మనకు తెలియని మహాయోగులు—18 41-త్రికాలజ్ఞాని అవధూత ప్రకాశానంద స్వామి -1871-1963

మనకు తెలియని మహాయోగులు—18

41-త్రికాలజ్ఞాని అవధూత ప్రకాశానంద స్వామి -1871-1963

  విజయనగరం దగ్గర ఒక వెలనాటి బ్రాహ్మణ కుటుంబం లో 1871లోవెంకట్రామయ్య ,గౌరమ్మ దంపతులకు అనంతయ్య పుట్టాడు .తండ్రి 8వ ఏట ,15వ ఏట తల్లీ చనిపోయారు .తాత లక్ష్మీ నరసింహం ,నాయనమ్మ మీనాక్షమ్మ ల వద్ద ధర్డ్ ఫారం చదివి ,15వ ఏట చదువు మానేసి సంస్కృతం, జ్యోతిష్యం నేర్చాడు .పెళ్ళికి తాంబూలాలు తీసుకోనగానే వధువు అకస్మాత్తుగా చనిపోగా వైరాగ్యం కలిగి౦ది .ఇంగ్లీష్ మేస్టార్ వేదాంతి దత్తయ్య పంతులు గొప్ప గురువు దొరుకుతాడని హామీ ఇచ్చాడు

  జ్ఞానన్వేషణకోసం 16వ ఏట ఇల్లువదిలి దేశాటనం చేస్తూ 1887జనవరి 14 బెల్గాం చేరి ,అక్కడ వేదాంతి డిప్యూటీ కలెక్టర్ లల్లూభాయ్ గోవర్ధనదాసు తో పరిచయం కలిగి, యోగ వాశిస్టం మొదలైన ఆధ్యాత్మిక గ్రంథాలు చదివి , సన్యసించా లన్న కోరిక చెప్పగా అందులో ఉన్న కష్ట నిష్టూరాలు తెలియజేయగా ఆకోరిక బలీయం కావటం తో ఆయన అనుమతితో  ఇల్లు వదిలి మళ్ళీ దేశాలమీద పడి,తిరుమల చేరి పుష్కరిణిలో ప్రేమ మంత్రం చెప్పుకొంటూ స్నానంచేసి శిఖా యజ్ఞోపవీతాలు తీసేశాడు .మద్రాసు వెళ్లి బుచ్చయ్య పంతులు వద్ద భాష్యం తో సహా ఉపనిషత్తులు నేర్చి ,అక్కడి నుండి నాశిక్ ,హరిద్వారం సందర్శించి ,దారిలో మహా వైయాకరణి అమరేశానందులవద్ద  సిద్ధాంత కౌముది ,వ్యాకరణ మహాభాష్య౦  అభ్యసించాడు అన౦తయ్య .అమరేశానంద అనంతయ్యకు ‘’ప్రకాశానంద స్వామి ‘’అని పేరు పెట్టారు .

   హృషీకేశం లో శ్రీ సుఖానంద స్వామి వద్ద హఠయోగ ప్రక్రియలు నేర్చి ,గుజరాత్ లోని నడియార్ చేరి ,అక్కడి సంత్ రాం గుడిలో ప్రమేయ గ్రంథాలు చదివారు .ఆశ్రమ స్వీకారం తర్వాత 15ఏళ్ళు లల్లూరాం గురువును సేవించి ,ఆయన సిద్ధిపొందాక సర్వ సంగ పరిత్యాగి యై ,జిజ్ఞాసువులకు జ్ఞాన బోధ చేస్తూ ,40వ ఏట ఆత్మ సాక్షాత్కారం పొందారు .త్రికాలజ్ఞానిగా గుర్తింపు పొందారు.ముముక్షువులకోసం చాలా గ్రంథాలు రాశారు .వార్తాలాప గ్రంథం ,సంతగురు పరిచయం ,ఆపరణోధర్మ,సప్తశ్లోక గత ధర్మ జ్యోతి రచనలలో ఆయన అపార పా౦ డిత్యం వెలువడింది .వాటినీ గుజరాతీ భాషలో ముద్రించారు .ద్వారకలో దేహం చాలించాలని సంకల్పించి 15-1-1962న చేరి 23-2-1962నప్లవనామ సంవత్సర మాఘ బహుళ చవితి శుక్రవారం  స్వామి ఆత్మ చిదాత్మలో 91ఏట కలిసిపోయింది .వారి సమాధి గొప్ప యాత్రాస్థలమైంది .

