శ్రీ శార్వరి ఉగాది పంచాంగ శ్రవణం
ఈరోజు సాయంత్రం 5 గంటలకు మా ఇంటి నుంచే శ్రీ శార్వరి ఉగాది పంచాంగ శ్రవణం ఫేస్ బుక్ లో ప్రత్యక్ష ప్రసారమౌతుంది .చూసి ఆన౦దించి మిగిలిన విషయాలు కూడా తెలుసుకోండి .
అందరికి శ్రీ శార్వరి నామ సంవత్సర ఉగాది శుభా కాంక్షలు .
శ్రీ కళ్యాణ గుణావాహం రిపుహరం –దుస్వప్న దోషాపహం –గంగాస్నాన విశేష పుణ్య ఫలదం –గోదాన తుల్యం నృణాం-ఆయుర్వృద్ధిద ముత్తమం ,శుభకరం –సంతాన సంపత్ప్రద౦
నానా కర్మ సుసాధానం –సముచితం –పంచాంగ మాకర్ణ్యతాం’’ .
‘’శుక్లాంబరధరం విష్ణుం –శశివర్ణం చతుర్భుజం –ప్రసన్న వదనం ధ్యాయే త్సర్వ విఘ్నోప శాంతయే ‘’
‘’సుముఖశ్చైక దంతశ్చ్య కపిలో గజకర్ణికః –లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః –ధూమ కేతుర్గణాధ్యశ్చఃఫాలచంద్రో గజానన –వక్రతుండ శ్శూర్ప కర్ణోః హేరంబ స్కంద పూర్వజః ‘’
‘’సరస్వతీ నమస్తుభ్యం వరదే కామ రూపిణీ –విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా ‘’
‘’యా కుందేందు తుషార హార ధవళా యాశుభ్ర వస్త్రాన్వితా –యా వీణా వరదండ మండిత కరా యాశ్వేత పద్మాసనా –యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభ్రుతి భి ర్దేవై స్సదా పూజితా –సామాం పాతు సరస్వతీ భగవతీ నిశ్శేష జాడ్యాపహా .
‘’లక్ష్మీం క్షీర సముద్రరాజ తనయాం శ్రీరంగ దామేశ్వరీం –దాసీభూత సమస్త దేవ వనితాం –లోకైక దీపాంకురాం –శ్రీమన్మంద కటాక్ష లబ్ధ విభవ బ్రహ్మేంద్ర గంగాధరాం-త్వం త్రైలోక్య కుటుంబిణీ౦-సరసిజాం వందే ముకుంద ప్రియాం .’’
శ్రీ శార్వరి నామ సంవత్సర ఫలం
ఈ సంవత్సరం రాజు ,ధాన్యాధిపతి బుధుడు .మంత్రి ,సైన్య, అర్ఘ్యా,మేఘాధిపతి చంద్రుడు . ,సస్యాధిపతి ,నీరసాధిపతి గురుడు .రసాధిపతి శని .నవనాయకులలో ఎనిమిది ఆధిపత్యాలు శుభులకు ,ఒక్క ఆధిపత్యం మాత్రమే – అదీ శనికి వచ్చాయి .శత్రువు మిత్రుడు అవటం వలన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలమధ్య సఖ్యత ,సహాయ సహకారం ఒకమాదిరిగా మాత్రమె ఉంటాయి ,
‘’శార్వరీ వత్సరే సర్వ సస్య వృద్ధిర్భవే ద్భువిః-రాజానో విలయం యాంతిపరస్పర జయేచ్ఛ యా ‘’అంటే –అన్ని పంటలు బాగా పండుతాయి .నాయకులు విజయ కాంక్షతో పరస్పర విరోదాలతో నశిస్తారు .
