‘’సామాజిక సమస్యలు’’కు పద్యాలలో కన్నీరు కార్చిన టేకుమళ్ళ
శ్రీటేకుమళ్ళ వెంకటప్పయ్య ఖండకావ్యం గా రాసిన ‘’ ’సామాజిక సమస్యలు’’ కవితా సంపుటి డిసెంబర్ 2017లో ప్రచురితమై, ఆయన దాన్ని నాకు ఎప్పుడిచ్చారో తెలీదుకాని, ఇవాళ ఏదో పుస్తకం కోసం వెతుకుతుంటే బయటపడింది .నాకు అభిమాన వ్యక్తీ, రచయితా, కవి వెంకటప్పయ్య .బేతవోలు ,శ్యామలానంద ,చక్రాల ,పూర్ణచంద్ వంటి సాహితీ దిగ్గజాలు దీనికి ముందుమాటలు ,అభినందనలు, ప్రోత్సాహక ప్రశంసలు రాశారంటేనే వెంకటప్పయ్య అలాంటిలాంటి కవికాడు అని అర్ధమౌతుంది .చిన్నప్పుడే తండ్రి మరణిస్తే అన్నీ తానె అయి చూసి, పెంచి,పెద్ద చేసి, జీవితాన్ని తీర్చి దిద్ది ,ఇక తనవంతు కర్తవ్యమ్ ముగిసిందని ఇహలోక౦ వీడిన అన్నగారు శ్రీ టేకుమళ్ళ లక్ష్మీ నరసి౦హ౦గారికి అంకితమిచ్చి ఋణం తీర్చుకొన్నాడు .
‘’నేతలందరి లక్ష్యంబు మేతకాగ –దేశమేగతి కేగునో తెలియరాదు ‘’అని కార్మిక సంక్షేమం కోసం మొసలి కన్నీరు కార్చే ప్రాభుత్వాల నేతల డొల్లతనాన్ని బయటపెట్టాడు.కార్మికులు గొంతెమ్మ కోరికలు కోరరని వకాల్తాగా చెప్పి , బాధ్యత తగ్గని జీవితాలతో ‘’తీరని బాధలే మిగులు తీరం చేరవు మీ కథల్’’అన్నాడు .కార్మిక హక్కులు చాలాఉన్నాయని ,అదరక బెదరక ఐక్యతతో వాటిని సాధించుకోమని ‘’శాంతి జీవనమెన్నుమా ‘’అని హింసా దౌర్జన్యాలు శ్రేయంకాదన్నభావంగా హితవు చెప్పి ‘’దేశనేతలు మారుతారని ,కృషికి తగ్గ ఫలితం లభిస్తుందని భరోసా ఇచ్చాడు .జలవనరులు సద్వినియోగం చేసుకొంటేనే ప్రగతి అంటూ ‘’మానవజాతికిన్ మిగుల మ్రాకుల వృద్దియే వర్ధన౦బుగా’’అని చెట్లు పెంచమని ,’’జలము వ్యర్ధంబు జేయంగ జాతినలిగి –కస్టనస్టంబు పాలగు –కరువు హెచ్చు ‘’అని ఘోషించాడు .వృద్ధుల ఆలలనా,పాలనా చూడక కొడుకులుంటే వాళ్ళ అధోగతికి బాధపడుతూ ‘’కాలము దీరగన్ దుదకు గట్టెగ మారెను గా౦చకే సుతుల్ ‘’ఇలాంటి తల్లిని డాలరుమత్తులో ఉన్న కొడుకు చూద్దామని ఊరికివస్తే జనులు తిట్టి శాపనార్ధాలు పెడితే ‘’కూలెను కుప్పగా నతడు కొట్లకు లభ్యమే తల్లి దీవెనల్ ‘’అని తల్లి దీవెనలోని ఉత్క్రుస్టత తెలిపాడుకవి .
దేశానికి వెన్నెముక రైతు అంటూ నినాదాలేకాని అతని ఆత్మహత్యలను పట్టించుకున్నవాడు లేడని బాధపడ్డాడు –‘’అన్నదాత లిట్టు లాత్మహత్య కు బూన –భావితరపు జనుల బ్రతుకు లుడుగు ‘’అని ప్రశ్నించి ,రాబోయే అనర్ధాన్ని కళ్ళకు కట్టించాడు.లక్షలు పోసి కార్పోరేట్ విద్యా సంస్థలో చదివేవారికి వచ్చేది’’పేలవమ్మగువిద్య ‘’మాత్రమేనని ఉచితంగా చదువు చెబుతూ ఉత్తమ ఉపాధ్యాయులు బోధించే సర్కారు బడులు నాణ్యమైనవీ ,మాన్యమైనవీ అని చెప్పి ‘’చదువుకొనెడి శ్రద్ధ ,చైతన్యమగు బుద్ధి ‘’ఉంటేచాలు ఘనత లభిస్తుందని చెప్పాడు .ప్రేమ కరువైతే భావిపౌరులు దొంగలు ,తీవ్రవాదులు గా మారుతారని మానసిక నిపుణులు హెచ్చరిస్తున్నారనీ’’భిన్న ధృవమ్ములన్ గలిపి పెద్లిని జేసినా పెద్దలు ‘’కంట్లో వత్తులు వేసుకొని కాపురాన్ని నిలబెట్టే ప్రయత్నం చేయాలనీ చిన్న విషయాలు పెద్దవికాకుండా ‘’చిక్కులు దీర్చెడి వారె దేవతల్’’అని కితాబిచ్చాడు .సమాజ శ్రేయస్సే కర్తవ్యంగా పిల్లల్ని పెంచాలని ‘’చిన్ననాడే మనసు చిగురించు వేళలో –చెత్తనాట దగదు చిత్తమందు ‘’అని మనకూ బుద్ధి చెప్పి పరులకస్టాలలలో బాగులు కోరే బుద్ధి నేర్పమని సలహా ఇస్తాడు .మోసం చేసే సీరియళ్ళకు మూతలు బిగి౦చ మన్నాడు .’’ఆంగ్ల భాష మోజు అసలుకే మోసమ్ము’’’’వెలుగులనిచ్చు భాష మరి వీడుట ధర్మమే ?’’అని ప్రశ్నించాడు .కార్పోరేట్ వైద్యం వెర్రి తలలను స్పృశిస్తూ ‘’ఆపరేషను జేయుట యవసరమ్ము –గంటలోపల సొమ్మును గట్ట వలయు –తలలు తాకట్టుబెట్టి యా ధనమునీయ –చాల శ్రద్ధగ నటియించి శవము నిచ్చు ‘’
భావ ప్రకటన స్వేచ్చ వికృత చేస్తను ఎత్తి చూపాడుకవి –‘’చట్టము లోగల లోసగుల –గట్టిగ కెలకంగాబూన’’ గబ్బే’’ మిగులున్ ‘’అని వేలుపెట్టి వాసన చూసే వెర్రినాగన్నలకు గున పాఠం చెప్పాడు .
