గిరీశ భాష్యం
గిరీశం -ఏం వాయ్ మైడియర్ వెంకటేశం !కరోనా వైరస్ తో రెండు నెలలు హాయిగా మీ ఇంట్లో కాలక్షేపం చేసే వీలు దక్కింది .జేబులో కాపర్స్ ఏమైనా ఉన్నాయా ?
వెంకటేశం –ఉన్ననాలుగు డబ్బులు ముందే దొబ్బేశారుగా ఇంకెక్కడివి ?
గి –సంచీ ఒకసారి దులిపి చూడు
వెం-దులిపితే రాలేవి ఎంగిలి బీడీ ,చుట్టముక్కలే .మీ పరువూ నా పరువు పోతుంది .
గి-ముదిరిపోయావ్ .పుట్టి శతాబ్దం అయిందిగా తెలివి తేటలు బానే ఒంటబట్టాయి .
వెం-లేకపోతె మీరు నాకు అక్షరమ్ముక్క నేర్పితే ఒట్టు .అంతా నా తంటాలతోనే ఎదిగా .గురువుగారూ !మీ పూటకూళ్ళమ్మ రోజూ ఫేస్ బుక్ నన్ను రెచ్చగొడుతూ లైనేస్తోంది .
గి –ఒరేయ్.గురూకు పంగనామం పెట్టబోకు పుణ్యం ఉంటుంది .
వెం-మీకు కృతజ్ఞతా పాడూ లేవు కాని నాకున్నాయ్ .నేనేమీ ప్రొసీడ్ అవటం లేదు .ఫుల్ స్టాఫ్ పెట్టేశా, పెట్టించా .
గి –మంచి పని చేశావ్ .ఇంతకీ ఇక్కడ ఉండిపోటానికి మీనాన్నకే ఠస్సావెయ్యాలా ఆని ఆలోచిస్తుంటే బుర్ర వేడెక్కుతోంది .మీ సిస్టర్ ని పంపి కాస్త నవరత్న తైలం మర్దన చేయించి పుణ్యం కట్టుకో .
వెం-మంచిదే .కాని ఇదివరకట్లాకాదుగా .టచ్ చేస్తే వైరస్ అంటుకుంటుంది .నేను పంపనే పంప .ఇంతకీ మానాన్న కేం చెప్పి బురిడీ కొట్టిస్తారు ?
గి-నాలుగు రోజులనుంచి అన్నీవెతుకుతున్నా .చిక్కట్లేదు .మీనాన్న కూడా బయటికి రావటం లేదే .
వెం- అందరికీ అదే భయం .సంధ్యవార్చి నీళ్ళు తులసి చెట్టులో పోయటానికి వస్తాడు అప్పుడు పట్టుకోండి.
గి –సరే .అదుగో మామగారు వస్తున్నారు .
వెం-ఏమండోయ్ చుట్టరికం కలిపేస్తున్నారు
గి –ఇవాళకాకపోతే రేపైనా నువ్వు నాబామ్మర్దివి మీ అక్కయ్య నా వుడ్ బి ,మీ అమ్మా నాన్న నాకు అత్తా మామలే కదా .ఇప్పట్నించే కొంచెం అడ్వాన్స్ అవుతున్నా .
వెం-సరే అఘోరించండి .
గి-మామగారూ కులాసానా ?
అగ్ని –ఏం కులాసా మీ బొంద .అదేదో జబ్బుష ప్రపంచమంతా పాకి నవిలేస్తోందష. ఇంట్లో రెడియోకూడా లేదు. బయటికి వెళ్ళనివ్వటం లేదు .కోర్ట్ లున్నాయో లేదో తెలీదు .దావాలు వాయిదాలు పడ్డాయో లేదో ప్లీడరీ గుమాస్తా చెప్పి చావటం లేదు. నీకు తెలిస్తే దాన్ని గురించి చెప్పు కాస్త పూజ ముగించుకొని చక్కా వస్తా.
గి –అలాగే కానీండి అదిగో అత్తయ్యా వస్తున్నారు .ఎలాఉన్నారత్తయ్యా ?
