ఆధునిక ఆంధ్ర శాస్త్ర రత్నాలు
29-తమలపాకుతోటల పెంపకం లో విప్లవం సృష్టించిన –చలసాని సుబ్బారావు
కృష్ణా జిల్లా భట్లపెనుమర్రు లో జన్మించిన చలసాని సుబ్బారావు ,అదేజిల్లా పెనమలూరు మండలం కానూరు లో స్థిరపడ్డారు .విద్యా గంధం లేకపోయినా తనదైనమార్గం లో అధ్యయనం చేసి అఖండవిజయాలు సాధించి రైతులకు స్పూర్తిప్రదాత అయ్యారు .అన్నిరకాల వ్యవసాయ ఉత్పత్తులలో అధిక దిగుబడి సాధించి రికార్డ్ సృష్టించారు .
1945-46లో తమలపాకుల తోటలను పెంచటం ప్రారంభించి ,తుఫాన్ వలన తీవ్ర నష్టాలు పొందారు .పోగొట్టుకున్నదాన్ని పోగొట్టుకొన్న చోటే సాధించాలన్న సంకల్ప బలం తో ,పెంపకం, యాజమాన్యం లలో ఉన్న లోపాలను అధ్యయనం చేసి పూర్తి జాగ్రత్తలు తీసుకొని మళ్ళీ తమలపాకు తోటలుపెంచి గణనీయమైన దిగుబడులు సాధించి ,ఎగుమతులు కూడా చేబట్టి ‘’తమలపాకు రారాజు’’అనిపించుకొన్నారు .
అంతేకాదు సీజన్ తో నిమిత్తం లేకుండా అన్ని రోజుల్లో అన్ని రకాల కూరగాయలు అత్యధిక దిగుబడులతో పండించి ఆశ్చర్యపరచారు .తక్కువ ఖర్చు అధిక దిగుబడి ఆయన స్లోగన్ ధ్యేయం కూడా .తన పరిశోధనలన్నిటినీ వ్యవసాయక్షేత్రం లోనే చేసి ,భూమినీ ,వాతావరణాన్ని పరిశోధక గ్రంథాలుగా భావించి పరిశోధనలు చేసిన లాబ్ లో కాలుపెట్టని భూమి పుత్రుడైన శాస్త్రవేత్త .సృజనాత్మక కృషి తో ఆదర్శ రైతుగా గుర్తి౦పబడి జాతీయ స్థాయికి ఎదిగారు .
చెరుకు ఉత్పత్తి లో నూ విప్లవ మార్గాలను అనుసరించి అధికదిగుబడులు సాధించిన యదార్ధ కృషీవలుడు సుబ్బారావు గారు .1992లో హెక్టార్ కు 133.37టన్నుల చెరుకు పండించి అవార్డ్ పొందారు .వరి లోనూఅద్వితీయ కృషి చేసి అదే ఏడాది ఎకరానికి 39 బస్తాల రికార్డ్ దిగుబడి సాధించారు .బాస్మతి రకం వరిని కూడా ఎకరానికి 35బస్తాలు పండించిన రైతు వీరుడాయన .
ఏ పంట సాగు చేసినా దాని అంతు చూసి అత్యధిక దిగుబడి సాధించట౦ ఆయనకు నల్లేరు పై బండి నడక అయింది. ఆయన వ్యవసాయ క్షేత్రాలను సందర్శించటానికి ,సలహాలు పొందటానికి రాష్ట్రం నలుమూలలనుండి వ్యవసాయ దారులు వచ్చేవారు .1980లో జిల్లా ఆదర్శ రైతు అవార్డ్ , 1990లో ఆంధ్రప్రదేశ వ్యవసాయ విశ్వ విద్యాలయం వారి బంగారుపతకం ,కేంద్ర ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ వారి ఆదర్శ రైతు పురస్కారం ,1994లో పెద్దిరెడ్డి తిమ్మారెడ్డి అగ్రికల్చరల్ ఫౌండేషన్ అవార్డ్ అందుకొన్నారు .విజయవాడ వ్యవసాయ మార్కెట్ ,’’ఉత్తమ కర్షక ‘’అవార్డ్ ,కృష్ణాజిల్లా కిసాన్ మేళా,కృష్ణా పారిశ్రామిక వ్యవసాయ ప్రదర్శన అవార్డ్ మొదలైనవెన్నో ఆయన్ను వరించాయి .భూసారం కాపాడటం నీటిపోదుపు ,కంపోస్ట్ ఎరువువాడకం మొదలైన మెలకువలతో ఇన్ని అద్భుత విజయాలు సాధించారుఆదర్శ రైతుపెద్ద చలసాని సుబ్బారావు గారు .
సశేషం
మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -3-7-19-ఉయ్యూరు