42-వాడరేవు లలితానంద స్వామి -1886-1950

స్కందుని అంశతో 17-11-1886వ్యయ వృశ్చికమాస బహుళ షష్టి మంగళవారం శ్రవణా నక్షత్రం లో  జన్మించిన లలితానంద తమిళనాడు  స్వామి మేలు వలక్కూరు గ్రామాధికారి కాకర్ల వెంకట నరసు సోమయాజులు అనే ముర్కినాటి బ్రాహ్మణుడికి జన్మించారు. ఆయనకు ఆంద్ర దేశం లో చాలామంది బంధువులున్నట్లు తెలుస్తోంది .పశుమల కొండ గుహలు తనియాల గ్రామం లోని కైలాసనదేశ్వర అఖిలాండేశ్వర ఆలయం చీరాలదగ్గర వాడరేవు ఆయన తపోవన క్షేత్రాలు .దేశాటన చేసి 1940విక్రమనామ సంవత్సరం లో పశుమల చేరి గుహలో ఏకాంతంగా దిగంబరంగా తపోదీక్ష కొనసాగించారు .1941లో అక్కడ స్వామికి డాక్టర్ తంగిరాల సీతారామయ్య ,కొసరాజు నాగయ్య లు మఠం కట్టించారు .

  సనాతన వైదిక ధర్మ ప్రచారం కోసం యజ్ఞయాగాలు మంత్రం అనుష్టాన బోదా కార్యక్రమాలు చేశారు. పసుమల తనియల వాడ రేవులలో ఏడాది పొడవునా ఏదో ఒక యజ్ఞం నిర్వహించేవారు ,   సాక్షీమాత్రులుగా ఉంటూ పరబ్రహ్మాను భవం సాధించిన జీవన్ముక్తులు స్వామి .సన్మార్గ ప్రవర్తన ధర్మానుష్టానం వైరాగ్యాలే సత్యాన్వేషణకు మార్గాలని బోధించేవారు 24-11-1951ఖర కార్తీక బహుళ దశమి శనివారం వారి పసుమల మఠం ఆయన ఉన్నగదిలోనుంచి ఒక దివ్యజ్యోతి ఆకాశం వైపుకు వెళ్ళింది. తలుపులు తెరచి చూస్తే స్వామి దేహం చాలించారని తెలిసింది .ఆయనను విధివిధానంగా సమాధి చేసి దానిపై నర్మదా లింగం ప్రతిష్టించారు .ఆయన పేర లలితానంద భక్త సమాజం ఏర్పడింది .ఆత్మజ్యోతి మాసపత్రిక వాడరేవు ఆశ్రమం ద్వారా వెలువడేది .

43-సద్గురు జగన్నాధ స్వామి -1885-1974

ఒంగోలులో కోటి సుబ్బయ్య కామమ్మ వైశ్య దంపతులకు 11-8-1885పార్ధివ శ్రావణ శుద్ధ విదియ మంగళవారం జగన్నాధస్వామి జన్మించాడు .ఉయ్యాలలో ఉండగానే యోగాసనాలు వేసి ఆశ్చర్యపరచేవాడు .ఆరేళ్ళ వయసులో తలిదండ్రులు చనిపోతే ,చేబ్రోలు రెడ్డిపాలెం లో మేనమామ ఇంట పెరిగాడు .కేశవరాజ యోగీంద్రుడు ఒక సారి కనిపించి ఆయన్ను సూక్ష్మ రూపం లో ఆకాశమార్గం లో తీసుకువెళ్ళి శ్రీశైలం గుహలలో దింపాడు .అక్కడి మహర్షులు పరకాయ ప్రవేశం మొదలైన విద్యలు నేర్పారు .త్రిమూర్తులు ప్రత్యక్షమై దేవాలయాలు నిర్మిస్తూ జన్మ సార్ధకం చేసుకోమని బోధించారు .

