ప్రపంచ దేశాల సారస్వతం
24-పోలిష్ సాహిత్యం
పోలిష్ భాష –ఇండో-యూరోపియన్ భాషా కుటుంబం లో స్లోవోనిక్ వర్గానికి చెందింది పోలిష్ భాష .పోలాండ్ దేశం లోనే కాక ఈ దేశవాసులు వలస వెళ్ళిన అమెరికా ,ఫ్రాన్స్ లలోకూడా ఇదే వారికి భాష .ఇందులో ఏడు మాండలికాలున్నాయి .ఇవి గ్రాంధిక భాషకు దగ్గరగానే ఉంటాయి .
సాహిత్యం -10వ శతాబ్ది కే పోలిష్ భాష అభివృద్ధి చెంది నా, మధ్యయుగం దాకా గ్రంథ రచన జరగక పోవటం విశేషం .దీనికి కారణం ఆ దేశీయులకు లాటిన్ భాషపైఉన్న మోజు మాత్రమె .10వశతాబ్దినుంచి 15 వ శతాబ్ది వరకు లాటిన్ భాష రాజ్యమేలింది .14వ శతాబ్దం లో వచ్చిన క్రైస్తవ గ్రంథాలన్నీ లాటిన్ లోనే రాయబడ్డాయి .15వ శతాబ్దిలో స్థానిక సమస్యలపై రాసినా , లాటిన్ లోనే అఘోరించారు .10వ శతాబ్దం లో సెయింట్ ఆరల్ బర్త్ మేరీ మాతను స్తుతిస్తూ రాసిన ‘’బెగర్జికా ‘’అనే బాగా ప్రచారమైన గీతం పోలిష్ భాషలో వచ్చినట్లు చెబుతారు .
16 వ శతాబ్దిలో పోలాండ్ లో వచ్చిన ఆర్ధిక సామాజిక రాజకీయ విప్లవాలు సాహిత్యం లో గొప్ప మార్పులు తెచ్చాయి .జాతీయోద్యమం బలపడి పత్రికారచన వచ్చింది .ఈ శతాబ్దం మొదట్లో ధనికులు, క్రాకో నగర ముద్రాపకులు కలిసి సాహిత్య పోషణ చేశారు .అందుచే పోలిష్ భాషలో మొదట రచన చేసిన బెర్ నాట్ ను మార్గదర్శిగా భావిస్తారు .16నుండి 17వ శతాబ్ది మధ్యవరకూ పోలిష్ భాష కు స్వర్ణయుగం .విషయ వైవిధ్యంతో గద్య పద్య రచనలు బాగా వచ్చాయి .నికాలస్ రెజ్,జాన్ కోచానో విస్కీ ,నికోలస్ సెవ్,షార్ జిన్స్కి సెబాస్టియన్ క్లోనో విజ్ ,సైమన్ సెమనో విజ్ ఈ కాలపు ప్రసిద్ధ పద్యకావ్య రచయితలు. వచన రచనలో స్టేని స్లాష్ జరజ చస్కి ,లూకాస్ గార్నికి ,పీటర్ స్కర్గా నిష్ణాతులు .
పోలిష్ సాహిత్య చరిత్రలో 17వ శతాబ్ది మధ్యనుంచి ,18వ శతాబ్ది ప్రారంభం వరకు ఉన్నదాన్ని ‘’బరోకీ యుగం ‘’అంటారు .స్వచ్చందమైన ,విశృ౦ఖలమైన కళా శైలికి ‘’బరోకీ’’ అని పేరు .ఎక్కువమంది రచయితలు ఈ శైలిలో రాయటం వలన ఆపేరొచ్చింది .ఈ యుగం లో ‘’అతిశయోక్తి అలంకారం’’ రాజ్యమేలింది .కొన్ని ఉదాత్త రచనలూ వచ్చాయి .ఇలారాసినవారిలో వాస్లో పోటోకి ముఖ్యుడు .1681లో పోలాండ్ టర్కీపై చేసిన యుద్ధగాధలను ,విజయాన్ని వర్ణిస్తూ యితడు రాసిన ఇతిహాసం మహా గొప్పకావ్యంగా ప్రసిద్ధం .మరో ప్రముఖ గేయకవి అందరూ మార్ స్టిన్ .మరో ఐతిహాసికుడు వెస్పాసియన్ కోచ వస్కి .హాస్యరస కావ్యాలను వోవలన్ స్కి రాశాడు .
