గీర్వాణకవుల కవితా గీర్వాణం-4 478-హాలస్య చంపు కర్త -జ్ఞాన సుందరి (20వ శతాబ్దం )
తమిళనాడు కుంభకోణం కు చెందిన నాట్య కళాకారిణి జ్ఞానసుందరి .కుప్పుస్వామి శాస్త్రి శిష్యురాలు .మైసూరు రాజాస్థానం ఆమెకు ‘’కవి రత్న ‘’బిరుదునిచ్చి సత్కరించింది .చాలారచనలు చేసినట్లు ఆమె స్వయంగా చెప్పింది .అందులో ఆరు స్తబకాలలో రాసిన ‘’హాలస్య చంపు ‘’ఉన్నది .ఇది మదురైలోని శైవ సంప్రదాయానికి సంబంధించింది .కవిత్వం ఒకే తీరున సాగకపోయినా సంస్కృతం పై ఆమె పట్టు కనిపిస్తుంది .అనుప్రాసలతో కవిత్వం అలరించింది .
479-రామ చరిత కర్త -కామాక్షి(20వ శతాబ్దం )
పంచాపకేశాచార్య కుమార్తె ,జి.యే.ముత్తు కృష్ణ అయ్యర్ భార్య కామాక్షి తంజావూర్ కు చెందినకవి .కాళిదాసదాస సాహిత్యంపై గొప్ప అధారిటీ ఉన్న సంస్కృత విద్వాంసురాలు .కాళిదాసశబ్దాలు పద సమూహాలు ఉపయోగించి ‘’రామ చరిత ‘’అనే చిన్న కావ్యం రాసింది.
480-బుద్ధ చరితామృతం కర్త -మందాయం ధాటి అలమేలమ్మ(20వ శతాబ్దం )
బుద్ధ చరితామృతం అనే కావ్యం రాసిన మందాయం ధాటి అలమేలమ్మదక్షిణభారత కవయిత్రి .20వ శతాబ్దం .481-రాధా గోవింద శరద్ రస కర్త – రాధాప్రియ (20 వ శతాబ్దం )
ఒరిస్సా రాజు రఘునాధదేవవర్మ కుమారుడు విశ్వనాధ దేవవర్మ మహారాణి రాదాప్రియ .భర్తతో కలిసి ‘’ రాధా గోవింద శరద్ రస’’రచించింది .ఇది రాధా కృష్ణుల శరత్కాలవిహార కేళి .భర్త రాసిన ‘’రుక్మిణీ పరిణయం ‘’అనే 11 కాండలకు విపులమైన వ్యాఖ్యానమూ రాసింది .
482- లక్ష్మీశ్వర చంపు కావ్యకర్త -రమాబాయి(19వ శతాబ్దం )
మైసూర్ రాజ్యం లో గంగామూల లో రమాబాయి జన్మించింది .తండ్రి అనంతసూరి .తల్లి అంబ. ఈమె’’ లక్ష్మీశ్వర చంపు’’ కావ్యం రాసింది .ఇది 1879-80లో ప్రచురితమైంది కనుక కాలం 19వ శతాబ్ది మధ్యకాలం .దర్భంగా అంటే మిదిలరాజు కలకత్తా సందర్శించినపుడు రమాబాయిని ఆహ్వానించి ఘనంగా సత్కరించాడు .దీనికి సంతృప్తి చెందిన ఈమె, రాజు పట్టాభి షేక విషయాలను కావ్యంగా రాస్తానని చెప్పి ‘’లక్ష్మీశ్వర చంపు ‘’రాసింది .ఇదే ఆమె మొదటి కావ్యం. రాజసత్కారం పొందిందంటే ఆమె ప్రతిభా సంపన్ను రాలే అయి ఉంటుంది .దక్షిణభారత దేశానికి చెందిన ఆమె కవిత్వం మిధిలా కలకత్తా వరకు ప్రాకి గుర్తింపు పొందింది .
ఈ కావ్యం లో 5స్తబకాలున్నాయి .దర్భంగా నగర వర్ణన లక్ష్మీశ్వరరాజు ,ఆయనతండ్రి వర్ణన .రాజు జన్మించటం వేడుకలు బాల్యం తండ్రి చనిపోవటం తల్లి సతీ సహగమనం మొదలైనవి మొదటి సర్గలో ఉన్నాయి .రెండవ సర్గలో రాజు బెనారస్ చదువు రాజ్యశ్రీ తో వివాహం,వేడుకలు ,సుఖమయ దాంపత్యం .సమర్ధతతో రాజ్యపాలన ,రానణికోరికై కొద్దికాలం పాలనకు దూరమై ఉద్యానవన విహారం ఉంటాయి .మూడులో కొత్తదంపతుల హనీ మూన్ విశేషాలు, ,నాలుగులో ప్రకృతివర్ణన ,అయిదవ సర్గలో రాజ్య పట్టాబిషేక విశేషాలు ,రాజదర్బారు విదేశీరాయబారులు వగైరా ఉన్నాయి .
