ఆధునిక ఆంధ్రశాస్త్ర రత్నాలు
- 27-‘’సుగర్ కేన్ టెస్టింగ్ రిఫ్రాక్టో మీటర్’’ సృష్టికర్త –భాగవతుల విశ్వనాథ్
భారతీయ వ్యవసాయరంగం లో అత్యుత్తమ శాస్త్రవేత్త శ్రీ భాగవతుల విశ్వనాథ్ 1-1-1889 న విశాఖ పట్నం లో జన్మించారు .తండ్రి జోగారావు .14 వ ఏట మెట్రిక్ పరీక్షలో లెక్కల్లో ఒకేఒక్కమార్కు తక్కువై తప్పారు .సైన్స్ లో 80 మార్కులొచ్చాయి .పరిశోధనపై ఆసక్తితో జపాన్ వెళ్లి ఒక ఏడాది పరిశోధన విషయాలపై అవగాహన పెంచుకొన్నారు .
ఇండియాకు తిరిగొచ్చి ,కలకత్తా లో ప్రముఖ రసాయనిక శాస్త్రవేత్త డా ప్రఫుల్ల చంద్ర రే(పి.సి.రే.) గారిని చేరి ఉత్తమ శిక్షణ పొందారు .జపాన్ అనుభవం తో మాంగనీస్ మొదలైన ఖనిజ విశ్లేషణ లో ఘనాపాఠీ అయ్యారు .ఖనిజాల ఎగుమతులను అధ్యయనం చేసి ,దానికి సంబంధించిన వ్యాపార సంస్థను నెలకొల్పి సాగక దెబ్బ తిన్నారు .తర్వాత మద్రాస్ ప్రభుత్వ అగ్రికల్చరల్ డిపార్ట్ మెంట్ లో కెమికల్ అసిస్టెంట్ ఉద్యోగానికి దరఖాస్తు చేయగా ,తగిన విద్యార్హతలు లేకపోయినా ,రసాయనిక శాస్త్రం లో చేసిన కృషిని తెలుసుకొని నిబంధనలు సడలించి ఉద్యోగం ఇచ్చారు .ఇక్కడితో ఆయన పరిశోధన దిశ కొత్త మలుపు తిరిగింది .నిరంతర పరిశోధన చేస్తూ ,మొదటి ప్రపంచయుద్ధం లో డెప్యుటేషన్ పై ఇరాక్ సందర్శించారు . తిరిగొచ్చి మళ్ళీ ఉద్యోగం లో చేరగానే ప్రభుత్వ వ్యవసాయ శాఖలో రసాయనిక శాస్త్ర వేత్తగా నియమి౦ప బడ్డారు .ఇక్కడ పని చేస్తూ భూసార పరిరక్షణపై గణనీయ పరిశోధనలు చేశారు .ఢిల్లీలోని అగ్రికల్చరల్ రిసెర్చ్ ఇన్ స్టి ట్యూట్ లో ఎర్త్ సైన్సెస్ విభాగ హెడ్ అయ్యారు .ఇక్కడ 1934నుండి 11ఏళ్ళు 1944 వరకు ఉండి,అత్యంత ప్రతిష్టాత్మకమైన ఈ పదవి పొందిన తొలి భారతీయుడిగా గుర్తింపు పొందారు .తొలి తెలుగు వాడూ అయినందున మనకూ గర్వకారణమే .రిటైర్ అయ్యాక దేశం లోని అనేక ప్రాంతాలలోని వ్యవసాయ రంగాలలో అత్యున్నత పదవులలో రాణించారు .
తర్వాత 1944-47 కాలం లో ఉమ్మడి మద్రాస్ స్టేట్ అగ్రికల్చరల్ డిపార్ట్ మెంట్ డైరెక్టర్ గా ,బెనారస్ హిందూ యూని వర్సిటి అగ్రికల్చరల్ డిపార్ట్ మెంట్ ప్రొఫెసర్ గా ,అగ్రికల్చరల్ కాలేజి ప్రిన్సిపాల్ గా,రాజస్థాన్ ప్రభుత్వ వ్యవసాయ శాఖ డైరెక్టర్ సలహాదారుగా సేవలందించారు విశ్వనాద్ . దేశం లోనే ప్రసిద్ధ వ్యవసాయ శాస్త్రవేత్త గా గుర్తింపు పొందారు .కేంద్రం లో కె.ఎం. మున్షీ మంత్రిగా ఉన్నకాలం లో ప్రారంభమైన ‘’వనమహోత్సవాలు ‘’కార్యక్రమం లో భాగస్వాములయ్యారు .కేంద్ర ప్రభుత్వ అధీనం లో ఉన్న అనేక ప్రణాళిక కమీషన్ లలో ,సలహా సంఘాలలో గౌరవ సభ్యులుగా ఉన్నారు .భూ వినియోగం మొదలైన అంశాలపై పలు మార్గ దర్శక సూచనలు చేశారు .24 వ ఇండియన్ కాంగ్రెస్ వ్యవసాయ విభాగానికి అధ్యక్షత వహించి ,వ్యవసాయ శాస్త్రవేత్తలకు మార్గ దర్శనం చేశారు .జర్మనీ ప్రభుత్వం కూడా వీరి నుండి వ్యవసాయ అభి వృద్ధికి సూచనలు తీసుకొన్నది .