18వ శతాబ్ది నుంచి 19వ శతాబ్ది ఆరంభం వరకు నీతిబోధక కావ్యాలు బాగా వచ్చాయి .ఇందులో అగ్నేషియస్ క్రాసిక్కి ప్రసిద్ధుడు .హాస్యం తో నీతిని బోధించే కావ్యాలురాశాడు .ఇతనికి దీటైనవాడు ట్రై౦ బెక్కె.మిగిలిన ప్రముఖులు కజేతవ్ వజీ రస్కి ,ఫ్రాన్సిస్ కరవ్ పింస్కిఫ్రాన్సిస్ నియాజ్జే. వచన రచనలో మేటిగా ఏడం నరుషే విస్కీ ,స్తనిప్లాస్టే షిస్,హూగో కొల్లెంతాన్ ప్రముఖులు.మధ్యయుగం నాటి పోలాండ్ చరిత్రను ఇంపైన శైలిలో నరుషె విస్కీ రాశాడు .సాంఘిక రాజకీయ సంస్కరణలకోసం రచన చేసి,అసమాన్యుడుఅనిపి౦చాడు ష్టే షిస్.తాత్విక గ్రంథ రచనలో పేరు పొందాడు కొల్లెం తాజ్.నాటకరచనకూడా ఈకాలం లోనే వచ్చింది .మోలియర్ ను అనుకరిస్తూ చాలామంది రాశారు .స్వతంత్ర నాటకాలురాసిన మొదటివాడు వాస్లా రజవిస్కి ,పోలిష్ చరిత్రలోని రసవత్తర ఘట్టాలను ఎన్నుకొని యితడు గొప్ప ట్రాజెడీలు రాశాడు .కాని నాటక వికాసాన్ని తెచ్చినవారు మాత్రం –వజేనక్ బొగు ప్లవిస్కి ,ఫ్రాన్సిస్ జోబిలస్కి .బొగు ప్లవిస్కి నాటకాలు రాయటమేకాక ,నాటక శాలలు నిర్మించి ప్రదర్శనలు కూడా వార్సా నగరంలో 1765లో నిర్వహించాడు.ఉత్తమ నాటకాలను రచయితలను ప్రోత్సహించాడు .దీనిఫలితంగా జోబిలస్కి ఉత్తమ ఉదాత్త నాటకాలు రాసి నాటకరంగానికి విశేష కీర్తి తెచ్చాడు . ఫిర్ సిక్వ జలోటక్ అంటే ’’సోగ్గాడి పెళ్లి ప్రయత్నం’’ అనేఇతని నాటకం ఆ నాటిఉత్తమోత్తమనాటక౦.’’పోవ్ రియట్ పోసలా ‘’అంటే’’ ప్రతినిధి తిరిగి రాక ‘’అనే సుఖా౦తనాటకం రాశాడు జూలియన్ ఉరిసిన్ నియమ శివిజ్ .ఇతడే ఐతిహాసిక గేయాలను –స్పీవీ హిస్టరియాని-అనే గేయకావ్యం కూడా రాశాడు .ఇప్పటికీ అందులోని గేయాలను ఉత్సాహంగా పాడుకొంటారు .