వెంకమ్మ – – ఎందుకడుగుతావు బాబు .మాతమ్ముడు కరకటం రావాలి ఎదురు చూస్తున్నా .ఎలా వస్తాడో పాపం నన్ను చూడంది ఉండలేడు వెర్రి నాయన . నా చేతుల్లో పెరిగాడు వెధవ .పిచ్చిసన్నాసి .
గి-కంగారు పడకండి అత్తయ్యా .మామయ్య కూడా రాగానే కంగారు తగ్గెట్లు కరోనా గురించి క్షుణ్ణంగా చెబుతా .దాని తీవ్రత తగ్గే దాకా సిగ్గు విడచి మీ ఇంట్లోనే ఉండి పోవాల్సి వస్తోంది .బిడియంగా ఉంది .
ఆమె-సంకోచం వద్దు .మీరూ కాల్సినవారే కాదుషా .కడుపులో పెట్టుకొంటాం నాయనా .సంకోచించకు నువ్వూ అబ్బాయి ఇక్కడే ఉండిపొండిపంతులుగారూ .మా వారికి ప్రధమకోపం ఎక్కువ .అగ్గి మీద గుగ్గిలమే .ఉబ్బెస్తే తర్వాత మనసు నవనీతమే .నువ్వే ఆయన్ను ఎష్లా గైనా ఒప్పించాలి .మామాట వింటే కల్లుతాగిన కోతిలా ఎగిరెగిరి పడతారు .జాగ్రత్త నాయనా .
గి –నేను చూసుకొంటాగా .మీరు గమ్మున ఉండండి .ఇదుగో మామయ్యా వచ్చేశారు .
అగ్ని –ఏమిటి శిఖరాగ్ర సమావేశం ?
గి – ‘’కరోనా ఆశానాసౌ నాసౌమన కోవిద్ప్రజానాం –నహి సౌభాగ్యం తనూం-చైనే రాను వ్ర-వ్రాతా భూతా ఇటలీ అమెరికా ఇంగ్లాండ్ సున్నా హేతు కృతా అకృతాం ‘’
కరోనా శాత్యా –శాసనా సౌమనససం-ప్రజామితి ప్ర –జాం-న సౌభాగ్యం తనూం –అగ్నెః చైనేను -అనువ్రతా భూత్వా – నహ్యే-ఇటలీ అమెరికా ఇంగ్లాండ్ సమితి సున్నా సున్నా హేతు కృతా అకృతాయ కం.
అగ్ని –పంతులూ ఏదో కొత్త పదం ఆలపిస్తున్నావు .ఎప్పుడూ వినలేదే .ఎక్కడ్నించి తెచ్చావ్
గి.మామగారూ ఈ ప్రాంతం లో నులక అగ్ని హోత్రావదాన్లు అంటే పదం క్రమ౦ ఘన జటలలో ఆయన్ను మించిన వారు లేరని లోకం కాకై కూస్తోంది. హనుమాన్ ముందు నా కుప్పిగంతులేమిటి ?
అగ్ని –నేను వినలేదు నేర్వలేదు రా బాబూ అంటే విని చావవేమిటి ?నీ బొట్లేరు ఇంగ్లీషుకు వేద పనసలు కూడానా.నమ్మకం కలగట్లేదుస్మీ .
గి-అందుకే నాకు ఎక్కడో కాల్తుంది .మీ తరం వారంతా ఎక్కడ వేసిన గొంగళి అక్కడి బాపతు .ఆతర్వాత వేదం యెంత పెరిగి విస్తృతి చెందిందో మీకు తెలీదు .నాలుగు ఇంగ్లిష్ అక్షరంముక్కలోస్తే తెలిసోచ్చేది .అది మీకు అంటరానిదాయే .కోర్టులు వ్యవహారాలకు మాత్రం దాన్లోనే అఘోరించాలి. తెలీక పొతే ప్లీడర్ల చేతుల్లో మూటలకు మూటలు పోసి వ్యాజ్యాలాడుతారు .ఇదెక్కడి ఖర్మ వచ్చిందో మనబ్రాహ్మణ్యానికి .
