నా దారి తీరు -124 ఉయ్యూరులో ధార్మిక ప్రవచనం

 నా దారి తీరు -124

ఉయ్యూరులో  ధార్మిక ప్రవచనం

నేనూ ,నా బోధనా, స్కూలు ,చదువు రాత లతో సమయం సరిపోయేది .మా సువర్చలాన్జనేయస్వామి ఆలయ నిర్మాణం పునః ప్రతిష్ట లతో కొంతకాలం గడిచింది .ధనుర్మాసం లో ఉదయం దేవాలయం లో పూజ .నేను సుందరకాండ పారాయణ ,ఎవరు విన్నా వినకున్నా స్వామినే శ్రోతగా చేసుకొని నెలరోజులు చేసేవాడిని .ఇలాగడిచింది కొంతకాలం .మా గుడికి వెళ్ళేటప్పుడు దారిలో ఉన్న విష్ణ్వాలయం కి వెళ్లి పంచపట్టాభిరామస్వామిని, శ్రీ రాజ్యలక్ష్మీ వేణుగోపాలస్వామిని దర్శించి వెళ్ళటం అలవాటు .అక్కడి పూజారులు మా గుడిలోనూ పని చేసినవాళ్ళు .కొందరు నా శిష్యులు కూడా. ఒకరోజు ఇక్కడిపూజారి ఛి వేదాంతం రమణాచార్యులు ‘’మాస్టారూ !విష్ణ్వాలయం లో మీ ప్రవచనం ఏర్పాటు చేయమని చాలామంది అడుగుతున్నారు .మీరు ఒప్పుకుంటే మైక్ లో అనౌన్స్ చేస్తాను ‘’అన్నాడు .అడగకుండా వచ్చిన సదవకాశం .సరే అన్నాను .

ఒక  ధనుర్మాసం  లో రోజూ సాయంత్రం 6-30నుండి 8గం లవరకు శ్రీమద్రామాయణం ధార్మిక ప్రవచనం ప్రారంభించాను .సరిగ్గాఆరున్నరకు ప్రార్ధనతో ప్రారంభం చేసేవాడిని .ఎవరు వచ్చినా రాకపోయినా దేవుళ్ళూ ,పూజారి రమణ ఉన్నారుగా అని నమ్మకం .క్రమంగావినే వాళ్ళూ పెరిగారు  ‘’గాస్ పంతులు’’గా అందరికీ పరిచయంగా ఉన్న  సూరి వెంకటేశ్వర్లు అనే రమణ  వెంట్ర ప్రగడ వారి మహాలక్ష్మీ గాస్ కంపెనీలో మేనేజర్ గా ఉండేవాడు .సాయంత్రం డ్యూటీకాగానే స్నానం చేసి నిత్య శ్రోతగా మారాడు .ఆడవాళ్ళు బాగానే వచ్చేవారు. కొందరు మగవారు రెగ్యులర్ శ్రోతలుగా ఉండేవారు .ఒక రోజురమణ  ‘’బాబాయ్ !నీ పురాణం వింటుంటే మీ మేనమామ గంగయ్యగారి పురాణం వింటున్నట్లుగా ఉంది. అంతకంటే స్పష్టంగా కూడా ఉంది ‘’అన్నాడు .అతడు సూరి శోభనాచలపతిగారబ్బాయి .మా ఇంటి సందుకు ఎదురిల్లు .ఇతని అన్నగారు’’ గోవా వీరుడు రామం ‘’.రమణ నేను ఒకరినొకరం ‘’బాబాయ్ అని పిల్చుకోవటం అలవాటు .ఒక శ్రోతకు నచ్చింది కదా  పురాణం అని సంతోషించాను .జనం మీద నా  దృష్టి ఉండేదికాదు .నాన్ స్టాప్ గా చెప్పటమే పని .పేపర్లలో రామాయణం పై వచ్చిన విశేషాలను ఆధ్యాత్మ రామాయణం, రామాయణ కల్పవృక్షం లనుంచి కూడా సందర్భానికి తగినట్లు విశేషాలను తెలిపేవాడిని .కొంచెం సైంటిఫిక్ ఆస్పెక్ట్ జత చేసి చెప్పేవాడిని .ధనుర్మాసం చివరి రోజున నాకు పూజారి శాలువ కప్పి సత్కరించి కొంత నగదు కూడా ఇచ్చిన జ్ఞాపకం .