ఇంతున్నా తేదీలు సంవత్సరాల విషయం రాయలేదు .చారిత్రాత్మక సంఘటనలు లేకపోవటం తో నిరాశకలుగుతుంది .చరిత్రకారిణికాకపోయినా అలంకార శాస్త్రం లో బహు ప్రజ్ఞావంతురాలనిపిస్తుంది గౌడీ –వైదర్బి రీతులకు మధ్యగాఉండే’’పాంచాలీ ‘’రీతిలో కావ్యరచన చేసింది .హుందాగా శబ్దార్ధమాదుర్యంగా కవిత్వం భాసించింది .శబ్దానికున్న అన్ని రకాల అర్ధాలను సందర్భోచితంగా వాడటం ఆమె ప్రత్యేకత .చక్రబంధం మిశ్రఘటకబంధం ,గోమూత్ర ,గవాక్ష బంధాలను సమర్ధంగా ప్రయోగించి తన పాండితీ గరిమ చాటింది .వివిధ చందస్సులను సమయానుకూలంగా ఉపయోగించింది .
483-చంపు భాగవత కర్త -శ్రీదేవి బాలరాజ్ఞి
భాగవత పురాణం లోని ముఖ్యవిషయాలను తెలుపుతూ శ్రీదేవి బాలరాజ్ఞి ‘’చంపు భాగవతం ‘’రచించింది .
484-కామాక్షామృత కర్త సునమణి దేవి
‘’కామాక్షామృత’’అనే మతగ్రందాన్ని సునమణి దేవి రాసింది. వివరాలులేవు .
485-రామాయణ చంపు కర్త -సుందరవల్లి
మైసూర్ కు చెందిన సుందరవల్లి-నరసింహ అయ్యంగార్ కూతురు ,కస్తూరి రంగాచార్య శిష్యురాలు .6కాండల ‘’రామాయణ చంపు కావ్యం’’రాసింది .
486-యాదవ –రాఘవ –పాండవీయ త్ర్యర్దికావ్యకర్త –త్రివేణి
దక్షిణభారతానికి చెందినా త్రివేణి ‘’యాదవ –రాఘవ –పాండవీయ౦ ‘’అనే త్ర్యర్ది కావ్యం రచించింది .ఈమె ఉదయేంద్రపురానికి చెందిన అనంతాచార్య కుమార్తె .భర్త శ్రీ పెరు౦బుదూర్ కు చెందిన వేంకటాచార్య .భర్త ,కుమారుడు అకాలమరణం చెందాక ప్రాపంచిక జీవితానికి దూరంగా భక్తీ రచనలతో జీవించింది .ఈమె రాసినవి చాలాఉన్నాయి అందులో కొన్ని-లక్ష్మీ ,రంగనాధ సహస్రనామావళి ,శుకసందేశం , భ్రుంగసందేశం ,రంగాభ్యుదయం, రంగరాట్ సముదాయ ,తత్వముద్రా భద్రోద్య’’
ఆధారం –The Contribution Of Women To Sanskrit Lterature –Presidency College Of Calcuutta -1943
సశేషం –
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -13-6-19-ఉయ్యూరు
మనవి-గీర్వాణకవుల కవితా గీర్వాణం మొదటి మూడుభాగాలలో 1090మంది సంస్కృతతకవులపైన నేను రాయటం, సరసభారతి తరఫునగ్రంథ రూపంలో ప్రచురింఛి ఆవిష్కరించటం , ఈ మూడింటికి సరసభారతికి, నాకు మిక్కిలి ఆత్మీయులు శ్రీ మైనేని గొపాల కృష్ణ శ్రీమతి సత్యవతి దంపతులు (అమెరికా ) స్పాన్సర్లుగా ఉండటం మీకు తెలుసు .
,నాలుగవ భాగం గా అంతర్జాలం లో ఇవాల్టికి రాసిన 486మందికవుల తోకలిపి 1576మంది గీర్వాణకవులపై రాసే అవకాశం ,అదృష్టం నాకు కలిగింది .ఇదంతా మా శ్రీ సువర్చలాన్జనేయస్వామి ,శ్రీ సరస్వతీ మాత అనుగ్రహమే .
ఈ నాలుగవభాగం లో నాకు కావాల్సిన విషయాలను అన్ని రకాల సోర్సులనుండి ఏరి కూర్చి నాకు పంపి రాయటానికి సహకరించిన మా రెండవ అబ్బాయి శర్మ ,మనవడు హర్ష లకు అభినందనలు .
ప్రస్తుతం ఈ ధారావాహికకు విరామం మాత్రమే ప్రకటిస్తూ ,సమాచారం లభిస్తే ,మరింతమందిగీర్వాణ కవుల గురించి రాస్తానని మనవి చేస్తూ –
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -13-6-19-ఉయ్యూరు

