నా దారి తీరు -121
గుడివాడ డివిజన్ లో విద్యా విషయక కార్యక్రమాలు
నేను అడ్డాడ హైస్కూల్ హెడ్ మాస్టర్ గా ఉండగా ,గుడివాడ డివిజన్ డిప్యూటీ విద్యా శాకాది కారులు కొందరుమారి కొత్తవారు వచ్చారు .శ్రీమతి ఇందీవరం గారి తర్వాత ఎవరొచ్చారో గుర్తులేదుకాని శ్రీ ఏసుపాదం గారు రావటం బాగా జ్ఞాపకం .ఆయన రావటం తోనే చాలాహడివిడి చేసి మీటింగులు పెట్టి డివిజన్ లో ఏవేవో గొప్పమార్పులు తేవాలని తీవ్ర ప్రయత్నం చేశారు .హెడ్ తలాడిస్తే తోకలూఊపాల్సినదేకద.మేమూ తలాడించి పనిచేశాం .ఆయన ‘’గాడ్ ఫియర్ ‘’పర్సన్ గా కనిపించారు .అప్పుడే కొత్తగా పబ్లిక్ పరీక్షలకు వెళ్ళే విద్యార్ధులకు కరదీపికగా హాండ్ బుక్ తయారు చేయటం ప్రారంభమైనదని జ్ఞాపకం .దీనికిగాను సబ్జెక్ట్ లో కాస్త పట్టు ఉన్న హెడ్ మాస్టర్లు అసిస్టెంట్ లు కలిసి సబ్జెక్ట్ కమిటీలుగా ఏర్పాటై పరేక్షలలో వచ్చే ముఖ్యమైన ప్రశ్నలు వాటి సమాధానాలతో ఏ సబ్జెక్ట్ కు ఆ సబ్జెక్ట్ కు తయారు చేసే పనిపట్టాం .నేను ఇంగ్లీష్ ,ఫిజికల్ సైన్స్ కమిటీలలో ఉన్నాను .ఇంగ్లీష్ లో నిధి అంగలూరు హెడ్మాస్టర్ శ్రీ జోశ్యుల సూర్యనారాయణ మూర్తిగారు మాకు ఇంగ్లిష్ కమిటీ హెడ్ .ఫిజిక్స్ కు నారాయణశర్మగారు అనే శ్రీ కూచిభొట్ల లక్ష్మీ నారాయణ శర్మ గారు హెడ్ అని గుర్తు .వీరు నామిత్రులు శ్రీ పసుమర్తి ఆంజనేయ శాస్త్రి గారికి తోడల్లుడు .సబ్జెక్ట్ లో నిధి .అన్ని విషయాలు వ్రేళ్ళమీద ఉండేవి .చైన్ స్మోకర్ ప్రైవేట్ కాలేజీలో ఫిజిక్స్ లెక్చరర్ గా సాయం కాలాలో పని చేసేవారు .ఆయన తెల్లటి మల్లు పంచే తెల్ల హాఫ్ హాండ్స్ షర్ట్ తో ఉండేవారు .కొంచెం నలుపురంగుగా ఉన్నా చిరునవ్వు ముఖం .చాలా సరదాగా మాట్లాడేవారు . జోక్స్ పేల్చటం ఆయన హాబీ .ఆయన నవ్వు కూడా విటగా ఉండేది .లోకల్ ప్రైవేట్ హై స్కూల్ లో సైన్స్ టీచర్ . ఎవరికి ఏ సందేహమోచ్చినా తీర్చగలసత్తా ఉన్న వ్యక్తీ .నేను రిటైరయ్యాకే ఆంజనేయ శాస్త్రి గారికి ఈ శర్మగారు తోడల్లుడు అని తెలిసింది .అంతటిదాకా తెలీదు నేన౦టే పరమ ఆత్మీయంగా ఉండేవారు . మీటింగ్ లలో ఇద్దరం ప్రక్కప్రక్కనే కూర్చునే వాళ్ళం .ఆయన పలకరింపు ఒక పులకరి౦పే .రిటైరయ్యాకకూడా ఫోన్ లో పలకరించుకొనే వాళ్ళం . అతిగా సిగరెట్లు తాగటం వలననో ,ఏమోఆయన సుమారు పది, పదిహేనేళ్ళ క్రితమే మరణించారని విన్నాను .