  మరుసటి ఏడు వేదాంతం దీక్షితులు పూజారి .అతడు కూడా ప్రవచనం చెప్పమని కోరాడు భాగవతం పై ప్రవచనం చేశాను .తర్వాత మరో ఏడాది  సుందరకాండ ,ఇంకో ఏడు జైమిని భారతం చెప్పాను .మళ్ళీ రమణ వంతు వచ్చి చెప్పమని కోరితే ‘’ఆముక్తమాల్యద ‘’చెప్పి గోదా దేవి చరిత్రను ఉయ్యూరు లో మొట్టమొదటిసారిగా పూర్తి వివరాలతో చెప్పి రికార్డ్ సృష్టించాను .అప్పటికే మా దేవాలయం లో ధనుర్మాసం ఉదయాన శ్రీతిరుప్పావై పఠించటంప్రారంభించి అప్పటి నుంచి ఇప్పటిదాకా ధనుర్మాసం నెలరోజులు తిరుప్పావై కులశేఖర ఆల్వార్ రాసిన ముకుందమాల చదువుతూనే ఉన్నాను .ఇప్పటికీ ధనుర్మాసం నెలరోజులూ ఇవన్నిటితోపాటు  సుందరకాండ పారాయణ చేస్తున్నాను .ధనుర్మాసం నెలలో కనీసం మూడు సార్లు అయినా పారాయణ చేస్తాను .ఇక్కడేకాదు అమెరికా వెళ్ళినా ఈ మధ్య అలాగే చేస్తున్నాను . గడచిన  2019ధనుర్మాసం తో సహా ఇప్పటికి నేను సుందరకాండను 64సార్లు పారాయణ చేసినట్లు గుర్తు .భక్తులు కోరితే కొందరికి 9రోజులు కొందరికి 5రోజులు పారాయణ చేసి కల్యాణం కూడా జరిపించాను .దాదాపు 2002వరకు  విష్ణ్వాలయం లో   పురాణ ప్రవచన చేసినట్లు జ్ఞాపకం .ఆతర్వాత అమెరికా వెళ్ళటం ,ఇతరకార్యక్రమాలవలన ఆపేశాను .

  సాహితీ మండలి కార్యక్రమాలకు పామర్రునుంచి తెలుగుమేస్టారు శ్రీ నల్లూరి బసవలింగం గారు వచ్చిపాల్గొనేవారు ,ప్రసంగించేవారు పద్యాలురాసి వినిపించేవారు ఆయన ను ‘’అపర ఘంటసాల ‘’అనేవాడిని .అదే బాణీలో అంతే కమ్మగా పాటలు, పద్యాలు పాడి జనరంజకం చేసేవారు .మంచి హరికథకులు .కూడా చాలాచోట్ల హరికథాగానమూ చేసేవారు .భీష్మ సినిమాలో ఘంటసాల పద్యాలు అద్వితీయంగా పాడేవారు .కరుణశ్రీ జాషువా పద్యాలు వీనులవిందుగా పాదేనేర్పు ఆయనది .పింగళి సూరన కళాపూర్ణోదయం ఆయనకు వాచో విదేయం .చేతిలో పుస్తకం అక్కరలేకుండా అనర్గళంగా పద్యాలు వచనాలు అందులోని సౌందర్య  కథా విశేషాలు అలవోకగా  తడబాతులేకుండా చెప్పేవారు .రేడియోలో దీన్ని ధారావాహికంగా చెప్పారు .మాసాహితీ మండలిలోనూ చెప్పారు. చాలా చోట్ల చెప్పారు .ఆయనకు ఆయనే సాటి నవ్వు ముఖం నల్లగా ఉన్నా సరదామనిషి కన్నడం లో దిట్ట కన్నడం నేర్పేవారు .దీనికి ప్రభుత్వం డబ్బు ఇచ్చేది. వేసవి సెలవులలో బెంగుళూరు వెళ్లి అక్కడ కూడా బోధించేవారు .నాకు పరమమిత్రుడు .ఉయ్యూరువస్తే మా ఇంటికి వస్తే  భోజనం చేయకుండా పంపించే వాళ్ళం కాదు.వచ్చినదగ్గర్నుంచి వెళ్ళేదాకా పాట లేక పద్యప్రవాహం జరగాల్సిందే .కమ్మని హాస్యం తో ప్రసంగించేవారు .పిట్టకథలు బగా చెప్పేవారు .బందరు స్పాట్ వాల్యుయేషన్ సెంటర్ లో తెలుగుపండితులకు ఆయన సమక్షం లో సందడే సందడి.అడ్డాడ హైస్కూల్ కు బసవలింగం గారిని ఆయన రిటైర్ కాకము౦దూ , రిటైర్ అయ్యాకా పిలిపించి సత్కరించాము .ఉయ్యూరు సాహితీమండలిలోనూ మా తలిదండ్రుల స్మారక పురస్కారం అందేశాము .అరుదైన వ్యక్తి ఆయన .

