటం చేత ఈ క్షేత్రాలన్నీ అన౦తపుర మండలం లో ఉండటం వల్లా కవి రాయలసీమ లోని అనంతపురం మండలం వాడై ఉంటాడని రాజుగారి అభిప్రాయం .2నుండి 108పద్యంవరకు 108 దివ్య తిరుపతుల వర్ణన చేశాడు .109పద్యం లో తనగురించి చెప్పుకొన్నాడు –
‘’ముదితాత్ముడగు పెదముల్కి వెంగనకేను పౌత్రుండ ,హరితస గోత్రజుండ-అనఘ పొత్తపి చెన్నయామాత్య సూనుండ ,మహిత చారిత్రుడ,మానధనుడ
కామక్షమా౦బను ఘనసాద్వి గర్భ జలధి చంద్రుడ ,మహా సరసి గుణుడ-సిరిమించు రాయల చెర్వు యబ్బారుడ?,ఘనుడ వెంకట నామకవి వరుడ
ధర్మ చరితుండ నిరతాన్న దాతవనుచు –నీకు మ్రొక్కెద నను బ్రోవు లోక వంద్య
మహితరోపాయ ధూర్జటి మతః విదేయ –సూర్య శతకోటి నిభకాయ సుబ్బరాయ ‘’.
కవి వంశంవారు పొత్తపి నుంచి వచ్చి అనంతపురం లో స్థిరపడ్డారు కనుక ఇంటిపేరు ‘’పొత్తపి ‘’అయింది .తాతపేరుకు ముందు పెదముల్కి ,తండ్రి పేరుముండు పొత్తపి, తన పేరుకు ముందు రాయల చెరవు ఊళ్ళ పేర్లున్నాయి కనుక ‘’మూడుతరాలలో మూడు ఊళ్ళ చెరువు నీరు త్రాగి ఉంటారు ‘’అని చమత్కరించారు ఆచార్య రాజుగారు .110వ పద్యం లో ఈ కృతికి తనను ప్రోత్సహించిన వారి గురించిరాశాడుకవి .కవి శైలీ రమ్యతకు ఒక పద్యం-
‘’వినయ భక్తి స్థానమున భుక్తినొసగెడు దేవుని నెదనెంచి దిగులు బూని –సారంగముల రెంటి సారంగమున గూర్చి సారంగధరు జూచి సరసుడనుచు
పండు వెన్నెలలోనిపండు వెన్నెలగాంచి పండు వెన్నెలగల బయలు బట్టి
పరితాపమందక పరితాపమును దీర్చి పరితాపహరు గురు ప్రస్తుతించి
జ్ఞానమార్గంబు దెలిసిన మానవుండు –అధికుడన మించి సత్పథ మందకున్నె
మహితరోపాయ ధూర్జటి మత విదేయ –సూర్య శతకోటి నిభకాయ సుబ్బరాయ’’.
‘’తత్వావతార దశకం ‘’అనే పద్యం సౌరు గమనిద్దాం –
‘’శ్రీమద్వరంబున చెన్నొందుగుణనాథు నేవేళ నాత్మలో నెన్నికొనుచు –అల మచ్చెమై నీటి కెదురెక్కవలెగాని,మూపున పెనుగొండ మోవరాదు
ఘోణియై ముస్తెను గోరాడవలె గాని ,దిగు లొ౦దగా నోరు దెరువరాదు-దీనత నొక్కరి తిరియ గావలె గాని తెంపున నృపతుల ద్రుంపరాదు
కట్టవలెగాని రోకట గొట్టరాదు – ఉండవలెగాని కత్తి మెండొడ్డ రాదు
మహితరోపాయ ధూర్జటి మతః విదేయ –సూర్య శతకోటి నిభకాయ సుబ్బరాయ’’
ఇందులో చక్కని వ్యాజస్తుతి కనిపిస్తోంది కృష్ణాజిల్లా కాసులపురుషోత్తమకవి గుర్తుకొస్తాడు .
ఆధారం – ఆధారం -.–ఆచార్య బిరుదరాజు రామరాజుగారి ‘’చరిత్ర కెక్కని చరితార్ధులు ‘’-(విస్మృత కవులు –కృతులు )
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -21-5-19-ఉయ్యూరు