అగ్ని- ఝాడించింది చాలుకాని అసలు విషయం ఏడవండి పంతులుగారు .
గి –అందుకే మీది ప్రధమకోపం అని జిల్లా అంతా అనుకొంటారు .సీమలో అంటే కోనసీమలో కాదు ఇంగ్లాండ్ లో మాక్స్ ముల్లర్ అనే జర్మని పండితుడు న్నాడు .మనవేదాలను ఉపనిషత్తులు పురాణాల అంతు చూసి వదిలిపెట్టాడు .స్వయంగా ఋగ్వేదం గానం చేసి గ్రామఫోన్ పై రికార్డ్ కూడా చేశాడు .
అగ్ని-అలాగటస్మీ .వాడి తస్సా దియ్యా భలే వాడే .మేమెప్పుడూ వినలేదే .
గి-(స్వగతం గా –గురుడు దిగొచ్చాడు .ఇక మనం చిలవలు పలవలు సృష్టించి ఎంతదాకా అయినా అల్లేయచ్చు) అవును మామగారూ !ఆయనే ఇందాక నే చదివిన మంత్రం ,పదం దర్శించాడు .దీన్ని మనవాళ్ళు ఎక్కడా చేర్చలేదు మన దౌర్భాగ్యం .
అగ్ని –ఇంతకీ ఆమంత్రం అర్ధం ఏమిషో సెలవివ్వండి.
గి-అక్కడికే వస్తూ మధ్యలో మీ చిరాక్కు వెనకడుగేశా మామగారు .ఈ మధ్య ప్రపంచమ౦తా కరోనా అనే క్రిమి అందర్నీ భయపెడుతూ వ్యాపిస్తోంది .దానితో కోవిద అనే జబ్బు వస్తోంది అది వస్తే మందూ, మాకూ లేదు .సరాసరి కాటికే . ఆయన ద్రష్ట కనుక ముందే ఊహించి మంత్రం లో బిగించాడు .దీనికి క్రమం ఘట, జట కూడా జడ అల్లినట్లు తేలిగ్గా అల్లేశాడు .
అగ్ని –పంతులూ నీ డొంక తిరుగుడు తగ్గించుకోలేదు ఇన్ని నెలలు మా వాడికి చదువు చెప్పే మిషతో మాఇంట్లో తిష్ట వేసినా .
గి-అలా ఐతే నేనిప్పుడే వెళ్లి పోతామామగారూ .
భార్య –అదేమీ షండీ అర్ధాంతరంగా పొమ్మని పొగబెడితే ఎక్కడికి పోతారు పంతులుగారు .బయటికి రానివ్వని కాపలా ఉన్న రోజుల్లో .
గి-(మనసులో –అత్తయ్య కూడా సపోర్ట్ బాగానే ఇచ్చింది. ఇదే బెస్ట్ చాన్స్ నా ప్రతాపం చూపాలి .ఇటలీలో కరోనాలాగా కదలకుండా తిష్ట ఇక్కడే వెయ్యాలి .మాంచి ధూపం తో పని చక్కబెడతా చూడు నా తడాఖా )
మాటవరసకు అన్నాను కానీ మామయ్యా ,నన్ను పోనివ్వనని అత్తయ్య బహు ఇబ్బంది పెడుతోంది .బుచ్చమ్మక్కూడా ఇష్టం లేదు వెంకటేశిగాడు సరేసరి .బయటికెళ్ళి లోకం లో ఆవ్యాధి అందరికీ పంచిపెట్టి చెడ్డ పేరు తెచ్చుకోకుండా ఇక్కడే మీ ఇంట్లోనే మీరు చీపురుపెట్టి తరిమేసేదాకా ఉండిపోతాను .మీ మీద, అత్తయ్య మీద ఒట్టు .
అగ్ని –ఒట్టు తీసి గట్టున పెట్ట రాదుషో.ఇంతకీ మంత్రార్ధం చెప్పకుండా శాఖా చంక్రమణం చాలా చేశావు పంతులూ .