నేనూ, అంగలూరు సైన్స్ మాస్టర్ శ్రీ పొట్లూరి రాజేంద్రప్రసాద్ మొదలైనవాళ్ళం ఫిజిక్స్ బాచ్ లో ఉన్నాం .మేము సలహాలుఇస్తే రాజేంద్రప్రసాద్ గారు బాధ్యత అంతా తానేతీసుకొని పూర్తి చేసేవారు .ఇక్కడే చిరివాడకు చెందిన సోషల్ మేస్టర్ వేలూరి ఆయన (కృష్ణమూర్తి ?)బాగా పరిచయమయ్యారు .అలా అన్ని సబ్జెక్ట్ ల వారూ తయారు చేసి డివిజన్ తరఫున ప్రింట్ చేయించి ప్రతిస్కూల్ కు అక్కడున్న విద్యార్ధుల సంఖ్యను బట్టి సరఫరాచేసే ఏర్పాటు జరిగింది .జనవరి ,ఫిబ్రవరి ,మార్చి నెలలో ఈ పుస్తకాలు చదివితే ఉత్తీర్ణత గారంటీ అనే అభిప్రాయం తో తయారైనపుస్తకాలివి .వీటిని ప్రతి స్కూల్ లోను ఆవరేజ్, బిలో ఆవరేజ్ విద్యార్ధులతో బాగా చదివించి లెక్కలు అయితే చేయించి పాస్ అవటానికి మార్గం సుగమం చేశారు .దీన్ని ఆదర్శంగా తీసుకొని మిగిలిన డివిజన్స్ వాళ్ళూ అనుసరించారు .తర్వాతతర్వాత ఏ డివిజన్ కు ఆ డివిజన్ వాళ్ళు శ్రమపడి తయారు చేశారు .శ్రీ ఏసుపాదం గారు తర్వాత జిల్లా విద్యాశాఖాధికారి అయ్యారు .అప్పుడు జిల్లాలోని సబ్జెక్ట్ ఎక్స్ పర్ట్శ్ కూర్చుని జిల్లాకంతటికీ ఈ సోర్స్ బుక్స్ లేక గైడ్ బుక్స్ తయారు చేయించి పంచిపెట్టి౦చి నట్లు జ్ఞాపకం .తర్వాత కొన్నేళ్ళు ఈ జాతర కొనసాగింది .కృష్ణా జిల్లా ప్రదానోపాధ్యాయ సంఘం కూడా కీలక బాధ్యతలు చేబట్టి ఈ బృహత్ప్రయత్నానికి యధా శక్తి సాయం చేసింది .తరువాత తర్వాత దీనిపై మోజుతగ్గి మొహం మొత్తి విరమించారని విన్నాను .ఏసుపాదంగారు ఇక్కడ ఉండగానో లేక ఏలూరు బదిలీ అయ్యాకో ‘’అవినీతి కుంభకోణం’’ లో బుక్ అయి సస్పెండ్ అయ్యారని తెలిసింది .ఒకప్పుడు 1970దశకం లో జాన్ గారనే డియివో కూడా ఇలాగే దెబ్బతిన్నారు .అధికారులు పైకి నిర్దుష్టంగా ,లోపల లోపభూయిష్టంగా ఉండటమే దెబ్బతినటానికి కారణం .
నేను రిటైరవ్వటానికి ముందు గుడివాడ డిప్యూటీ ఎడ్యుకేషనల్ఆఫీసర్ గా శ్రీ టి. శ్రీరామమూర్తిగారు వచ్చారు .మితభాషి . సజావుగా చక్కగా పని చేసి అందరి మన్ననలు అందుకొన్నారు .ప్రతిస్కూల్ కు విజిట్లు, వార్షిక తనిఖీలు పెండింగ్ లేకుండా చేసి విద్యా రంగానికి మార్గదర్శనం చేశారు .పరీక్షలు నిర్దుష్టంగా జరిపించారు .మంచి మనిషిగా బాధ్యత గల ఆఫీసర్ గా గుర్తింపు పొందారు .మా అడ్డాడ హైస్కూల్ ఇన్స్పెక్షన్ కూడా చేసి బాగా సంతృప్తి చెందారు .మమ్మల్ని చూసి నేర్చుకోవాల్సింది చాలాఉందని మిగిలిన స్కూల్స్ లో చెప్పేవారు .నా రిటైర్మెంట్ రోజున మా ఆహ్వానం పై వచ్చి ,నా పి.ఎఫ్. (ప్రావిడెంట్ ఫండ్ )నుంచి రావాల్సిన 60 వేల రూపాయల డబ్బు ను చెక్కు రూపంగా తెచ్చి నా చేతిలో పెట్టి సర్ప్రైజ్ చేశారు .ఇలాంటి ఆఫీసర్లు ఉంటే పని చేసేవారికి ఆనందం సంతృప్తి .మనసులు గెలవటం అంటే ఇదే .
సశేషం
మీ -గబ్బిట దుర్గాప్రసాద్ -18-6-19-ఉయ్యూరు
—
—
—
—