అనుబంధంగా ఉన్నవాటిలో ‘’చీరే సొగసు చూడ తరమా ?’’లో స్త్రీచీరకట్టుకొంటే అందం రెట్టింపు అవుతుందనీ అదే చీరే కొంగు ఎండ వేడికి గొడుగౌతుందని ,కూలిపనికి తలపై చీర చుట్ట బరువు జీవితభారం మోయటానికి సహకరిస్తుందని ,చివరికి అ౦తులేని బాధలతో ఉన్నవారికి ‘’ఉరి’’ కి కూడా ఉపయోగపడుతుందనిఅందంగా అర్ధవంతంగా బాధగానూ చెప్పాడు .జడపై పద్యం చెబుతూ ‘’జడ య౦దము స్త్రీలకు –జడయల్లినయపుడే దాని ‘’జాణ’’న సబబౌ ‘’అంటాడు .ఇవికాక ఈశ్వరవైభవం ,ధనుర్మాస విశిష్టత ,దేశభాషలందు తెలుగులెస్స,పోలవరం, వ్యాస వైభవం ,నేటియువత, కర్తవ్యమ్ శీర్షికలతో అర్ధవంతమైన పద్యాలున్నాయి .
ఈ కవితా సంపుటిలో ప్రతి శీర్షికకు ఉపోద్ఘాతం, దానికి తగ్గ మంచి శ్రీ చిత్రం ఉండటం విశేషం .సమాజాన్ని అన్నికోణాలలోనూ దర్శించి ,జరుగుతున్న అన్యాయాలకు ,కుళ్ళిపోతున్నవ్యవస్థ ,కుటుంబం , సమాజానికి ,మానవ వనరులు సద్వినియోగపడకపోవటానికి సంక్షేమం మాటలలోనే కాని చేతలలో కనిపించకపోవటానికి, భావదారిద్ర్యానికి ,తెలుగు భాష దీనస్థితికి ,కార్పోరేట్ కారుమేఘాలు కమ్ము కోవటానికి ,బాధలు గుండె గొంతుదాటి బయటకు రాకపోవటానికి , సగటు మనిషి ఏమీ చేయలేక కార్చిన’’ కన్నీటి బొట్టును ‘’అర్ధవంతమైన ముఖ చిత్రంగా మలచిన చిత్రకారుడు ‘’ శ్రీ అలహరి రాము ‘’కవితోపాటు మిక్కిలి అభినందనీయుడు .
‘’పూజా నైవేద్యం లేకుండా ఉన్నాడుకాని మా దేవుడు మహా గొప్పవాడు’’అని ఒక సామెత ఉంది .ఇది మిత్రుడు వెంకటప్పయ్య విషయం లో పూర్తి యదార్ధం .అతడు సంస్కృతాంధ్రాలలో నిష్ణాతుడు .ఆ రెండుభాషలలో కవిత్వ సవ్యసాచి . ఇంతవరకు కృష్ణా జిల్లా తెలుగు రచయితల సంఘం, ,ఆంధ్రప్రదేశ్ రచయితల సంఘం మొన్ననే పుట్టిన ప్రపంచ తెలుగు రచయతల సంఘం , ఆంద్ర దేశం లోని మరి యే సాహితీసంస్థ వెంకటప్పయ్య సాహితీ ప్రతిభకు తగిన గుర్తింపు ఇవ్వకపోవటం శోచనీయం .సరసభారతి మాత్రం ఆ గౌరవం దక్కి౦చు కొన్నది .అ మధ్య నాతోమాట్లాడుతూ శ్రీ టేకుమళ్ళ తాను ‘’సాంఘిక ప్రబంథం’’రాస్తున్నానని త్వరలోనే పూర్తవుతుందని చెప్పాడు .శుభం భూయాత్ .గరికపాటివారి’’ సాగర ఘోష ‘’లోలాగా ఈయన ప్రాంతమైన నెల్లూరు దాని ప్రక్కనున్న పినాకినీ నదీ ఘోష ,,ప్రస్తుతం ఉంటున్న విజయవాడలోని కృష్ణానదీ ఘోష కలిసి అందులో ప్రతిధ్వనిస్తాయని ఆశిస్తూ ,మరిన్ని మంచి పద్యరచానలతో అలరించాలని టేకుమళ్ళ వారిని కోరుతూ-
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -15-6-19-ఉయ్యూరు
—