గి-నాగుబాము ముందు బురద కొయ్య ఆడినట్లు నేను మీ ముందు మంత్రార్ధం చెప్పేంత ఘటికుడినా మామగారూ .
అగ్ని –మేమంతా నులక పేనినట్లు ఘనా జటా పేనుతూ వేదం వల్లె వేయటమే కాని అందులో ఏముందో తరచి చూడని బాపతు .నువ్వు చెబితే వినాలని ఉంది .
గి –(తనలో –చిక్కాడు మిడటం భొట్లు .ఒకాట ఆడుకుంటా పాచిక వేసి ప్రయోజనం సాధిస్తా )
అది కరోనా మంత్రం .దానికి పదం క్రమం ఘన జట కూడా ఉన్నాయి .సింపుల్గా భావం చెబుతా వినండి అత్తయ్యా మీరుకూడా –చైనాలో పుట్టిన ఓ కరోనా నీకు జాతిమతకుల ప్రాంత భేదం లేదు .కనిపించినవాడినల్లా నీ కిరీటం లాంటి కోరల్లో బంధించి నంజుకు తింటావు .ఇటలీ ఇరాన్ ఇంగ్లాండ్ దాటి అమెరికా లో ఇప్పుడు మనదేశం లోనూ అంటే ఇండియాలోనూ స్థిరపడ్డావ్ .నువ్వు అంటుకుంటే వదలని కామపిశాచి లాంటి దానివి .నీ క్రిమి అంటే వైరస్ సోకిన ఎవరినైనా కౌగిలిస్తే వాళ్ళు మటాష్ .మాడిపోవటమే భస్మాసుర హస్తమే .దానివల్ల వచ్చే జబ్బే కోవిద .అంటే- ఎవరికి తెలుసు అని అర్ధం .కరో అంటే పని చెయ్యి .న అంటే వద్దు మొత్తం మీద ఒక పని మాత్రం చెయ్యద్దు అని అర్ధం .ఆఒక్కపని ‘’హగ్ ‘’చెయ్యటం అన్నాడు తెల్లవాడు.అంటే కౌగిలించటం ,దగ్గరకు తీసుకోవటం ముద్దు,శృంగారం వగైరాలతో ముంచేయటం చెయ్యరాదు అని అర్ధం .మామయ్యా .పెద్దవారు మీదగ్గర శృంగార విషయాలు ప్రస్తావించటం ఇబ్బందిగానే ఉంది .విడమర్చి చేబితేనేకదా అర్ధమయ్యేది .తప్పలేదు అత్తయ్యా .బుచ్చమ్మకూడా దొంగ చాటుగా వింటోంది .వెంకటేషి జామ చెట్టెక్కి పళ్ళు తింటూ వాడూ వింటున్నాడు .చివరికి దొర చెప్పిందేమిటి అంటే కరోనా రాక్షసి కి కృత్యం అకృత్యం అంటూ ఏమీ జాలీ దయాలేదు .మనిషికీ మనిషికీ బారెడు దూరం పాటించాలి .గోమూత్రం తో ఇల్లూ ఒళ్ళూశుభ్రం చేసుకోవాలి. ఆవుపంచితం తీర్ధంగా. తులసి దళాలతో రెండు పూటలా పుచ్చుకోవాలి .మామయ్యా రాత్రిళ్ళు మీ ఇద్దరూ కూడాదూర౦ పాటించండి .తప్పదు.ఇలా చెప్పినందుకు మన్నించండి ..
అగ్ని, వెంకమ్మ -ఇంత కథా కమామీషు ఉందిషోయ్ అల్లుడూ .నీ కడుపు చల్లగా మంచి వేదమంత్రం చేవినేసి మాకు అర్ధం కాని విషయాలన్నీ చెవికెక్కి౦చావ్ .సూర్యుడు మేషరాసిలో ఉచ్చస్థితి లోకి వచ్చేదాకా మీరిద్దరూ ఎక్కడికీ కదలకుండా మా ఇంట్లోనే ఉండిపొండి.మా ఆబోరు దక్కించండి .