1863నుంచి ఇక్కడా కాల్పనిక సాహిత్యం వచ్చింది. మార్గదర్శి కషిమిర్ బ్రోజేన్ స్కి .పీడితజన పక్షపాతి గా ప్రసిద్ధుడు .విల్నా యూని వర్సిటి సారస్వత కేంద్రంగా ఉండేది .వార్సాలోకూడా పోలిష్ సాహిత్యానికిఆదరణ బాగా ఉండేది .అప్పుడు పోలాండ్ రష్యాలో భాగం గా ఉండేది .స్వాతంత్ర్యం కోసం ఉద్యమాలు నడిచాయి .మిక్కీవిజ్ ,స్లోవస్కి,మొదలైనవారు షేక్స్పియర్ ను ఆదర్శంగా తీసుకొని రచనలు చేశారు . ఆంటోనీ వాల్ జీవిస్కి ,సూయన్ గోషినస్కి జోసేఫ్ బోధన్ జలేస్కి కూడా ప్రసిద్ధ రచయితలే .నవలారచనలో హెన్రి రాజవిస్కి ప్రముఖుడు .చారిత్రిక నవలకు క్రాస్ విస్కీ ,జిగ్మంట్ కాశ్కో విస్కీ ,జిగ్మంట్ మిల్కో విస్కీ ప్రసిద్ధులు ..రచయితల రచనలవలన ప్రజలు ఉత్తేజితులై స్వాతంత్ర్యపోరాటం చేయగా ,1863 న తిరుగుబాటు వచ్చింది .ప్రభుత్వం అణచేసింది .
దీన్ని ప్రజలు గుణపాఠం గా భావించి ప్రజలు వాస్తవిక లోకి వచ్చి ,చైతన్య వంతులయ్యారు ఈ రచయితలలో హెన్రిక్ శీన్ ,కీవిజ్ రాసిన ‘’కోవాడిస్ ‘’గ్రంథంఅనేక ప్రపంచ భాషల్లోకి అనువాదం పొంది విశ్వ వ్యాప్త కీర్తి నార్జించింది .19వ శతాబ్దిలో యువకులు ‘’కళ కళ కొరకే ‘’అనే సిద్ధాంతాన్ని ప్రచారం చేసి మొదటి ప్రపంచ యుద్ధం వరకు ప్రసిద్ధమైంది .ఈ వాదాన్ని కాజిమీర్ జ్ తత్మేజర్ ,జీనస్ ప్రజస్మిస్కి ,స్టాన్ స్లా విస్పియాన్ స్కి,జాస్ కస్ ప్రోవిజ్ ,లేపాల్డ్ స్టాఫ్ సమర్ధించారు ప్రసిద్ధ రచనలు చేశారు .మొదటి ప్రపంచయుద్ధం తర్వాత పోలాండ్ స్వాతంత్ర్యం పొందింది .సాహిత్యమూ అభి వృద్ధి చెందింది .భవిష్యత్ వాదం ,అభి వ్యక్తివాదాలు ప్రవేశించాయి .మస్తత్వ రచనలూ వచ్చాయి .వీటిలో ప్రసిద్ధుడు- వ్లాడిస్కో స్తవిస్లా రెయ్ మౌంట్ .ఇతని నవలలు జేమియా ఒబీకనా ,చ్లోసి అంటే రైతు బాగా పాప్యులర్ అయి ఉత్తమ నవలలని పించాయి .1924లో ఇతనికి నోబెల్ ప్రైజ్ దక్కింది .గేయకవిత్వానికీ మంచి కాలం ఇది .బ్రోమినిస్కి ,అతని అనుయాయులు గేయ రచనలో కొత్తపోకడలు పోయారు..రెండవ ప్రపంచ యుద్ధం లో పోలాండ్ మళ్ళీ అన్యాక్రాంతమై దేశభక్తి మూడుపూలు ఆరుకాయలుకాసి ప్రసిద్ధ రచనలు వచ్చాయి .యుద్ధం తర్వాత సోషలిస్ట్ ప్రభుత్వమేర్పడి ,వర్గరహిత సమాజభావన తో చాలా రచనలు వచ్చాయి.