  అలాగే ఉయ్యూరు దగ్గర పెద వోగిరాలకు చెందిన శ్రీ వోగిరాల వెంకట సుబ్రహ్మణ్యం గారు గన్నవరం దగ్గర పెదవుటపల్లి లో ఉండేవారు .ఆయన చింతలపాటి సోదరులు దివి సీమలో కోసూరు  మొవ్వ చల్లపల్లి కూచిపూడి లలో  భారతీయ సాహిత్యపరిషత్ ఆధ్వర్యంలో సాహిత్య కార్యక్రమాలు జరుపుతూ నన్ను ఆహ్వానించేవారు .ఒక సారిఅలా వెళ్లి  వస్తుంటే బస్సులో సుబ్రహ్మణ్యం  గారితో పరిచయమేర్పడి ఆయన మరణించేదాకా కొనసాగింది  .ఆయనను మండలికి పరిచయం చేసి పురస్కారమిచ్చి గౌరవి౦చా౦ ..ఆయన రాసిన భక్తిశతకాలకు నాతొ ముందుమాటలు రాయించేవారు. ఒకశతకాన్ని ఆనాటి శాసన సభ్యులు గద్దె రామమోహనరావు గారు ఆ ఊళ్లోనే ఆవిష్కరించారు .ఆసభకు నన్నూ రమ్మంటే వెళ్లి మాట్లాడాను .ఒకరకంగా ఆయన మాకు  ఫామిలీ ఫ్రెండ్ అయ్యారు .ఆయన భార్య పిల్లలు బాగా పరిచయస్తులయ్యారు .వారింట్లో వివాహాలకు మేము మా ఇంట్లో పెళ్లిళ్లకు గృహప్రవేశానికి ఆయనా భార్య పిల్లలు  హాజరవటం తప్పని సరి .నాకంటే పెద్దవారైనా ఆయనకు నేను అంటే  విశేషమైన గౌరవం ఉండేది .మా ఇంటికి వస్తే జామపళ్ళు రేగిపళ్ళు తేకుండా ఉండేవారుకాదు .వారి అబ్బాయిలూ అంతటి అభిమానం గా ఉండేవారు .సుమారు పదేళ్ళక్రితం సుబ్రహ్మణ్యం గారు మరణించారు .తెల్లపంచే తెల్లచొక్క ఖండువా తెల్లజుట్టు ,చేతిలో సంచి ఆయన  ప్రత్యేకత .

  మరొక విశేష వ్య క్తి ఉయ్యూరు ఆంధ్రాబాంక్ లో చీఫ్ అకౌంటెంట్ గా ,మేనేజర్ గా పని చేసిన శ్రీ జానకి రామశర్మగారు  ఇంటిపేరు గుర్తు లేదు .విశ్వనాథ వారు అంతేవాసి .వారి సాహిత్యాన్ని ఔపోసనపట్టినవారు. అనర్గళంగా   మాట్లాడగలవారు .పద్యాలు రాయటం లో ఆయన శైలి విభిన్నం .అందీ అందకుండా ఉండేది. సాహితీమండలికి ఆయన ఆభరణం .రిటైరయ్యాక తెనాలిలో స్థిరపడ్డారు .మా ప్రత్యేక కార్యక్రమాలకు ఆహ్వానిస్తే శ్రమపడి వచ్చేవారుకూడా .