గి-(మనసులో -పడ్డాడు మామ నాపాచిక గోతిలో )అంటే మామయ్యా అత్తయ్యా ఏప్రిల్ 14 వరకూ ఇక్కడే ఉండిపొమ్మని సెలవా .
ఇంతలో కరాటక శాస్త్రి వచ్చి –అక్కయ్యా బావయ్యా బాగున్నారా .వీధిలో అందరికళ్ళూ కప్పి వచ్చేసరికి తలప్రాణం తోకకు వచ్చింది .ఎప్పుడు నేను మీ ఇంటికి వచ్చేసరికి ఎడ్డెం తడ్డెం గా ఉండే మీరిద్దరూ ఇవాళ కలిసి నవ్వుతూ ఒకే మాటమీద ఉన్నట్లు కనిపిస్తున్నారు .ఏమిటి విశేషం ?
అక్కా బావా –ఏమీ లేదోయ్ కరకటం-గిరీశం పంతులు ఏదో కొత్త వేద మంత్రం చెప్పి దాని అర్ధ తాత్పర్యాలు వివరించాడు .
కరటక –(వీడేదో ఠస్సా వేసి బావనూ అక్కనూ బురిడీ కొట్టించి ఉంటాడు .జగజ్జ౦త్రీ గిరీశం అంటే ) వేదం లో కొత్త మంత్రమా .వింతగా ఉందే.
అగ్ని –నేనూ మొదష్లో అష్లాగే అనుకొన్నా .తీరా పంతులు విడమర్చి చెప్పేసరికి సరేనని తలూపాను .అదేదో కొత్తరకం క్రిమిట ప్రపంచాన్ని భయపెడుతోందట .పంతులు అంతా చెప్పాడు .ఎవరూ ఎక్కడికీ కదలకూడదట .ఒకరినొకరు ముట్టుకోరాదట .బారెడు దూరం లో ఉండాలట .
కరటక –అవునవును .నేనూ విన్నా .(లోపల -ఇదే సమయమని వీడు ఇక్కడ తిస్ట కోసం మహా పనస అల్లాడన్నమాట )
అగ్ని దంపతులు –ఒరేయ్ కరకటం .ఎల్లాగో అలలాగా కస్ట పడి ఇక్కడికి వచ్చావ్ .అంతా సర్దుమణిగేదాకా నువ్వూ, పంతులు ,అబ్బి గాడితో ఇక్కడే ఉండి పో మాతోపాటు .
కరటక-బావా నువ్వేనా ఈమాట అన్నదీ .ఎప్పుడొచ్చినా ఎప్పుడు వెళ్తావు అనే కాని, నోరార ఒక్కసారీ ఉండమని అఘోరించలేదు .అందుకే జగత్తులో ఇంత విలయం .(మనసులో –మనకూ మంచిదే –మధురవాణి దగ్గర కెళ్లినా అంటూ కోకుండా ముట్టుకోకుండా ఉండటం బ్రహ్మ ప్రళయం .కనుక ఇక్కడ తిష్ట వేయటమే మంచిది .ఉభయ భ్రస్టుత్వం- ఉపరి సన్యాసం ఎందుకు ?సరే నంటే పోలా ?)
సరే- మీరు అంతగా బతిమాలుతున్నారు కనుక ,మీమాట గౌరవి౦చాలికనుక ఇక్కడే ఉండిపోతా (లోపల –ఇక్కడే ఉండిగిరీశం గాడికి చెక్ పెట్టటమూ మంచిదే .వెంకటేషి గాడి బీడీలు సిగరెట్లు చుట్టా నశ్యం తగ్గించనూ వచ్చు )
గి –చూశారా అత్తయ్యా మామయ్యా కరటక బాబాయిగారూ .ఎందుకొచ్చిందో కరోనాకానీ మనల్ని ఇక్కడే కలిపి ఉంచి మంచి పని చేసింది .
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -28-3-20-ఉయ్యూరు

