ఇకనైనా పక్కా ప్లాన్ తో కదలండి ప్రభువుల్లారా,ప్రజా సేవకుల్లారా !
జనతా కర్ఫ్యూ ప్రవేశపెట్టి వారం అవుతోంది .ఉద్యోగస్తులకు జీతం నాతం వస్తుంది కనుక ఇబ్బంది లేదు .పనుల్లేక దినకూలీలు యెంత బాధ పడుతున్నారో ఏలినవారు గమనిస్తున్నారా ? తమ చిత్తం ప్రకారం నడుచుకొంటూ ఇంట్లోనే క్వారంటైన్ లో ఉంటున్న పేద లకు ఇప్పటి వరకు హామీల వర్షమే కాని ,’’కనకధార’’ ,సరుకు ,కూరగాయల రవాణా లేక రేట్లు ఆకాశం లో ఉంటె ఉన్న డబ్బు తో కొనలేక గగ్గోలు పడుతున్నారు .మీ ఆన శిరసావహించే పేదలపై ఉపేక్ష ఇప్పటికైనా వదలండి .చురుగ్గా ,కరుగ్గా ముందుకు కదలండి .యాత్రలకని బయల్దేరిన జనం ఇతర రాష్ట్రాలలో దిక్కు తోచక ,సాయం అందకా ,ఇంటికి చేరే రవాణా సౌకర్యాలు అన్నీ మూసుకుపోగా బావురు మంటూ కాశీ మొదలైన ప్రాంతాల్లో ఉన్నట్లు పేపర్లద్వారా, చానళ్ళ ద్వారా తెలుస్తున్నాయి తమ చెవులకు కళ్ళకు ఆ వార్తలు వినిపిచాలేదా కనిపించలేదా ? వాళ్లకు ఊరట కలిపించే ప్రయత్నం వీసమైనా చేశారా ?పక్కరాస్త్రానికి ఇదే సమయమా హాస్టళ్ళు మూసి విద్యార్ధుల్ని రోడ్లమీద పడెయ్య టానికి ఒక నవారమో పక్షమో పోషించి హాయిగా ఇంటికి పంపిస్తే ఘనమైన ఆప్రభుత్వాన్ని యెంత మెచ్చుకొంటారు ?ఇంతలోనే కక్కూర్తా ? ఇప్పుడే కళ్ళు తెరిచి కొన్ని పనులు చేబట్టినట్లు విన్నాను ధన్యవాదాలు .
1-ఒక హెల్ప్ లైన్ నంబర్ ఇచ్చి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వారి సమాచారం సేకరించి వెంటనే తగిన వైద్య పరీక్షలు నిర్వహించి సంతృప్తి చెంది వాళ్ళ స్వగ్రామాలకు పంపే ఆలోచన సత్వరమేచేయండి .లేకుంటే ‘’హోమ్ సిక్ నెస్’’తో దూరంగా ఉన్నవాళ్ళు ,వాళ్ళ కోసం కుటుంబ సభ్యులు బాధ పడే ప్రమాదం ఉంది .ఉభయ తెలుగు రాష్ట్రాలు, కేంద్రం ఈ విషయం లో త్వరగా చర్యలు తీసుకొని ప్రజాసేవ చేయాలి మహా ప్రభో .
2-వాలంటీర్లకు వేలాది జీతాలిచ్చి పోషిస్తూ వారితో ఈ సమాచారం తెప్పించుకోకపోతే వారికిసాయపడకపోతే ఎలా ?తగిన చర్య నిమిషాల్లో జరగాలి ,జరపాలి .సరుకులు ,వారానికి కనీసం మూడు వేల రూపాయలు అర్జెంట్ గా వారి ఇళ్ళకు చేర్చాలి .లేకపోతె ఆకలి బాధ ,మాల్ న్యూట్రిషన్ ప్రమాద ఘంటికలు మోతాయ్ .చేతులుకాలాక ఆకులు పట్టుకో వద్దు ఇల్లుకాలాక నుయ్యి తవ్వొద్దు .జనాలకు కావలసింది ఊరడింపు మాటలు, హావభావాల చేష్టలూ కాదు .సానుభూతి ,సహకారం ,చేయూత ఓదార్పు ఆరోగ్య రక్షణ కావాలి .ఇవన్నీ కలిసి పని చేసేట్లు చూసే సమన్వయ వ్యవస్థ కావాలి . .
3-ఇళ్ళకు డాక్టర్లను పంపి పరీక్షలు చేయించి అనుమానం ఉంటె హాస్పిటల్ లో చేర్చి చికిత్స అందించాలి .
4-ఇలాంటి ఎపెడేమిక్ ఉపద్రవాల్లో ఎప్పుడూ ముందుండే ఆర్ ఎస్ ఎస్ కార్యకర్తలు ఇప్పుడు ఎక్కడా కనపడటం లేదు .వారి ఆరోగ్యాలకు రక్షణ కల్పించి ప్రభుత్వాలు వారి సేవలు వినియోగించుకోవాలి .
5-స్థానికం పోస్ట్ పోన్ అయ్యాక ,కోర్టులు చీవాట్లు పెట్టాక మన పోలీసు వ్యవస్థ కొంత ముందుకు కదలటం శుభ పరిణామం .ఇందులో పార్టీ విచక్షత చూపి ,పక్ష పాతం ప్రదర్శించి వ్యవస్థకు కుల ,రాచకీయ ‘’ పక్షవాతం తెచ్చి’’ సమాజాన్ని నిర్వీర్యం చేయకండి .బాధితులు ఎవరైనా ఒక్కటే .అక్కున చేర్చి ఓదార్చి మెప్పు పొందండి’’ మూడు సి౦హాల వారూ ‘’.ఇదే చేయకుంటే చరిత్ర మనల్ని క్షమించదు.
6-అమరావతి పై ఉద్యమిస్తున్న రైతులను మహిళలను సాంత్వన దృష్టితో చూడండి. రాజకీయాలు ఇవాళ ఉంటాయి రేపు పోతాయి ఎప్పుడూ ఉండేదిఓటుహక్కున్న ‘’ఆం ఆద్మీలే’’.కేజ్రీ వాల్ ను చూసి నేర్చుకోండి .నోళ్ళు సంబాళించు కోండి. ఇకనైనా వీటిని గుర్తించండి . ఉస్ట్ర పక్షి పోకడలు వినాశ హేతువు .
ఈ షట్కర్మ నిరతులై ప్రజాభిమానం పొందమని పాలక ,ప్రతిపక్ష ,స్వచ్చంద సంస్థలన్నిటికీ విజ్ఞప్తి చేస్తున్నాను .
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -27-3-20-ఉయ్యూరు