1730-40కాలాన్ని పోలిష్ వికాస యుగం అంటారు .వికాస యుగకవి –ఇగ్నాసి క్రాసిక్కి ని ‘’ది ప్రిన్స్ ఆఫ్ పోఎట్స్ ‘’అంటారు . ‘’అడ్వెంచర్స్ ఆఫ్ మిస్టర్ నికొలాస్ విజ్డం’’అనే పోలిష్ మొదటి నవల రాసినవాడు లా ఫ్రాన్ టైన్.ఇతడు నాటకాలు కూడా రాసిన జర్నలిస్ట్ ,ఎన్ సైక్లో పీడియా నిర్మాత ,అనువాదకుడుకూడా .జాన్ పొటో క్కి –ఈజిప్టాలజిస్ట్ ,లింగ్విస్ట్ ,అడ్వెంచరర్.ఇతడి నవల ‘’ది మాన్యు స్క్రిప్ట్ ఫౌండ్ ఇన్ సగర్ గోస్సా ‘’ ప్రసిద్ధ నవలను డేకామేరాన్ , అరేబియన్ నైట్స్ లతో పోలుస్తారు .1785 రోమా౦టిజం ఇక్కడ వ్యాప్తి చెందింది .జార్ చక్రవర్తుల ఉక్కు పాదాలకింద నలిగిపోయింది .పోలిష్ పాజిటివిజం,రొమాంటిజం లు యూరప్ సాహిత్య ప్రభావ జనితాలు .ఈరచయితలలో ఆడం మిక్కీవిజ్ ,గోజేన్ స్కి ,టొమాజ్ జాన్ ప్రసిద్ధులు .వీరి రచనలవలన స్వాతంత్ర్య కాంక్ష పెరిగి సావరిన్ ప్రభుత్వమేర్పడింది .మిస్టిజం రచనలొచ్చాయి .అణగారిన జాతులకవులు గా జూలియస్ సోవాస్కి ,జిగ్మౌంట్ క్రాసిస్కి ప్రసిద్ధులు
1918-39కాలాన్ని ‘’ఇంటర్ బెల్లం’’అంటారు .కవిత్వానికి మంచికాలం ‘’పోలిష్ అకాడెమి ఆఫ్ లిటరేచర్ ‘’ఏర్పడింది .ఈ యుగపు కవులు –బోలేస్లా లేస్మియన్.1945-56కాలం లో పోలిష్ రచనలన్నీ యుద్ధానంతరం వెలుగు చూశాయి .ఈకాలం లో 3లక్షలమంది పోలిష్ పౌరులు అరెస్ట్ అయ్యారు .6వేలమందికి మరణ శిక్ష విధించారు .కొందరు రచయితలను జైలులో చిత్రహి౦సలు పెట్టారు .స్వాతంత్రం పొందాక మినిస్ట్రీ ఆఫ్ పబ్లిక్ సెక్యూరిటి ఏర్పడి ప్రజలు ఊపిరి పీల్చుకొన్నారు .1956నుంచి గొప్ప రచనలు చేసిన ప్రముఖులలో కొందరు-గుస్టావ్ మొర్సేనిక్ ,పోలా గోజావిన్ స్కి ,కాజిమిర్ బ్రాన్దిజ్ ,ఆడం జగవేస్కి ,జాన్సూజ్ జైడేల్ ,లియోపార్డ్ టిం రాండ్ వగైరా లు .
సాహిత్యం లో నోబెల్ పొందిన రచయితలు –హెన్రి సీన్ కి విజ్ -1905,వ్లాడిస్లా రేమాంట్ -1924,ఇషాక్ బాషేఏస్సింగర్ -1978,జేస్లా మిలోజ్ -1980,విస్లాజిమ్బోస్క-1996,ఓల్గా టొకార్ కుజ్ -2018.వీరిలో విస్సాలోవా ,ఓల్గా లిద్దరూమహిళా రచయితలే
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -16-3-20-ఉయ్యూరు
—