  భక్తిప్రచారం చేస్తూ మంత్రోపదేశాలు చేస్తూ ఉత్తర దక్షిణ దేశయాత్ర చేశారు .పొన్నూరులో సహస్రమ లింగేశ్వర,దశావతార దేవాలయాలు  కట్టించారు .చెంచమ్మను పెళ్ళాడి ఆమె కొద్దికాలానికే చనిపోతే ,కోటి రత్నమ్మను  ద్వితీయం  చేసుకొన్నారు ,ఆడబిడ్డ పుట్టాక ఆనందాశ్రమం చేరి ,భార్య చనిపోగా గురువు ఆజ్ఞతో సీతమ్మను మూడవ పెళ్లి చేసుకొని ,కూతురు సీతమ్మతో బాపట్ల చేరారు .శ్రీశైల యాత్రకు వెళ్లి కొండఎక్కుతూ కాలుజారి లోయలో ఒకమహర్షి  ఒడిలో పడగా ఆయన నాలుకపై బీజాక్షరాలు రాయగా ,ఇలా ఎన్నో గండాలు గడుస్తూ దేవాలయ నిర్మాణాలు చేయిస్తూ ,అధ్బుత మహిమలుప్రదర్షిస్తూ జగన్నాధ స్వామి 10-9-1974ఆనంద భాద్రపద బహుళ నవమీ మంగళవారం 89వ ఏట దేహం చాలించారు .భాద్రపద  బహుళ నవమినాడు బాపట్లలో ఆరాధనోత్సవాలు దివ్యంగా చేస్తారు .

44-సహజకవి నార్పల తిక్కయ్యస్వామి -1870-1924

నార్పల తిక్కయ్యస్వామి 1904లో చెళ్ళ గురికి లో హజాము భీమన్నపోలం లో ఎర్రి తాతను దర్శించి ,నాలుగేళ్ళు సేవించి ,మఠంకట్టించి గురువును అందులో ప్రవేశపెట్టి ,1909లో గురువు ఆదేశం పై అజ్ఞాతం లోకి వెళ్ళిపోయాడు .1920లో అనంతపురం మండలం నార్పల గ్రామం చేరి ,దక్షిణంగా నడిచి ,దుగమరి ఊరికిఉత్తరాన ఉన్న దత్తాత్రేయ ఆశ్రమం చేరి ,అక్కడినుండి సుల్తాన్ పేట వెళ్లి ఒక వరిపొలం లో రైతు నంద్యాం తిమ్మారెడ్డి ని పేరుపెట్టి పిలిస్తే ఆశ్చర్యపోయి,ఇంటికి తీసుకు వెళ్లి భోజనవసతి సౌకర్యాలు కల్పించాడు .అక్కడి ధనిక పేదజనం అందరూ ఆయన్ను బాగా ఆదరించారు .అష్టసిద్ధులు మహిమలు ప్రదర్శించి రోగాలు నివారిస్తూ వారికి సాయం చేశాడు .

  ఒక రోజు స్వామి ఒక వెండి రూపాయిని బలం గా విసిరితే అది దూరంగా ఉన్న బ్రహ్మజెముడు డొంక పడింది .అక్కడే తనను సమాధి చేయమని ఆదేశించాడు. 10-4-1924రక్తాక్షి చైత్ర శుద్ధ షష్టి గురువారం 54వ ఏట తిక్కయ్యస్వామి కుండలిని భేదించుకొని బ్రహ్మైక్యం చెందారు .1925లో సమాధిపై మందిరం నిర్మించారు .సమాధిపై స్వామి ఇత్తడి శిరస్సు ,నాగపడగ స్థాపించి పూజలు చేస్తున్నారు .చైత్ర శుద్ధ పంచమి నుండి మూడు రోజులు ఉత్సవాలు చేస్తారు .

