గీర్వాణకవుల కవితా గీర్వాణం-4
470-సంస్కృత ప్రాకృత కవయిత్రుల కవిత్వ తులనాయ్మక పరిశీలన -2
సంస్కృత –వేద కవయిత్రులు-2
‘’సాస్వతి ‘’కవయిత్రి అభిప్రాయం పైదానికి పూర్తిగా విభిన్నంగా ఉంటుంది .ఆమెలో సర్వసమర్పణ ,అంకితభావం భర్తపట్ల పూర్తీ విధేయత ,భర్త చేసిన పాపాలకు పరిహారంగా తాను వ్రతాలు నోములు చేసి పాపవిముక్తుడిని చేయటం ,అతడు పూర్తిగా మంచి మనిషిగా మారాక అంతులేని ఆనదాన్ని సంతోషాన్ని పొందటం కనిపిస్తుంది (8-1-34)
ఒక సుదీర్ఘ మంత్రం లో కొత్త పెళ్ళికూతురు గురించి కొన్నిప్రసిద్ధ వివాహమంత్రాల గురించి ఉన్నది .గృహిణిగా ఇంటి పెత్తనాన్ని పొంది కొడుకులు కోడళ్ళు మనవలతో ఆమె పొందే ఆనందం వర్ణింపబడింది (10-35).అగస్త్యుని సోదరి కుమారులకోసం ఇంద్రుని తల్లులను ప్రార్ధించటం ,వారు తమ పుత్రుల ఘనత ,సాధించిన విషయాల ను గర్వంగా చెప్పటం వర్ణించబడింది (4-18,10-153).
మరికొన్ని మంత్రాలలో స్త్రీ జీవితం లో వివిధ దశల వివరణ మరికొన్నిటిలో అనేక తరహాల స్త్రీలు వర్ణించబడ్డారు .’’గోధా’’అనే ఆమె ఇంద్రుని భక్తురాలుగా ,ఆయనపైనే ఆధారపడినదానిలాగా కనిపిస్తుంది(10-134).’’యామి’’ చెప్పినట్లుగా ప్రచారం లో ఉన్న మరొక మంత్రం లో మక్కువ ,ఉద్రేకం ,విలాసం, ఉన్న స్త్రీ చివరికి తన సోదరుడిని సైతం మోహింఛి చెడగొట్టిన వర్ణన ఉన్నది (10-10).శీలం చెడినఒక స్త్రీ శృంగారం పై తనకున్న నీచ అభిప్రాయాన్ని చెప్పి ఇతరులకు కూడా అదే భావాన్ని కలిగించి దాన్ని నీచంగా ప్రచారం చేయటం కనిపిస్తుంది (10-95). ‘’సరమా ‘’చెప్పినట్లున్న మరొక మంత్రం లో విశ్వాసమున్న దూత వ్యక్తిత్వ వర్ణన ఉన్నది (10-108).
కనుక సంస్కృత కవయిత్రులులాగానే వేదఋషీమణులుకూడా వివిధ విషయాలపై నా, స్త్రీ జేవితం లోని వివిధదశలపైనా అంటే ముసలి పనికత్తెపెళ్ళికి ఆరాటపడటం(ఘోష ) ,కొత్త పెళ్ళికూతురు (సూర్యా),పతివ్రత అయినభార్య (సాస్వతి ),అసూయాపరురాలైన ఇల్లాలు (ఇంద్రాణి ),విలాస స్త్రీ (రోమసా,లోపాముద్ర )జబ్బుపడ్డ భార్యను దూరం చేసినభర్త (ఆపాలా ),సంతృప్తితో జీవించే గృహయజమానురాలు (విశ్వవార )పుత్రుల పరాక్రమాలకు గర్వపడే తల్లి (అగస్త్యుని సోదరి ,అదితి ఇంద్రమాతలు )కవితలు చెప్పారు .మత ధర్మాలకు అంకితమైన పతివ్రత ( గోధ ) వేశ్య (యమి )శీలం చేడ్డ స్త్రీ (ఊర్వశి ),విశ్వాసపాత్రురాలైన దూత (సరమా )లగురించీ మంత్రాలలో చెప్పారు .వీటన్నిటిని క్షుణ్ణంగా పరిశీలిస్తే ,స్త్రీకి ఉన్న అపార మానవతా దృష్టి ,పూర్తిగా జీవం కలగజేయటం ,శక్తి ఓజస్సు ,కట్టలు తె౦చు కొనే ఉద్రేకం అన్నీ గుండెలోతుల్లోంచి పెల్లుబికి వస్తున్నట్లు తెలుస్తుంది .
కాని వీరు ఇంత వైవిధ్యంగా ప్రకృతిని దర్శించి చెప్పింది చాలాతక్కువే .కొన్ని చోట్ల అగ్ని రాత్రి మొదలైన వర్ణనలు అద్భుతంగా చేశారు .సంస్కృత కవయిత్రుల కవితలను ,ఋషీమణులైన కవయిత్రుల మంత్రాలతో పోలిస్తే -స్త్రీ మనసు ,సహజమైన ఆత్మభావన ఎక్కడో కొన్ని ప్రత్యెక విషయాలను మినహాయిస్తే సమానంగానే కనిపిస్తాయి .తరువాత తరువాత వచ్చిన మంత్రాలు పూర్వపు వాటికంటే చాలా మోటుగా ఘాటుగా ,ఉద్రేకపూరితం మమకారం గా అత్యంత శక్తివంతంగా కనిపిస్తాయి .మొదటివి కళాత్మకంగా ,నగిషీలతో మెరిస్తే ,తరవాత వచ్చినవాటిలో ఆ నిండుదనం ,శోభ ,కళ తగ్గినట్లనిపిస్తాయి .
దీనితర్వాత సంస్కృత కవయిత్రుల, ,బౌద్ధ భిక్షిణుల కవిత్వానికి ఉన్న తేడాలను తెలుసుకొందాం .
ఆధారం –The Contribution Of Women To Sanskrit Lterature –Presidency College Of Calcuutta -1943
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -11-6-19-ఉయ్యూరు

