గీర్వాణకవుల కవితా గీర్వాణం-4
469–‘’ఆసేచనక ‘’రామాయణకర్త –బ్రహ్మశ్రీ సుబ్రహ్మణ్య సూరి (1850)
రామాయణార్య లేక ‘’అసేచనక రామాయణం;; రాసిన బ్రహ్మశ్రీ సుబ్రహ్మణ్య సూరి 1850లో పుదుక్కొట వద్ద కడయక్కుడి గ్రామం లో జన్మించాడు .కౌశిక్ గోత్రానికి చెందిన సామవేది .రామభద్ర దీక్షితుని మామ చొక్కనాధ దీక్షిత వంశంవాడు .గొప్ప వ్యాకరణ వేత్త అయిన రామభద్ర దీక్షితులు జానకీ పరిణయ కావ్యం రాశాడు .ఈ వంశీకులంతా తిరుచినాపల్లి తాలూకా బొమ్మసముద్రం దగ్గరున్న ‘’నాచికురిచి ‘’గ్రామానికి చెందినవారు .ఇక్కడినుంచి పుదుక్కోటరాజ్యం లో ని’’ పిన్నంగుడి’’ కి వలసవెళ్ళారు .మనకవి తండ్రి శంకరనారాయణ శాస్త్రి కడయక్కుడి లో స్థిరపడ్డాడు .ఇక్కడే ఉన్న స్వామి అయ్యంగార్ వద్ద కావ్య నాటక అలంకార శాస్త్రాలు,తంజావూర్ జిల్లా అనంతగిరి తాలూకా కారవాయాల్ లో ఉన్న శ్రీనివాస శేషాచార్యవద్ద వ్యాకరణం నేర్చాడు సూరి .వీటన్నిటిలో నిష్ణాతుడై కవిత్వ ,చిత్రలేఖన సంగీతాలలోనూ అద్వితీయుడనిపించాడు .వీటితోపాటు హరికథాగానం లోనూ,రచనలోను సిద్ధహస్తుడు .ఎన్నో హరికథలు స్వయంగా రాసి గానం చేసి సభలలో మెప్పించాడు .పుదుక్కొట రాజాగారికాలేజిలో సంస్కృత అసిస్టెంట్ గా 19-1-1894న చేరి ,16-2-1910లో శాఖాధిపతి అయ్యాడు .
అసేచనక రామాయణం తోపాటు ,వల్లీ బాహులేయం నాటకం ,’’చతుష్పదీ చతుశ్శనీ ‘మన్మధమధనం అనేభాణం,పూర్వాదునిక్ వృత్తపద్యాశికా ,వృత్తనామ సంగ్రహం ,కారకాణి రచించాడు .సంగీత రూపకాలుగా రామావతారం సీతాకల్యాణం ,రుక్మిణీ కల్యాణం,పార్వతీకల్యాణ౦ వగైరా రాశాడు .రామ చంద్ర పద్య పంచరత్నం ,శుక సూక్తి ,సుధారసాయనం డోలాగీతాని మొదలైనవి రచించాడు .అయితే వీటిలో కొన్నిమాత్రమే తనవద్ద ఉన్నాయని సూరిగారి కుమారుడు మద్రాస్ లోని అకౌంటెంట్ జెనరల్ ఆఫీస్ సూపరిం టే౦డెంట్ శ్రీ ఎస్.శంకరనారాయణ 1932లో తెలియజేశారు .
సుబ్రహ్మణ్య సూరి రాసిన అసేచనక రామాయణం లేక రామయాణార్య ఆర్యా ఛందస్సులో రాయబడిన కావ్యం .ప్రతిశ్లోకం లోని మూడుపాదాలలో కధాంశం ఉంటె నాలుగవపాదం లో వీటి లోని నీతి ఉంటుంది అదీ ప్రత్యేకత. ఇంతకీ అసేచనక అంటే ఏమిటి ?మిక్కిలి సుందరమైనది అని అర్ధం .సుందరకాండ మాత్రమేకాదు రామాయణ కాండలన్నీ బహు సుందరమైనవని తెలియ జేసి ,రచనలో రుజువు చేశాడు సూరి . కావ్యానికి అందమైన పేరు పెట్టటం లోనూ తన ప్రత్యేకత చూపించాడు .
బాలకాండ లో శ్లోకాలు –
యః పూర్వమాధ్యాం కవితోచ్చశాఖామారుహా రామేత్య శక్రుచ్చకూజ-రసం చ రసాక్షరమత్ర వందే వాల్మీకినామాద్రుత కొకిలం నమ
నారదః పయోదే ర్వాల్మీకీ రామ చరిత మయమమృతం –యన్నం వినేవ లేభే సాధుజన౦ సాధ్యమేవ సఫలయతి
క్రౌన్చమిదునా త్విలైకం వాల్మీకిః కాముకం కిరాతహతం –హ్రుశ్వ సుశోచ దయయా భూతదయా భూతాదియానీ పుంసాం ‘’
200వ శ్లోకం –‘’కేసరికా పిజయాయం శ్వసనేనో ప్యాదితో౦జనా రవ్యాయతమ్ – దాసస్తవ రామాయం సద్దార్మికో హి మార్జరః
ఫలహరణాయ జనన్యాం చాలితాయాం శోశవేయమానిలసుతః –ఫలబుధ్యతా ర్కముపాగమత్ బాలో వత్సోభయం న జానాతి ‘’
చివరిశ్లోకం –‘’ప్రతియుగ మవనాయ సతాం కతిపయ శఠ శిక్షణాయచ శ్రీశః-అవతారతి రఘోర్వంశేనివసతి నైకత్ర రాక్షకో నృణాం’’
‘’ఇతి ఉత్తరాకాండః
ఇతి కడయకుడి బ్రహ్మశ్రీ సుబ్రహ్మణ్య సూరి కృతంశ్రీ మదసేచనక రామాయణం సంపూర్ణం ‘’ఓం తత్సత్ ‘’
ఇలా రామయణాన్ని బహు సుందరబందురంగా 289శ్లోకాలో కవిత్వీకరించి’’ అసేచనక రామాయణం’’ అనే అన్వర్ధనామాన్ని ఉంచి సమర్ధంగా, బహుజనరంజకంగా ఆర్యావృత్తం’లలో నిబంధించి సొగసు చేకూర్చిన బ్రహ్మశ్రీ సుబ్రహ్మణ్య సూరి ధన్యుడు .
ఆధారం -సుబ్రహ్మణ్య సూరి కుమారుడు శంకరనారాయణ వ్యాసం
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -10-6-19-ఉయ్యూరు