బుధుడు రాజు అవటం వలన గాలి భయం.స్త్రీ,పురుష సమాగమభయం ఉంటాయి .మేఘాలు కొద్దిగా వర్షిస్తాయి .పంటలు ఒకమాదిరిగా పండుతాయి
‘’సదాగతి స్సాద్వ సక్రుత్ప్రజానం నరాః-స్త్రీయోవా రతికర్మహీనాః –ధారధరాశ్చాప్యవిముక్త ధారాః –మధ్యాని సస్యాని భవంతి భూమౌ.
మంత్రి చంద్రుడు అవటం వలన –పంటలకు తగిన వర్షం కురిసి ధాన్యాలు బాగా పండుతాయి .ప్రజలు ఆరోగ్యంగా క్షేమ౦గా సుభిక్షంగా ఉంటారు –
‘’సువృస్టి స్సర్వ సస్యాని ఫలితాని భవంతిచ –క్షేమారోగ్యం సుభిక్షం స్యాచ్ఛశాంకే సచివే సతి ‘’
సేనాధిపతి చంద్రుడవటం వలన –అధికధారాలు ,అధిక వర్షం ఉంటాయి .ప్రజలు ఆరోగ్యంతో సుఖంగా ఉంటారు .ఆవులు పాలుబాగా ఇస్తాయి .
‘’అతివర్ష మతీవార్ఘ ,మరోగా స్సుఖినో జనాః –బహు క్షీర ప్రదా గావ శ్చ౦ద్రే ససేనాధిపతిః’’
సస్యాధిపతి గురువు –యవలు ,గోధుమలు ,శనగలు బాగా పండుతాయి .పచ్చని నేలలో పంటలు ఎక్కువ .
‘’యావ గోధూమ,చణకాః ఫలితాశ్చ భావంతిహి-పీత దాత్రీచ ఫలితా గురౌ సస్యాదిపే సతి’’
ధాన్యాధిపతి బుధుడు –మేఘాలు గాలులచే చెదరగొట్టబడి ,పంటలకు అనుకూల వర్షం కురవదు .ధాన్యాలు కొద్దిగా పండుతాయి .పాలకులు ఆందోళనతో ఉంటారు –
‘’మధ్య వృష్టి ర్మంద సస్యం మేఘా వాతేన పీదితాః-త్రాపస్సర్వ నృపాణా౦చ బుదే ధాన్యాది పతే సతి’’
అర్ఘాధిపతి చంద్రుడు –పంటలను బట్టి వర్షం వస్తుంది .పైరులన్నీ బాగా ప౦డుతాయి కాని ధరలు బాగా పెరుగుతాయి –
‘’సువృస్టి స్సర్వ సస్యానా మభీ వృద్ధిశ్చ జాయతే –మహతీ దార్ఘ్య వృద్ధిస్యాచ్ఛ౦ద్రేచారార్ఘ్యా దీపే సతి .
మేఘాధిపతి చంద్రుడు –దేశమంతా సస్యానుకూల వర్షం కరుస్తుంది .పూర్వ అపర ధాన్యాలు బాగా పండు తాయి .గోక్షీరం సమృద్ధి .
రసాధిపతి శని-చెరుకు నెయ్యి నూనె బెల్లం తేనే ఉప్పు కర్పూరం వగైరా రస జాతుల ధరలు తగ్గుతాయి .-
‘’ఘ్రుత తైల గుడా క్షౌద్రాః ఏ చానె రస రస జాతయః –శూన్యార్ఘ్యం యాంతి తే సర్వే,శనౌయది రసాదిపే ‘’
నీరసాధిపతి గురుడు –వక్కలు రత్నాలు బ౦గారం ధాన్యాలు పత్తి చర్మం చందనం బాగా వృద్ధి చెందుతాయి .బ్రాహ్మణులు సుఖ సంతోషాలతో ఉంటారు –
‘’పూగీ ఫలా న్యఖిలం రత్న సువర్ణ ధాన్యం కార్పాస చర్మ కుసుమానిచ చందనం చ –వృద్ధియయుర్ద్విజః గణా స్సుఖినో భవంతి భూమౌచ నీరసపతౌ సురరాజ పూజ్యే ‘’
ఈ సంవత్సరం లో ఆశ్వయుజమాసం అధికమాసం .నిజ ఆశ్వయుజం లోనే శుభకార్యాలు ,శరన్నవ రాత్రులు జరుగుతాయి .