45-రెండవ సదాశివ బ్రహ్మేంద్ర సరస్వతి –పుదుక్కొట జడ్జి స్వామి -1850-1915

విశాఖ లో వేదమూర్తి శాస్త్రి అనే వేదపండితుని కుమారుడిగా1850లో పుట్టిన  ఆయన జాతకం చూసి పరివ్రాజక శిరోమణి అవుతాడని చెప్పారు. తండ్రి వద్ద తెలుగు సంస్కృతాలు నేర్చి ,వేదం తోపాటు ఇంగ్లీష్ కూడా నేర్చుకోవటానికి మద్రాస్ వెళ్లి న్యాయ శాస్త్ర డిగ్రీ సాధించి ,జూనియర్ వకీలుగా కొంతకాలం పని చేసి ,తర్వాత స్వతంత్రం గా ప్లీడర్ గాఉంటూ మంచిపేరు పొందాడు.తల్లీతండ్రీ కాశీ వెళ్ళిపోయారు .

   జడ్జిస్వామి న్యాయ సమ్మతమైన కేసులే వాదించేవాడు. న్యాయం కోసమే తప్ప డబ్బుకోసం ప్రయత్నించేలేదు .20ఏళ్ళు ప్లీడర్ గా ఉంటూ లోకాచారం శిక్షాస్మృతి స్థానికాచారం  కటుంబ ఆచారం చారం అనే నాలుగు కోణాలలో కేసులపై తీర్పులిస్తూ తిరువాన్కూరు హైకోర్ట్ జడ్జిగా పనిచేశారు .ఒకసారి చట్టప్రకారం ఒక అమాయకుడికి మరణ శిక్ష విధించాల్సి వచ్చి ,సత్యాన్వేషణలో సంసారం ఉద్యోగం వదిలేసి అడవులలో తిరుగుతూ కరాచీలోని ఉపనిషణ్మఠం  చేరి ,అక్కడ ఐదేళ్ళు 1899వరకు ఉపనిషత్ సత్యాన్వేషణలో గడిపి ,శ్రీ రామకృష్ణావదూత ఆదేశం మేరకు దిగంబరంగా ఉంటూ నేరూరు వెళ్లి సదాశివ యతీంద్రుల సమాధి వద్ద కొంతకాలం తపస్సు చేసి హిమాలయాలకు వెళ్లి ఋషీకేశ్ లో తపస్సు చేశారు .

  శరీరత్యాగానికి సమయం దగ్గర పడిందని తెలిసుకొని ,పుదుక్కొట దగ్గర నర్తమలై చేరి చోళరాజుల ప్రాచీన శివాలయం లో తీవ్ర తపస్సు చేశారు .బ్రహ్మ తేజస్సుతో వెలుగుతున్న స్వామిని ప్రజలు పల్లకీలో ఊరేగింపుగా పుదుక్కోటకు తీసుకు వెడుతుంటే  .పల్లవ సరసు వద్ద స్వామి ప్రాణాలు అన౦త ప్రాణం లో కలిసి పోయాయి .మార్తాండ భైరవ తొండమాన్ చక్రవర్తి స్వామి వారి సమాధికోసం పుదుక్కోటకు తూర్పున విశాల స్థలం ఇచ్చి సమాధి చేయించారు .కొంతకాలం నిత్యపూజలు జరిగేవి .తర్వాత సమాధి నిర్లక్ష్యానికి గురైతే ,శిష్యులు భువనేశ్వరీ విగ్రహ ప్రతిష్ట చేసి మందిరం అభి వృద్ధికి తోడ్పడగా ఆప్రాంతం భువనేశ్వరీ నగరంగా వర్ధిల్లింది .జడ్జి స్వామి అసలుపేరు ఎవరికీ తెలియదు .కానీ శ్రీ కాళహస్తిలో గురువు రామ కృష్ణ అవధూత మాత్రం ‘’రెండవ సదాశివేంద్రుడు ‘’అన్నారు  .ప్రస్తుతం జడ్జిస్వామి సమాధి గొప్ప క్షేత్రంగా మారింది .

   సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -22-9-20-ఉయ్యూరు

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు, సమీక్ష and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.