  ఉయ్యూరుకు చెందిన శ్రీ కూచిభొట్ల శ్రీరామ చంద్రమూర్తి గొప్ప సాహిత్య జ్ఞానమున్నవారు .ఆయన్ను శ్రీనాధుడు అనేవాడిని .అ౦తాతనకే తెలుసుననే భావన ఉండటం వల్ల దూరమయ్యారు  .యువకులలో త్రినాథ్ అనే మా హైస్కూల్ శిష్యుడు కూడా వచ్చేవాడు .అతన్ని కవిత్వం రాయమని బలవంతపెడితే తప్ప రాసేవాడు కాదు. మాట్లాడమని ఎన్నో సార్లు చెబితేనే మాట్లాడేవాడు .ఇవాళ ఉయ్యూరు హై స్కూల్ లెక్కలమేస్టారుగా బాగా రాణిస్తున్నాడు .మంచి వక్త కూడా అయ్యాడు .అలాగే సురేష్ ?అనే కుర్రాడు రెగ్యులర్ గా వచ్చి సహాయమూ చేసేవాడు . రాదా కృష్ణ  కుంటికాలు ఉన్నా కర్రలు  చేతుల్లో ఉన్నా , నడవటం కష్టమైనా క్రమం తప్పకుండా వచ్చి పాల్గొని తర్వాత  ఆయనే సంస్థను పూర్తిగా నిర్వాహించే స్థాయి సంపాదించాడు .గరికపర్రు కో ఆపరేటివ్ బాంక్ లో పని చేసి రిటైర్ అయిన శోభనాద్రిగారు కూడా మాలో కలిసిపోయి సుదీర్ఘమైన కవితలు వినిపించేవారు .మా గురువుగారు శ్రీ గరుడాచలం గారూ హాజరయ్యేవారు .అలాగే గరికపర్రు అప్పర్ ప్రైమరీ హెడ్ మాస్టర్ శ్రీ రంగారామానుజం గారు రెగ్యులర్ కస్టమర్. మధ్యలో నిద్రపోయినా చివరిదాకా ఉండేవారు .తర్వాత అధ్యక్షులుగా పని చేశారు .తెలుగు లెక్చరర్ గా  పశ్చిమ గోదావరిజిల్లాలో పని చేసిరిటైర్ అయ్యాక ఉయ్యూరు లో బిల్డింగ్ కట్టుకొని స్థిరపడ్డ శ్రీ పి.విజయసారధి ని సంస్థకు నేనే పరిచయం చేశాను .ఆయన మంచి ఉపన్యాసకులు .అన్నీ బాగా ప్రిపెరై చక్కగా మాట్లాడేవారు .ఇంతమంది  సాహిత్యకారులకు సాహితీమండలి  వేదికగా నిలిచింది .తర్వాతవచ్చిన శ్రీ భవానీశంకరరావు, శ్రీ గిరిరెడ్డిచురుకుగా పాల్గొని తర్వాత సంఘ బాధ్యతలూ చేబట్టారు .కృష్ణా జిల్లా రచయితల సంఘ సమావేశాలకు మేమందరం కలిసే వెళ్ళేవాళ్ళం .మా వంతు పాత్ర నిర్వహించేవాళ్ళం