20-11-20కార్తీక శుద్ధ షష్టిశుక్రవారం గురుడు మకరరాశిలో ప్రవేశించటంతో తుంగ భద్రానదికి పుష్కరాలు ప్రారంభమై 1-12-20కార్తీక బహుళ పాడ్యమి మంగళవారం వరకు 12 రోజులు జరుగుతాయి .
29-5-20నుండి 8-6-20 వరకు శుక్ర మౌఢ్యమి .16-1-21నుంచి 10-2-21వరకు గురు మూఢమి కనుక శుభకార్యాలు ఉండవు .
21-6-2020జ్యేష్ట బహుళ అమావాస్య ఆదివారం మృగశిరా నక్షత్ర చివరిపాదం లో’’చూడామణి ‘’పేరున్న సూర్యగ్రహణం .ఉదయం 10-25కు ప్రారంభమై ,మధ్యాహ్నం 1-53 దాకా ఉంటుంది .మృగశిర ఆరుద్ర నక్షత్ర జాతకులు చూడకుండా ఉండటం మంచిది .
14-1-2021పుష్యశుద్ధ పాడ్యమి తాత్కాల విదియలో శ్రవణా నక్షత్ర యుక్త వృషభ లగ్నం లో మధ్యాహ్నం 1-57కు సూర్యుడు మకర రాశిలో ప్రవేశించటం వలన మకర సంక్రాంతి .సంక్రాంతి పురుషుడి పేరు ‘’మంద ‘’.
ఒకటిరెండు రాష్ట్రాలలో ఊహించని పరిస్థితులేర్పడతాయి .దేశం లో ఆర్దికమాన్ద్యం ఇబ్బందిగా ఉంటుంది .పాక్ కుపీడ ఈఏడాది .భారత్ –చైనాలమధ్య డిషుం డిషుం.మన దేశ సీనియర్ నాయకుల ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది .శ్రీ లంక భారీ వర్షాలు వరదలతో అల్లకల్లోలమై ,దేశాధ్యక్షుడికి ఇబ్బంది కలుగుతుంది .బంగ్లాదేశ్ లో అనిశ్చిత పరిస్థితులు ..మయన్మార్ లో రాజకీయాలు దారితప్పచ్చు .ధాయ్ లాండ్ లో తిరుగుబాట్లు జరిగే ప్రమాదం .మలేశియాలోనూ కల్లోల పరిస్థితులే .సైన్స్ లో ఫ్రాన్స్ గణనీయంగా పేరుపొంది ప్రతిష్టాత్మక అవార్డ్ లు పొందచ్చు .పశ్చిమాసియాలో భారీ భూకంపం రావచ్చు .అమెరికా అడకత్తెరలో పోక గా మారుతుంది .ట్ర౦ప్ మళ్ళీ గెలవచ్చు .దక్షిణ కొరియా భారత్ భాయి భాయి .అగ్నిపర్వత ప్రాంత ప్రదేశాలు జాగ్రత్తగా ఉండాలి .
ఈరోజు సాయంత్రం 5 గంటలకు మా ఇంటి నుంచే శ్రీ శార్వరి ఉగాది పంచాంగ శ్రవణం ఫేస్ బుక్ లో ప్రత్యక్ష ప్రసారమౌతుంది .చూసి ఆన౦దించి మిగిలిన విషయాలు కూడా తెలుసుకోండి .
శ్రీ శార్వరి ఉగాది శుభాకాంక్షలతో
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -25-3-20-ఉయ్యూరు
—