తన సమర్ధతకు తగిన ఉన్నతపదవులెన్నో భాగవతులవారికి దక్కాయి .ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ శాఖ లోని బోర్డ్ ఆఫ్ అగ్రికల్చరల్ రిసెర్చ్ కి గౌరవ రీజినల్ అగ్రికల్చరల్ ప్రొడక్షన్ కమీషనర్ గా ,కార్యదర్శిగా 1950-51కాలం లో పని చేశారు .ప్లానింగ్ కమిషన్ లో అగ్రికల్చరల్ ప్రోగ్రాం కు గోరవ సలహాదారుగా ,1951-52లో ,ఇండియన్ కౌన్సిలాఫ్ అగ్రికల్చరల్ రిసెర్చ్ వారి సాయిల్ సైన్స్ కమిటీకి అధ్యక్షులుగా 1952నుంచి 56 వరకు నాలుగేళ్ళు ఉన్నారు .భూసారపరిరక్షణలో ,వ్యవసాయ పైశోధన రంగం లో అవిశ్రాంత కృషికి చాలా సంస్థలు వీరిని ప్రోత్సహించాయి .ఇండియన్ నేషనల్ సైన్స్ అకాడెమి ,,ఇండియన్ అకాడేమిఆఫ్ సైన్స్ మొదలైన సంస్థలలో ఫౌండేషన్ ఫెలోగా ఉంటూ పరిశోధనలు చేశారు .
సాయిల్ సైన్స్ ,ఫెర్టిలైజర్ ప్లాంట్ ,యానిమల్ న్యుట్రిషన్ ,షుగర్ కేన్ రిసెర్చ్ రంగాలలోనూ విశేష పరిశోధనలూ చేశారు .వ్యవసాయ ఉత్పత్తులను ,వ్యర్ధ పదార్ధాలను ఆర్ధికం గా ఎలా సద్వినియోగ పరచాలో అద్వితీయంగా వివరించారు .తగిన శాస్త్రవేత్తలతో కలిసి దేశం లోనే మొదటి సారిగా ‘’సాయిల్ మ్యాప్ ఆఫ్ ఇండియా ‘’తయారు చేసి కీర్తి శిఖరాలను అధిరోహించారు .చెరకు అధిక దిగుబడి ఉత్పత్తికి విశేష పరిశోధనలు చేశారు .చెరుకు గానుగ ఆడటానికి పక్వ స్థితిలో ఉన్నదో లేదో పరీక్షించే ‘’షుగర్ కేన్ రిఫ్రాక్టో మీటర్ ‘’తయారు చేసి విప్లవాత్మకమార్పుకు నాంది పలికారు .
జొన్న పంట దిగుబడి పెరగటానికి ,సింధటిక్ రబ్బర్ ఉత్పాదన లో భాగవతులవారి కృషి అద్వితేయమైనది .రసాయనిక ఎరువుల వాడకం తగ్గించి ,భూసారం పెంచి ఇతోధికంగా పంట దిగుబడి సాధించటానికి రైతులకు అనేక నూతన విషయాలను సూచించి ఆచరి౦ప జేసి అధిక దిగుబడిలో ఇండియా ‘ అగ్ర భాగాన నిలిచింది .భాగవతులవారికి బ్రిటిష్ ప్రభుత్వ౦ 1935లో ‘’కింగ్స్ సిల్వర్ జూబిలీ మెడల్ ‘’1936లో ‘’కింగ్స్ మెడల్ ‘’ అందజేసింది .ఆంధ్రా యూని వర్సిటి ‘’డాక్టర్ ఆఫ్ సైన్స్ అవరిస్ కాజ్ ‘’గౌరవ డిగ్రీ అందించింది .కేంద్ర ప్రభుత్వం రావు బహదూర్ ,C.I.E.గౌరవ పురస్కారాలిచ్చింది .
భాగవతులవారు ‘’The Effect of Manufacturing crop of negative and Re productivecapacity of the seed ‘’పరిశోధన వ్యాసం మంచి పేరు తెచ్చింది .ఇది జర్మని భాషలోకి అనువాదం పొందింది జొన్న ,వరి లపై కూడా రచనలు చేశారు .విజయనగరం లో ఒక రసాయనిక పరిశ్రమ స్థాపించారు.ఇలాంటి పరిశోధకవ్యాసాలు 100కు పైగా రాశారు .దేశానికి పూర్తిగా అంకితమైన వీరుఆంధ్ర రాష్ట్ర౦ లో నూ సేవలందిస్తూ ,బాపట్ల అగ్రికల్చరల్ కాలేజి స్థాపనలో ఎంతో సహాయం చేశారు .ఇన్ని విధాలుగా భారత వ్యవసాయ రంగం లో తనదైన ముద్ర వేసిన వీరికి చరిత్రలో తగిన స్థానం లభించకపోవటం ఆశ్చర్యంగా ఉంది .శ్రీ భాగవతుల విశ్వనాథ్ ఢిల్లీ లో 75 ఏట 1-2-1964న మరణించారు .
ఆధారం –శ్రీ వాసవ్య రచన ‘’ఆంద్ర శాస్త్ర వేత్తలు ‘’
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -1-7-19-ఉయ్యూరు
—
—