  పెన్షనర్స్ అసోసియేషన్

బసవాచారి గారు చనిపోయాక పెన్షనర్స్ అసోసియేషన్ నిర్వీర్యమై పోయింది .అప్పుడు శ్రీ కే.కోటేశ్వర శర్మగారు అనే రిటైర్డ్ క్రాఫ్ట్ మాస్టర్ గారు అధ్యక్షులయ్యారు .నేను  రిటైర్ అయ్యాక .రిటైరీలందరం శ్రీ వీరమ్మ తల్లి దేవాలయం అరుగులమీద సాయంకాలలో చేరేవాళ్ళం .పిచ్చాపాటీ మాట్లాడుకొంటూ కొంతకాలం గడిపి పెన్షనర్స్ అసోసియేషన్ ను బలపరచాలని నిర్ణయించి శర్మగారికి సాయంగా శ్రీ కృష్ణమూర్తి గారనే హెల్త్ డిపార్ట్మెంట్ లో క్లార్క్ గా రిటైరైన కృష్ణ మూర్తిగారిని  సెక్రెటరి,  నేను వైస్  ప్రెసిడెంట్  శ్రీ పారుపూడి శ్రీరామమూర్తి మొదలైనవారు సభ్యులుగా ఒక కమిటీ ఏర్పాటు చేసి బాగానే కృషి చేశాం. శర్మగారికి కృష్ణమూర్తిగారికి రూల్స్ బాగా తెలుసు .సభ్యత్వ చందా వసూలు చేయించి రసీదులు రాయించి ,ప్రతి సమావేశం లో జమాఖర్చులు చెప్పి౦చి పకడ్బందీగా నడిపాం .శర్మగారు ఏదో తన పుట్టిన రోజు అనో పిల్లలపుట్టినరోజు అనో దాదాపు ప్రతినెలా వాళ్ళింట్లో మంచి అల్పాహార విందు ఇచ్చేవారు .మేమూ వీలైనప్పుడల్లా అలానే చేసేవాళ్ళం .పెన్షనర్ల ఫిక్సేషన్  అరియర్స్ వగైరాలకోసం ఎలిమెంటరి టీచర్స్ రంగరామానుజం గారి దగ్గరకు చేరేవారు .ఆయన్ను మాలో కలుపుకొని సాగాం .నిలవడబ్బు పోస్టాఫీస్ లో జాయింట్ అకౌంట్ తెరచి జమ చేయి౦ చేవాళ్ళం .ఇలా చేయకపోతే నేను ఊరుకోనేవాడిని కాదు . రాష్ట్ర సంఘానికి మా సంఘాన్ని అనుబంధంగా మార్చాం .వారి నుంచి డైరీలు పొందేవాళ్ళం .

 పెన్షనర్స్ వాయిస్ మాసపత్రిక

   బసవా చార్యులుగారు నడిపిన ‘’రిటైరీ’’మాసపత్రిక ఆయన మరణం తో ఆగిపోయింది .దాన్ని ‘’పెన్షనర్స్ వాయిస్ ‘’అనే మాసపత్రికగా మార్చి నేను దాని ఉపసంపాదకుడిగా శర్మగారు సంపాదకుడుగా కొంతకాలం బాగానే నడిపాం .నేను ఎడిటోరియల్స్ కొన్ని ముఖ్యసాహిత్య వ్త్యాసాలు రాసేవాడిని .శర్మగారు సమస్యలపై చర్చించి రాసేవారు మేదూరుకు చెందినా జ్ఞాన వయో వృద్ధులు శ్రీమాధవరావుగారు ఆధ్యాత్మిక విషయాలు రాసేవారు ఆయన మంచి సలహాదారు నేను అంటే బాగా అభిమాన౦ గా ఉ౦డేవారు నిరుడే చనిపోయారు  .నాలుగైదేళ్ళు బాగానే నడిచి౦ది పత్రిక .కానీ చందాలు సకాలం లో రాకపోవటం ప్రింటింగ్ ఖర్చు,పోస్టల్ చార్జీలు పెరగటం చందాదారులు పెరగకపోవటం వలన శర్మగారు ఆర్ధికంగా చాలా బాధ పడ్డారు .ఆయనే  బెజవాడ వెళ్లి పత్రిక ప్రింట్ చేయించి తెచ్చి అందరికి ప౦ పేవారుఇచ్చెవారు .తలకు మించినభారం అవటం ,పేపరు రు రెన్యు చేయకపోవటం తో పత్రిక ఆగిపోయింది .కాని పెన్షనర్స్ కు ఆశాజనకంగా నడిపాం నడిపినన్నాళ్ళు’’అదో తుత్తి’’ .

  పెన్షనర్స్ కో ఆపరేటివ్ సొసైటీ

మా అబ్బాయి రమణ హైదరాబాద్ లో త్రిప్ట్ కో ఆపరేటివ్ సొసైటీలో పని చేసి అనుభవం సంపాదించి ఉయ్యూరు లో ;;జాగృతి పొదుపు సహకార సంస్థ ‘’ప్రారంభించాడు .బాగానే నడుస్తోంది .వాడిని ఒకసారి పెన్షనర్స్ సమావేశానికి పిలిచి కో ఆపరేటివ్ సొసైటీ గురించి చెప్పించాను .చాలాబాగుంది మనం కూడా పెడదాం అని అందరూ అన్నారు .సరే అని ఒక ఆదివారం మా ఇంట్లోనే సమావేశం ఏర్పాటు చేసి శర్మగారినే దానికి ప్రెసిడెంట్ గా కృష్ణమూర్తిగారు  అకౌంటెంట్ గా నేను వైస్ ప్రెసిడెంట్ గా కమిటీ ఏర్పాటు చేసి ప్రతినెలాసభ్యులు 100రూపాయలు కట్టాలని అకౌ౦ట్స్ అన్నీ ఖచ్చితంగా ఉండాలని కమిటీ ఎవరికి లోన్ ఇవ్వాలో నిర్ణయి౦చి తీర్మానం చేస్తేనే  డబ్బు ఇవ్వాలని హామీ దారు ఉండాలని బై లాస్ అన్నీ రాసి ప్రారంభించాం .ఒకరకంగా బయటివారిదగ్గరకు డబ్బుకోసం ఎక్కువవడ్డీ తో డబ్బు తీసుకోవటానికి పోకుండా  ఇదొక సువర్ణ అవకాశం రిటైరీలకు .మూడేళ్ళు బాగానే జరిగింది .నేనూ లోన్ తీసుకొన్నాను అమెరికా వెడుతూ .నిల్వ సొమ్ము పోస్టాఫీస్ లో జాయింట్ అకౌంట్ ఖాతాలో ఉంచాం .తర్వాతతర్వాత శర్మగారు మాకు చెప్పకుండా ఎవరికి పడితే వారికి లోన్లు ఇచ్చి, వాళ్ళు కట్టక మేము ఆయన్ను నిలదీస్తే నోటమాటరాక ‘’పరపతి సంఘం పరపతి తిరపతి ‘’అయింది .చూసి చూసి చెప్పి చెప్పి విసిగెత్తి అందర్నీ ఎలర్ట్ చేసి ముందుగా నేను కట్టినడబ్బు అంతా తీసేసుకొన్నాను .తర్వాత ఒకరి తర్వాత ఒకరు లాగేశారు .కట్టేవారు లేరు అప్పులూ లేవు .చివరికి లెక్కలన్నీ తేల్చి ఎవరికీ నష్టం రాకుండా చూసి కో ఆపరేటివ్ సొసైటీని మూసేశాం .కాని మా అబ్బాయి జాగృతి దినదిన ప్రవర్ధమానంగా ఇప్పటికీ మంచి లాభాలతో విస్తృతంగా వ్యాపించి నడుస్తోంది .

  శర్మగారు ఆర్దికబాధలు తట్టు కోలేక ఆత్మ హత్య చేసుకొన్నారు .దీనితో పెన్షనర్స్ అసోసియేషన్, పెన్షనర్స్ వాయిస్ ,కో ఆపరేటివ్ సొసైటీ అన్నీ ఆగిపోయాయి .తర్వాత పెన్షనర్స్ అసోసియేషన్ రామానుజంగారి ఆధ్వర్యం లో నేనూ కొంతమంది కలిసినిలబెట్టి కొంతకాలం లాక్కోచ్చాం .ఎక్కడ తప్పటడుగు వేసినా ప్రశ్నించే నా నైజానికి రామానుజంగారు జీర్ణించుకోలేక నన్ను దూరం చేసి తొట్టిగాంగ్ ను దగ్గర చేర్చుకొని పెన్షనర్స్ డే నాడు లావిష్ గా ఖర్చు చేసి జమా ఖర్చులు చెప్పకుండా నడిపారు ,అనేక అక్రమాలకూ పాలుపడ్డారనే అభియోగంతో ప్రభుత్వం ఎంక్వైరీచేసి  అరెస్ట్ చేసి జైలు పాలు చేసినసంగతి నేను అమెరికాలో ఉండగా ఎపార్లద్వారా తెలిసింది   .నిర్దుష్టంగా ఉండకపోతే ఏ సంఘమూ నిలవదు అని గ్రహించాలి .ఆయనతర్వాత ఇప్పుడు పెన్షనర్స్ కు సంఘం ఉందొ లేదో నాకు తెలీదు .

   సశేషం

మీ –గబ్బిట దుర్గాప్రసాద్ – 21-6-19-ఉయ్యూరు


— 

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in నా దారి తీరు and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.